20, ఆగస్టు 2018, సోమవారం

డబ్బులు ఊరికే రావు!

డబ్బులు ఊరికే రావు అంటూ ఈ మధ్య ఒక బంగారు నగల వ్యాపారి ప్రచారం అందర్నీ ఆకట్టుకుంది. అతని బంగారు షాపు ముందు కొత్త సినిమా విడుదలైనప్పుడు కనిపించేంత జనం చేరారంటే ఆ ప్రకటన ఎంతగా ప్రభావం చూపిందో అర్థం అవుతుంది. డబ్బులు ఊరికే రావు అని అతను చెబుతున్నా... పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి నగలు కొనేందుకు ఎగబడ్డారు. డబ్బులు ఊరికే రావు అని చెబుతూనే మీ జేబులు ఖాళీ చేయించడం అంటే ఆ వ్యాపారి తెలివి తేటలను మెచ్చుకోవలసిందే.
మోసగాళ్లుంటారు జాగ్రత్త అంటూ కొన్ని మేయిల్స్, ఎస్‌ఎంఎస్ సందేశాలు వస్తుంటాయి. ఒక వైపు మోసగాళ్ల గురించి జాగ్రత్తలు చెబుతూనే మోసం చేసే కిలాడీలు వీళ్లు.
డబ్బులు ఊరికే రావు అనే అతని ప్రచార ఉద్దేశం ఏదైనా... డబ్బులు ఊరికే రావు అనేది అక్షర సత్యం. అది అర్థం అయితే మన డబ్బుకు మనం విలువ ఇస్తాం. మోసగాళ్ల బారిన పడం. చాలా మందికి పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపితే డబ్బులు ఊరికే రావు అనే కనీస అవగాహన లేకుండా మోసపోతుంటారు.
మీ నగలన్నీ ఈ చెంబులో వేయండి. నెల రోజుల పాటు చెంబును పూజ చేయండి తరువాత చెంబు మీద ఉన్న గుడ్డను తెరిచి చూస్తే మీ నగలు రెట్టింపు అవుతాయి. మీ ఇంట్లో సమస్యలు మటుమాయం అవుతాయి. అంటూ దాదాపు మూడు దశాబ్దాల నుంచి మోసం చేస్తూనే ఉన్నారు. దాదాపు పదేళ్ల క్రితం ఇలాంటి దృశ్యాలు సినిమాల్లో కూడా చూపారు. ఇలాంటి మోసాలేం విచిత్రంగా అనిపించవు కానీ... ఇలాంటి మోసాల గురించి ఇంతగా ప్రచారం జరుగుతున్నా, సినిమాల్లో చూపినా ఇంకా ఇదే తీరులో మోసపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మోసపోయే వారి పరిస్థితి ఎలా ఉన్నా. ఇలాంటి పురాతన ట్రిక్స్‌తో ఇంకా జనాన్ని మోసం చేయవచ్చునని జనం తెలివిపై అంత విశ్వాసం ఉన్న మోసగాళ్ల తెలివి ఆశ్చర్యం కలిగిస్తుంది. మూడు దశాబ్దాల క్రితం నుంచి ఉన్న ఇలాంటి మోసాలు మరో మూడు దశాబ్దాలు అయినా ఎక్కడికీ పోవు అలానే ఉంటాయి. ఉత్త పుణ్యానికి నగలు రెట్టింపు అవుతాయి అంటే మనకు ఆశ పుడుతుంది కానీ ఉత్త పుణ్యానికి నగలు రెట్టింపు కావు అనే అవగాహన ఉండదు. నగలు రెట్టింపు చేసే మంత్రాలే వారికి వచ్చి ఉంటే మీరిచ్చే వంద రూపాయల కోసం మీ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతారు.
మీరు పదివేల రూపాయలు డిపాజిట్ చేస్తే రెండు నెలల్లో రెట్టింపు ఇస్తాం అనే ప్రచారాన్ని చూసి చాలా మంది డిపాజిట్ చేసి మోసపోతుంటారు. వేరువేరు స్కీంల పేర్లతో ఇలాంటి మోసాలు గతంలో జరిగాయి. భవిష్యత్తులో కూడా జరుగుతాయి. డబ్బు గురించి సరైన అవగాహన లేకపోవవడం వల్లనే ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి.
మనం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే దాదాపు ఏడు శాతం వరకు వడ్డీ చెల్లిస్తారు. గృహ రుణాలు, విద్యా రుణాలు, పరిశ్రమల స్థాపనకు రుణాల నుంచి వ్యక్తిగత రుణాల వరకు వివిధ రకాల రుణాలు ఇస్తాయి. 10 శాతం నుంచి 14 శాతం వరకు వడ్డీతో బ్యాంకులు రుణాలు ఇస్తాయి. మనకు ఏడు శాతం వడ్డీ చెల్లించే బ్యాంకులు ఆ డబ్బును పది శాతం నుంచి 14శాతం వరకు వడ్డీకి రుణాలు ఇస్తాయి. మనకు చెల్లించే వడ్డీకి, బ్యాంకులు వసూలు చేసే వడ్డీకి మధ్య ఉన్న తేడానే బ్యాంకు వచ్చే లాభం. ప్రైవేటు వడ్డీ వ్యాపారులైనా, బ్యాంకులైనా అంతే. మనకు చెల్లించే వడ్డీ, వారు వసూలు చేసే వడ్డీ మధ్య ఉండే తేడానే వారి లాభం.
ఎవరో ప్రైవేటు వ్యక్తి, సంస్థ వచ్చి మూడు నెలలకే మీ డిపాజిట్‌పై రెట్టింపు డబ్బు ఇస్తామంటే ఈజీగా నమ్మేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అనే ఆలోచనే లేదు. ఏడు శాతం వడ్డీని బ్యాంకులు ఎలా చెల్లిస్తున్నాయి అంటే? 12శాతం వడ్డీకి ఇతరులకు ఇచ్చి, డిపాజిట్లపై ఏడు శాతం చెల్లించగలుగుతున్నాయి. నెలకు 30 శాతం వడ్డీ ఇవ్వాలి అంటే మీ డిపాజిట్‌ను ఆ వ్యక్తి కనీసం 40 శాతం ఆదాయం వచ్చే విధంగా పెట్టుబడి పెట్టాలి. ఇది సాధ్యమా?
అయితే ఇలాంటి మోసగాళ్ల వద్ద డబ్బులు డిపాజిట్ చేసే వాళ్లు ఇదంతా ఆలోచించరు. మన వద్ద లక్ష రూపాయలు ఉంటే వాని వద్ద డిపాజిట్ చేస్తే నెలకు పదివేలు ఇస్తానంటున్నాడు. హాయిగా ఇంటి ఖర్చు వెళ్లిపోతుంది అనే ఆలోచనే తప్ప లక్ష రూపాయలకు నెలకు పదివేల రూపాయలు చెల్లించడం ఎలా సాధ్యం. మనం డిపాజిట్ చేసిన డబ్బును వాళ్లు ఏ విధంగా ఇనె్వస్ట్ చేస్తారు. మనకు లక్షకు పదివేలు ఇవ్వాలి అంటే వారికి అంత కన్నా ఎక్కువ ఆదాయం రావాలి కదా? అది ఎలా సాధ్యం అనే ఆలోచన ఏ మాత్రం రాదు. మనం డిపాజిట్ చేసిన లక్ష నుంచి రెండు మూడు నెలల పాటు క్రమం తప్పకుండా పదేసివేలు వడ్డీగా చెల్లిస్తారు. దీనితో అతనిపై నమ్మకం కలుగుతుంది. చాలా మంది డిపాజిట్ చేస్తారు. వారి లక్ష్యం మేరకు డబ్బు సమకూరిన తరువాత బిచాణా ఎత్తివేస్తారు. ఇలాంటి సంఘటనలు కొన్ని వందల నగరాల్లో, పట్టణాల్లో జరిగాయి. అయినా ఇప్పటికీ నమ్ముతూనే ఉంటారు. డబ్బుకు సంబంధించి, వడ్డీకి సంబంధించి కనీస అవగాహన ఉంటే ఇలా మోసపోరు.
తవ్వకాల్లో బంగారు కడ్డీలు దొరికాయి మీకు చౌకగా ఇచ్చేస్తాం. డబ్బు తీసుకొని రండి అంటే వెళ్లిపోవడమే. బంగారం ఎక్కడైనా బంగారమే. మార్కెట్ ధరకు ఎక్కడైనా అమ్ముడు పోతుంది. ఎక్కడో ఉత్తరాది రాష్ట్రం నుంచి ఇక్కడున్న మీకు ఫోన్ చేసి చెప్పగానే వెళ్లిపోవడమేనా? బంగారం చౌకధరకు కొట్టేద్దామనే ఆలోచనే తప్ప బంగారం ఎక్కడైనా బంగారమే నాకు ఫోన్ చేసి అమ్మాల్సిన అవసరం ఏమిటనే ఆలోచన రాదు.
మిమ్ములను రాత్రికి రాత్రి లక్షాధికారులను చేయాలని, మీ డిపాజిట్లను రెండు మూడు నెలల్లో రెట్టింపు చేయాలని ఎవరో కంకణం కట్టుకుని వేచి చూస్తున్నట్టు కనీస అవగాహన లేకుండా డబ్బులు ముట్టచెప్పడం- మోసపోవడం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. డబ్బులు డబ్బులను సంపాదిస్తాయి అక్షర సత్యం. అయితే అది రెండు మూడు నెలల్లో ఎక్కడా రెట్టింపు కావు. మోసాలకు దూరంగా ఉండాలి అంటే డబ్బులు ఊరికే రావు అనే కనీస అవగాహన జీవితంలో ఉండాలి.
*
-బి.మురళి(8-8-2018)

1 కామెంట్‌:

  1. మనిషి ఆశకి అంతు లేదు అందుకనే ఇది సాధ్యమవుతోంది. ఇవి అన్ని వేళల అన్ని రకాల ప్రజలు చదువుకోవాల్సిన సత్యాలు. తరచూ ప్రచురించండి.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం