3, జనవరి 2017, మంగళవారం

మరో యాభై.. ఇంకో యాభై..!

‘‘రావోయ్ రా..! సమయానికి వచ్చావు.. టీవీలో చాలా ఇంట్రస్టింగ్ న్యూస్ వస్తోంది. ప్రముఖ వ్యాపారి గన్నయ్య ఇంటిని పోలీసులు చుట్టు ముట్టారు. వందల కోట్ల రూపాయల కరెన్సీ ఉందని సమాచారం అందడంతో ఐటి శాఖ అధికారులు దాడి జరిపారు. నోట్ల కట్టలను టీవీలో జూమ్ చేసి మరీ చూపిస్తున్నారు. ‘మన్నుతిన్నావా?’ అని తల్లి అడిగితే తన నోటిలో విశ్వానంతటినీ చూపించిన ద్వాపర యుగం కన్నయ్యలా నింపాదిగా గన్నయ్య నవ్వుతూ మీడియాతో మాట్లాడుతున్నాడు. ఇదంతా నా ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు చేసిన కుట్ర. చట్టానికి వ్యతిరేకంగా నా వద్ద ఎలాంటి కరెన్సీ లేదు అని ధీమాగా చెబుతున్నాడు’’
‘‘అన్నయ్య గారూ ఆయన టీవీ వార్తల్తో నిండా మునిగిపోయారు. ఇప్పట్లో మన లోకంలోకి రారు. ఆయన్ని చూస్తే భయంగా ఉంది. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడో ఏమైందో మీరే చూడండి అన్నయ్య గారూ’’
‘‘నువ్వు చాలా గ్రేట్! నీలో ఏ మార్పూ లేదు. అదే పాత చేతక్ బండిమీద వచ్చావు, అదే టీ తాగుతున్నావ్.. యూ ఆర్ గ్రేట్..’’


‘‘ఆపరా బాబూ నీ సోది... ఏదో పాతికేళ్ల తరువాత చూసినట్టు ఆ పిచ్చి చూపులేంది.?’’
‘‘ఇంకా మీరు నయమండి అన్నయ్య గారు! రాత్రి అంతా ఒకేసారి పడుకున్నాం. ఉదయం లేవగానే పిల్లలను చూస్తూ- అరే మీరు అచ్చం అలానే ఉన్నారు ఏమీ మారలేదు అని పలకరించే సరికి పాపం.. వాళ్లు బిత్తర పోయారు. ఇంటిని వింతగా చూస్తూ మార్పేమీ లేదు అంటున్నాడు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నయ్య గారూ! చివరకు నన్ను కూడా ఏదో ఆర్ట్ సినిమాలో ఐశ్వర్యారాయ్‌లా మార్పేమీ లేకుండా అలానే ఉన్నావు అంటూ వింతగా చూస్తున్నాడు. ఒకే గదిలో పడుకున్నామా! ఉదయం లేవగానే నువ్వు నువ్వేనా? అని వింతగా మాట్లాడితే ఏమనుకోవాలి?’’


‘‘ఆపండి మీ గోల.. టీవీలో ఆ నోట్ల కట్టలు చూడు నల్లధనం బయటకి వస్తుంది? అంటే మీరు నమ్మలేదు కదా? ఇప్పుడు చూడండి. నిన్నటి వరకు ఆ గన్నయ్య ఏదో బుద్ధిమంతుడని అనుకున్నాం కదా? చూడు వాడింట్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. అయినా సిగ్గులేకుండా ఆ మనిషి ఎలా నవ్వుతూ ధైర్యంగా ఉన్నాడో. ముందు ఆ వార్తలు చూడండి మనం మళ్లీ మాట్లాడుకుందాం’’
***
‘‘సారీ గన్నయ్య గారూ.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలి. మీ వద్ద నోట్ల కట్టలు ఉన్నాయని పక్కా సమాచారం రావడంతో దాడి చేయాల్సి వచ్చింది. మీలాంటి వ్యాపారుల ఇంటిపై దాడి చేసినందుకు సిగ్గుపడుతున్నాం.’’
‘‘వ్యాపారం అన్నాక ఇలాంటి దాడులు సాధారణమే. సరే మీ పోలీసులకు చెప్పి ఆ నోట్ల కట్టలు బస్తాలన్నీ ఎప్పటి మాదిరిగానే ఇంట్లో పెట్టి వెళ్లమనండి’’
***
‘‘అదేంటి? అన్ని బస్తాల నోట్ల కట్టలు కనిపిస్తుంటే ఐటి అధికారులు క్షమాపణ చెప్పడం ఏమిటి? పోలీసులు నోట్ల కట్టల బస్తాలను ఇంట్లో పేర్చడం, అదీ టివీలో చూపించడం వింతగా ఉందండి’’
‘‘పిచ్చి డియర్.. అవి నోట్ల కట్టలు నిజమే. అవి ఒరిజినల్ నోట్ల కట్టలు కావు నకిలీ నోట్ల కట్టల బస్తాలు. గన్నయ్య వ్యాపారంలో ఒకేసారి పైకి ఎలా వచ్చాడా? అని అనుకున్నా.. ఈ నకిలీ నోట్ల వ్యాపారం పుణ్యమాని ఇంతలా ఎదిగాడన్నమాట!’’


‘‘మరి పోలీసులు అలా వదిలేయడమేమిటి?’’
‘‘చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దు. చట్టం ఏం చెబితే అదే చేయాలి. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు. ఇప్పుడు రద్దయిన ఆ నోట్లు ఎవరి వద్దనైనా ఉంటే కఠినంగా శిక్షించేలా ఆర్డినెన్స్ తెచ్చారు. గన్నయ్య ఇంట్లో దొరికినవి రద్దయిన నోట్లు కాదు నకిలీ కరెన్సీ. దాంతో ఐటి అధికారులు, పోలీసులు బిక్కమొఖం వేశారు. నకిలీ కరెన్సీ కాబట్టి బతికి పోయాడు. ఒకవేళ ఒరిజినల్ నోట్లు ఉంటే.. అమ్మో తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది.. చట్టమే గన్నయ్యను రక్షించింది’’


‘‘ఏంటోరా! లోకం తలకిందులుగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఓ ఎమ్మెల్యే ‘ఫిజిక్స్ ’పై ఆసక్తితో బికాం చేశానని చెప్పాడు. ఏ డిగ్రీలో ఏ సబ్జెక్ట్ కూడా ఉంటుందో తెలియని వాళ్లు ఎమ్మెల్యేలైపోయారని మా అబ్బాయితో చెబితే- వాడెమన్నడో తెలుసా? కామర్స్‌పై ఇష్టంతో బికాం చదివిన నీకు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలవడం వల్ల ఫస్ట్ క్లాస్‌లో పాసై, క్లర్క్ అయ్యావు. కొడుక్కు బైక్ ఇప్పించలేవు. బికామ్‌లో ఫిజిక్స్ ఉంటుందని చెప్పిన ఆ నేత ఎమ్మెల్యే అయి తరతరాలకూ సరిపోయే సంపద కూడ గట్టాడు. ఇప్పుడు చెప్పు.. బికామ్ లో కామర్స్ తెలిసిన వాడు తెలివైన వాడా? జీవితంలో ఆదాయం లెక్కలు తెలిసిన వాడు తెలివైన వాడా? అని అబ్బాయి అడిగితే- తల కొట్టేసినట్టు అనిపించింది అనుకో? నా సంగతి సరేరా! అదేంటి తిక్కతిక్కగా మాట్లాడుతున్నావట! చెల్లెమ్మ చెప్పింది. నన్ను కూడా వింతగా చూస్తూ పిచ్చిపిచ్చి ప్రశ్నలు అడుగుతున్నావ్! ’’
‘‘ మన ముచ్చట్లకేముంది కానీ పద.. ఆ శ్మశాన వాటికకు వెళ్లి వద్దాం! శవాలు పైకి లేస్తాయి. చూసొద్దాం’’
‘‘నిజమేనమ్మా నువ్వు చెబితే ఏదో అనుకున్నా.. వీడికి నిజంగానే ఏదో గాలి సోకినట్టుగా ఉంది.’’


‘‘నాకేమీ కాలేదు. మీకే ఏదో అయినట్టుగా ఉంది. నేను స్పృహలోనే ఉన్నా. గాలి సోకింది మీకే.. మీరంతా దేశద్రోహులు ’’
‘‘డాక్టర్ గారూ.. వీడికి ఏమైంది? ఏదేదో మాట్లాడుతున్నాడు’’
‘‘ కంగారు పడకండి 50 రోజుల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. తగ్గిపోతుంది’’
‘‘ ఇంతకూ ఏమైంది డాక్టర్?’’
‘‘ పెద్దనోట్ల రద్దు తర్వాత 50 రోజులకు ఏవో అద్భుతాలు జరుగుతాయని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. పేదలు సంపన్నులతో సమానం అవుతారని, అవినీతి నిర్మూలన అవుతుందని, ఎటిఎం క్యూలో ప్రాణాలు పోయిన వారు తిరిగి బతుకతారని ఏదో ఊహా ప్రపంచంలో ఉండిపోయాడు. ఇదే సమయంలో టీవీలో ఆ ఎమ్మెల్యే ఎవరో బికామ్‌లో ఫిజిక్స్ చదివి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగినట్టు వార్త వినడంతో చిన్నమెదడుపై తీవ్ర ప్రభావం చూపించి ఏదేదో మాట్లాడుతున్నాడు! ఓ 50 రోజులు అయితే మామూలు మనిషి అవుతాడు’’


‘‘50 రోజుల్లో మామూలు మనిషి కాకపోతే ఎలా డాక్టర్..?’’
‘‘ఇంకో 50 రోజులు ఎదురు చూడాలి. ఇలా యాభైయేసి రోజుల చొప్పున చికిత్స పెంచుకుంటూ పోవాలి. అంతకు మించి చేయగలిగిందేమీ లేదు ’’

-బుద్ధా మురళి (జనాంతికం 30. 12. 2016)

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం