15, సెప్టెంబర్ 2014, సోమవారం

నాయకుడు- ఓటరు- ఒక ప్రేమ కథ

‘‘రాజులో విష్ణు అంశ ఉంటుందని అంటారు. కానీ నాకెందుకో పాలకుల్లో విష్ణు అంశ కన్నా ఇంద్రుడి అంశే ఎక్కువ అనిపిస్తోంది. ’’
‘‘ ఎందుకలా? ’’
‘‘ఇంద్రుడు పతీ పత్నీ ఔర్ ఓ కేసు కదా.. నాయకలు కూడా అంతే కదా.. అందుకే..’’
‘‘ జోకులు ఆపి సీరియస్‌గా చెప్పు ’’
‘‘నాయకుల్లో విష్ణు అంశ కాకుండా ఒక గొప్ప ప్రేమికుడి అంశ కనిపిస్తుంది. రౌడీ ముదిరితే నాయకుడు అవుతాడని అంటారు కానీ నేను మాత్రం ప్రేమికుడు ముదిరితే నాయకుడు అవుతాడనుకుంటాను’’
‘‘నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు అనుకో తప్పు లేదు కానీ, అలా అనుకోవడానికి ఓ బలమైన కారణం ఉండాలి. ’’
‘‘ లేకేం బోలెడు కారణాలు ఉన్నాయి. కామి కాని వాడు మోక్షగామి కాడన్నట్టు, ప్రేమికుడు కాలేని వాడు నాయకుడు కాలేడని బల్లగుద్ది చెప్పగలను.’’
‘‘ అదే అడుగుతున్నాను? ఎలా చెప్పగలవు అని? ’’
‘‘ నువ్వు సినిమాలు చూస్తావా? ముగింపులో ఏ ముంటుంది? ’’
‘‘శుభం’’
‘‘ సినిమా శుభం కార్డుతోనే ముగుస్తుంది. చివర్లో భంశు అని కార్డు పడితే ఇంత కంగాళీ సినిమా నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పే బాపూ కార్టూన్ గుర్తుంది కానీ శుభం కన్నా ముందు, సినిమా ముగింపులో ఏ ముం టుంది అని’’
‘‘ గ్రూప్ ఫోటో ఉంటుంది’’


‘‘పాతాళా భైరవిలో రాజకుమారిని ప్రేమించిన తోట రాముడి కథ నుంచి నిన్నమొన్నటి మెగాస్టార్ కొడుకు చరణ్ సినిమా, నటశేఖర్ కృష్ణ సాక్షి సినిమా మొదలుకొని ఆయన కొడుకు సినిమా, అల్లుడి సినిమా, ఎన్టీఆర్ మనవడి కుమారుడి సినిమా, అక్కినేని కుమారుడి మేనల్లుడి సినిమా ఏ సినిమా అయినా’’
‘‘చాల్లే సినిమా వారి వంశ వృక్షం మనకెందుకు కానీ అసలు విషయానికి రా! ’’
‘‘కొనే్నళ్ల తరువాత వందేళ్ల ఉత్సవాలు జరుపుకోనున్న తెలుగు సినిమాలన్నీ హీరో హీరోయిన్‌లు పెళ్లి చేసుకోగానే శుభం కార్డు పడుంది. అంతే కదా?’’
‘‘అవును.. టూరింగ్ టాకీసుల కాలం నుంచి మల్టీప్లెక్స్‌ల కాలం వరకు ఈ సంగతి అందరికీ తెలిసిందే ? ’’
‘‘ సినిమా కథ హీరో హీరోయిన్ల పెళ్లితో ముగిసిపోతుంది కానీ నిజ జీవితంలో కథ పెళ్లితోనే మొదలవుతుంది. పెళ్లి తరువాత కథలకు శుభం కార్డు ఎబ్బెట్టుగా ఉంటుంది అందుకే పెళ్లితోనే కథ ముగిస్తారు’’.
‘‘ఇంతకూ రాజకీయ నాయకుల ప్రేమికులనే వాదన ఎలా సమర్ధించుకుంటావో చెప్పనే లేదు? ’’


‘‘అక్కడికే వస్తున్నాను. రాజకుమారిని రాక్షసుడు గుహలో దాచిపెట్టినా హీరో నానా కష్టాలు పడి కొండలు గుట్టలు దాటి, మారువేశాలు వేసి హీరోను హతమార్చి హీరోయిన్‌ను తన దాన్ని చేసుకుంటాడు. ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా అంతే కదా కాలేజీకి ఫీజు కట్టి సర్వర్ కన్నా ఎక్కువ సమయం క్యాంటిన్‌లో నిరీక్షించి హీరోయిన్ దృష్టిలో పడతాడు. చిల్లర పనులన్నీ చేసి ఛీ కొట్టించుకుని చివరకు ఎలాగైతేనేం హీరోయిన్ మనసు దోచుకుంటాడు. శుభం కార్డు పడుతుంది. అంతే కదా? ’’
‘‘ అంతే అంతే కానీ అసలు విషయం... ’’
‘‘ ఒక్కసారి ఊహించుకో ప్రేమికులుగా హీరో హీరోయిన్‌లు చెట్ల వెంట పుట్టల వెంట పరిగెత్తుతూ పాటలు పాడుకుంటుంటే చూసేందుకు ఎంత బాగుంటుంది. వాళ్లిద్దరి మధ్య పెళ్లయ్యాక ఒక రేషన్ షాపు క్యూలో నిల్చుంటే మరొకరు ఆర్టీసి బస్సు కోసం పరిగెత్తి ఆఫీసర్ చేత చివాట్లు తింటూ ఆఫీసులో ఓ మూలన కూర్చోని పని చేస్తుంటే చూసేందుకు ఏమన్నా బాగుంటుందా?
నీలవేణి అలివేణి మీనాక్షి అంటూ రకరకాల పేర్లతో ప్రేయసి అందాన్ని వర్ణించి కవిత్వం రాస్తారు. రాయడం రాకపోతే ఎవడో ఒకడికి క్యాంటిన్‌లో టిఫిన్లు పెట్టించి కవిత్వం రాయించుకుని రక్తంతో రాశాను ప్రేమ లేఖ అంటూ ప్రేయసికి చెప్పిన ప్రియుడు పెళ్లి కాగానే ఏం చేస్తాడు. ఆఫీసుకు వెళ్లేందుకు టైం అవుతుంది, ఆ బోడి కూర వండేందుకు ఇంకెంత సేపు అంటూ గర్జిస్తాడా? లేక నువ్వు వంట వండుతుంటే ఎంత అందంగా ఉన్నావు శశి అంటూ బాపుగారి సినిమాలో హీరో హీరోయిన్‌తో మాట్లాడినట్టు మాట్లాడతాడా? నువ్వే చెప్పు ’’


‘‘ ఇంత మాట్లాడినా నువ్వు విషయంలోకి రావడం లేదు’’
‘‘ఆకాశం దించాలా? నెలవంకా తుంచాలా? అంటూ ప్రేయసి మనసు దోచేందుకు ప్రేమికుడు ఏం మాట్లాడతాడో, సరిగ్గా రాజకీయ నాయకుడు కూడా అదే మాట్లాడతాడు. ఆకాశమంతా రాజధాని కడతానంటాడు. చేసిన అప్పులు, చేయబోయే అప్పులు, పూర్వ జన్మలోని అప్పులు ఈ జన్మలోని అప్పులు అన్నీ తీర్చేస్తాను అంటాడు. ప్రేయసిని కలల్లో విహరింపజేసినట్టుగానే ఓటరును నాయకుడు ఊహాలోకంలో విహరింపజేస్తాడు. ’’
‘‘ఔను నిజమే దేశానే్నలే వారి నుంచి మా గల్లీ కార్పొరేటర్ వరకు ఇలానే అంటారు. ’’
‘‘మనం చదువుకునేప్పుడు అసంకల్పిత ప్రతీకార చర్య అని చెప్పేవారు గుర్తుందా? రుచికరమైన పదార్థాన్ని చూడగానే నోటిలో నీరు ఊరడం వంటివి మనకు సంబంధం లేకుండానే జరిగిపోతాయి. అసంకల్పిత ప్రతీకార చర్యలా ఆ చిన్న వయసులోనే మనలో నాయకత్వ లక్షణాలు సహజంగా అబ్బుతాయి. ఐదో తరగతి క్లాస్ లీడర్‌గా పోటీ చేస్తూ మన తరగతిని యూనివర్సిటీగా మార్చేస్తాం అనే హామీలు ఇచ్చేస్తాం. ’’
‘‘ఔను నిజమే ఇప్పుడు గుర్తుస్తోంది. మొన్న ఓ యూనివర్సిటీ ఎన్నికలు చూశాను. రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన అందిస్తామని కల్చరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న విద్యార్థి ఎంత బాగా చెప్పాడో? కానీ ప్రజలేంటి అంత అమాయకంగా నమ్మేస్తారు? అదే అర్ధం కాదు ’’


‘‘పిచ్చోడా? కొన్ని సార్లు ఎదుటి వారు మాట్లాడేది అబద్ధం అని తెలిసినా ఆ మాటలు వినేందుకు బాగుంటాయని వింటారు. ప్రపంచంలో నీ అంత అందగత్తె లేదని ప్రియుడు అనే మాటలతో ఆమె బుగ్గలు ఎరుపెక్కుతాయి. అతను జీవితంలో తన ఊరు దాటి ఉండడు కానీ ప్రపంచంలోని అందగత్తెలందరినీ చూసి ఆమెనే అందగత్తె అని తేల్చేస్తాడు. అతను చెప్పేది అబద్ధం అని ఆమెకు అందరి కన్నా బాగా తెలుసు. అబద్ధం అయినా సరే అలాంటి మాటలు వినేందుకు బాగుంటాయి. అందుకే రాజకీయ నాయకులు, ఓటర్లది ప్రేయసీ ప్రియుల సంబంధం అంటున్నాను. నాయకుల మాటలూ అబద్ధాలే అని ఓటర్లకూ తెలుసు కానీ వినడానికి బాగుంటాయి కదా?’’

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం