6, ఫిబ్రవరి 2016, శనివారం

చరిత్ర సృష్టించిన తెరాస

రాజకీయాల్లో విజయం నాయకులను ఆనందంలో ముంచెత్తుతుతుంది. అయితే జిహెచ్‌ఎంసిలో తెరాస సాధించింది సాధారణ విజయం కాదు. సంతోషపెట్టడం కన్నా భయపడాల్సిన విజ యం. సాధారణ రాజకీయ నాయకులు ఒక అసాధారణ విజయంగా దీన్ని చూసి మురిసిపోకూడదు. విజయంపై మురిసిపోవడం, ప్రత్యర్థులను ఎద్దేవా చేయడం ఎవరైనా చేసేదే. కానీ నాలుగు కాలాల పాటు విజ య పరంపర కొనసాగాలన్నా, ప్రజల ఆ కాంక్షలను అర్ధం చేసుకుంటే ఈ విజయా న్ని చూసి భయపడాలి. అలా భయపడితేనే ఈ విజయం నాలుగు కాలాల పాటు నిలుస్తుంది. హైదరాబాద్ నగరానికి నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. చాదర్‌ఘాట్ డెవలప్‌మెంట్ బోర్డు నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వరకు 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఇంతటి సుదీర్ఘమైన చరిత్రలో గతంలో ఎప్పుడూ ఒక రాజకీయ పక్షానికి ఇంత భారీ మెజారిటీ లభించలేదు.


150 డివిజన్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో పాత బస్తీలో ఎంఐఎం సామ్రాజ్యాన్ని మినహాయిస్తే మొత్తం నగరంలో టిఆర్‌ఎస్ కారు దూసుకెళ్లింది. గ్రేటర్ ఎన్నికల ప్రచా రం ముగింపు తరువాత తెలంగాణ భవన్‌లో కెటిఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కారు, కెసిఆర్ తప్ప మరోటి చూడబోరు. మీరు ఊహించని స్థాయిలో మా విజయం ఉంటుంది చెప్పారు. టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని అందరూ ఊహించిందే అయినా ఈ స్థాయి ఘన విజయం ఊహించలేదు. 14 ఏళ్ల ఉద్యమం ఫలించి తెలంగాణ కల సాకారం అయిన తరువాత జరిగిన ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో టిఆర్‌ఎస్ 63 నియోజక వర్గాల్లో సాధించిన విజయం కన్నా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సాధించిన విజయం ఘనమైంది.


గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ వారే ఉంటారు. కానీ హైదరాబాద్ అలా కాదు. తెలంగాణకు రాజధాని అయినా ఇది మినీ ఇండియాలా ఉంటుంది. మినీ ఇండియా రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో ఇంతటి ఘన విజయాన్ని సాధించడం మామూలు విషయం కాదు. తెలంగాణ ప్రజలు, పెద్ద సంఖ్యలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు, దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు చెందిన వారు వీరందరినీ టిఆర్‌ఎస్ నాయకుడు కెసిఆర్ ఏకం చేసినట్టు ఫలితాలు నిరూపిస్తున్నాయి.
టిఆర్‌ఎస్‌కు ఓటు వేయడానికి ఒక్కో వర్గానికి ఒక్కో కారణం ఉండవచ్చు కానీ ప్రజలు టిఆర్‌ఎస్‌పై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారనడానికి ఈ ఫలితాలు నిదర్శనం. వారి ఆశల మేరకు పని చేయాల్సిన బాధ్యత టిఆర్‌ఎస్‌పై ఉంది. విజయాన్ని సొంతం చేసుకునేందుకు అందరూ ముందుకు వస్తారు. తప్పేమీ లేదు అన్ని చేతులు కలిస్తేనే విజయం సాకారం అయిం ది. కానీ ఈ విజయంతో మురిసిపోవడానికే పరిమితం అయితే ఇతర పార్టీలకు టిఆర్‌ఎస్‌కు తేడా ఉండదు. ప్రజలు ఏ ఆశలతో టిఆర్‌ఎస్‌ను, కెసిఆర్ నాయకత్వాన్ని గెలిపించారో గుర్తించి, వాటిని సాకారం చేయా లి. 14 ఏళ్ల తెలంగాణ ఉద్య మం ద్వారా తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టుకున్న టిఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు సాధారణ ఎన్నికల్లో పట్టం కట్టారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలో ప్రజలకు చెప్పి ఒప్పించిన కెసిఆర్, సాధించిన తెలంగాణ ఏ విధంగా ఉండాలో చెప్పి అదే ప్రజలను ఎన్నికల్లో ఒప్పించారు. విజయం సాధించారు. తెలంగాణ ప్రజలు 14 ఏళ్ల ఉద్యమం వల్ల టిఆర్‌ఎస్‌ను గెలిపించారు. ఏడాదిన్నర పాలనలో టిఆర్‌ఎస్ తెలంగాణ ప్రజలతో పాటు హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రాంతంతో పాటు ఇతర రాష్ట్రాల ఓటర్ల మద్దతు సైతం సాధించడం విశేషం.


నరేంద్ర మోదీపై దేశ వ్యాప్తంగా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని మూడు దశాబ్దాల తరువాత సంకీర్ణ రాజకీయాలకు స్వస్తిపలికి ఒకే పార్టీకి విజయం చేకూర్చారు. అయితే మోదీ అధికారం చేపట్టిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ బిజెపికి ఎదురుగాలి వీస్తోంది. మోదీ పాలిస్తున్న ఢిల్లీ రాష్ట్రంలోనే బిజెపికి ఘోరపరాజయం తప్పలేదు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఎక్క డ ఏ ఎన్నికలు జరిగినా బిజెపికి పరాజయమే. బిహార్‌లో లక్షల కోట్ల ప్యాకేజీని సై తం ప్రజలు తిరస్కరించారు. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో నాలుగువ స్థానంలో నిలిచారు. అదే సమయంలో తెలంగాణలో మాత్రం ఏ ఎన్నికలు జరిగినా టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తోంది. వరంగల్ పార్లమెంటులో విపక్షాలకు డిపాజిట్ దక్కలేదు. టిడిపి ఆవిర్భావం నుంచి 17 ఏళ్లపాటు అధికారంలో ఉన్న సికిందరాబాద్ కంటోనె్మంట్‌లో విజయం సాధించలేకపోయింది. కానీ టిఆర్‌ఎస్ మాత్రం తొలిసారి పోటీ చేసి కంటోనె్మంట్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంతకు మించిన ఘన విజయం సాధించింది.


రోమ్‌లో రోమన్‌లా ఉండమన్నారు. అలానే ఉద్యమ కాలంలో ఉద్యమ కారుడిగా ఉన్న కెసిఆర్ తెలంగాణ ఆవిర్భావం జరిగాక, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ఒక పాలకుడిగానే ఉన్నారు. ఉద్యమ కారుడిగా 14 ఏళ్లపాటు కెసిఆర్‌ను చూసిన వారు ముఖ్యమంత్రిగా సైతం అదే విధంగా ఊహించుకున్నారు. కానీ వారి ఊహలను పటాపంచలు చేస్తూ కెసిఆర్ రాజధర్మాన్ని పాటించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కెసిఆర్ ప్రచారం చేసింది రెండే రెండు సార్లు. ఒకటి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధికి ఏం చేయదలిచారో చెప్పారు. ఒక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విపక్షాలు ఉద్యమ కాలంలో కెసిఆర్ ఏం మాట్లాడారో చెప్పడానికి ప్రయత్నిస్తే, కెసిఆర్ మాత్రం ప్రభుత్వాధి నేతగా హైదరాబాద్‌లో ఏం చేయదలిచారో చెప్పారు. హైదరాబాద్‌లో ఉండేవారంతా మా బిడ్డల్లాంటి వారే అని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను సైతం కొందరు తప్పు పట్టారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా విభజన జరిగింది. ఇది అయిపోయిన అంశం. ఇప్పుడు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే దానిపై అందరి దృష్టి ఉండాలి. ఏం చేస్తామో చెప్పిన టిఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరించారు. ఈ అంశంలో సరైన వ్యూహం లేని విపక్షాలను జనం పాతిపెట్టేశారు. 

సాధారణ విజయం అయితే టిఆర్‌ఎస్ ఈ ఫలితాలను సాధారణంగా తీసుకోవచ్చు. కానీ ఇవి అసాధారణ ఫలితాలు. ప్రజలు టిఆర్‌ఎస్‌పై ప్రాంతాలకు, రాష్ట్రాలకు, కులాలకు అతీతంగా ఎంత ఆశలు పెట్టుకున్నారో తెలిపే ఫలితాలు. టిఆర్‌ఎస్ ఈ దిశగా పని చేయాల్సిన బాధ్యత ఉంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. వరుస విజయాలతో ప్రజలు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారని స్పష్టం అవుతోంది. అయితే ఇంకా మిగిలి ఉన్నది మూడేళ్ల కాలం. ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారో వాటిని చేసి చూపించాం అని వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ నాయకత్వం సగర్వంగా ప్రకటించుకునే అవకాశం ఉండాలి. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పాతాళంలో పడిపోతుందని, చీకట్లు తప్పవని భారీగా ప్రచారం చేశారు. ఈ మాటలు తెలంగాణ వారిని సైతం భయపెట్టాయి. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత నాయకత్వం సరైన పంథాలోనే వెళ్లి ఈ ప్రచారాలు పచ్చి అబద్ధాలని నిరూపించగలిగింది. ప్రపంచ ప్రఖ్యాత ఐటి కంపెనీలు హైదరాబాద్‌లో అడుగు పెట్టేట్టు చేసింది.


హైదరాబాద్ తెలంగాణ గుండె కాయ. ప్రచారం ద్వారా ఈ గుండెకాయనే పిసికేయాలని ప్రయత్నించారు. కానీ టిఆర్‌ఎస్ నాయకత్వం గుండెకాయను బతికించుకుంటేనే తెలంగాణ బతుకుతుందని గ్రహించి సమర్ధవంతంగా పని చేసింది. ఇక టిఆర్‌ఎస్‌కు ఎదురులేదని తేలిపోయింది. ఇంకా మూడున్నర ఏళ్ల కాలంలో చెప్పినవి చేసి చూపడంపై దృష్టిసారించాలి. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ప్రజలతో కనెక్ట్ కాలేకపోయామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ ఇక్కడే విజయం సాధించింది. ప్రాంతాలు, కులాలకు అతీతంగా ప్రజలకు టిఆర్‌ఎస్ కనెక్ట్ అయింది. వారికి ఏం కావాలో టిఆర్‌ఎస్‌కు స్పష్టమైన అవగాహన ఉంది. ఇక మిగిలిన ఈ మూడున్నర ఏళ్ల కాలంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంపై దృష్టిసారించాలి. తెలంగాణ టైగర్, ఆంధ్ర టైగర్, అంతర్జాతీయ టైగర్‌లుగా తమకు తామే ముద్రలు వేసుకున్న చంద్రబాబు, లోకేశ్, రేవంత్‌రెడ్డిని ప్రచారంలో ఎంత తిరిగినా, ఎన్ని తిట్టినా చివరకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు సైతం విలువ ఇవ్వలేదు. ముగ్గురు టైగర్లుకలిసి ప్రచారం చేసినా మూడు సీట్లు రాలేదు. ఇంటింటికి అందుతున్న ఆసరా పథకం, ఆశలు కల్పించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం టిఆర్‌ఎస్ ఘన విజయంలో కీలక పాత్ర వహించాయి. కాళ్లు కడిగినప్పుడే కాపురం ఎలా చేస్తుందో తెలుస్తుంది అంటారు. సెంటిమెంట్ ఎల్ల కాలం నిలబడదు, 60 డివిజన్లలో మా సామాజిక వర్గం వాళ్లే ఫలితాలను తేలుస్తారు అంటూ టిడిపి సామాజిక అనుబంధ మీడియా బహిరంగంగా ప్రకటించింది. కానీ ప్రజలు వీటికి ప్రాధాన్యత ఇవ్వలేదు.


విపక్షాలు టిఆర్‌ఎస్‌ను భయపెట్టే స్థాయిలోలేవు. ప్రజల ఆకాంక్షలే టిఆర్‌ఎస్‌ను నడిపిస్తున్నాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథ కం ఒక శక్తివంతమైన ఆయుధం. ఎన్ని ఇళ్లు కట్టి చూపిస్తే టిఆర్‌ఎస్ చేతిలో అన్ని ఆయుధాలు ఉన్నట్టు. చెప్పినవి చెప్పినట్టుగా చేసి చూపిస్తే టిఆర్‌ఎస్ పథకాలే ఆ పార్టీ చేతిలో బ్రహ్మాస్త్రాలు. కనీసం ప్రచారం కూడా చేయని పాతబస్తీలో సైతం టిఆర్‌ఎస్ తన ప్రభావం చూపగలిగింది అంటే మతాలకు, కులాలకు అతీతంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో స్పష్టం అవుతోంది. ప్రచారం చేసిన డివిజన్లను మించి సీట్లు సాధించింది. 

తెలంగాణలో ఇప్పుడు నినాదాలు పని చేయవు, సిద్ధాంతాలను పట్టించుకోవడం లేదు. కులాలు చూపించే ప్రభావం చాలా తక్కువ. పథకాల అమలే ప్రభావం చూపిస్తాయి. ప్రకటించిన పథకాల అమలు టిఆర్‌ఎస్‌ను భయపెట్టాలి. ఒక బాధ్యతను నెరవేర్చాలనే చిత్తశుద్ధి ఉన్నవారిని ఆ బాధ్యత నెరవేర్చేంత వరకు మనసు నిద్ర పోనివ్వదు. ఇంతటి ఘన విజయం టిఆర్‌ఎస్ నాయకత్వానికి లక్ష్య సాధన కోసం నిద్ర పోనివ్వదు. అలా జరిగితేనే ప్రజలకు మేలు, టిఆర్‌ఎస్ నాయకత్వానికి మేలు.

బుద్దా మురళి (6.2.2016 ఎడిట్ పేజి )

11 కామెంట్‌లు:

 1. ఈ ఎన్నికలు నిజంగా చారిత్రిక తీర్పు ఇచ్చాయి. కాంగ్రెస్ బీజేపీలు ఇరువురికి అలారం మోగినట్టే. ఇక టీడీపీకి వైకాపను చూడి నేర్చుకోవాలని వోటర్లు సంకేతం ఇచ్చారు.

  రిప్లయితొలగించు
 2. చాలా మంచి విశ్లేషణ! ప్రజలు తమపై పెట్టుకున్న ఆశల్ని కేసీయార్ వమ్ము చేయరని ఆశిస్తున్నా ...
  ఇంకోమాట -
  ప్రస్తుతం ఆంధ్రా ప్రజలు కూడా ముఖ్యమంత్రి అంటే కేసీయార్ లా ఉండాలి అనుకుంటున్నారు ఇది నిజం

  రిప్లయితొలగించు
 3. నిజమే,ఇక సెటిలర్లు అనబడే ఆంధ్రమూలాలు ఉన్నవారు ఆ ముద్దుపేరు చెరిపేసుకుని తెలంగాణ వారుగా స్థిరపడాలి!చంద్రబాబు తట్టాబుట్టా సర్దుకుని ఆంధ్రాకి అర్జెంటుగా పోవాలి.మూడేళ్ళ తర్వాత కూడా సొంత రాష్త్రం నుంచి ధీమాగా పరిపాలించలేని అసమర్ధుణ్ణి కేసీఆర్ ఎన్ని తిట్టినా ఫర్వాలేదు - I support KCR!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. ఒకరకంగా ఈ ఫలితం ఆంద్ర రాష్ట్రానికి మంచిదే. సాధారణ ఎన్నికల ఓటమి దరిమిలా జగన్ తెలంగాణాను వదిలేసి (మకాం మార్చకపోయినా) ఆంద్ర మీదే దృష్టి సారిస్తున్నారు. అదే పని చంద్రబాబు చేయగలిగితే ఇరు పక్షాల మధ్య ఆరోగ్యకరమయిన పోటీ రావొచ్చును. బీజేపీకి సమస్య భవిష్యత్తులో ఆంధ్రలో ఒరిగేది ఏమీ లేదు కనుక వారు తెలంగాణా ఫోకస్ చేస్తే తెరాసకు ప్రత్యామ్నయంగా ఎదిగే అవకాశాలు మెండు.

   తొలగించు
 4. నేను తె.రా.స. కార్యకర్తను కాను. ఈ వ్యాఖ్యని మీరు ప్రచురిస్తారో లేదో తెలీదు. ఆంధ్రా వోటర్లు ఏవేవో ఆశలతోనో లేదా అలాంటి భావోద్వేగాలతోనో తె.రా.స. కి వోటు వేసినట్లు అనిపించదు. నేనొక సీనియర్ సిటిజన్ దగ్గర విన్నది - ఒక ప్రాక్టికల్ కన్సిడరేషన్ తో తె.రా.స.కి వేశామని చెప్పాడాయన. పైన తె.రా.స. ఉండగా క్రింద తె.దే.పా.-బి.జె.పి. కార్పొరేటర్లు ఉన్నా ఉద్ధరించేదేమీ ఉండదని ఆంధ్రావారు ఒక అభిప్రాయానికొచ్చారట. అదీ గాక కేటీయార్ ని వాళ్ళు తెలంగాణవాడుగా చూడరు. ఆయనకి తెలంగాణ కన్నా గుంటూరుతోనే అనుబంధం ఎక్కువని వినికిడి.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. వాచస్పతి గారూ, ఆంధ్రులు లేని చోట్ల కూడా తెరాస గెలిచింది. వాళ్ళు వోట్లు వేయకపోయినా కొద్దిగా సీట్లు తగ్గేవేమో అంతే తప్ప పెద్ద తేడా లేదు.

   తొలగించు
  2. ఆ భావన మీకు ఆనందాన్ని కలిగిస్తుందంటే నేను మీ తృప్తికి అడ్డురాను. కానీ నా అంచనాలో- నాకు అర్థమయినంత వరకూ ఆంధ్రా వోటర్ల సహకారం లేకపోతే కొద్ది సీట్లు కాదు, చాలా సీట్లని తెరాస కోల్పోవాల్సి వచ్చేది. ఎందుకంటే ఇందులో కొన్ని లెక్కలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ యొక్క వాస్తవ జనాభా 77 లక్షలయితే ఒక్కొక్క డివిజన్ లోనూ సుమారు 51,000 మంది జనాభా ఉంటారు. ఆంధ్రావాళ్ల జనాభా విషయంలో ఖచ్చితమైన లెక్కలు లేవు. కానీ సంక్రాంతి్-దసరాలకి ఆ వైపుకు వెళ్ళే రైల్-బస్సు ప్రయాణీకుల సంఖ్యని బట్టి కొంత ఊహించడానికి అవకాశముంది. అది తరచూ 20 - 30 లక్షల మధ్య ఉంటోంది. సరే, అధమం 20 లక్షలనుకున్నా, సుమారు 39 సీట్లలో ఆంధ్రావాళ్ళు నిర్ణాయకమైన ప్రభావాన్ని చూపగల రిస్థితి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రావాళ్ల అడ్డాలుగా భావించబడే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి జూబిలీ హిల్స్, దిల్సుఖ్ నగర్-వనస్థలిపురం ఏరియాల్లోని డివిజన్లే ఒక్కొక్కటీ పది-పది చొప్పున ఉన్నాయని గమనిస్తే ఈ డివిజన్ల లెక్క సరిగ్గా సరిపోతోంది.

   తొలగించు
  3. There is no way andhra population is more than 17 to 18% in greater hyderabad. Dilsukhnagar,LB nagar and surrounding areas are in fact addas for telangana middle class people even in these areas andhra population is less than 25% the only exception is 1 or 2 divisions like vanasthalipuram.ee areas lo major parties have given almost all the tickets to telangana people including vanasthalipuram division.

   తొలగించు
  4. సంక్రాంతికి 20-30 లక్షల మంది ఆంధ్రకు వెళ్ళాలంటే ఎన్ని బస్సులు కావాలి? ఈ ట్రాఫిక్ అంతా 3 రోజులలో ఉంటె రోజుకు 6-10 లక్షల మనుషుల కోసం 12-20 వేల బస్సులు అవసరం. ఆర్టీసీకి ఉన్నవే 10 వేల బస్సులు అందులో పల్లె & తిరుమల బస్సులు తీసేస్తే మిగిలేవి 4,500. ఒకవేళ వాటన్నిటినీ హైదరాబాదుకు వేస్తె జిల్లాలలో రవాణా అస్తవస్త్యం అవ్వాలి అందుకు దాఖలాలు లేవు. ఇక రైల్లంటారా 5-6 స్పెషల్ రైళ్ళు మాత్రమె వేస్తారు అందులో రోజుకు ఎంతమంది ఊరెళ్ళగలరు?

   తొలగించు
 5. ఎన్నికల ప్రచారం లోకేష్ నేను పక్కా హైదరాబాదిని ఇక్కడ గల్లిల్లో చెడ్డిలు వేసుకొని తిరిగాను కేటిఆర్ గుంటూరు అన్నారు .. అదే మాట మీలాంటి వారు నమ్ముతున్నారు .. ఎవరి నమ్మకాలు వారివి నమ్మండి .. మీ లెక్క ప్రకారం గ్రేటర్ లో తెలంగాణా ఘోరంగా ఓడిపోయింది ఆంధ్ర గెలిచింది అన్న మాట

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. లోకేష్ ఇదే మాట హైదరాబాదీ (దాఖ్నీ) ఉర్దూలో అని ఉంటె నమ్మశక్యం అనిపించేదేమో కానీ ఆయనకు నోరు తిరగదు!

   inu kya cheddi pahenke galliyon mein phira re bai. ulloo bananeko hameech mila kya isku!

   తొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం