12, జనవరి 2015, సోమవారం

సెలబ్రిటీ స్వీపర్లు!

చేతిలో చీపుర్లు పట్టుకుని ముచ్చట్లు పెడుతుండడంతో క్షణాల్లో కెమెరాలు ప్రత్యక్షం అయ్యాయి. అది వివిఐపి జోన్.. బాగా డబ్బు కోసం కిడ్నాప్ చేయాలనుకునే వారు మొదలుకుని కొవ్వును కరిగించుకోవాలనుకునే వారి వరకు అందరూ అక్కడికొస్తారు. ఎ నుంచి జడ్ కేటాగిరి వరకు సెక్యూరిటీ హక్కుగా ఉన్నోళ్లు అక్కడ సర్వసాధారణం. గుంపును చూసి మొదట కెమెరాలు ఆ వెంటనే సీనియర్ నాయకులు, ఔత్సాహిక నాయకులు, పోలీసులు చేరిపోయారు. మహిళా ఆత్మాహుతి దళమేమో అని ఈ గుంపును దూరం నుంచి పరిశీలిస్తున్న వ్యక్తి అంచనా వేశాడు. అంత మంది చుట్టు ముట్టేసరికి ఆ గుంపు బెదిరిపోయింది.


‘‘చేతిలో చీపుర్లున్నాయి కానీ వాళ్లు సినిమా యాక్టర్లు కాదు. సానియా మీర్జా లేదు, సైనా నెహ్వాల్ కనిపించడం లేదు. ఎంత దూరంలో ఉన్నా పొడుగు కాళ్ల గుత్తా జ్వాలా కనిపిస్తుంది. కనిపించడం లేదంటే ఆమె రానట్టే, అంటే వాళ్లు స్పొర్ట్స్ ఉమెన్స్ కూడా కాదని తెలిసిపోతోంది. కనీసం బడా పారిశ్రామిక వేత్తలు కూడా కాదు. ఏంటో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చీపురు పట్టుకోవడమే.. హీరోలా ఓ ఫోజు. కనీసం టాలీవుడ్ స్టార్లయినా కాదు కానీ చేతిలో చీపురు’’ అంటూ ఓ యువకుడు అందరికీ వినబడేట్టుగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. ‘‘చీపురు పట్టుకోవాలంటే కనీసం నాలుగైదు సినిమాల్లో లీడ్ రోల్స్‌లో నటించి ఉండాలని చట్టం తేవాలి. నాగార్జున చీపురుపట్టుకున్నప్పటి ఫోటో పేపర్‌లో వచ్చింది కదా నాగార్జున వెనుక నీలి రంగు జీన్స్ ప్యాంట్ కనిపిస్తుంది కదా? అది నాదే. తెల్లషర్ట్ వేసుకున్నాను కానీ అది కనిపించడం లేదు. జీన్స్ ప్యాంట్ అందగాడ్ని నేనే’’ అని అతను తనను తాను పరిచయం చేసుకున్నాడు. పొగమంచు వల్ల వాళ్ల ముఖాలు సరిగా కనిపించడం లేదు. పోలీసులు వచ్చి వారిని పలకరించారు. జరుగుతున్నది ఏమిటో అర్ధం కాక అంతా వణికిపోయారు. బిత్తరపోయి చూస్తున్న మహిళలు వారి మధ్యలో ఒకే ఒక పురుష పుంగవుడు. సార్ క్షమించేయండి సార్ నేను వద్దే వద్దన్నాను ఇదిగో వీళ్లే అంటూ అతను పోలీసు కాళ్ల మీద పడిపోయాడు. వాళ్లతో మాట్లాడిన తరువాత పోలీసులకు విషయం అర్ధమై అందరినీ వెళ్లిపొమ్మని పంపించేశారు. 

వాళ్లంతా స్వీపర్లు, వాళ్ల కాంట్రాక్టర్ బర్త్‌డే కావడంతో టీ తాగుదామని అంతా ఒక చోట చేరారు. ‘‘ఇదీ విష యం చీపుర్ల గుంపు కనిపించడంతో మీలానే మేము కూడా వివిఐపిలేమో అని కంగారు పడ్డాం’’ అని ని పోలీసు అధికారి అందరికీ విషయం వివరించి చెప్పాడు.
‘‘నిజమే చీపుర్లు అనగానే సెలబ్రిటీలే గుర్తుకొస్తున్నారు కానీ రోడ్లు ఊడ్చేవాళ్లు చీపుర్లు పట్టుకుంటారనే విషయమే మర్చిపోయామండి’’ అని మీడియా వాళ్లు నవ్వుకున్నారు. అంతా వెళ్లిపోయిన తరువాత రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఆ చీపుర్ల బృందంలోని మహిళని పలకరించి, కంగారు పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చాడు.
‘‘ఈ మధ్య చాలా మంది చీపుర్లు పట్టుకొన్న ఫోటోలు పత్రికల్లో కనిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ కూడా రోడ్లు ఊడ్చే బిజినెస్‌లోకి వస్తున్నాడట కదా? ఏ వ్యాపారం దొరక నట్టు మీరంతా ఇందులోకి వచ్చి మా పొట్ట కొట్టాలా? రానివ్వండి వాళ్లందరినీ కడిగిపారేస్తాను’’ అని అమె ఆవేశంగా అంటోంది.


‘‘వాడెవడో పెద్ద కంపెనీ వాడు రోడ్లు ఊడ్చే కాంట్రాక్టు తీసుకుని వందల మంది సూపర్ వైజర్లను పెట్టుకుని మాతో రోడ్లు ఊడ్పిస్తున్నారు. మాకు తెలియదనుకోకండి మొన్న మా యూనియన్ మీటింగ్‌కు వెళ్లాను. రోడ్లు ఊడ్చే మా కన్నా సూపర్‌వైజర్లకు, కాంట్రాక్ట్ పొందిన కంపెనీకే ఎక్కువ ఆదాయం వస్తుందట! ఆదాయం బాగుందని ఏకంగా చీపుర్లు తీసుకుని పెద్దోళ్లంతా ఇలా రోడ్డున పడడం ఏమైనా న్యాయంగా ఉందా? ’’ అంటూ ఆమె ఆవేశంగా ప్రశ్నించింది.
‘‘ఆవేశపడకు... నేను చెబుతున్నాను కదా రోడ్లను ఊడ్చే నీ ఉద్యోగానికి ఎలాంటి ఢోకా లేదు. వాళ్లంతా సెలబ్రిటీలు అంటే బ్యాట్ పట్టినందుకు సానియా మీర్జా, సినిమాల్లో నటించినందుకు అమితాబ్ లాంటి వాళ్లు కోట్ల రూపాయలు తీసుకుంటారు. వ్యాపారంలో ఎత్తుపల్లాలు సహజమే ఎంత వ్యాపారం పడిపోతే మాత్రం చీపురు పట్టుకుని మీతో పోటీకి వస్తారా? రారు కదా? ’’ అని ఆ రిటైర్డ్ అధికారి ఆమెను అనునయించాడు.
‘‘మరి ఎందుకలా రోజూ చీపుర్లు పట్టుకుని టీవిల్లో కనిపిస్తున్నారు. ఇన్ని వందల మంది చీపుర్లు పట్టుకుని రోడ్డు మీదకు వస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయని భయంగా ఉంటుందా? ఉండదా? మీరే చెప్పండి. అర్ధరాత్రి నుంచి రోడ్లు ఊడ్చి రెక్కలు ముక్కలు చేసుకుంటే అందరి కమీషన్లు పోగా నెలకో నాలుగువేలు మిగిల్తే గొప్ప. దీనికీ పోటీ అంటే కోపం వస్తుందా? రాదా? మీరే చెప్పండి ’’ అని మళ్లీ అడిగింది.


‘‘ఎవరైనా మనిషే ఉద్యోగం పోతుందంటే కోపం వస్తుంది. కానీ టీవిల్లో రోజూ చీపుర్లతో కనిపించే వాళ్లేవరూ మీకు పోటీ కానే కాదు. ఇంకో విషయం తెలుసా? వాళ్లకసలు చీపురు పట్టుకోవడం కూడా సరిగా రాదు. ఇక ఊడ్వడం వరకెందుకు? కెమెరాల ముందు కాసేపు పట్టుకుని వెళ్లిపోతారు. నిజం నీమీద ఓట్టు నమ్ము.
స్వచ్ఛ్భారత్ అని కొత్త ప్రొగ్రామ్... మీ సూపర్‌వైజర్‌తో మంచిగుండాలని మీరనుకుంటారు కదా? అలానే దేశాన్ని పాలించే వాళ్లతో మంచిగుండాలని వాళ్లంతా అలా చీపుర్లు పట్టుకుని వెళ్లిపోతారు. ’’
‘‘స్వచ్ఛ్భారత్ అంటే ఏంటి బాబయ్యా.. రోడ్లు ఊడ్చేవారి జీతాలు పెంచడం, వారికి నీడ కల్పించడం, వారి ఆరోగ్యంపై దృష్టిపెట్టడం వంటి పథకాలు ప్రారంభిస్తారా? ’’


‘‘నీకెంత జ్ఞానోదయం కలిగించాలని ప్రయత్నించినా నీ చిన్నబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. స్వచ్ఛ భారత్ అంటే నీలాంటి స్వీపర్ల గురించి ఆలోచించడం కాదు. స్వచ్ఛ్భారత్ అంటే అంబానీ లాంటి బడా కార్పొరేటర్లు, అమితాబ్ లాంటి సూపర్ స్టార్లు, ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, సమంత లాంటి అందగెత్తలు చీపుర్లు పట్టుకోవడం. దేశానికో అంబానీ ఉన్నట్టుగానే రాష్ట్ర స్థాయి అంబానీలు కూడా ఉంటారు కదా? స్వచ్ఛ భారత్ అంటే ఏయే రాష్ట్రంలో ఏయే సెలబ్రిటీ ద్వారా చీపుర్లు పట్టించాలో ఆలోచించే ప్రోగ్రాం అంతే కానీ చీపుర్లు పట్టేవారి జీవితాల గురించి ఆలోచించే చీప్ ప్రోగ్రామ్ కాదు.’’ అని కోపంగా చెప్పి వెళ్లిపోయాడు ఆ రిటైర్డ్ ఉన్నతాధికారి.
సెలబ్రిటీ లు స్వీపర్ల అవతారం ఎత్తోచ్చు  .. కానీ స్వీపర్లు సెలబ్రిటీ లు కాలేరు 

1 కామెంట్‌:

  1. జిమ్ కెళ్ళే వాళ్ళందరినీ పట్టుకుని వాళ్ళ చేతికి డంబెల్స్ బదులు చీపుర్లు ఇస్తే స్వామి కార్యం, స్వకార్యం రెండూ అవుతాయి కదా!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం