23, ఆగస్టు 2015, ఆదివారం

హీరోలూ...! నిరుద్యోగులు.. షష్టిపూర్తులూ...!@ 60

‘‘మీ ఇంటికొచ్చి ఇంత సేపైంది ఓ మాట లేదు.. ముచ్చట లేదు. అసలేమైంది నిన్ను చెల్లెమ్మ గానీ తలపై బలంగా కొట్టిందా? ఏంటి? ’’
‘‘నాకు అంత అదృష్టమా అన్నయ్య గారూ! వయసు మీద పడింది కదా తలమీద కొడితే మెదడు చిట్లిపోతుందేమోననే భయంతో కొట్టడం లేదు. ఏం జరిగిందో తెలియదు కానీ ఎవరితోనూ మాట్లాడవద్దని నిర్ణయించుకున్నారు.’’


‘‘ఏం జరిగిందిరా! నాక్కూడా చెప్పకూడదా? ’’
‘‘నువ్వు మరీ బలవంత పెట్టేస్తున్నావు. నిర్మోహమాటంగా మాట్లాడితే నీకూ కోపం వస్తుంది? ’’
‘‘కాలేజీలో చదువుకునేప్పుడు విశాలక్ష్మికి నేను ప్రేమ లేఖ రాయడం, అవిడ నా చెంప ఛెళ్లు మనిపించడం తప్ప ఏ విషయంపైనైనా నిర్మొహమాటంగా మాట్లాడు. నాకేమీ అభ్యంతరం లేదు. ’’
‘‘మొన్న పుట్టిన రోజున అనాథాశ్రయంలో, వృద్ధాశ్రయంలో కాస్సేపు సరదాగా గడుపుదామని వెళ్లాను ’’

‘ఇందులో తప్పేముంది. సమాజం నిర్లక్ష్యం చేసిన వారిని ఆప్యాయంగా పలకరించడం కన్నా పుణ్యం ఏముంటుంది? ’’
‘‘ అదే నేను చేసిన తప్పు. నేను వెళ్లే సరికి అచ్చం చిక్కడ పల్లి సిటీసెంట్రల్ లైబ్రరీలో గ్రూప్ వన్‌కు ప్రీపేర్ అవుతున్న కుర్రాళ్ల సమూహంలా కనిపించింది ఆ వృద్ధాశ్రమం. అంతా తలో చెట్టు కింద పుట్ట కింద చేరి పుస్తకాలు చదువుకుంటున్నారు. రాసుకుంటున్నారు. భలే ముచ్చటేసింది. సరే ఆ వృద్ధాశ్రమం నిర్వాహకులు మనకు తెలిసిన వారే కావడంతో అందరినీ ఒక చోట చేర్చారు. అయినా కొందరు దగ్గరికి రాకుండా సీరియస్‌గా ఏదో రాసుకుంటూ కనిపించరు. వీలునామా రాస్తున్నారా తాతయ్యా? అంటూ ఆప్యాయంగా పలకరించాను అంతే... ’’
‘‘ నువ్వు చెప్పు ఇందులో తప్పేమైనా ఉందా? ’’
‘‘ తప్పేముందిరా! ప్రేమ, ఆప్యాయత ఉంది కానీ’’
‘‘ కదా? కానీ ఆక్కడ రాసుకుంటున్న వారంతా ఒక్కసారిగా నాపై దాడికి దిగారు. పిచ్చపిచ్చగా ఉందా? ఏమనుకుంటున్నావని నిలదీశారు. ’’


‘‘ ఇంతకూ వాళ్లేం రాసుకుంటున్నారు, నీ మీద కోపమెందుకు? కొంపదీసి ఈ వయసులో అక్కడున్న అమ్మమ్మలు, తాతయ్యలు ఒకరికొకరు ప్రేమలేఖలు రాసుకుంటున్నారా? ఏమిటి? ఆ..ఆహా ...హా...’’
‘‘ ఆపురా నీ నవ్వు !’’
‘‘ మరేంటో విషయం చెప్పు’’
‘‘ వాళ్లంతా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్నారట! వాళ్లలో ఒక్కరు కూడా 60 ఏళ్ల లోపు వాళ్లు లేరు. కొత్త ప్రభుత్వం పదేళ్ల పొడిగింపు, వికలాంగుల కోటా, ఆ కులం, ఈ కులం ఇతర విభాగాల కింద ప్రత్యేక పొడిగింపులతో 62ఏళ్ల వరకు కూడా ఉద్యోగానికి పరీక్షలు రాసే చాన్స్ వచ్చింది. 58 ఏళ్లకు రిటైర్‌మెంట్.. 62ఏళ్ల వరకు పరీక్ష రాసే చాన్స్.. పుట్టిన రోజున వాళ్లను ఆప్యాయంగా పలకరించాలని వెళ్లి వాళ్లతో చివాట్లు తిని వచ్చేశాను..’’
‘‘ ఔను పుట్టిన రోజంటే గుర్తుకొచ్చింది.. చిరంజీవికి 60 ఏళ్లట. నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. రాంగోపాల్ వర్మ కూడా ఇదే మాట అన్నాడు కదా? చిరంజీవికి 60 అంటే ఒప్పుకోం 26 మాత్రమే అని ప్రకటించేశాడు. ఏంటో చిరంజీవి నా కన్నా వయసులో పెద్ద అంటే అస్సలు ఒప్పుకో బుద్ధి కావడం లేదు ’’


‘‘ముందు నేను చెప్పేది విను. ఆ తరువాత నీ గోడు చెప్పు వింటాను. మా మేనమామ కొడుకు ముఖేష్ కనిపిస్తే అభిమానంతో ఏంటోయ్ హీరో అని పలకరించాను’’
‘‘ఇందులో తప్పేమైనా ఉందా? ’’
‘‘ పెద్దవాడినని కూడా చూడకుండా ఒక్కసారిగా గయ్‌మని లేచాడు. ఏంటీ నాకెమన్నా 60 ఏళ్లు దాటాయనుకుంటున్నావా? జస్ట్ 30 ఏళ్లు మాత్రమే.. మరోసారి హీరో అని పిలిస్తే మర్యాద దక్కదు అని వార్నింగ్ ఇచ్చాడు. ఏంటో ఏం మాట్లాడినా ఇలా రివర్స్ అవుతుందని కొద్ది రోజులు మాట్లాడవద్దనుకున్నాను’’
‘‘ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు కానీ చిత్రంగా ఉంది కదూ ఒకవైపు చిరంజీవి షష్టిపూర్తి జరుపుకుంటూ మరోవైపు కొత్త సినిమా కోసం చర్చలు సాగిస్తున్నారు. షష్టిపూర్తి వేడుకలు ముగియగానే హీరోయిన్‌తో కలిసి పార్కుల్లో కిందా మీద పడి బోర్లుతూ ప్రేమ కబుర్లు చెప్పడం విచిత్రంగానే ఉంటుంది కదూ’’
‘‘ ఇందులో విచిత్రం ఏముందోయ్ అన్నగారు 60 ఏళ్ల వయసులో అమ్మా నేను కాలేజీలో ఫస్ట్ వచ్చానమ్మా అంటూ ఇంటికి పరిగెత్తుకు రావడం, ఎన్టీఆర్ కన్నా సగం వయస్సున్న తల్లి ఆనంద బాష్పాలు రాలుస్తూ నా కలలు ఫలించాయి బాబూ ఫలించాయి అంటూ కన్నీళ్లు తుడుచుకోవడం... ఎన్టీఆర్ చేతిలో నోట్‌బుక్ పట్టుకుని సీరియస్‌గా చదువుకుంటూ ఆయన కన్నా పావుసగం వయస్సున్న హీరోయిన్ కవ్వించినా పట్టించుకోక పోవడం ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఆ రోజులే వేరు. ’’
‘‘ సరైన సమయంలో సినిమాల్లోకి వచ్చి టాప్ లేపిన చిరంజీవి ఏడేళ్ల ముందు రాజకీయాల్లోకి వచ్చి దెబ్బతిన్నారు కానీ 60 ఏళ్ల వయసులో ఇప్పుడు వచ్చి ఉంటే ఎన్టీఆర్‌లా సక్సెస్ అయి ఉండేవారేమో అనిపిస్తుంది. ఆజాను బాహుడు కావడం వల్ల ఎన్టీఆర్ నిజానికి తన వయసు కన్నా పెద్దగా కనిపించే వారు.తెలుగు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్‌లోకి వచ్చిన కాలంలోనే ఎన్టీఆర్ వయసు కన్నా పెద్దగా కనిపించే వారు. తాత వయస్సు ఉంటేనే హీరో అనే నమ్మకం ఆ కాలంలో బలంగా ఉండడంతో ఎన్టీఆర్ నెట్టుకొచ్చారు.


చిరంజీవి కూడా ఎన్టీఆర్‌లా 60 ఏళ్ల వరకు సినిమాల్లో నటించి, . ఇంత కాలం ఆదరించిన తెలుగు ప్రేక్షకుల కోసం ఏమైనా చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను అనే డైలాగు వినిపిస్తే పేలేది కదా? పైగా ఢిల్లీలో తెలుగు పాలకులకు ప్రధాని కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. తెలుగు ఆత్మగౌరవం డైలాగుకు మళ్లీ మంచి రోజులు వచ్చి ఉండేవి. ఏడేళ్ల ముందు రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారు, ఇప్పుడు తనకు 60 ఏళ్లు అని ప్రకటించి మరో తప్పు చేశారు. హీరోలు అభిమానుల దృష్టిలో దేవుళ్లు.. దేవుళ్ల వయసు ఎప్పుడూ పాతికేళ్ల వద్దే ఆగిపోతుంది.
-బుద్దా మురళి (జనాంతికం 23.8.201 5)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం