4, ఆగస్టు 2017, శుక్రవారం

మనం చాలా బిజీ గురూ..

‘‘ప్రపంచంలో అత్యంత బిజీగా ఉండేవాళ్లు ఎవరంటావ్?’’
‘‘యక్షుడు అడిగిన ప్రశ్నల్లో స్పీడ్ గురించి ఉంది. కానీ బిజీ గురించి లేదు. చైనావాడి బుల్లెట్ ట్రైన్ స్పీడట! ఆ మధ్య బాబుగారు చూసొచ్చారు. ఆయన చెప్పినట్టు బుల్లెట్ ట్రైన్‌ను తీసుకువస్తే దేశంలో అమరావతిలోనే స్పీడ్ ప్రయాణం అవుతుంది’’
‘‘నీలోనూ రాజకీయ నాయకుడి లక్షణాలు బాగానే ఉన్నాయి. నేనడిగిన దానికి చెప్పకుండా నీకు తెలిసింది చెబుతున్నావ్’’
‘‘బాబు బాగా బిజీ.. అని అదేదో ఎఫ్‌ఎం రేడియో ఛానల్‌లో ఆవిడెవరో కవ్విస్తున్నట్టు ద్వంద్వార్థంతో ఏదో చెబుతుంది.. కానీ బిజీ అంటే అది కాదు. క్షణం తీరిక లేకుండా ప్రాణాలకు సైతం తెగించేంత బిజీ జీవితం గడిపేది ఎవరని నా ప్రశ్న ’’
‘‘ఐనా ఈ రోజుల్లో గూగుల్ లాంటి గురువు చేతిలో ఉండగా ఏ విషయమైనా తెలుసుకోవడం ఎంత సేపు?’’
‘‘ఒకప్పటి కాలంలో పిల్లలకు తల్లిదండ్రులు, గురువులే అన్నీ చెప్పేవాళ్లు. ఇప్పుడు వాళ్ల పాత్రను కూడా గూగుల్ పోషిస్తోంది. ఏమడిగినా క్షణంలో చేప్పేస్తుంది. రోడ్డుపై మనం అడ్రస్ అడిగితే ఒక్కొక్కరు ఒక్కో దారి చూపిస్తారు. మన రోడ్లకు గూగుల్ కూడా కన్‌ఫ్యూజ్ అయి దారి సరిగా చూపడం లేదు. కానీ అమెరికాలో మాత్రం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా గూగులే చూపిస్తుంది, చెబుతుంది. నీ ప్రశ్నకు గూగుల్ వెదికినా సమాధానం దొరకడం లేదు’’
‘‘నిజమా? ఎందుకలా? సమాధానం నీ వద్ద సిద్ధంగా ఉన్నాకే ప్రశ్న అడుగుతావు. ఆ సంగతి నాకు తెలుసు కానీ సమాధానం కూడా నువ్వే చెప్పేయ్. నేనైతే అమెరికానే అనుకుంటున్నా? వాళ్లు ఎప్పుడు చూసినా బిజీ బిజీగా ఉంటారని విన్నాను. సంపన్న దేశం కదా? సంపన్నులు మహేశ్ బాబంత బిజీగా ఉంటారు. ’’
‘‘ బిజీకీ, మహేశ్ బాబుకీ సంబంధం ఏంటి?’’
‘‘నువ్వు సినిమాలు చూడవా? ’’
‘‘మల్లీశ్వరి నాలుగుసార్లు చూశా? రాముడు- భీముడు రెండు సార్లు చూశా. ’’
‘‘అందుకే అలా అడిగావు. ఆ కాలం సినిమాల్లో హీరో మరీ బద్ధకస్తుడు. ఇద్దరు ముగ్గురు విలన్లను కొట్టడానికే నానా హైరానా పడేవాడు. డిష్యుం డిష్యుం అంటూ పిడి గుద్దులు గుద్దేవాడు. మరిప్పుడు మహేశ్ బాబు చాలా బిజీ కాబట్టి ఒక గన్నుతో అయితే ఆలస్యం అవుతుందని రెండు చేతులతో రెండు గన్స్ పట్టుకుని వందల మంది విలన్ల ముఠాను మూడున్నర నిమిషాల్లో పేల్చేస్తాడు.. ఆయన కన్నా బిజీ ఎవరుంటారు’’
‘‘నేనడిగింది సినిమాల గురించి కాదు, బిజీగా ఉండేవాళ్ల గురించి?’’
‘‘నువ్వే చెప్పు వింటాను’’
‘‘మనవాళ్ల ప్రతిభను తొక్కేస్తున్నారు. గూగుల్‌ను నమ్మకంతో అడిగితే ప్రపంచంలో టాప్ టెన్ దేశాలు అంటూ ఆదాయం, ఎక్కువ సమయం పని చేయడం, కష్టపడి పని చేయడం వంటి దేశాల జాబితా చూపుతున్నారు కానీ నిజంగా బిజీగా ఉండే మన వాళ్ల ప్రసక్తే ఎక్కడా కనిపించడం లేదు’’
‘‘అంటే నీ ఉద్దేశం ప్రపంచంలో ఎక్కువగా బిజీ ఉండేది మన వాళ్లేనా? నమ్మలేక పోతున్నాను. గంటల తరబడి ఇరానీ హోటల్స్‌లో టీలు తాగుతూ బస్టాపుల్లో కాలక్షేపం, రోజుకో సినిమా చూస్తూ, రోజంతా క్రికెట్ చూస్తూ గడిపే మనం అందరి కన్నా బిజీనా? నమ్మలేకపోతున్నాను? అందుకే మహాకవి గురజాడ మన వాళ్లు ఉత్త వెధవాయలోయ్ అన్నట్టున్నారు’’
‘‘అంబులెన్స్ వెళుతున్నా దాన్ని ఓవర్ టేక్ చేస్తూ వెళుతుంటారు? ఎందుకంటావు? అంబులెన్స్ అత్యవసరం.. అలాంటి అంబులెన్స్ కోసం కూడా ఓ నిమిషం పక్కకు తప్పుకోలేనంత బిజీగా ఉంటేనే కదా? దాన్ని ఓవర్ టేక్ చేసి వెళ్లడం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎర్ర బల్బు వెలిగినా వాహనం నిలపకుండా వెళ్లి పోతాం అంటే రెండు నిమిషాలు కూడా వృథా చేయనంత బిజీగా ఉండడం వల్లే కదా? అలా వెళుతున్నాం. రోడ్డు మీద మనుషులు కనిపిస్తే వాళ్ల పై నుంచే ఇసుక లారీలు వెళ్తాయి.. ఎందుకనుకుంటున్నావ్?’’
‘‘అర్థమైంది ఇసుక లారీలు అందరి కన్నా బిజీ’’
‘‘వెరీ గుడ్.. రైల్వే క్రాసింగ్‌ల వద్ద బద్ధకస్తులను చూస్తే ఎంత బాధేస్తుందో? రైలు వస్తుందని గేటు వేస్తే అరగంట పాటు అలానే నిలబడతారు. మనలాంటి ఏ కొద్ది మందో బిజీ జీవితం గడిపేవారు గేటు పైకి ఎక్కి వెళతారు, గేటు కింది నుంచి దూరి వెళతారు. ఎంత బిజీగా లేకపోతే అలా చేస్తాం. ప్రపంచంలో బహుశా మరెక్కడా లేనంత బిజీ జీవితాన్ని మనం గడుపుతున్నా- బిజీ జీవుల జాబితాలో మన దేశం కనిపించక పోవడం మన ప్రతిభను తొక్కి పెట్టడమే. చెప్పుకుంటే సిగ్గు చేటు.. అమెరికా అంటే బాగా అభివృద్ధి చెందిన దేశం అని అనుకుంటాం కదా? అక్కడ మనలా ఎవరైనా బిజీగా ఉండేందుకు ప్రయత్నిస్తే, ప్రోత్సహించడానికి బదులు జరిమానాలు విధిస్తారు’’
‘‘ఔనా? ఎందుకలా?’’
‘‘కొత్తగా సిమెంట్ రోడ్డు వేస్తే గట్టిపడేంత వరకు నీటితో తడుపుతూ అటు వైపు ఎవరూ వెళ్లకుండా అడ్డం పెడతారు. మనలాంటి బిజీ జీవులకు దీని వల్ల ఎంత సమయం వృథా అవుతుంది? సరే... మనం పట్టించుకోకుండా ఇంకా గట్టిపడని ఆ రోడ్డుపై నుంచే వెళతాం.. మన పాద పద్మాలు, టైర్ల గుర్తులు ఆ సిమెంట్ రోడ్డుపై శాశ్వతంగా ఉండిపోతాయి. ఇటీవల అమెరికాలో మన సోదరుడు ఒకరు అలానే బిజీగా ఇంకా గట్టిపడని రోడ్డుపై వెళితే పదివేల డాలర్ల జరిమానా విధించారు. ఇలా అయితే ఆ దేశం ఎలా బాగుపడుతుందో? ’’
‘‘బిజీలోనే కాదు.. ఎన్నో విషయాల్లో మన రికార్డులు ప్రపంచానికి తెలియడం లేదు. మొన్నో మాజీ మంత్రి కొడుకు తనపై తానే మూడు రౌండ్లు కాల్పులు జరిపించుకున్నాడు. ఎదుటి వారిని చంపేవారు ఎక్కడైనా కనిపిస్తారు. తనపై తూటాలు పేల్చడానికి తానే లక్షలు ఇచ్చి ఏర్పాట్లు చేయించుకునే సాహసవంతులు ఎక్కడైనా ఉంటారా? అభినందించాల్సింది పోయి అరెస్టు చేస్తారా? ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది. సాహసవంతులు జైలులో ఉంటే ఈ ప్రపంచానికి జ్ఞాన బోధ చేసేది ఎవరు? ’’
‘‘అన్నీ నిజమే.. కానీ మన దేశ గ్రోత్ రేట్ అధో  ముఖం పట్టిందట కదా..?’’
‘‘ఇలా మాట్లాడితేనే నాకు చిర్రెత్తుకొస్తుంది. బిజీగా బతకడంలో, బద్ధకంలో, చట్టాలను ఉల్లంఘించడంలో ఎన్నో రంగాల్లో గ్రోత్ రేట్ ఊర్ధ్వముఖంలో ఉంటే ఒక్క గ్రోత్‌రేట్ తగ్గిందని .. నిరుద్యోగం పెరిగిందని , జనం బతక లేక పోతున్నారని పనికి రాని మాటలు  ఎందుకు మాట్లాడుతావ్? అందుకే గురజాడ మనల్ని తిడుతూ ‘వెధవాయలోయ్’ అన్నాడు.
*
-బుద్దా మురళి(జనాంతికం 4. 8. 2017)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం