31, అక్టోబర్ 2015, శనివారం

ఎన్టీఆర్ .. బాబు.. వైయస్ ఆర్ .. కెసిఆర్ జమానా- మీడియా .....జనం ఆమోదమే పాలనకు కొలమానం

ఒక పాలకుడి సామర్ధ్యానికి పనితీరుకు కొలమానం ఏమిటి? ప్రజాస్వామ్యంలో కచ్చితంగా జనం ఆమోదమే ఒక నాయకుడి పనితీరుకు కొలమానం. అంతే తప్ప మీడియాతో ఆ నాయకుడు ఎలా వ్యవహరించాడు, మీడియా అతన్ని ఎలా ఆకాశానికి ఎత్తింది? ఎంతగా వ్యతిరేకించింది అనేది పాలకుడి పనితీరుకు కొలమానం కానే కాదు. 2004 గుజరాత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సమయంలో ప్రపంచ వ్యాప్తంగా మీడియా నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించింది. అదే సమయంలో చంద్రబాబు పాలనను తెలుగు మీడియా ఆకాశానికెత్తింది. ప్రపంచ మీడియా సైతం ఆకాశానికెత్తినట్టు తెలుగు మీడియా తెలుగు పాఠకులకు చెప్పుకొచ్చింది. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే మీడియా వ్యతిరేకించిన నరేంద్ర మోదీ ఘన విజయం సాధించారు. మీ డియా ఆకాశానికెత్తిన చంద్రబాబు టిడిపి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కేవలం 47 స్థానాలకు పరిమితం అయ్యారు. అది మీడియా రంజక పాలనే తప్ప జనరంజక పాలన కాదని జనం తేల్చారు . 

 నాయకుడి పనితీరుపై మీడియా అంచనా, ప్రజల అంచనాలకు అస్సలు సంబంధం లేకపోవడం వల్ల వచ్చిన ఫలితాలివి. టిడిపి ఆవిర్భావానికి ముందు తెలుగునాట రాజకీయాలు ఒక రకంగా ఉంటే ఆ తరువాత రాజకీయాల్లో పూర్తిగా మార్పు కనిపించింది. మీడియా రాజకీయాల్లో భాగంగా మారిపోయింది. ఇప్పుడు పాలకులు- మీడియా సంబంధాలపై చర్చ సాగుతోంది. చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ ముగ్గురి మీడియా అనుబంధం ఒకరితో ఒకరికి ఏ మాత్రం సంబంధం లేనిది. టి అంజ య్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఆవరణలోని సిఎల్‌పి కార్యాలయం మెట్లమీద ఒక జర్నలిస్టు అంజయ్య భుజంపై చేయి వేసి మాట్లాడిన సందర్భాలు సైతం ఉన్నాయి. చివరకు సెక్యూరిటీ వాళ్లు బతిమిలాడడం వల్ల ఆ విధానానికి స్వస్తి పలికారు.
ఎన్టీరామారావు కొన్ని దశాబ్దాల పాటు నటుడిగా సంపాదించుకున్న ఇమేజ్ వల్ల అభిమానులు ఆయన్ని దేవుడిగా చూసేవారు. తిరుపతి వెళ్లి అటు నుంచి మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్‌ను చూసే భక్తులు ఉండేవాళ్లు. అలాంటి ఇమేజ్‌తో రాజకీయ పార్టీ స్థాపించిన ఎన్టీఆర్‌కు మీడియా అండగా నిలిచింది. ఎన్నికల ప్రణాళిక రూపొందించడం మొదలు, అభ్యర్థుల ఎంపిక వరకు మీడియానే చేసింది. అయితే ఆ కాలంలో కాం గ్రెస్‌పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల మీడియా పాత్రపై పెద్దగా విమర్శలు రాలేదు. 


ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత కొద్దిమంది మీడియా వారిని మాత్రమే గుర్తించే వారు. ఆయనకు పత్రికలు చదివే అలవాటు కూడా తక్కువ. మనం వార్తలు సృష్టించాలి కానీ మనం చదవడం ఏమిటి అనేవారట! ఎన్టీఆర్‌ను మినహాయిస్తే ఆ తరువాత ముఖ్యమంత్రులకు మీడియాతో విడదీయరాని బంధం ఏర్పడింది. నువ్వు మరోసారి నా ఇంటికి రా వద్దు, నీ ముఖం నాకు చూపించవద్దు అని విలేఖరుల సమావేశంలోనే ఎన్టీఆర్ ఒక జర్నలిస్టును మందలించారంటే ఆయన్ని దించే కుట్రలో మీడియా పాత్ర ఎంతో తెలుస్తోంది. ఆ తరువాత ఎన్టీఆర్ వద్దకు ఆ జర్నలిస్టు వెళ్లాల్సిన అవసరం ఏర్పడలేదు. ఎన్టీఆర్‌నే వ్యూహాత్మకంగా మీడియా, బాబు కలిసి దించేశారు.
తాను అధికారం చేపట్టడం వెనుక మీడియా పాత్ర ఉండడం వల్ల చంద్రబాబు ముఖ్యమంత్రి మీడియాకు బాగా ప్రాధాన్యత ఇచ్చారు. బదిలీల కోసం, పోస్టింగుల కోసం ముఖ్యమంత్రిగా బాబు ఇంటి వద్దే కాకుండా ఒక జర్నలిస్టు ఇంటి వద్ద సైతం అధికారులు పడిగాపులు కాసిన రోజులు ఉన్నాయి. బాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే అప్పటి వరకు మంత్రిగా ఉపయోగించిన చాంబర్ వద్దే విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతుంటే ఆజాద్ చిస్తీ అనే ఒక జర్నలిస్టు బాబు చెవిలో ఏదో చెప్పడానికి ప్రయత్నించగా, మీరేదైనా చెప్పదలుచుకుంటే బహిరంగంగానే చెప్పండి అంటూ బాబు నిర్మొహమాటంగా చెప్పారు.


 నిజానికి బాబుకు చెవి కొరుకుడు బృందం వేరుగా ఉండేది. ఇతను ఆ బృంద సభ్యుడు కాదు. ముఖ్యమంత్రి చెవి కొరకడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. చెవి కొరుకుడు చూసిన ఉన్నతాధికారులు ఏదేదో ఊహించుకుని చెవి కొరికిన జర్నలిస్టు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితునిగా భావించి వాళ్లు చెప్పినవి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ కిటుకు ఆ జర్నలిస్టుకు తెలుసు, బాబుకూ బాగా తెలుసు. 

ఏవరో జర్నలిస్టు చెప్పినట్టు నేను నడుచుకుంటాను అని మీరు అనుకుంటున్నారు కదా అని బాబు చాలా సార్లు మీడియా ముందే అడిగే వారు. ఆయన అలా అడగడం వెనుక ఉద్దేశం తనను ఎవరూ నడిపించ డం లేదని చెప్పడం. అయితే ప్రారంభంలో మాత్రం ముఖ్యమంత్రిగా తాను స్థిరపడాలి అనే ఉద్దేశంతో చెప్పినవి చేశారు. చంద్రబాబు మొత్తం జర్నలిస్టుల సంక్షేమం కోసం పెద్దగా పట్టించుకోలేదు కానీ తనను నమ్మిన కొద్ది మందిని ఎక్కడికో తీసుకు వెళ్లారు. జీతాలు కూడా సరిగా చెల్లించలేని సంస్థల్లో పని చేసిన వారిని బంజారాహిల్స్ భవంతుల స్థాయికి తీసుకు వెళ్లారు. రిలయన్స్ లాంటి కంపెనీలో ఉన్నత స్థాయి కల్పించారు. మేనేజ్‌మెంట్ కోటాలో తన వాటా కింద ఒకరిద్దరి పిల్లలకు మెడికల్ సీటు కూడా ఇప్పించారు. మహా అయితే ఓ డజను మంది జర్నలిస్టుల మంచి చెడులు ఆయన చూసుకున్నారేమో కానీ వేలాది మంది సామాన్య జర్నలిస్టులకు ఆయన పాలనలో ఒరిగింది ఏమీ లేదు.


ఇక వైఎస్‌ఆర్‌ది బాబు కన్నా పూర్తి భిన్నమైన శైలి. సచివాలయానికి వచ్చినప్పుడు, పోయేప్పుడు మీడియాతో మాట్లాడే విధానం బాబు హయాంలో ఉంటే దానికి స్వస్తిపలికి అవసరం ఉంటే తానే పిలిచి మాట్లాడతానని అన్నారు. ఆ రెండు పత్రికలు అంటూ మీడియా తీరును బహిరంగంగానే విమర్శించే వారు. ప్రజలను ఒప్పించి అధికారంలోకి వచ్చినా మీడియాను ఒప్పించలేమని, మీడియా మదిలో టిడిపినే ఉంటుందనే భావనతో సొంతంగా మీడియా ఏర్పాటు చేసుకున్నారు. అసెంబ్లీ జరిగేప్పుడు లాబీల్లో కనిపించే జర్నలిస్టులను పేరు తెలియకపోయినా ఏం సార్ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ వెళ్లే వారు. ఒకరిద్దరు జర్నలిస్టులకు సొంత వ్యవహారాలు చక్కబెట్టినా మొత్తం జర్నలిస్టుల సంక్షేమం కోసం కొంత వరకు ప్రయత్నించారు. హెల్త్ కార్డుల వల్ల ఎంతో మంది జర్నలిస్టులకు మేలు జరిగింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సొంత ఇంటి కలను నిజం చేయాలనుకుని భూమి కేటాయించారు. అనేక కేసులు పడ్డాయి సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో ఇప్పటి వరకు వివాదం పరిష్కారం కాలేదు. వైఎస్‌ఆర్ తరువాత వచ్చిన రోశయ్య ఉన్నది కొద్ది రోజులే కాబట్టి చెప్పు కొదగిన పరిణామాలేమీ జరగలేదు. జర్నలిస్టుల వద్ద ఆరోగ్య బీమా కోసం డబ్బులు వసూలు చేసి కార్డులు ఇవ్వని ఘనత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానిది. బహుశా ఈదీ అమీన్‌లాంటి పాలకులు సైతం బీమా సొమ్ము తీసుకుని హెల్త్‌కార్డులు ఇవ్వకుండా అనారోగ్యంతో కొందరు జర్నలిస్టులు మరణించేట్టు చేసి ఉండరు.


చెన్నారెడ్డి కాలం నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి కాలం వరకు కాంగ్రెస్, టిడిపిలు, ము ఖ్యమంత్రులు ఎందరు మారుతున్నా జర్నలిస్టు నాయకులుగా అధికార గణం వద్ద అధికారం చెలాయించేది మాత్రం వాళ్లే. ఎవరు మారినా మీరు మాత్రం కొనసాగుతున్నారని ఒకసారి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారి ముందు ఆశ్చర్యపోయారు. పార్టీలు మారినా వీరి ప్రాభవం తగ్గలేదు. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడడంతో పరిస్థితి పూర్తుగా మారిపోయింది.


బాబు వైఎస్‌ఆర్‌ల కన్నా కెసిఆర్‌ది భిన్నవైఖరి. కొమ్ములు తిరిగాయని భావించే జర్నలిస్టులను సైతం పట్టించుకోరు. అదే సమయంలో ఏదో మారుమూల గ్రామానికి చెందిన గ్రామీణ విలేఖరితో సైతం ఆప్యాయంగా కబుర్లు చెబుతారు. బాబు హయాంలో సచివాలయంలో, అసెంబ్లీలోకి ఆయన వచ్చేప్పుడు పోయేప్పుడు మీడియానే స్వాగతం పలికి, మీడియానే వీడ్కోలు పలికేది. వైఎస్‌ఆర్ దీన్ని కొంత తగ్గిస్తే, కెసిఆర్ కనీసం అటువైపుకూడా మీడియా రాకుండా చేశారు. దీన్ని కొమ్ములు తిరిగిన వాళ్లు, ముఖ్యమంత్రితో ఆప్యాయ సంబంధాల వల్ల వ్యవహారాలు నడిపిన వారు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. 

పాలన ఎలా ఉందో, ప్రజల కష్టనష్టాలు గురించి మీడియాలో రాయడం జర్నలిస్టు బాధ్యత అంతే కానీ ఆ సంగతులు ముఖ్యమంత్రి చెవిలో చెప్పడం డ్యూటీ కాదు కదా? చెవి కొరకనివ్వక పోతే నియంతృత్వం, అహంకారం అంటూ ఆ గగ్గోలు ఎందుకు? ఎప్పుడంటే అప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఇస్తే అది అద్భుతమైన పాలనా? పాలనను ప్రజల కోణంలో చూడాలి, తప్ప జర్నలిస్టులకు ముఖ్యమంత్రి ఎంత వరకు దగ్గరగా ఉన్నారనే దాన్ని బట్టి కాదు. మీడియా వల్ల అధికారంలోకి వచ్చిన నాయకుడిలోనే క్రమం గా మార్పు వచ్చింది. 

అలాంటిది 14 ఏళ్లపాటు ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన నేత మీడియా సహాయంతో అధికారంలోకి వచ్చిన నేతలా ఉండాలని ఎలా కోరుకుంటారు? జర్నలిస్టు పెద్దన్నలుగా అధికారం చెలాయించిన వారికి ఇది కష్టకాలమే అయితే కావచ్చు. కానీ దానితో ప్రజలకు సంబంధం లేదు. గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం తీసుకునే చర్యలపై టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. హామీలు అమలు చేస్తారా? లేదా ? అనేది కాలం చెబుతుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో జర్నలిస్టులు చెప్పాలి కానీ జర్నలిస్టు పెద్దలే ప్రపంచం అని తాము బాగుంటే ప్రపంచం బాగున్నట్టు , తమను పట్టించుకోక పోతే నియంతృత్వం, అహంకారం అనుకోవడమే అసలైన అహంకారం.


  • - బుద్దా మురళి 
  • 31/10/2015

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం