25, మే 2018, శుక్రవారం

మీకు మీరే బాధ్యులు..

‘హుషారుగా కనిపిస్తున్నావ్..?’’
‘‘ఉదయమే విశ్వనాథం ఫోన్ చేశాడు. చాలా దిగులుగా ఉన్నాడు. ఏంట్రా విషయం అంటే నీకేం హైదరాబాద్‌లో హాయిగా ఉన్నావ్? మేం హైదరాబాద్‌ను వదులుకున్నాం అని బాధపడ్డాడు’’
‘‘మరి నువ్వేమన్నావ్?’’
‘‘నువ్వు ఒక్క హైదరాబాద్‌నే వదులుకుని అంత బాధపడితే, మేం విజయవాడ, విశాఖ, గుంటూరు, తెనాలి, రాజమండ్రి, కర్నూలు, కడప, అనంతపురాన్ని, ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు తిరుపతి, అన్నవరం, శ్రీశైలం వదులుకుని ఇంకెంత బాధపడాలని అడిగాను’’
‘‘మరేమన్నాడు? ’’
‘‘బుర్ర గిర్రున తిరిగినట్టుంది. ఏమీ అనలేదు. అతను హైదరాబాద్‌ను వదులుకోవడం ఏంటి? నేను తిరుపతి వదులుకోవడం ఏంటి? ఎవరు ఎక్కడికైనా వెళ్లవచ్చు. హైదరాబాద్‌కు వస్తే నినె్నవరూ అడ్డుకోరు, తిరుపతి వస్తే ననె్నవరూ అడ్డుకోరు. చంకలో పిల్లను వదులుకున్నాను, పూర్వులు సంపాదించిన ఆస్తిని వదులుకున్నానని అన్నట్టు ఆ దిగులు వద్దు అని చెప్పానులే! ’’
‘‘నీ దృష్టికి ఇంకేం విశేషాలు రాలేదా?’’
‘‘రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి.’’
‘‘అవెప్పుడు చల్లగా ఉన్నాయని? అవికాదు.. ఇంకేం రాలేదా? ఎప్పుడో నూట పాతిక సంవత్సరాల క్రితం పుట్టిన చలం గురించి, మూడున్నర దశాబ్దాల క్రితం మరణించిన సావిత్రి గురించి ఈ తరం పిల్లలు కూడా మాట్లాడుకోవడం నీకు విశేషంగా అనిపించలేదా? సావిత్రి మహానటి. పాపం వాళ్లయన మోసం చేశాడు. కానీ జెమినీ గణేశన్ పెద్ద భార్య కూతురేమో సావిత్రి కాదు, మా నానే్న మహానటుడు అభిమానులు రసికరాజు అనే బిరుదు కూడా ఇచ్చారని చెబుతోంది..’’
‘‘చూడోయ్ శ్రీరాముని కోణం నుంచి రామాయణం కథ చెబితే అతను పితృవాక్య పాలకునిగా ధీరోధాత్తునిగా, రావణుడు విలన్‌గా కనిపిస్తాడు. ఈ మధ్య రావణున్ని హీరోగా చూపుతూ బోలెడు సాహిత్యం వచ్చింది. ‘అన్నగారు’ ఎప్పుడో సినిమాలు కూడా తీశారు. కథ ఒకటే కానీ ఎవరి కోణం నుంచి చెబుతున్నామనేదే ముఖ్యం. అంతెందుకు? గాడ్సే కోణం నుంచి మహాత్మా గాంధీ కథను కూడా గాడ్సే హీ రోగా రచించారు.’’
‘‘పోనీ.. చలం గ్రేట్ కదూ... ఆయన రాతలు అజరామరణం కదా? కవి మరణిస్తాడేమో.. కానీ ఆయన సాహిత్యం శాశ్వతం ఏమంటావు?’’
‘‘ లక్షల మంది మరణానికి కారణమైన హిట్లర్‌ను రోజూ తలుచుకుంటున్నాం, ప్రపంచానికి అహింస ఆనే ఆయుధాన్ని అందించిన గాంధీని తలుచుకుంటున్నాం. తలుచుకోవడం ఒక్కటే గొప్పతనానికి ప్రతీక కాదు’’
‘‘అంటే చలం హిట్లర్ అంటావా? మహాత్మాగాంధీ అంటావా?’’
పలనా వారు మహాత్ములు, ఫలానా వారు దుష్టులు అని ముద్రలు వేసే అధికారం నీకూ నాకే కాదు.. ఎవరికీ లేదేమో! ’’
‘‘డొంక తిరుగుడు వద్దు చలం గురించి ఏమనుకుంటున్నావో చెప్పు?’’
‘‘ఏ తేదీ నాటి చలం గురించి చెప్పమంటావు? ఓషో ఏమన్నాడు ఊపిరి తీసుకున్న ప్రతిసారి మనిషి కొత్త జన్మ ఎత్తినట్టే అన్నాడు. మనిషి ఎప్పుడూ మారుతుంటాడు. ఈ రోజు నీకు నేను గొప్ప మిత్రునిగా కనిపించవచ్చు. నువ్వడిగిన రూ.ఐదువేల చేబదులు ఇవ్వక పోతే నాలో నీకో దుర్మార్గుడు కనిపించవచ్చు. అభిప్రాయాలు నిరంతరం మారుతాంటాయి. చలం తాను రాసిన రచనలపై తానే పశ్చాత్తాపం చెందిన సందర్భాలు ఉన్నాయి. నీ పుస్తకాల వల్ల ఎం తో మంది పాడయ్యారు.. అలా ఎందుకు రాశావంటే- అప్పుడు అట్లా అనిపించింది రాశానని బదులిచ్చినట్టు చలం మనవరాలు తురగా జానకీరాణి ఓ సందర్భంలో చెప్పారు. చలం జీవితాన్ని అనుభవించాడు, ఆయన సంతానం చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. ఆయనకు అలా అనిపించినప్పుడు అలా రాశాడు అభిమానులేమో అదే మహద్భాగ్యం అనుకుని ఆ అభిప్రాయాలను మెదడులోకి జొప్పించి సొంత ఆలోచనలను పక్కన పెట్టారు.’’
‘‘నువ్వు మహానటి సావిత్రిని, మహారచయిత చలంను తప్పు పడుతున్నావ్?’’
‘‘మళ్లీ అదే మాట.. వాళ్లను తప్పు పట్టడానికి ఒప్పు పట్టడానికి నేనెవరిని? నువ్వెవరివి? సావిత్రి తనకు నచ్చినట్టు తాను బతికింది. చలం తనకు నచ్చినట్టు తాను రాశాడు. నాకు తోచింది నేను చెప్పాను. నీకు నచ్చింది నువ్వు స్వీకరించు. ముద్రలు వేయడానికి మనమెవరం?’’
‘‘నువ్వు విమర్శిస్తున్నావో? సమర్ధిస్తున్నావో అర్థం కాలేదు.’’
‘‘కర్నాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకార దృశ్యాలు చూశావా?’’
‘‘దానికి,దీనికి సంబంధం ఏమిటి?’’
‘‘ఉంది.. సోనియాగాంధీతో కలిసి విజయ హస్తం చూపుతూ అల్లుడు ఎంత సందడి చేశారు. రాహుల్‌ను భుజం తట్టారు’’
‘‘దానికీ.. దీనికి సంబంధం ఏంటో చెప్పు?’’
‘‘టిడిపిని స్థాపించిన అన్నను దించేసినప్పుడు ఎన్టీఆర్ కాంగ్రెస్‌తో చేతులు కలిపారని అల్లుడి బృందం విమర్శలు చేసింది గుర్తుందా? ’’
‘‘ఔను.. కాంగ్రెస్ నుంచి వచ్చిన అల్లుడు.. తన మామ కాంగ్రెస్‌తో కలవడాన్ని జీర్ణం చేసుకోలేకపోయాడు.’’
‘‘ఇటలీ మాత అంటూ నిప్పులు చెరిగిన అల్లుడు అదే మాతతో వెనె్నల్లో హాయిగా ముచ్చట్లు చెప్పు కోవడం చూశావా?’’
‘‘చూశాను.. ఐతే ?’’
‘‘మళ్లీ అదే చెబుతున్నాను. సావిత్రి తనకు తోచినట్టు బతికింది. చలం తనకు నచ్చినట్టు రాశాడు, బతికాడు.. కాంగ్రెస్ వ్యతిరేకత లాభసాటి అనుకున్నప్పుడు అల్లుడు ఆ పని చేశారు. ‘చేయి’తో చేయి కలిపితే లాభసాటి అని ఇప్పుడు అనుకుంటున్నారు. ఏ నిర్ణయం శాశ్వతం కాదు. ఎవరికి లాభసాటి అనుకున్న నిర్ణయం వాళ్లు తీసుకుంటారు. ఆ నిర్ణయం లాభసాటా? కాదా? అనేది కాలం తేలుస్తుంది. చలం ఆలోచనలు అద్భుతం, రాంగోపాల్ వర్మ ఆలోచన మహాద్భుతం అంటూ కార్బన్ కాపీగా మారిపోకు. వాళ్ల అభిప్రాయాలు చదవగలవు కానీ వాటి వెనక ఉన్న ఉద్దేశాలు, ఫలితాలు నీకేం తెలుసు? గద్దర్ అయినా రాంగోపాల్  వర్మ అయినా ఎవరైనా  బతకడానికి తగిన ఏర్పాట్లు చేసుకొని ఏమైనా మాట్లాడవచ్చు .  నువ్వు కూడా నీకు నచ్చిన నిర్ణయం తీసుకో.. ఫలితాన్ని నువ్వే అనుభవించు. సింపుల్‌గా చెప్పాలి అంటే నీ దురదను నువ్వే గోక్కో. ఇతరులు గోక్కోవడం చూసి అనుసరించకు. ఎవరి దురదకు వాళ్లే బాధ్యులు
’’.
‘‘మరి ఓషో అంటున్నావు ’’
‘‘నన్ను ఫాలో కా అని ఓషో ఎప్పుడూ చెప్పలేదు ..అలా కార్బన్ కాపీ లంటే ఆయనకు పడదు కూడా ..  నీకు నువ్వు ఆలోచించుకో అన్నారు ’’
-బుద్దా మురళి (జనాంతికం 24-5-2018)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం