24, ఏప్రిల్ 2015, శుక్రవారం

తెలంగాణ గుండె చప్పుడు కేసీఆర్

--నేడు టిఆర్‌ఎస్ ప్లీనరీ--
తెలంగాణ ఆత్మ తెలిసిన నాయకుడు కేసీఆర్. అందుకే పిడికిలెత్తి జై తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలంతా జై తెలంగాణ అంటూ దిక్కులు పిక్కటిల్లేట్టుగా నినదించారు. ఉద్యమంలో కెసిఆర్ వెన్నంటి ఉన్న నాయకులకు ఉద్యమ కాలంలో కేసీఆర్‌పై ఎంత నమ్మకం ఉందో తెలియదు కానీ ప్రజలకు మాత్రం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాకారం అవుతుందని నమ్మారు. తెలంగాణ సాకారం అ యిన తరువాత ఆయన వెంట ఉన్న మం త్రులు, ఎమ్మెల్యేల్లో బంగారు తెలంగాణపై ఎంత మందికి నమ్మకం ఉందో తెలియదు కానీ సాధారణ తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాకారం అవుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు. తెలంగాణ ఆత్మ తెలిసిన నాయకుడు కాబట్టే కేసీఆర్ తెలంగాణ ప్రజల మనోభావాల మేరకు పాలన సాగిస్తున్నారు. ఏ ఒక్క పార్టీ మరో పార్టీ ఉనికిని సహించలేదు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న పార్టీలన్నింటితో జై తెలంగాణ అనిపించిన నాయకుడు కేసీఆర్.
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది కావస్తోంది. ఏడాది కాలంలో తెలంగాణ పయనం ఏ విధంగా సాగిందో, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలో సమీక్షించుకోవడానికి నిర్వహించే సమావేశమే టీఆర్‌ఎస్ ప్లీనరీ. శుక్రవారం ఎల్‌బి స్టేడియంలో పారీట ప్లీనరీ జరుగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ప్లీనరీ కావడంతో అధికార పక్షం పోకడలన్నీ ప్లీనరీ ఏర్పాట్లలో కనిపిస్తున్నాయి. ప్లీనరీలో ఎన్ని వంటకాలు వండారు, ఎంత మంది వడ్డించారు, నగర అలంకరణ ఎంత అట్టహాసంగా చేశారు అనేది తెలుగు రాజకీయ రంగంలో ఇది కొత్తేమీ కాదు. ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి సమావేశాల్లో లొట్టిపిట్టలు, ఏనుగుల ఊరేగింపులు గతంలో చూసినవే. ఇలాంటి ఆర్భాటాల సంగతి ఎలా ఉన్నా... తెలంగాణ ఏ దిశలో వెళుతోందో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చే దిశగా ప్లీనరీ సాగాలి.
కేసీఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్య మం ప్రారంభం అయిన తరువాత ఉద్యమానికి నాయకత్వం వహించడానికే కేసీఆర్ పనికిరాడని అన్నారు. టిఆర్‌ఎస్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయ్యాక ప్రజల్లో కదలిక మొదలయ్యాక. కేసీఆర్‌ను బలహీన పరచడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని బలహీన పరచవచ్చునని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వ్యక్తిగతంగా బహుశా కేసీఆర్‌ను టార్గెట్ చేసినంతగా రాజకీయ రంగంలో మరో నాయకుడిని చేసి ఉండరు. ఆలె నరేంద్ర, విజయశాంతి, దేవేందర్‌గౌడ్, గద్దర్ లాంటి ఎందరో కేసీఆర్‌కు పోటీగా తెలంగాణ కోసం రాజకీయ పార్టీలు ప్రారంభించారు. అట్టహాసంగా ముహూ ర్తం షాట్ తీసి చేతులెత్తేసిన కొత్త సినిమా నిర్మాతల్లా కొద్ది రోజులకే పార్టీలను మూసేశారు. తెలంగాణ ఏర్పాటును బలంగా కోరుకున్న వర్గాలు టిఆర్‌ఎస్ వైపు ఆశగా చూస్తే, తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన వర్గాలు ఈ కొత్త పార్టీలను మీడియా ద్వారా ఆకాశానికి ఎత్తాయి. అయితే అవి మీడియాలో వార్తలు గానే మిగిలిపోయాయి కానీ తెలంగాణ ప్రజల మనసుల్లోకి వెళ్లలేదు. ఎన్ని లోపాలున్నా ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయం లేదు అన్నట్టుగా, తెలంగాణ ప్రజలు ఎన్ని లోపాలున్నా తెలంగాణ సాధనకు కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం లేదని విశ్వసించారు. తెలంగాణ సాకారం అయిన తర్వాత పాలించేందుకు కాంగ్రెస్, టిడిపి- బిజెపి, టిఆర్‌ఎస్ మూడు పక్షాల నాయకులు ప్రజల ముందుకు వస్తే, ఉద్యమ కాలంలో నమ్మిన కేసీఆర్‌కే తిరిగి ప్రజలు పట్టం కట్టారు.
11నెలల పాలనా కాలంలో కేసీఆర్‌సైతం ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయలేదు. ఒక ఉద్యమ కారుడికి ఉండాల్సిన వ్యూహం, ఎత్తుగడ, ఆవేశం వేరు. పాలకుడికి ఉండాల్సిన రాజధర్మం వేరు. ఉద్యమ నాయకుడికి, పాలకుడికి మధ్య తేడా బాగా తెలిసిన నాయకుడు కేసీఆర్. మోదీ అద్భుత పాలన మీకు ఇప్పుడు అర్ధం కాదు, ఐదేళ్ల తరువాత తెలుస్తుంది అంటున్న బిజెపి నాయకులు కేసీఆర్ పాలన ఫలితాలు ఇప్పుడే తేలాలంటున్నారు. ఎవరేమన్నా కేసీఆర్ రాజధర్మం ముందు ముందు అర్ధమవుతుంది.
ఎన్నికల ఫలితాలు వెలువడగానే కేసీఆర్ మంత్రివర్గంలో చేరమని ఎంఐఎంను ఆహ్వానించారు. ఒక ప్రతినిధి బృందాన్ని ఎంఐఎం వద్దకు పంపించారు. టిఆర్‌ఎస్, ఎంఐఎం కలిసిపోతున్నాయని ప్రచారం సాగింది. కొద్ది రోజుల తరువాత బిజెపి ప్రభుత్వంలో టిఆర్‌ఎస్ చేరిపోతోందని బలంగా ప్రచారం సాగింది. ఒకే పార్టీ అటు ఎంఐఎంతో ఇటు బిజెపితో కలుస్తుందని ఒకేసారి ప్రచారం సాగడం విశేషం.
తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. అందుకే కెసిఆర్ వ్యూహాత్మకంగానే ఇటు ఎంఐఎంతో సన్నిహితంగా ఉంటూనే మరోవైపు కేంద్రంలో బిజెపి ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. తెలంగాణ ఏర్పడే సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా సాగిన ప్రచారాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కేసీఆర్ అనుసరించిన వ్యూ హం సరైనదా? కదా? అనేది తెలుస్తుంది. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌లో భూముల ధరలు పాతాళంలో పడిపోతాయని, హైదరాబాద్‌లోని పరిశ్రమలన్నీ తరలిపోతాయని, ఆదాయం పడిపోతాయని, చీకట్లు కమ్ముకుంటాయనే ప్రచారం సాగింది. వ్యతిరేక శక్తుల ప్రచారం ఏ విధంగా ఉన్నా, ఈ ప్రచారాన్ని తెలంగాణ ఏర్పాటును బలంగా కోరుకున్న శక్తులు సైతం కొంత వరకు నమ్మాయి.
తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ, గుండె కాయ బలంగా ఉంటేనే తెలంగాణ బతికి బట్టకడుతుంది. కెసిఆర్ పగ్గాలు చేపట్టగానే ముందు గుండె కాయపైనే దృష్టిపెట్టారు. నగరంలో దాదాపు 30 శాతం విస్తరించి ఉన్న ఎంఐఎం లాంటి పార్టీకి ప్రాధాన్యత ఇవ్వడం వెనుక వ్యూహం సైతం ఇదే. హైదరాబాద్‌లో భారీ నిర్మాణాలు, ఆకాశ మార్గాలు వంటి ప్రకటనలతో రియల్ ఎస్టేట్ రంగం ఆలోచనలో పడింది. తెలంగాణ ఏర్పాటుకు ముందే రియల్ ఎస్టేట్ రంగంలో కొంత స్తబ్దత ఏర్పడి అది కొనసాగింది. ఇప్పుడిప్పుడు తిరిగి కదలిక ప్రారంభం అయింది. అంతే తప్ప భయంకరంగా ప్రచారం జరిగినట్టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పాతాళంలో పడిపోలేదు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారికే పదవులు లభించాలని తెలంగాణ ఉద్యమ కారులు కోరుకోవడంలో తప్పు లేదు. రాజకీయం వేరు ఉద్యమం వేరు. చివరకు ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారి తల్లే ఎన్నికల్లో ఓడిపోయారు. ఎలాంటి త్యాగాలు చేయని, ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు పెట్టుబడి పెట్టిన అభ్యర్థి విజయం సాధించారు. ఎన్నికల రాజకీయాలు వేరు, ఉద్యమ రాజకీయాలు వేరు. అందుకే ఎన్నికల సమయంలో, ఎన్నికల తరువాత అంత వరకు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వారిని సైతం టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. మంత్రివర్గంలో సైతం స్థానం కల్పించారు. తెలంగాణ సాధించారు సరే ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలంటే అధికారంలో ఉండడం, తిరిగి అధికారం దక్కేట్టు ఇప్పటి నుంచే వ్యూ హాలు రచించుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా అవసరం. దానిలో భాగంగానే పక్తు రాజకీయ ఎత్తుగడలతో ఇతర పార్టీలను బలహీన పరుస్తూ ఆయా పార్టీల వారిని టిఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఇదేమీ కొత్త కాదు గతంలో ఉన్నదే, ఇప్పుడు సాగుతున్నది, భవిష్యత్తులో కూడా ఉంటుంది.
తెలంగాణ పోరాడి సాధించుకున్న రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ అనివార్యంగా ఏర్పడిన రాష్ట్రం. తెలంగాణలో కేసీఆర్ విఫలం చెందాలని ఇతర రాజకీయ పక్షాలు కోరుకోవడం సహజం. కేసీఆర్ విఫలం అయితే తాము అధికారంలోకి వస్తామనేది ఆ పార్టీల ఆశ. కానీ కేసీఆర్ నాయకత్వం విఫలం అయితే ప్రజల ఆకాంక్ష విఫలం అయినట్టు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ విఫల ప్రయోగంగా చేసినట్టు అవుతుంది. ప్రజల ఆకాంక్షల మేరకు కేసీఆర్ నడుచుకోవాలి. తాను విఫలం చెందితే టిఆర్‌ఎస్ అనే ఒక రాజకీయ పార్టీ, కేసీఆర్ అనే ఒక నాయకుడు విఫలం చెందినట్టు కాదు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష, నమ్మకం విఫలం చెందినట్టు.
సదకొండు నెలల కాలంలో టిఆర్‌ఎస్ చెప్పుకోదగిన విజయాలనే సాధించింది. వచ్చే ఎన్నికల్లో ఇంటింటికి తాగునీటిని అందించలేకపోతే ఓట్లు అడగడం అని కెసిఆర్ ధైర్యంగా చెబుతున్నారు. అవి చేస్తాం ఇవి చేస్తాం అని రాజకీయ నాయకులు ప్రకటించడం మామూలే కానీ ఎన్నికల నాటికి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగం అని ఎవరూ చెప్పలేదు. వాటర్ గ్రిడ్ పథకంపై ప్రధానమంత్రి సైతం ఆసక్తి చూపుతూ అన్ని రాష్ట్రాలను పరిశీలించమని చెప్పారు. చెరువులు తెలంగాణకు ప్రత్యేకం. చెరువు పూడిక తీసివేత ఒక ఉద్యమంగా చేపట్టడం టిఆర్‌ఎస్‌కు రాజకీయంగా, తెలంగాణ పల్లెలకు ఆర్థికంగా ప్రయోజనకరమైంది. ఏటా ఈ సీజన్‌లో విద్యుత్ కోతలతో అల్లాడే వాళ్లు. ఈ సీజన్‌పై ఎంతో ఆశలు పెట్టుకుని విపక్షాలు ఉద్యమానికి లాంతర్లు సిద్ధం చేసుకున్నాయ. కానీ గతంలో ఎప్పుడూ లేనట్టుగా విద్యుత్ కోత అనేది ఈ సీజన్‌లో లేకుండా చూడడంలో కేసీఆర్ విజయం సాధించారు. ఉద్యమ నాయకుడిగానే కాదు పాలకుడిగా సైతం తన శక్తి సామర్ధ్యాలను కేసీఆర్‌చూపించారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, మీడియాను ఖాతరు చేయడం లేదు, అనే విమర్శల సంగతి ఎలా ఉన్నా తెలంగాణ ప్రజలను మెప్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని కేసీఆర్ నిలబెట్టుకోవాలి. కేసీఆర్ ఏ మీడియా పెద్దను కలిశారు, ఎవరికి పదవి ఇచ్చారు? పౌర హక్కులను ఎంత వరకు కాపాడుతున్నారు? ఎన్‌కౌంటర్‌లు నిజమేనా? అనేది విమర్శకులకు కావాలి. కేసీఆర్ తెలంగాణ కోసం ఏం చేయనున్నారు అనేదే సాధారణ తెలంగాణ ప్రజలకు కావలసింది. సంక్షేమ పథకాలు, నీళ్లు, నీడ, ఉపాధి ఇవే వారికి కావలసినవి. ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత వీటికే ఇవ్వాలి. సామాన్యుడికి సొంతింటి కల నెరవేరితే, ఇంత కాలం ఫ్లోరోసిస్ శాపానికి బలైన వారికి గుక్కెడు మంచినీళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించిన రోజే బంగారు తెలంగాణ సాకారం ఆయినట్టు.