14, అక్టోబర్ 2016, శుక్రవారం

ఇంటింటా ‘సర్జికల్ స్ట్రైక్’!

‘.‘ఛీ ఛీ  .. బుద్ధి లేకపోతే సరి.’’
‘‘ఏంటోయ్ టీవీ చూస్తూ తిడుతున్నావ్ ఎవరిని?’’
‘‘ఇంకెవరినీ అదిగో వాళ్లనే’’
‘‘అక్కినేని రొమాంటిక్ హీరోగా వెలిగిపోతున్న ‘మురళీకృష్ణ’ సినిమా కాలం వాడివి. కళ్లతోనే హీరోయిన్లు శృంగారాన్ని ఒలికించే కాలం కాదిది. హీరో,హీరోయిన్ల సాంగ్ అంటే వాత్సాయనుడి భంగిమలే. దీనికే ఇలా ఫీలయితే ఎలా? ’’
‘‘నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. ఎన్టీఆర్.. ఊపిరి ఆగిపోయేంతలా అమ్మాయిని ఆలింగనం చేసుకున్న సీన్లను చూస్తూ పెరిగిన శరీరం ఇది. ఇలాంటి సీన్లు నాకో లెక్కా.’’
‘‘మరేంటి?’’
‘‘సినిమాలో డ్యూయెట్లు పుట్టినప్పటి నుంచి చూస్తున్నా, వాళ్లకు కొంచమైనా ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. ఇంకెంత కాలానికి మారుతారో? ’’


‘‘దేని గురించో చెబితే.. నా వంతు తిట్లు నేనూ తిడతాను’’
‘‘లో బడ్జెట్, భారీ బడ్జెట్ అనే తేడా లేదు అన్నింటిలో ఇదే. హీరో, హీరోయిన్లు వాత్సాయన భంగిమలో పార్కుల్లో కిందా మీదా పడి దొర్లుతూ వారి బాధలేవో వాళ్లు పడుతుంటే హీరోయిన్ వైపు ఓ రెండు డజన్ల మంది, హీరో వైపు మరో రెండు డజన్ల మంది మిమిక్రీ ఆర్టిస్టులు గొంతును ఇమిటేట్ చేసినట్టు. ఈ నాలుగు డజన్ల మంది హీరో,హీరోయిన్ల డ్యాన్స్‌ను ఇమిటేట్ చేస్తుంటారు. ఇంట్లో వాళ్లను తప్పించుకుని పార్కుల్లో పాటలు పాడుకుంటున్న వారిని ఒంటరిగా వదిలేయాలనే కనీస జ్ఞానం ఉండదు. ఏం మనుషులో’’
‘‘భలే  వాడివోయ్.. పాపం వాళ్లదేం తప్పు కావాలంటే డైరెక్టర్‌ను తిట్టు. ప్రపంచంలో ఏ జంటా అలా నాలుగైదు డజన్ల మందిని తీసుకెళ్లి డ్యూయెట్లు పాడదు. అస్పత్రిలో జయలలిత, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, తెలంగాణలో కొత్త జిల్లాలు, అమెరికాలో రాజకీయ శూన్యత ఏర్పడిందని అమరావతి నుంచి బాబు ప్రకటన. ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య సర్జికల్ స్ట్రైక్ వంటి కీలక అంశాలు ఎన్నో ఉండగా, ఊహించని విధంగా నువ్వు సర్జికల్ అటాక్ జరిపావు నాపై ’’


‘‘ఉత్తరప్రదేశ్‌లో సైనికులు, మోదీ ఉమ్మడి పోస్టర్లను చూసి ఎన్నికల్లో ఎక్కడ దెబ్బతింటామో అని ఇతర పార్టీలు కంగారు పడి ఏదేదో మాట్లాడుతున్నాయి. కానీ, కామన్ మ్యాన్ ప్రతి రోజూ సర్జికల్ అటాక్‌ల మధ్యనే కాలం గడుపుతాడు కదా? యుద్ధానికి, యుద్ధానికి మధ్య విరామ కాలమే ‘శాంతి’ అని ఎవరో పెద్దాయన అన్నట్టు జనన, మరణాల మధ్య జీవితమంతా సర్జికల్ అటాక్‌ల మధ్య గడపడమే కాదు. మహానగరంలో ఇంటి నుంచి బయట అడుగు పెట్టాక ఎవడు ఎటు నుంచి వాహనంతో మెరుపుదాడి జరుపుతాడో తెలియదు.’’
‘‘సరిహద్దుల్లో ఇవి మామూలే కావొచ్చు. రాజకీయాల్లో మాత్రం ఈ సర్జికల్ అటాక్ లు భలేగా ఉంటాయి. ’’
‘‘ తమ్ముళ్లంతా కాళ్లు మొక్కుతుంటే- నా పేరు చెప్పి ‘చెప్పు’ను నిలబెట్టినా గెలుస్తాడు అని ఎన్టీఆర్ ధీమాగా ఉంటే అల్లుడి జరిపిన సర్జికల్ స్ట్రైక్ నుంచి ఎన్టీఆర్ కోలుకోలేక పోయారు. పాపం ఆ దెబ్బ తరువాతే కదా పెద్దాయన పై లోకానికి వెళ్లింది. రాజకీయాల్లో ఇంత గొప్ప వ్యూహాత్మక సర్జికల్ స్ట్రైక్ మరోటి కనిపించదు. ’’
‘‘ సర్జికల్ అటాక్  చరిత్ర చాలా పాతదే?’’
‘‘భూమి  పుట్టినప్పటి నుంచి ఉంది? ’’
‘‘ఆలోచిస్తే అలానే అనిపిస్తోంది. మహాభారతంలో అడుగడుగునా సర్జికల్ అటాక్‌లు కనిపిస్తాయి ’’
‘‘ యుద్ధ సమయంలో శత్రు శిబిరంలోకి వెళ్లి- తాతా.. నిన్ను ఓడించడం కష్టంగా ఉంది. నువ్వెలా చస్తావో కాస్త చెప్పు అని ధర్మరాజు తాత భీష్ముడిని అడగడానికి మించిన మెరుపు దాడి ఇంకోటి లేదేమో. నవ్వెలా చస్తావు అని అడగడం, చెప్పడం ప్రపంచ సాహిత్యంలోనే నేటికీ అపురూపం. పాపం ఆ సమయంలో భీష్ముడు మనసులో ఏమనుకున్నాడో? ’’
‘‘అచ్చం సర్జికల్ స్ట్రైక్‌లానే ఆంధ్రలో దోమలపై వ్యూహాత్మక దాడులు జరపుతామని ఆరోగ్యశాఖ మంత్రి చెప్పారు కదా.. ఎంత వరకు వచ్చింది?’’
‘‘దోమలేమన్నా పాకిస్తాన్ ఉగ్రవాదులా? ఆరోగ్య శాఖ సిబ్బంది భారత సైనికులా? మీడియాలో ప్రచారం కోసం ఇలాంటి ప్రకటనలు మామూలే అని దోమలకు తెలియదా? ఏంటి? ’’


‘‘మన సంగతికేం కానీ ప్రపంచానికి పెద్దన్నలాంటి అమెరికాకే ఎంత కష్టం వచ్చిపడింది? ’’
‘‘నీకూ నాకూ కష్టం కానీ అమెరికా కేం కష్టం? ఉంటే గింటే ఇతర దేశాలను ఎలా వేధించాలనే ఆలోచనలతో కష్టపడుతుంటారు.’’
‘‘అమెరికాలో నాయకత్వ శూన్యత ఏర్పడిందట కదా? బాబు గారు చెప్పారు వినలేదా? ’’
‘‘అమరావతిలో రాజధాని నిర్మాణం తప్ప ప్రపంచంలో అన్ని విషయాలను బాబుగారు క్షణ్ణంగా అధ్యయనం చేస్తారు. చూడోయ్ ట్రంప్- రేవంత్‌రెడ్డి లాంటి వాడు అని నేను ఎప్పుడో చెప్పాను. సంచలన ప్రకటనలతో మొదట్లో మీడియాలో చోటు సంపాదిస్తారు. తరువాత అదే మీడియా చీ..చీ.. ఇంత దుర్మార్గుడు మరొకరు లేరు అని చెబుతుంది. ట్రంప్‌కు అదే జరిగింది. ఇదే అమెరికా మీడియా అకాశానికెత్తింది. తీరా ఎన్నికలు సమీపించగానే ఇదే మీడియా వీడంత దుర్మార్గుడు లేడు అనే ప్రచారం మొదలు పెట్టింది. ట్రంప్‌కు విషయం అర్థమయ్యే సరికి పుణ్యకాలం దాటిపోయింది. ’’
‘‘ట్రంప్ రాజకీయాలకు తగడు అని బాబుచెప్పిన మాటల ప్రభావం వల్ల అమెరికా ఓటర్లు ట్రంప్‌ను ఓడించే అవకాశం ఉంటుంది కదా? ’’
‘‘ఎన్నికల ఫలితాలు వచ్చాక నువ్వు ఇలా ప్రచారం చేసుకో అడ్డుకునేవారెవరూ ఉండరు.’’
‘‘ అమెరికా లో రాజకీయ శూన్యత గురించి ఆలోచించే లోక నాయకుడిని రాజధాని ఎప్పుడు కడతారు ? పోలవరం పూర్తి చేస్తారా ? జిల్లాల సంఖ్య పెంచుతారా ? అనే సిల్లీ ప్రశ్నలు అడగడం తగదు ... అంతర్జాతీయ స్థాయి లోనే ప్రశ్నలు ఉండాలి .. ఇంతకూ సర్జికల్ అటాక్ జరిగిందో లేదో నీ అభిప్రాయం చెప్పలేదు.’’
‘‘నువ్వు బాగా మందు కొట్టి వెళ్లినప్పుడు మీ ఆవిడ తలపై కొట్టిందని నవ్వు పైకి చెప్పుకోలేవు. బుర్రపై బొడిపెలు రెండు రోజుల తరువాత కనిపించవు. దాడి జరిగిందంటావా? జరగలేదంటావా? ఇంట్లో సంగతులు బయట చర్చించవద్దు. రాజకీయాలను, సైన్యాన్ని కలిపేయవద్దు. ఎవరి డ్యూటీ వాళ్లు చేస్తారు. రాజకీయాలు, సైన్యం రెండింటినీ కలిపిస్తే పాకిస్తాన్ లా వికృత రూపం తయారవుతుంది. 

అది దేశానికే కాదు... ప్రపంచానికీ మంచిది కాదు.

 - బుద్దా మురళి( జనాంతికం14. 10. 2016 శుక్రవారం ) 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం