13, సెప్టెంబర్ 2015, ఆదివారం

కుక్క కరిచింది!

బ్రేకింగ్ న్యూస్
‘‘రాణీ... కుక్క ఒకేసారి ఏకంగా ఏడుగురిని కరిచింది’’
‘‘థ్యంక్స్ రఘు ఈరోజు పెద్దవార్తలేమీ లేవు. తొందరగా లైవ్‌లోకి వచ్చేయ్’’
‘‘బ్రేకింగ్ న్యూస్...కెసిఆర్ ఇంటికి 28 కిలో మీటర్లు, హైటెక్ సిటీకి 31 కిలో మీటర్లు, అమరావతికి నాలుగు వందల కిలో మీటర్ల దూరంలోని కుషాయిగూడలో పిచ్చి కుక్క విచక్షణా రహితంగా 18 మందిని కరిచింది. పూర్తి వివరాలు మా రిపోర్టర్ రఘును అడిగి తెలుసుకుందాం’’
‘‘ రఘూ... కుక్క కరవడంపై ఏమంటున్నారు’’
‘‘ఒకేసారి 18 మందిని పట్టపగలు అందరూ చూస్తుండగా కరవడం వెనుక అంతు చిక్కని కుట్ర ఏదో ఉందనే అనుమానం రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు రాణి’’


‘‘ రఘూ...రాజకీయ నాయకులు ఎవరైనా స్పందించారా?’’
‘‘విప్లవ ప్రతిఘాతక శక్తులు బరితెగించారు అనడానికి కుక్క కరవడమే సాక్ష్యం. ఆరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని కుక్క కాట్లతో విప్లవాన్ని ఆపలేరు.’’ అని విప్లవ్‌కుమార్ ఆవేశంగా ప్రకటించాడు రాణీ. స్థానిక ప్రముఖ నాయకుడు గన్నయ్య మాట్లాడుతూ దామాషా ప్రకాఠం కరవాలి కానీ మా సామాజిక వర్గం వాళ్లను ఎక్కువ మందిని కరిచింది. ఇందులో కుట్ర దాగుంది. సాక్షాలను తారు మారు చేసే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేసి సిబిఐ విచారణకు ఆదేశించాలి.’’
‘‘రఘూ... రాష్ట్రాలను కుదిపేసిన ఈ సంఘటనపై మన స్టూడియోలో ఉన్న విశే్లషకుల అభిప్రాయాలు తెలుసుకుందాం. ముందుగా ప్రముఖ రిటైర్డ్ మేధావి మేదయ్య అభిప్రాయం’’


‘‘అరవడం మనిషి లక్షణం, కరవడం కుక్క లక్షణం. ప్రత్యేక పరిస్థితుల్లో మనుషులు కరుస్తారు, కుక్కలు అరుస్తాయి. మానవ నాగరికత అభివృద్ధి చెందుతున్న దశలో కక్కలు, మనుషులు కలిసే అరిచేవారు, కరిచే కరిచేవారు. మనిషి ఆహారాన్ని వేటాడే దశలో అతనికి కుక్కలు తోడుగా ఉండేవి. నాగరికత అభివృద్ధి చెందిన తరువాత సామాజిక వర్గాలు, మతం ఏర్పడిన తరువాత కుక్కల పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి తమ జాతిపై మనుషులు సాగిస్తున్న అమానుషత్వానికి ప్రతీకారంగానే ఆ కుక్క మనుషులపై దాడి చేసి కరిచింది. ఆ కుక్క నా దృష్టిలో విప్లవ వీరుడు. ఏ జాతిలోనైనా ముందు ఒకే ధిక్కార స్వరం వినిపిస్తుంది. ఆ తరువాత ఆ స్వరాన్ని ఇతర స్వరాలు అనుసరిస్తాయి. మనం అన్ని కోణాల్లో ఈ అంశాన్ని పరిశీలించాలి. ఒక వేళ ఆ కుక్క అసంకల్పితంగా తిరుగుబాటు జరిపితే దానిలో హిందుత్వ వాదుల కుట్ర లేకపోలేదు. హిందూ శక్తులు ఆ కుక్కను ఉసిగొల్పి కరిపిస్తున్నాయేమో అనే కోణంలో పరిశోధన సాగించాల్సిన అవసరం ఉంది. నేనీ మాటను ఆషామాషిగా చెప్పడం లేదు. ఆ కుక్క నలుపు రంగులో ఉంది. అక్కడక్కడ తెలుపు మచ్చలు కనిపిస్తున్నాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ కుక్క మీసాల్లో కాషాయ రంగులో ఉన్న వెంట్రుక ఒకటి కనిపిస్తుంది. కుక్క మూతితోనే కరుస్తుంది. అంటే కాషాయ రంగు వెంట్రుక ప్రభావం ఆ కుక్క చర్యలో ఉందని చెప్పడంలో నాకు సందేహం లేదు. ’’


‘‘రాజకీయ జీవి గారు ఈ సంఘటనను మీరెలా చూస్తున్నారు.’’
‘‘మీరో కీలకమైన విషయాన్ని మరిచిపోతున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేనప్పుడే ఈ సంఘటన జరిగిందంటే యాదృచ్చికం అని భావించలేం. బలమైన సాక్ష్యాన్ని సిద్ధం చేసుకొని రాజకీయ కుట్రలో భాగంగానే ఇది జరిగి ఉంటుంది. స్టూడియోలో చర్చకు రాక ముందే కూషాయ గూడాలో కుక్క కాటుబారిన పడ్డవారి వివరాలు సేకరించాను. సామాజిక వర్గాల వారిగా బాధితుల సంఖ్యను చూస్తే రాజకీయ కారణం అనిపిస్తోంది. మా పార్టీకి అండగా నిలిచే సామాజిక వర్గం వారినే ఎక్కువ మందిని కరిచింది. మమ్ములను కరిచే కుక్కలను మేం తిరిగి కరుస్తాం. కరవడం అంటూ మొదలు పెడితే కుక్కలు మిగలవని గ్రహించాలి. పులితో ఫోటో దిగాలనుకో పరవా లేదు కానీ చనువిచ్చింది కదా అని పులిని కరవాలనుకుంటే కుక్క అనే కనికరం కూడా లేకుండా తిరిగి కరిచేస్తాం.’’
‘‘తటస్థులు గారు అందరి అభిప్రాయాలు విన్నారు కాదా దీనిపై మీరేమంటారు’’


‘‘ ఈ దేశంలో దురదృష్టకరమేమంటే అంతా తమ తమ పార్టీల కోణంలోనే సమస్యను చూస్తున్నారు. సమస్యను సమస్యగా చూడడం లేదు. ఇప్పుడున్న పార్టీలన్నీ కుక్కలను రెచ్చగొట్టి మనుషులను కరిపిస్తున్నాయి. కొత్త పార్టీ రావలసిన అవసరం ఉంది అని మొన్నటి వరకు నేను పని చేసిన పార్టీ నన్ను బయటకు పంపిన తరువాత నేను గ్రహించిన విష యం’’
‘‘రఘూ... విన్నావు కదా! ఇంతకూ విచక్షణా రహితంగా మనుషులను అలా ఎందుకు కరవాల్సి వచ్చిందో ఆ కుక్కతో మాట్లాడించు’’
‘‘ రాణీ... కుక్క కరవడంపై మనం ప్రసారం చేసిన వార్త దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ప్రధాన మంత్రి కార్యాలయం దీనిపై వివరాలు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కుక్కలను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ రాష్ట్రప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వివిధ పార్టీల ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసింది. రాష్టప్రతిని, అమెరికా అధ్యక్షుడిని కలిసేందుకు వేరువేరు బృందాలు బయలు దేరి వెళ్లాయి రాణీ. అసలెందుకు కరిచిందో మనం కుక్కను అడిగిత తెలుసుకుందాం.


 కుక్కగారూ మీరెందుకు..... ’’
కెవ్వు కేక
‘‘రఘూ... ఏమైంది .. రఘూ...మాట్లాడండి’’


‘‘హాలో నేను దారిన పోయే దానయ్యనండి. మీ రిపోర్టర్‌ను కుక్క కరిచింది. కెవ్వుమని అరిచి పడిపోయాడండి. మాట్లాడలేడు. మీ రిపోర్టర్ నాకు బాగా తెలుసండి. ఆ కుక్క వాడి పెంపుడు కుక్కే. ఈ రోజు వార్తలేమీ లేక తన పెంపుడు కుక్క కరవడంపైనే స్టోరీ చేశాడు. తనను అడ్డం పెట్టుకుని ఇంత రాజకీయం చేయడం చూశాక ఆ కుక్కకు పిచ్చెక్కి మీ రిపోర్టర్‌ను కరిచేసింది. ఇప్పుడు, మీ స్టూడియో వైపేపరిగెత్తుకు  వస్తోంది జాగ్రత్తండి ’’

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం