16, డిసెంబర్ 2016, శుక్రవారం

రాకుమారి- తోటరాముడు- అమరావతి

‘తెలుగు సినిమా ప్రేమికుడిగా సంతోషంతో కూడిన గర్వంతో ఉన్నాను. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పనిని తెలుగు సినిమాలో హీరో ఒంటరిగా చేస్తే అంతా నవ్వేవాళ్లు. అదే ఇప్పుడు నిజమవుతోంది. అందుకే గర్వంగా ఉంది.’’


‘‘ఏ హీరో? ఏం సాధించాడు?? అది చెప్పు’’
‘‘ఎపిలో రాజధాని నగరాన్ని నిర్మించేందుకు రెండువందల దేశాలు పోటీ పడుతున్నాయని చంద్రబాబు చెప్పారు కదా? చివరికి ఏమైంది..? జపాన్ మాకీ, చైనా బాప్‌కీ, సింగపూర్ బహేన్‌కీ కంపెనీలు అన్నీ అయిపోయాక చివరకు ...’’
‘‘ఉండుండు.. అసలు ప్రపంచంలో ఉన్న దేశాలే 196. నువ్వేమో రెండు వందల దేశాలు పోటీ పడ్డాయి అంటున్నావు’’
‘‘పాలకులు చెప్పిన దాని కన్నా నీకు గూగుల్ పైనే నమ్మకమా? సినిమాలో రాజకుమారి స్వయం వరం సీన్ ఒక్కసారి గుర్తు చేసుకో! అతల, కుతల, పాతల దేశాల నుంచి రాకుమారులు వచ్చారని చెబుతారు. గూగుల్‌లో ఈ పేరు ఒక్కటన్నా కనిపిస్తుందా? మరి సినిమాలో చూపించింది అబద్ధమా?’’
‘‘ఏదో సందేహం వచ్చి అడిగాను...’’


‘‘కొత్త రాజధాని నిర్మాణం కోసం రెండువందల దేశాలు పోటీ పడితే చివరకు ఆ భాగ్యం దక్కింది ఎవరికో తెలుసా? తెలుగు సినిమా దర్శకుడు రాజవౌళికి. సినిమా ప్రేక్షకుడిగా ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది? ’’
‘‘రాజకుమారి ప్రేమకోసం దేశదేశాల రాజకుమారులు పరితపిస్తుంటే, రాజకుమారి తోట రాముడి ప్రేమలో పడ్డట్టు- రాజధాని నిర్మాణం కోసం రెండువందల దేశాలు పోటీ పడితే రాజుగారు రాజవౌళిని ఎంపిక చేశారన్నమాట!’’
‘‘ ఈగను హీరోను చేసిన రాజవౌళి రానాను విలన్‌ను చేశాడు. బాహుబలి సినిమా చూడకపోతే దేశద్రోహి అన్నట్టుగా ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని ఇప్పుడు బిజెపి వాళ్లు కాపీ కొట్టి కరెన్సీ రద్దుని వ్యతిరేకిస్తే దేశద్రోహి అంటున్నారు. దేశాన్ని పాలించే వాళ్లే ఇలా అనుసరిస్తుంటే, సామంతరాజు రాజధాని నిర్మాణానికి రాజవౌళిని నమ్ముకుంటే తప్పా? ’’
‘‘తప్పు అనడానికి నేనెవరిని? ఏప్రిల్ వరకూ రాజవౌళి బిజీనట! ఆయన భారీ సినిమా అంటే కనీసం రెండేళ్లు పడుతుంది. ఏప్రిల్ నాటికి ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంటుంది? ఈ సమయం రాజవౌళి భారీ సెట్టింగ్‌కు బాగా సరిపోతుంది.’’
‘‘ప్రముఖ కాంట్రాక్టు కంపెనీలకు పెద్ద పెద్ద నిర్మాణాల బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీ. ఈ సాంప్రదాయాలను పట్టుకుని ఎన్నాళ్లు వేలాడుతారు? కాస్త మారండి.. ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించి, పేదప్రజలను కన్నబిడ్డాల్లా చూసుకున్నారనే కదా? ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసింది. అందుకే భారీ సినిమా సెట్టింగ్ అనుభవం ఉన్న రాజవౌళికి రాజధాని బాధ్యతలు.. ’’


‘‘ప్రత్యేక హోదాకు మొండిచేయి. కేంద్రం నుంచి కొత్తగా వచ్చే నిధులు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో సెట్టింగ్‌లను నమ్ముకోక ఒరిజినల్ భవంతులు ఎలాగూ సాధ్యం కాదు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి చక్రం తిప్పే కాలం కూడా కాదు’’
‘‘పాజిటివ్‌గా ఆలోచించలేవా? ఆలోచన విశాలంగా ఉండాలి. డబ్బుదేముంది..? కుక్కను కొడితే డబ్బులు రాలుతాయి. పాత పరుపుల కింద ఖజానాలు బయటపడుతున్నాయి. బాత్రూమ్ గోడలు కూల్చితేనే వందలకొద్దీ కొత్త కరెన్సీ కట్టలు వచ్చి పడుతున్నాయి. నోట్ల రద్దుతో నాలుగైదు లక్షల కరెన్సీ బడాబాబుల ఇళ్లలోనే ఉండిపోతుందని కేంద్రం కోర్టుకు కూడా చెప్పింది. ఆ డబ్బుల్లో భారీ వాటా దక్క కుండా ఎక్కడికి పోతుంది? వెంకయ్య నాయుడు మోదీ పక్కనే ఉంటున్నారు. అవసరం అయినప్పుడు మనకు కావలసింది తేకుండా ఉంటాడా?’’


‘‘కుక్కను కాదు.. ఎటిఎంను పగులగొట్టినా నోట్లు రాలడం లేదు. ఇంకెక్కడి నల్లధనం? చెప్పుకుంటే సిగ్గు చేటు.. చెలామణిలో ఉందని ఆర్‌బిఐ భావించిన కరెన్సీ కన్నా ఇప్పుడు బ్యాంకుల్లో వచ్చి చేరిన కరెన్సీ ఎక్కువగా ఉందట! ’’
‘‘చూడోయ్.. అన్నింటికీ డబ్బేనా? వందకోట్లు ఖర్చు చేసినా ఒక్క రోజు ఆయుష్షు కూడా కొనలేవు తెలుసా? ’’
‘‘ పాతిక రూపాయలు పెట్టి మంచి పుస్తకం కొంటే ఇలాంటి రెండున్నర వేల సూక్తులు దొరుకుతాయి. వందకోట్లు అక్కర లేదు. ఓ లక్ష ఇచ్చి నా జీవితంలో ఒక రోజు తీసేసుకో!’’
‘‘ఎవరూ చేయని విధంగా మోదీ కరెన్సీని రద్దు చేశాడు. దానికి స్వాగతించకుండా విమర్శిస్తున్నావు? అసలు డబ్బు అవసరం దేనికి చెప్పు’’


‘‘మనం ఇప్పుడు తాగిన టీకి డబ్బులివ్వాలి కదా? ’’
‘‘టీ తాగడం ఆరోగ్యానికి హానికరం, ఒక్కో సిగరెట్ ఆరు నిమిషాల ఆయుష్షును హరిస్తుంది! మానేయ్.. ఆరోగ్యానికి మంచిది.’’
‘‘ఇంటికి వెళ్లాలంటే బస్సుకు..?’’
‘‘హాయిగా నడుచుకుంటూ వెళ్లు . ఐదు కిలోమీటర్లు నడవ లేవా? చదువుకునే రోజుల్లో ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లి వచ్చేవాడివి.. ఆ రోజులు మరిచిపోయావా? ’’
‘‘కాఫీ..’’
‘‘కాఫీలో కెఫెన్ ఉంటుంది. వదిలేయ్’’
‘‘ఆదివారం కోడికూర..’’
‘‘జీవించే హక్కు నీకెలా ఉందో? ఆ జీవికి కూడా ఉంది? దాన్ని చంపి తినడానికి నీకు మనసెలా వస్తుంది? ’’
‘‘పోనీ.. ఉడిపి హోటల్‌లో టిఫిన్’’
‘‘ఇంట్లో భార్యాపిల్లలతో కలిసి తినడంలో ఉన్న ఆనందం ఎవరో హోటల్‌లో చేసే తిండిలో ఉంటుందా? చెప్పు’’
‘‘బంగారం..’’
‘‘మానసికంగా పరిణతి సాధిస్తే ఇనుము ఐనా బంగారం అయినా ఒకటే అనే స్థాయికి చేరుకుంటావు. ఆ దశ కోసం ప్రయత్నించు’’
‘‘నావల్ల కాదు. ఊరేసుకుని చస్తా. ఉరితాడు కోసం డబ్బులు..’’
‘‘ రైలుపట్టాలపై తల పెట్టు’’


‘‘మరి.. ఎటిఎం క్యూలో చనిపోయిన వారి సంగతి?’’
‘‘శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఏం చెప్పాడు? ‘అర్జునా యుద్ధం చేయ్.. విజయం సాధిస్తే రాజ్యం,ప్రాణం పోతే స్వర్గం లభిస్తుంది’ అన్నాడు కదా? మోదీ ప్రకటించిన యుద్ధంలో విజయం సాధిస్తే రెండువేల నోటు దక్కుతుంది లేదంటే స్వర్గం- ఎటిఎంల క్యూలో పోయిన వారికి మోక్షం లభించి పుణ్యలోకాలకు వెళ్లినట్టు’’
‘‘ ఈరోజుల్లో ఆరెంజ్ ఆక్సిజన్ పేరుతో గాలిని కూడా అమ్మకానికి పెట్టారు’’
‘‘ఎందుకోయ్.. అడవులకు వెళితే స్వచ్ఛమైన గాలి ఉచితంగానే దొరుకుతుంది. ఆకులు అలములు తింటూ హాయిగా బతికేయవచ్చు. కరెన్సీ పుట్టింది తుగ్లక్ కాలంలో.. అంతకుముందు కొన్ని వేల సంవత్సరాల పాటు మన వాళ్లు కరెన్సీ లేకుండా బతక లేదా? 50 రోజులకే ఇలా హాహాకారాలు చేస్తున్నారు. ’’


‘‘మంచి ఐడియా.. అడవులకు వెళ్లి కరెన్సీ లేకుండా బతికేద్దాం’’
‘‘నువ్వు వెళ్లు.. నేను రాను! సలహాలు ఇచ్చేది ఆచరించడానికి కాదు.’’
*-బుద్దా మురళి (జనాంతికం 16-12-2016)-

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం