6, ఏప్రిల్ 2018, శుక్రవారం

పదివేలు కట్టు.. పార్టీ పెట్టు..

‘‘ఆసక్తిగా చూస్తున్నావ్ .. ఏంటో?’’
‘‘ఆయన పార్లమెంటు మెట్లకు మొక్కుతున్న ఫొటో. మా మామను నేనే రాజకీయాల్లోకి తీసుకు వచ్చా, నన్ను చూసే మోదీ పాలించడం నేర్చుకున్నాడని అని తనకు తాను ఆయన ఎంత మెచ్చుకున్నా... మీడియా డార్లింగ్ అని ముద్దుగా పిలిపించుకున్నా.. ఈ విషయంలో మాత్రం మోదీ ముందు ఈయన నటన వెలవెలబోయింది. గుజరాతీ నటనలో జీవం ఉంది. ఫొటోగ్రఫీ దర్శకునికి ఉన్నంత అవగాహన మోదీలో ఉంటే, ఈయన మాత్రం పెళ్లిళ్ల ఫొటోగ్రాఫర్‌తో సినిమా షూటింగ్ చేయించినట్టు.. ఆ ఫొటో ఎంత పేలవంగా ఉందో చూడు.. రాయలసీమ ఫ్యాక్షన్ కథల నేపథ్యంలో మట్టిన ముద్దాడే సీన్ తొలిసారి ‘ఇంద్ర’లో సూపర్ డూపర్ హిట్టయింది. చివరకా సీన్ అల్లరి నరేష్ పేరడీ సీన్‌గా మారిపోయింది. అప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పి, ఇప్పుడు తొలిసారి పార్లమెంటుకు వచ్చినట్టు ముద్దాడితే సీన్ ఏం పండుతుంది?’’
‘‘ఆ ఫొటో గురించి కాదు..’’
‘‘మరేంటి..?’’
‘‘ఆ సంగతి వదిలేయ్! ఏంటీ మార్కెట్‌లో విశేషాలు?’’
‘‘రామ్‌చరణ్ తొలిసారిగా నటించాడట!’’
‘‘తొలిసారిగా నటించడం ఏమిటి? ఆయన సినిమాలు చాలానే వచ్చాయి కదా?’’
‘‘నిజమే..కానీ తొలిసారి ‘నటించాడని’ అంతా అంటున్నారు. అలా ఎందుకంటున్నారో నాకూ తెలియదు’’
‘‘సినిమాల సంగతి మనకెందుకు.. రాజకీయాలు ఎలా ఉన్నాయి? కొత్తపార్టీల గురించి ఏమనుకుంటున్నావ్?’’
‘‘జనసేన పార్టీకి అధ్యక్షుడు మినహా కార్యవర్గం ఏమీ లేకపోతే కొత్త పార్టీ అంటావా? నాలుగవ వార్షికోత్సవం కూడా ఘనంగా జరుపుకున్నారు. ’’
‘‘పార్టీ అంటే అదొక్కటేనా? ’’
‘‘చూడోయ్ రాజధాని నగరంలో ఓ చిన్న చాయ్ సెంటర్ పెట్టాలన్నా, ఇడ్లీ బండి, టిఫిన్ సెంటర్ పెట్టాలంటే, గినె్నలు, స్టౌ, కుర్చీలు, అడ్డాకు ఓ పాతిక వేలన్నా కావాలి. కానీ ఓ పార్టీని రిజిస్టర్ చేయించాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు పదివేలుంటే చాలు. రిజిస్టర్ అయిన పార్టీలు దేశంలో 1866 ఉన్నాయి. ఇంకొన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ చూడు రిజిస్ట్రేషన్ ఖర్చు, విధి విధానాలు, దరఖాస్తు ఫారాలు అన్నీ సిద్ధంగా ఉంటాయి.’’
‘‘మనమో పార్టీ పెడితే ఎలా ఉంటుంది?’’


‘‘నాకు ఆసక్తి లేదు, ఆ శక్తీ లేదు. సినిమా నేపథ్యం ఉంటే సరుకు లేకపోయినా ఫరవాలేదు. లక్షల మంది మీటింగ్‌లకు వస్తారు. కాలం కాని కాలంలో పార్టీ పెడితే ఎన్టీఆర్ పార్టీనైనా ఎవరూ పట్టించుకోరు. ఉన్న పార్టీని అల్లుడు టేకోవర్ చేశాక ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టి, నల్లడ్రెస్ వేసుకుని తిరిగితే ఎవరూ పట్టించుకోలేదు. ఎన్టీఆర్ 1982లో పార్టీ పెడితే నేల ఈనిందా, ఆకాశానికి చిల్లులు పడిందా? అన్నట్టు జనం! 14 ఏళ్ల తరువాత అదే ఎన్టీఆర్ 1996లో మరో పార్టీ పెడితే దిక్కూ దివాణం లేదు.’’
‘‘మరెవరు పార్టీ పెడితే బాగుంటుంది? ఉద్యమ నేతలు రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెడితే- రాజకీయ భూకంపం రాదా?’’
‘‘కొన్ని డైలాగులు సినిమాలకు బాగుంటాయి. సినిమాల్లో సీరియస్‌గా అనిపించిన డైలాగులు నిజ జీవితంలో సిల్లీగా ఉంటాయి. బుడ్డ ఎన్టీఆర్ తెలుసు కదా? మాస్ ఫాలోయింగ్‌లో పెద్ద ఎన్టీఆర్‌నే మించి పోయాడంటారు అభిమానులు. కంటి చూపుతో చంపేస్తాను అనే డైలాగు బాగా పాపులర్ అయింది. 2009 ఎన్నికల్లో కంటిచూపుతో మహాకూటమిని గెలిపిస్తానని ఎన్నో ఊర్లు తిరిగాడు. గెలవ లేదు సరికదా? ఆ తరువాత మామ రాజకీయాలను తట్టుకోలేక .. సినిమా రంగంలోనూ అడ్రెస్ లేకుండా చేస్తారని కంగారు పడి .. నాకు రాజకీయాలు తెలియవు బాబోయ్ అని అస్త్ర సన్యాసం చేశాడు.’’
‘‘ఉద్యమ నేపథ్యం.. ?’’
‘‘ఇరోమ్ షర్మిలా గుర్తుందా? దేశ చరిత్రలో ఆమెలాంటి ఉద్యమ కారులు ఇంకెకవరినైనా చూపిస్తావా? 16 ఏళ్లపాటు ఆహారం తీసుకోకుండా నిరాహార దీక్ష చేసింది. ఆమె ఉద్యమాన్ని ప్రపంచం గుర్తించింది. అవార్డులతో సత్కరించింది. ‘గ్లోబల్ ఐకాన్ ఆఫ్ ప్రొటెస్ట్’ అంటూ జాతీయ, అంతర్జాతీయ మీడియా, ఉద్యమ సంఘాలు ఆమెను ఆకాశానికెత్తాయి. జీవితంలో ముఖ్యమైన యవ్వన కాలమంతా ఆమె దీక్షలోనే గడిపింది. ఇంతకుమించిన త్యాగం ఉద్యమాల చరిత్రలో ఇంకోటి ఉంటుందా? ’’
‘‘ఆమె సంగతి వేరు’’
‘‘జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేసిన ఆమె రాజకీయ పార్టీ స్థాపించి మణిపూర్ ఎన్నికల్లో పోటీ చేస్తే కేవలం 90 ఓట్లు వచ్చాయి. ఆమె పార్టీ తరఫున మిగిలిన వారికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలియదు. ముఖ్యమంత్రి పదివి చేపట్టి వ్యవస్థను సంస్కరిస్తానని అని ఆమె ప్రకటన చేసిన వార్తకు రెండు వందల కామెంట్లు వచ్చాయి. అందులో సగం ఓట్లు కూడా ఆమెకు రాలేదు. ఫేస్‌బుక్ వాల్ మీద, ఇంటి గోడల మీద నినాదాలను చూసి మనం ఎలా ఊహించుకున్నా- జనం తీర్పు ముఖ్యం. ఆమె ఉద్యమాన్ని తప్పు పట్టడం లేదు. చిన్న చూపు చూడడం లేదు. ప్రజలెప్పుడూ తప్పు చేయరు. ఏ కాలానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అలా నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మనకు నచ్చక పోవచ్చు.’’
‘‘పోనీ- ప్రజలను ఆకట్టుకునే విధంగా పార్టీని ఎలా ప్రారంభించాలో చెప్పు’’
‘‘మంచి ప్రశ్న.. జనాకర్షక పార్టీని స్థాపించడం ఎలా? అని ఓ పుస్తకం రాయవచ్చు. ఈ బుక్ విడుదలకు ఇదే సరైన సమయం. ఓ వ్యక్తి సినిమాల్లో తెగ ప్రయత్నించి విఫలమై, సినిమా తీయడం ఎలా అని తండ్రి గ్రాట్యూటీ డబ్బులతో ఓ బుక్ రాశాడు. బుక్ అమ్ముడు పోలేదు, సినిమాల్లో చాన్స్‌లు దక్కలేదు.. తండ్రి డబ్బులు మిగలలేదు. సినిమాకైనా, రాజకీయాలకైనా సక్సెస్ ఫార్ములా అంటూ ఉండదు. అలా ఉంటే దేశంలో రిజిస్టర్ అయిన 1866 పార్టీలు అధికారంలో ఉండేవి. ప్రతివాడూ హీరో అయ్యేవాడు. కాలం కలిసి రాక అద్వానీ లాంటి వారు మౌ నంగా ఉన్నారు. దేనికైనా కాలం ముఖ్యం. పూజారి దేవుడు కాలేడు. 

చాణక్యుడు రాజనీతిని బోధించగలడు, రాజు కాలేడు.’’ *
-

 - బుద్దా మురళి(జనాంతికం-6-4-2018)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం