8, ఫిబ్రవరి 2015, ఆదివారం

సినిమా చూపిస్త మామా !

సినిమాలు లేని జీవితాన్ని ఊహించలేం. సినిమా అంటే చిరాకు అనేవాళ్లు, సినిమానే ప్రాణంగా బతికేవాళ్లుంటారు. ప్రేమిస్తూనో, ద్వేషిస్తూనో సినిమానే మనకు లోకమై పోయింది. సినిమాలో హీరో ఒక్కడే వందల మంది విలన్లను చితగ్గొడుతుంటారు. అది సినిమా అనే విషయం కూడా మరిచిపోయి ఆ హీరో కటౌట్‌కు పాలాభిషేకం చేసే అభిమానులను చూసి నవ్వుకుంటాం. అదే హీరో వయసు మీరాక రాజకీయాల్లోకి వస్తే మన కష్టాలన్నీ తీర్చే దేవదూత వచ్చాడనుకుని దేవుడిలా పూజిస్తాం, ఓటేసి అధికారం అప్పగిస్తాం. హీరోలకు పాలాభిషేకాలు చేసే వారికి, ఓటేసే వారికి పెద్దతేడా ఉండదు కానీ వాళ్లను వీళ్లు, వీళ్లను వాళ్లు పిచ్చోళ్లు అనుకుంటారు. పిచ్చాసుపత్రిలో ఒకరిని చూసి ఒకరు జాలి పడ్డట్టు.


సచివాలయాన్ని ఎర్రగడ్డకు మారిస్తే సహించేది లేదంటూ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బృందం మూడు కిలో మీటర్ల మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టగా.. మూడడుగులు వేయకముందే పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటి వరకు మీరు చూసింది ట్రయలర్ మాత్రమే.. చూడాల్సిన సినిమా ముందుంది.. సినిమా చూపిస్తాం అని యువ మంత్రి కెటిఆర్ పొన్నాలకు ఆశ చూపించారు. సినిమా చూసిస్తా అంటే మురిసిపోవడానికి ఆయనేమైనా చిన్నపిల్లాడా? సినిమా చూపిస్తామని కెటిఆర్ అనడం, పోలీసులు నన్ను లాక్కెళ్లారు అంటూ పొన్నాల ఏడవడం మొదలు పెట్టారు. ఇది చూసిన మీడియా వారికి మాత్రం నిజంగానే సినిమా చూసినట్టు అనిపించింది. అయితే రాంగోపాల్ వర్మ కామెడీ సినిమా అనుకొని తీస్తే అప్పల్రాజు సినిమా ట్రాజెడీగా మిగిలిపోయినట్టు అయింది ఆయన వ్యవహారం. వర్మ దయ్యం సినిమా కన్నా ఆయన కామెడీ సినిమానే ప్రేక్షకులను ఎక్కువగా భయపెట్టింది. పాపం అలానే పొన్నాల జోక్ కన్నా ఆయన ఏడుపే మీడియాను ఆయోమయానికి గురి చేసింది. ఎప్పుడూ జోక్ చేసే పొన్నాల కన్నీళ్లు పెట్టడంతో ఇది ఆయన సహజ శైలిలో భాగమో, లేక బాధో అర్ధం కాక వర్మ సినిమా చూసిన ప్రేక్షకుల్లా మీడియా వాళ్లు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టారు.


కెటిఆర్ స్కూల్ ఎగ్గొట్టి సినిమాలు చూసే వయసులోనే ఎన్టీఆర్ తెలుగునాట రాజకీయాల్లో సినిమాలు చూపించడం మొదలు పెట్టారు. దశాబ్దాల పాటు అందరికీ ఎన్టీఆర్ సినిమాలు చూపిస్తే, ఆయన అల్లుడు పార్టీలో చేరిన పదేళ్లకే ఎన్టీఆర్‌కే సినిమా చూపించారు. ముఖం చూసి మనం గుమ్మడి అనుకుంటాం. వాళ్ల చేతిలో దెబ్బతిన్న తరువాత కానీ అతను గుమ్మడిలా కనిపించిన రాజనాల అని అర్ధం కాదు. జానపద సినిమాల్లో రాజు గారి నమ్మిన బంటే రాజుకు వెన్ను పోటు పొడిచినట్టు, ఎన్టీఆర్‌కు కూడా నమ్మిన బంటు నుంచే పోటు తప్పలేదు. నిజానికి ఒక కళాకారుడు సాటి కళాకారుడి ప్రతిభను అంగీకరించడు. యాచకుడికి యాచకుడు శత్రువు అన్నట్టు, రచయిత సాటి రచయిత గొప్పతనాన్ని అంగీకరించడు. కవి చచ్చినా ఇంకొకరిని గొప్ప కవి అనుకోడు. ఈ విషయంలో ఎన్టీఆర్ ఇలాంటి వారందరికీ అతీతంగా వ్యవహరించారు. అందరూ ఆయన్ని మహానటుడు అని కీర్తిస్తే, ఎన్టీఆర్ మాత్రం మా అల్లుడు నా కన్నా గొప్పనటుడు అని నిజాయితీగా మెచ్చుకున్నారు. 

అక్కడెక్కడో షోలే కొన్ని సంవత్సరాల పాటు నడించిందట! దిల్‌వాలే దుల్హనియా దశాబ్దాల తరబడి నడిచింది. ఏదో ఒక్క థియోటర్‌లో సినిమా నడవడం కాదు. తెలుగు నాట 83 నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా సినిమా నడుస్తూనే ఉంది. ఇంతకు ముందు మొత్తం రాష్టమ్రే ఒక ఓపెన్ థియేటర్‌గా ఉండేది. ఇప్పుడు ఒక థియోటర్ స్థానంలో రెండు వచ్చాయి అంతే. దశాబ్దాల క్రితమే పాలన వీధి నాటకంగా మారిపోయింది. వయసులో చిన్నవాడైనా పెద్ద మాట చెప్పాడు ఆ మధ్య రేవంత్‌రెడ్డి అనే యువ ఎమ్మెల్యే. ఆయన మాటల సారాంశం ఎన్నికల్లో గెలవడానికి అందరం అబద్ధాలు చెబుతాం. ఎవరి మాటలు నమ్మితే వారికి అధికారం. అంతే తప్ప ఎన్నికల ముందు చెప్పిన వన్నీ చేసి చూపించమంటే ఎలా సాధ్యం అంటూ చాలా నిజాయితీగా ప్రశ్నించారు. ఎంత బాగా చెప్పారో? దూకుడు, పోకిరీ సినిమాలు చూశారా? గాలిలో ఎగురుతూ ఒకేసారి ఒక్క వ్యక్తి డజన్ల మందిని తుపాకీతో పేల్చడం సాధ్యమా? తొడ కొడితే కార్లు ఆకాశంలోకి ఎగురుతాయా? డబ్బులిచ్చి సినిమా చూసే ప్రేక్షకులకు ఈ విషయం తెలుసు. అందులో నటించే మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లకు ఈ విషయం తెలుసు. దర్శకుడికి అంత కన్నా బాగా తెలుసు.

 కానీ ఆ సినిమాలు సక్సెస్ అవుతుంటాయి. అదంతే. రాజకీయాల్లో సైతం అచ్చం అలానే చెప్పేవారికి, వినేవారికి, క్యూలో నిలబడి ఓటేసేవారికి అందరికీ అవి అబద్ధాలు సాధ్యం కాదు అని తెలుసు. అయినా ఏదో కొత్త సినిమా చూసినట్టు కొత్త మాటలు విని ఊరట చెందుతారు. ఎందుకంటే సినిమాలకు తెలుగు రాజకీయాలకు పెద్ద తేడా ఉండదు కాబట్టి.
అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. నెలకు 30 సినిమాలు వస్తే అందులో సక్సెస్ అయ్యేవి ఒకటో రెండో అంతే. చిన్న సినిమా భారీ సినిమా అంటూ రోజూ ఏదో ఒక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా మొత్తం తెలుగు రాజకీయ సినిమా చరిత్రను మలుపు తిప్పుతుందనే అనుకుంటాడు. మెగా హిట్టు గ్యారంటీ అంటాడు. 149 సినిమాలు తీసిన అనుభవంతో చిరంజీవి సైతం ఇంతే నమ్మకంతో రాజకీయ సినిమా ప్రారంభిస్తే అట్టర్ ప్లాప్ అయింది. దాంతో 150 సినిమా తీయాలా? వద్దా అనే ఆలోచనలో పడ్డారు. తమ్ముడు ముందు జాగ్రత్తగా సినిమా టైటిల్ ప్రకటించారు కానీ షూటింగ్ ప్రారంభం అయిందో లేదో చెప్పడం లేదు. సినిమా తీసే ఉద్దేశం లేకపోయినా చాలా మంది సినిమా టైటిల్స్‌ను రిజిస్ట్రర్ చేయించుకుంటారు. ఇది కూడా అలాంటి కేసేనా? లేక నిజంగా సినిమా విడుదల అవుతుందా? అంటే అన్నీ ప్రశ్నలే తప్ప సమాధానం దొరకడం లేదు. ప్రశ్నిస్తాను అని బయలు దేరినాయన్ని ఎవరు ప్రశ్నించేది ఎవరు?
దశాబ్ద కాలం పాటు అన్ని పార్టీలకు కెసిఆర్ తెలంగాణ సినిమా చూపించారు. ఈ సినిమా నిర్మాతలం మేమే, సినిమా రైట్స్ మాకే దక్కాలి అని కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా జనం మాత్రం నిర్మాతను పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాతైనా మా సినిమా ఆడాలి అని కాంగ్రెస్ అంటుంటే, లేదు లేదు.. మేమే సినిమా చూపిస్తామని కెటిఆర్ అంటున్నారు. జనం మాత్రం ఒక టికెట్‌కు రెండు సినిమాలు అన్నట్టు తెలంగాణ, ఆంధ్ర థియోటర్లలో సినిమాలు చూసేస్తున్నారు.

1 కామెంట్‌:

  1. "వర్మ దయ్యం సినిమా కన్నా ఆయన కామెడీ సినిమానే ప్రేక్షకులను ఎక్కువగా భయపెట్టింది"
    :))

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం