20, డిసెంబర్ 2015, ఆదివారం

కాల్ మనీ -వాణిశ్రీ చీరలు .. సావిత్రి అందాలూ

‘‘మనం ఎక్కడికి వెళుతున్నామో అని ఆలోచిస్తే ఒక్కో సారి భయం వేస్తుంటుంది’’
‘‘ నిజమే.. అవసరం కోసం అప్పు తీసుకుంటే రాక్షసులు ఆడవారి జీవితాలతో ఆడుకుంటారా? ఆ రాక్షసులను ఎన్‌కౌంటర్ చేసేయాలి.’’
‘‘ఆ సంగతి మనకెందుకు వదిలేయండి. ఆటోవాడు మీటరు మీద ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నాడు ఇంత కన్నా దుర్మార్గం ఉంటుందా? ’’
‘‘ ఇవన్నీ కామన్.. మరీ అంత దుర్మార్గం ఏమిటండి వయసులో ఉన్న ఆడవారిని వారి, పిల్లలను అప్పు చెల్లించలేదని వ్యభిచారం చేయిస్తారా? ప్రజాప్రతినిధులతో జల్సాలకు విదేశాలకు పంపిస్తారా? చదువుతుంటేనే రక్తం సలసల కాగిపోతోంది. ’’
‘‘ఇలాంటివి కామన్ .. ఇందులో అన్ని సామాజిక వర్గాల వారున్నారు. అసలు అందం అంటే మహానటి సావిత్రిదేనండి.. ఎం అందం, ఏం అభినయం. కన్యాశుల్కం చూశారా? లొట్టిపిట్టలు అంటూ నవ్వుతూ ఆమె చెప్పే డైలాగు మనను గిలిగింతలు పెట్టి కవ్విస్తున్నట్టుగా ఉండదూ ’’
‘‘నేను కాల్ మనీ గురించి చెబుతుంటే మీరేంటండి కన్యాశుల్కం అంటారు.’’
‘‘కన్యాశుల్కం నాటకమైనా సినిమా అయినా నాకు నచ్చలేదు అన్న పిచ్చొడ్ని నేను మొదటి సారి చూస్తున్నాను. కన్యాశుల్కం నాటకంలోని ప్రతి డైలాగు ఇప్పటికీ కంఠతా వచ్చిన వాళ్లున్నారు. దేవదాసులో అంత చిన్నవయసులో సావిత్రి ఎంత పరిణితి కనబర్చిందండి. ఏం నటన ఏం నటన. ’’
‘‘ అది కాదండి కొత్త రాజధాని ఇమేజ్ ఏమై పోతుంది. రుణాలిచ్చి ఆడవారి మానాలు దోచుకునే కాల్‌మనీ రాక్షసులు, ఇసుక మాఫియాను అడ్డుకున్న అధికారులను చితక్కోట్టే ప్రజాప్రతినిధులను ఇలా విచ్చలవిడిగా వ్యవహరించే వారిని వదిలేయడం న్యాయమా? పాలకులు కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాలి కదా?’’
‘‘ సరే ఏం చేస్తాం మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలి. మహానటి సావిత్రి గురించి మాట్లాడితే వినేంత ఓపిక కూడా మీకు లేదు.. దానవీర శూరకర్ణ చూశారా? తెలుగు సినిమా చరిత్రలో అజరామరమైన సినిమా అది. ఒక్కో డైలాగు ఒక్కో ఆణిముత్యం కదటండి. ఏమంటివేమంటివి? ఇది క్షాత్ర పరీక్షే కానీ... చిత్రం భళారే విచిత్రం .... ఆ సినిమాలో ఎన్టీఆర్ ఆరున్నర కిలోల కిరీటం, మూడు కిలోల 534 గ్రాముల బరువైన నగలు, రెండు కిలోల బరువున్న పాదరక్షలు, ఆరకిలో మేకప్ ఉపయోగించారు తెలుసా? ’’
‘‘అప్పు చేయడం తప్పు కాదు. ఇంత అన్యాయం ఏంటండి. మనమిప్పుడు మాట్లాడుకోవలసింది ఓలమీ తిక్కరేగిందా? ఒళ్లంతా తిమ్మిరెక్కిందా? అనే పాటలో ఎన్టీఆర్ హీరోయిన్ పిరుదులపై ఎన్ని సార్లు కొట్టారు. తన పిరుదులను ఎన్నిసార్లు తిప్పారు అని కాదండి. ఎట్టాగో ఉన్నాది ఓలమీ ఏటేటో అవుతుందే చిన్నమ్మి అంటూ వాణిశ్రీ కొంగు జారినప్పుడు చూసి అక్కినేని ఎన్నిసార్లు బొర్లాపడిపోయాడు అని కాదండి మనం చర్చించాల్సింది. చట్టం అంటూ ఒకటి ఉందని, నేరాలకు పాల్పడిన వారి పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుంది అనే సందేశం ప్రజల్లోకి వెళ్లాలి కదండి’’
‘‘ అబ్బా మీరేంటండి నక్షత్రకుడు హరిశ్చంద్రుడ్ని వదలకుండా పట్టుకున్నట్టు, మీకు ప్రపంచంలో మరే అంశం దొరకనట్టు కాల్ మనీ కాల్ మనీ అని పట్టుకుని కూర్చున్నారు. మాస్టారు ప్రపంచం చాలా స్పీడ్‌కు ముందుకు వెళ్లిపోతోంది మారండయ్యా మారండి. మోనాలిసా మనం ఎటు నుంచి చూసినా నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. ఇదెలా సాధ్యం 

అయిందంటారు.? బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించేప్పుడు ఎంత అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారండి. నాదృష్టిలో ఆయన రచనలన్నింటిలోకీ అదే ఉత్కృష్టమైంది.’’


‘‘ ఈ చర్చ నాకు నచ్చలేదు అంటున్నాను. ’’
‘‘ ఈ కాకా హోటల్‌లో మనం చర్చించుకోవడానికి ఇంత కన్నా ముఖ్యమైంది ఏముంది? మీకు సావిత్రి అన్నా పడదు. ఎన్టీఆర్ నచ్చరు, అక్కినేని అంటే గిట్టదు. పోనీ జెమ్స్‌బాండ్ కృష్ణ గురించి మాట్లాడుకుందామంటే ముఖం చిట్లిస్తారు. వాణిశ్రీ చీరల గురించి తెలియకుండానే ఆ వయసు దాటి వచ్చారా? ఈ సబ్జెక్ట్స్ గురించి చర్చిచేంత అవగాహన మీకు లేకపోతే పోనీ జబర్ధస్త్ ప్రోగ్రామం గురించి మాట్లాడుకుందామా? ’’
‘‘వాటి గురించి నాకు తెలియదు’’


‘‘మీరు కళాకారులను అవమానిస్తున్నారు, జాతి నాయకులను అవమానిస్తున్నారు జాతీయ నాయకులను అవమానిస్తున్నారు. చివరకు బాబా సాహేబ్ అంబేద్కర్‌ను సైతం అవమానిస్తున్నారు. మీ ప్రవర్తన పాకిస్తాన్ తీవ్రవాదుల కన్నా తీవ్రంగా ఉంది. మీకు గాంధీ అన్నా లెక్క లేదు, సర్దార్ పటేల్ అన్నా పట్టింపు లేదు. ఇలాంటి వారిని ఉగ్రవాదులుగా ప్రకటించి దేశ బహిష్కరణ శిక్ష వేయాలి’’
‘‘మీరు అపార్థం చేసుకున్నారు. నేను వాళ్లేవరినీ అవమానించ లేదు. ప్రపంచంలో తెలుగు వారికి ఎక్కడ అన్యాయం జరిగినా స్పందిస్తానని హామీ ఇచ్చారు. కాల్ చేస్తే వచ్చేస్తానన్నారు కాల్‌మనీ విషయంలో ఇలా ఉన్నారేమిటని? దేశంలో మన పరువేం కావాలని అంటున్నాను తప్ప నేనెవరినీ అవమానించలేదు. కావాలంటే మా ఇంటికి వచ్చి చూడు అంబేద్కర్ సాహిత్య సంకలం మొత్తం నాదగ్గరుంది. ’’


‘‘ అందరినీ అవమానిస్తున్న మీలో మార్పు రావాలని కోరుతూ ఒక రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ’’
‘‘వామ్మో వాళ్లందరినీ అవమానించానని నువ్వు ప్రచారం చేస్తే ఏమైనా ఉందా? క్షమించు కాల్‌మనీ కాలనాగుల గురించి అస్సలు మాట్లాడను.’’
‘‘అలా రా దారికి... కుబేరుడు శ్రీవేంకటేశ్వరస్వామికి అప్పిచ్చి ఇంకా వడ్డీ వసూలు చేస్తూనే ఉన్నాడుకదా? కాల్ మనీ కేసుపై విచారణ కలియుగం ప్రారంభం నుంచి మొదలు పెట్టాలి. అంటే నువ్వు దైవాన్ని కూడా అవమానిస్తున్నావన్నమాట. ఆర్‌బిఐ చేసేది వడ్డీ వ్యాపారమే. ప్రపంచ బ్యాంకు దేశాలకు అప్పులిస్తుంది అంటే నువ్వు ప్రపంచ బ్యాంకుకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా కుట్రకు తెర తీస్తున్నావన్నమాట? ’’


‘‘కావాలంటే ఏడాది సస్పెండ్ చేసుకో నన్ను క్షమించి వదిలేయ్ ’’
-బుద్దా మురళి (జనాంతికం 20. 12.2015)