31, ఆగస్టు 2014, ఆదివారం

కన్నీళ్లు పెట్టించే రాజనాల జీవితం

అవి తెలుగునాట మద్యనిషేధం అమలులో ఉన్న రోజులు. మందు దొరుకుతుంది కానీ ఆ మందును గొంతులోకి పంపేందుకు ఓ నీడ కావాలి. కొంత మంది జర్నలిస్టు మిత్రులకు ఆ సమయంలో యూసుఫ్‌గూడలోని సారధి స్టూడియో వద్ద ఓ రేకుల షెడ్డు నీడ లభించింది. ఆ షెడ్డులో నివాసం ఉండే వ్యక్తి వీరికి మంచినీళ్లు, మందు తాగేందుకు గ్లాసుల వంటి మౌళిక సదుపాయాలు కల్పించేవారు. 

అక్కడ మద్యం తాగి ఆ ఇంటిలో ఉన్న వ్యక్తికి ఒక క్వార్టర్ తాగించి వెంట తీసుకెళ్లిన బిర్యానీ ప్యాకెట్, జేబులో ఉంటే ఓ 50 రూపాయలు ఇచ్చేవాళ్లు.
ఇందులో పెద్ద విశేషం ఏముంది? ఆ కాలంలో చాలా మంది ఇలా చేసిన వారున్నారు అనుకోవచ్చు. నిజమే ఏ కాస్త చీకటి కనిపించినా అక్కడ మందు తాగిన వాళ్లు, ఇప్పటికీ తాగుతున్న వాళ్లు చాలా మందే ఉండొచ్చు. కానీ ఆ రేకుల షెడ్డులో నివసించేది ఒకప్పుడు తెలుగు చలన చిత్ర సీమలో మకుటాయమానంగా వెలిగిపోయిన విలన్... తెలుగు విలన్‌లకు విలనిజం నేర్పిన నటుడాయన... హీరోలను మించి పాపులారిటీతో పాటు హీరోలను మించి పారితోషికం తీసుకున్న నటుడాయన. దాదాపు పాతికేళ్లపాటు చిత్ర సీమలో ఎదురు లేకుండా నిలిచిన నటుడు. హీరోలకు పోటీ ఉందేమో కానీ విలన్‌గా ఆయనకు పోటీ లేకుండే. అతని కోసం హాలీవుడ్ సినిమా వాళ్లు సైతం దేశానికి వచ్చి సినిమా తీశారు. అతనే రాజనాల. మహోన్నత స్థితి నుంచి అధఃపాతాళంలోకి పడిపోయిన ఆయన జీవితం సినిమా వారికే కాదు జీవితాన్ని ప్రేమించే అందరికీ ఒక గుణపాఠం.

***
రాజనాల తన చివరి రోజుల్లో హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌కు రోజూ వచ్చేవారు. ఆయన పరిస్థితి చూసి పాత్రికేయులు జాలి పడేవారు. రాజనాల ఒక రేకుల షెడ్డులో దుర్భర జీవితం గడిపే రోజుల్లో ఒక పాత్రికేయుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తూ అంత సంపాదించిన వారు ఇలా ఎలా అయ్యారు? అని అడిగారు. నువ్వు రాయను అంటే చెబుతాను, ‘ప్రపంచంలో నేను రుచి చూడని మద్యం బ్రాండ్ లేదు.. నేను తాగని బ్రాండ్ సిగరెట్ లేదు ’ అంటూ ఒక్క ముక్కలో చెప్పేశాడు. మీ తరం ఇలా ఎందుకు అయింది అనేది చెబితే తరువాత తరం వారికి ఉపయోగపడుతుంది కదా? రాయడం వల్ల నలుగురికి ఉపయోగమే తప్ప నష్టం లేదని చెబితే, అయితే నీ ఇష్టం అని చెప్పాడు.
***
రాజనాల ఇంటి పేరు కల్లయ్య అసలు పేరు. 1928 జనవరి మూడున నెల్లూరు జిల్లా కావలి వెంకట సుబ్బయ్య, నారాయణమ్మ దంపతులకు జన్మించిన రాజనాల మొదట్లో నెల్లూరులో కుస్తీలు పట్టేవారు. మంచి పహెల్వాన్. ఆ ఆసక్తే ఆయన్ని సినిమాల వైపు తీసుకు వెళ్లింది. రాజనాల కన్నా ముందు విలన్లు ఉన్నా పాపం వాళ్లు సాత్వికులు. రాజనాల వచ్చాక విలనిజానికి కొత్త నిర్వచనం చెప్పాల్సిన పరిస్థితి. ఎన్టీఆర్, కాంతారావు హీరో ఎవరైనా కావచ్చు. హీరోకు ధీటుగా నిలిచే విలన్ రాజనాల. కుస్తీల పట్టిన కండల తిరిగిన శరీరం. డైలాగులతో ఎదుటివారిని వణికించే స్వరం.
జానపద సినిమాలు, పౌరాణికాలు, సాంఘిక చిత్రాలు ఏవైనా కావచ్చు. రాజనాల విలన్‌గా చెలరేగిపోయారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేస్తూనే నేషనల్ ఆర్ట్ థియేటర్‌ను స్థాపించి నాటకాలు వేసేవారు. ఎవరు దొంగ పేరుతో అవినీతి అక్రమాలపై నాటకం ప్రదర్శించారు. అది జిల్లా కలెక్టర్‌కు ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ప్రభుత్వంలోని అవినీతిని బయటపెడతారా? అని మండిపోయారు. రాజనాల నాటకాల్లో ప్రజలను రెచ్చగొట్టే సంభాషణలు ఉంటున్నాయని, ప్రభుత్వానికి పోలీసులు నివేదిక ఇచ్చారు. జిల్లా కలెక్టర్ రాజనాలను మూడునెలల పాటు సస్పెండ్ చేస్తే. రాజనాల ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని శాశ్వతంగా సస్పెండ్ చేసి రంగ స్థలాన్ని నమ్ముకున్నారు. అటు నుంచి సినిమాలకు వెళ్లారు. 1951లో కాంతారావు హీరోగా, రాజనాల విలన్‌గా హెచ్‌ఎం రెడ్డి వారి ప్రతిజ్ఞ సినిమాలో నటించారు. కాంతారావు, రాజనాల ఇద్దరికీ ఇది మొదటి సినిమా. సినిమా భారీ హిట్టు . తరువాత వీరిద్దరు హీరో విలన్‌గా అనేక సినిమాల్లో నటించారు. విఠలాచార్య సినిమాల్లో కాంతారావు హీరో, రాజనాల విలన్. కారణాలు వేరు వేరు కావచ్చు కానీ ఒక వెలుగు వెలిగిన ఈ ఇద్దరు తారల జీవితాలు ముగింపు మాత్రం ఒకే రకంగా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 25 ఏళ్లపాటు సినిమాల్లో బిజీబిజీగా గడిపి కొన్ని వందల సినిమాల్లో నటించిన రాజనాల లాంటి వారు సినిమాల్లో చాలా అరుదు.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. ఆ కాలంలో తెలుగులో వచ్చిన పలు జానపద సినిమాలు తమిళంలో అనువాదం అయ్యేవి. దాంతో తమిళనాడు రాజనాలకు ఆనాటి హీరోలతో సమానంగా పాపులారిటీ ఉండేది.
ఎన్టీఆర్, కాంతారావు సినిమాల్లో తప్పనిసరిగా కనిపించే విలన్ రాజనాల. రెండు చేతులా సంపాదించిన రాజనాల మద్రాసులో రెండు ఇళ్లను కట్టుకున్నారు. రాజనాల సంపాదనకు హద్దులేదు, ఖర్చుకు హద్దు లేదు. దాన ధర్మాలు చేశారు. బంధువులను ఆదుకున్నారు. వారికి ఇళ్లు కట్టించారు. మద్రాసులో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి అందరికీ మంచి సాహిత్యం అందుబాటులో ఉండేట్టు చేశారు.

ఆ సినిమాతో ఆ నటుడు ఇక వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం ఏర్పడలేదు అంటుంటారు సినిమా వాళ్లు. కానీ ఏ దశలోనైనా వెనుతిరిగి చూసుకోవాలి అలా చూసుకోక పోతే కొంత కాలం గడిచిన తరువాత వెనుతిరిగి చూసుకున్నా ఏమీ మిగలదు. రాజనాల విషయంలో అదే జరిగింది. భార్య మరణంతో ఆరోగ్యం క్షీణించింది. అదే సమయంలో క్రమంగా సినిమాలు తగ్గిపోయాయి. అప్పటి వరకు సంపాదించిన సంపదను జాగ్రత్త చేసుకున్నా, ఏదో ఒక రంగంలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన చేసి ఉంటే రాజనాలను ఆ ఆలోచనే చివరి దశలో ఆదుకునేది. కానీ రాజనాల మాత్రం అంతా అయిపోయే వరకు వెనుదిరిగి చూసుకోలేదు.

ఎన్టీఆర్ రాజనాలపై మొదటి నుంచి ఆప్యాయత చూపించే వారు మామాజీ అని పిలుచుకునే వారు. అనేక సినిమాల్లో ఇద్దరూ కత్తులు దూసుకున్నారు. హీరో ఎన్టీఆర్ తన గ్లామర్‌ను, ప్రజల్లో ఉన్న ఆదరణను పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కాగా, అదే సమయంలో రాజనాల పరిస్థితులు క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. మద్రాసులో ఇక జీవనోపాది లేదని గ్రహించిన తరువాత 1993 ప్రాంతంలో రాజనాల హైదరాబాద్‌కు వచ్చారు.
తెలుగువీర లేవరా సినిమా షూటింగ్‌లో అరకులో జరుగుతుండగా రాజనాల కాలుకు గాయమైంది. అప్పటికే మధుమేహం వ్యాధి ఉండడంతో చివరకు తొడవరకు తీసేయాల్సి వచ్చింది. నిజానికి ఆ సమయంలో రాజనాలకు వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును కూడా భరించే స్థితి లేదు. ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించింది. రాజనాల వైద్య చికిత్స కోసం ఒక హెల్త్ కార్డును ప్రభుత్వం ఇచ్చింది. సినిమా రంగానికి చెందిన దాతలు నెలకు వెయ్యి రూపాయల సహాయం చేస్తే వాటితోనే చివరి రోజుల్లో రాజనాల బతికారు. అంతకు ముందు ఎన్టీఆర్ కొంత ఆర్థిక సహాయం చేసినా, ఇకపై రాజనాల వస్తే పంపించేయండి అంటూ ఆదేశించారని, రాజకీయాల్లో ఎన్టీఆర్‌కు వ్యక్తిగత సహాయకులుగా పని చేసిన సిబ్బంది చెప్పారు. ఎవరైనా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసినా ఆ డబ్బు తిరిగి మద్యం కొనేందుకే ఖర్చు చేసేవారనీ, రాజనాలను చివరి రోజుల్లో దగ్గరి నుంచి చూసిన వారు చెబుతారు. రాజనాల తొలి భార్య మరణించినప్పటి నుంచే ఆయన పరిస్థితి తలక్రిందులు కావడం మొదలైంది. 84లో ఒక కుమారుడు మూర్ఛవ్యాధితో మరణించాడు. ఒక కుమారుడు ముంబై వెళతానని చెప్పి వెళ్లాడని ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలియదని రాజనాల చివరి రోజుల్లో చెప్పారు. రాజనాలకు జ్యోతిష్య శాస్త్రంలో మంచి ప్రవేశం ఉంది. చివరి రోజుల్లో ఆస్పత్రిలో చికిత్స జరిగేప్పుడు కూడా డాక్టర్లకు, నర్సులకు జ్యోతిష్యం చెప్పేవారు.

అచ్చం సినిమాలో హీరోను బెదిరిస్తూ మాట్లాడినట్టుగా కళ్ల్లెర్ర చేసి, ముఖ కవళికలు మార్చి ఆస్పత్రిలో నర్సులను బెదిరించినట్టుగా మాట్లాడేవారు. ఆ నటన సినిమాలో హీరోలను భయపెట్టి ఉండొచ్చు కానీ ఆ చేష్టలను చూసి ఆస్పత్రిలో నర్సులు నవ్వుకునే వారు. ఒకరి జీవితం పతనమైనా, ఉన్నతంగా ఉన్నా ఎవరి జీవితానికి వారే కారణం. 

ఇతరులకు జ్యోతీష్యం చెప్పిన రాజనాల తన జీవిత భవిష్యత్తును ఊహించలేకపోయారు. *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం