22, జూన్ 2014, ఆదివారం

అన్న నీళ్ళు...అమ్మ ఉప్పు! రాజకీయ ఆవిష్కరణలు

మన రాజకీయ నాయకులు ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ శాస్తవ్రేత్తలను మించి పోతున్నారు. విద్యుత్ బల్బ్ కనిపెట్టింది ఎవరు? అని ప్రశ్నిస్తే, ఏ మాత్రం తడుముకోకుండా ఎడిసన్ అని ఠక్కున చెప్పేస్తాం. పైగా ఆయన ఆవిష్కరణల కృషిని వ్యక్తిత్వ వికాస పాఠాలుగా చెప్పేస్తారు. 999సార్లు విఫలం అయ్యాక వెయ్యోసారి బల్బ్ కనిపెట్టారని కథలు కథలుగా చెబుతారు. కానీ వీరి కన్నా రాజకీయ ఆవిష్కర్తల కష్టం ఎక్కువగా ఉంటుంది. ఎడిసన్ వెయ్యవ ప్రయోగంతో బల్బ్ కనిపెట్టిన తర్వాత ఎన్నివేల సార్లు బల్బ్ తయారు చేయాలన్నా అదే సూత్రం వర్కవుట్ అవుతుంది. కానీ రాజకీయాల్లో ఒకసారి బ్రహ్మాండమైన ఆవిష్కరణగా నిలిచింది తరువాత ఎందుకూ పనికి రాకపోవచ్చు. ప్రతి ఎన్నికల్లోనూ పోటీ పడి కొత్త కొత్త ఆవిష్కరణలు కనిపెట్టాలి. అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు ప్రభుత్వంపై ఆసక్తి కలిగే విధంగా తరచుగా కొత్త కొత్త ఆవిష్కరణలను ప్రజలకు పరిచయం చేయాలి.


రాజకీయాల్లో నూతన ఆవిష్కరణల్లో తమిళనాడు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆ రాష్ట్రంలో జరిగిన ఆవిష్కరణల వల్ల అక్కడ అధికారం రావడమే కాదు... చివరకు వారిని కాపీ కొట్టిన వారికి సైతం అధికారం దక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రెండు రూపాయల కిలో బియ్యం అనగానే తెలుగునాట అన్నగారి ఆవిష్కరణ అని అంతా భావిస్తారు. నిజానికి ఇది తమిళనాడు ఆవిష్కరణ. ఇదొక్కటే కాదు చీర ధోవతి వంటి పథకాలకు, రిక్షా కార్మికులకు డ్రెస్సుల వంటివి అపూర్వమైన పథకాలను మొదట ఆవిష్కరించింది తమిళ నేతలే. ఆ మార్గాన్నే  తెలుగునేతలు అనుసరించారు. 

ఈగ సినిమా సక్సెస్ అయిందా? లేదా? అనేది ముఖ్యం కానీ రాజవౌళి ఆ సినిమాను ఏ ఇంగ్లీష్ సినిమా నుంచి కాపీ కొట్టారనేది అనవసరం. రాజకీయాల్లో సైతం అంతే! ఓటర్లపై తీవ్రమైన ప్రభావం చూపించి అధికారంలోకి వచ్చారా? లేదా? అనేదే ఏ కొత్త ఆవిష్కరణ కైనా కొలమానం.
తమిళ అమ్మ ఐదు రూపాయలకు భోజనం, రూపాయికి టిఫిన్ అంటూ వచ్చే ఎన్నికల కోసం కొత్త కొత్త ఆవిష్కరణలను ఓటర్లకు పరిచయం చేస్తున్నారు. ఏ కూర వండినా ఉప్పు ఉండి తీరుతుంది. టిఫన్‌లోనూ అంతే. అయినా అమ్మగారికి ఎందుకో కానీ ఇంటింటికి తన ఉప్పు అంది తీరాల్సిందేనని అనిపించింది. ఉప్పు విశ్వాసానికి ప్రతీక. ఉప్పు తిన్నవారు కృతజ్ఞతతో ఉంటారని గట్టి నమ్మకం. ఐదు రూపాయల భోజనం, రూపాయి టిఫిన్‌లో ఉప్పు ఉంటుంది. కానీ ఎక్కువ మంది ఇంట్లోనే వండుకుంటారు. మరి ఎలా అని తీవ్రంగా ఆలోచించిన అమ్మ బృందం అద్భుతమైన ఆవిష్కరణకు నాంది పలికారు. ఈ ఆలోచన ఇంటికి అమ్మ ఉప్పు ఆవిష్కరణకుదారి తీసింది. ఇంట్లో ఉండి ఎవరి వంట వాడు వండుకున్నా వారి వంటల్లో ఉండాల్సింది అమ్మ ఉప్పు. తిండి తమదైనా ఉప్పు అమ్మది కాబట్టి ఉప్పు తిన్నందుకు విశ్వాసపాత్రంగా ఉంటారని అమ్మ బాగానే ఆలోచించారు. తమిళనాట ఎన్నికలకు ఇంకా బోలెడు సమయం ఉంది. అప్పటి వరకు అమ్మ ఉప్పు తమిళ ఓటర్ల ఒంటికి బాగానే ఒంటబడుతుంది. తమిళ తల్లి అమ్మ ఉప్పు అంటే తెలుగు అల్లుడు అన్న నీళ్లు అంటున్నారు. రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ పథకాన్ని ప్రకటించారు. వాటర్ పథకం ఎలా ఉన్నా రుణమాఫీ అమలు చేయకపోతే ఓటర్లు మాత్రం ప్రభుత్వంతో నీళ్లు తాగించేట్టుగా ఉన్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐదు రూపాయలకు భోజనం పథకం అమలు చేస్తున్నా, ఎంఐఎం మేయర్ ఈ పథక ఆవిష్కర్త కావడంతో పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. 


తెలుగునాట రెండు రూపాయల కిలో బియ్యం ఆవిష్కరణ తరువాత అంత గొప్ప ఆవిష్కరణ మరేదీ జరగలేదు. ఆ పథకాన్ని అల్లుడు ఐదు రూపాయల చేసినా, వైఎస్ ఒక రూపాయికి చేసినా కిరణ్ కుమార్‌రెడ్డి ఉచితం అన్నా ఈ పథకం ఆవిష్కర్తగా ఎన్టీఆర్ పేరే ఉండిపోయింది. ఈ పథకం మాతృక తమిళనాడే అయినా తెలుగువాడిదే అన్నంతగా ప్రభావం చూపింది. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలంటారు. అలానే పవర్‌లోనే పవర్ వెతుక్కోవాలనే ఆలోచన వైఎస్‌ఆర్‌కు వచ్చింది. మీకు ఫ్రీ పవర్ ఇస్తాననగానే రైతులు ఆయనకు పవర్ ఇచ్చారు.
చక్కగా ఆడుకోండి అంటూ అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ యువత కోసం ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరిస్తే, ఈయన పాలనలో అత్యాచారాల గురించి ల్యాప్‌టాప్‌లో వివరాలు సేకరిస్తూ ఆక్కడి యువత ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ల్యాప్‌టాప్‌లో చర్చలు సాగిస్తోంది.


మొన్నటికి మొన్న అల్లుడు గారు రుణవిముక్తి అనే అద్భుతమైన యంత్రాన్ని కనిపెట్టాను. అధికారంలోకి రాగానే ఆవిష్కరణను జాతికి అంకితం చేయడమే నా మొదటి పని అన్నారు. జనం నమ్మారు. ఇప్పుడేమో ఈ ఆవిష్కరణ విడుదల చేయవచ్చా? లేదా? చేస్తే ఎలా చేయాలి? చేయకపోతే ఎలా చేయవద్దు అంటూ కమిటీ వేశారు. చిన్నా చితక అవిష్కరణలతో అంతా అధికారం కోసం ప్రయత్నిస్తుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏకంగా తెలంగాణ ఆవిష్కరణతో అధికారంలోకి వచ్చేశారు. టెలిఫోన్ ఆవిష్కరణకు ప్రపంచం విస్తుపోయింది. తరువాత పేజర్ల గురించి వింతగా చెప్పుకున్నారు. ఇప్పుడు సెల్‌ఫోన్... ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు వెలుగు చూడాల్సిందే... అధికారం కట్టబెట్టిన అద్భుతమైన ఆవిష్కరణలు అయినా కొంత కాలానికి వాటి ఆకర్షణ శక్తి కోల్పోతాయి. అందుకే నేతలంతా కొత్త కొత్త ఆవిష్కరణల కోసం తమిళనాడుపై ఓ కన్నేసి  ఉంచుతారు. ఈ రోజు బెంగాల్ ఏం ఆలోచిస్తుందో రేపు దేశం అదే ఆలోచిస్తోందని అనే వారు. అలానే నేడు తమిళనాడు అమలు చేసే పథకాలను రేపు తెలుగునాడు అమలు చేస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి పుంటికూర పచ్చడి, ఇంటింటికి ఆవకాయ వంటి ఆకర్శణీయ పథకాలు రావచ్చు. సినిమా టైటిల్స్‌ను ముందుగానే రిజిస్టర్ చేయించుకున్నట్టు ఈ పథకాల రిజిస్ట్రేషన్ కూడా ఉంటే బాగుండేది. పనిలో పనిగా హోంలోన్, క్రెడిట్ కార్డ్ లోన్ రద్దు పథకాల ఆలోచన ఎవరికీ రావడం లేదెందుకో?

1 కామెంట్‌:

  1. ఇలాంటి తాయీలాలతో తమిళనాడుని కాస్తా, తాయిలనాడు చేసేసారు.

    తమిళనాట ప్రజలు ఒక రేషన్ కార్డు, వోటర్ కార్డు సంపాదిస్తే చాలు. కాలు మీద కాలు వేసుకుని బతికేయవచ్చు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం