2, ఆగస్టు 2023, బుధవారం

మీడియా లో పుకార్ల పంట.. అదిగో పులి .. ఇదిగో తోక ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -82

మీడియా లో పుకార్ల పంట పండిస్తారు ఇదిగో పులి .. అదిగో తోక ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -82 ------------------------------------ వర్షం పడితేనే రైతులు పంట పండిస్తే మీడియా వార్తల కరువు లో పుకార్ల పంట పండిస్తుంది . గవర్నర్ కోటా కింద శాసన మండలి సభ్యులుగా ఎంపిక అయ్యె వారి గురించి ఎ బి ఎన్ ఛానల్ లో ఓ స్టోరీ ప్రసారం చేశారు . మోత్కుపల్లి నర్సింహులు మొదలుకొని తమకు తెలిసిన పలువురు నాయకులకు ఈ కోటాలో మండలి సభ్యత్వం కల్పించారు . తీరా చూస్తే కుర్రు సత్యనారాయణ , దాసోజు శ్రవణ్ లను కెసిఆర్ ఎంపిక చేశారు . ఒక్క ఛానల్ , ఒక్క పత్రిక కూడా ఈ పేర్లను ముందుగా ప్రసారం చేయలేదు . ఇలా ఎందుకు ? అంటే నిర్ణయం తీసుకునేవారు ఏ నిర్ణయం తీసుకుంటారో మీడియాకు తెలియదు . వారు నిర్ణయం తీసుకునేంత వరకు వీరికి గుర్తున్న , తెలిసిన పేర్లన్నీ రాసేయవచ్చు .. మోత్కుపల్లి పై జ్యోతికి అమితమైన ప్రేమ ఉమ్మడి రాష్ట్రంలో వారంలో రెండు మూడు సార్లు మోత్కుపల్లిని గవర్నర్ ను చేసేవారు . విభజన తరువాత శాసన మండలి సభ్యుడి నైనా చేయక పోతే ఎలా అని ఏ ఎన్నిక వచ్చినా వారు తమ మీడియాలో మోత్కుపల్లిని అందలమెక్కిస్తున్నారు . కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఓ జర్నలిస్ట్ మిత్రులు మంత్రివర్గ విస్తరణ పై రాయబోతుంటే ... తెలంగాణ ఉద్యమం , రాష్ట్ర ఏర్పాటు చివరి దశ లో విస్తరణ ఉండదు అని వివరంగా చెబుతున్నాను ... ఆ మిత్రునికి కిరణ్ కుమార్ రెడ్డి బాగా సన్నిహితులు , ఫోన్ లో కబుర్లు చెప్పుకునేంత సన్నిహితం . నేను చెప్పింది విని ... విస్తరణ ఉండదు , ఆ విషయం నీకన్నా నాకే బాగా తెలుసు .. విస్తరణ ఉండదు అంటే ఒకటే వార్త . విస్తరణ ఉంటుంది అని రాస్తే రెండు మూడు రోజులకు ఓ సారి రాసుకోవచ్చు . మరి వార్తలు కావాలి కదా ? అని వార్తల మర్మం తెలియ జేశారు . మీడియా రాజకీయ నాయకులకు సంబధించే కాదు చివరకు తమ మీద తామే పుకార్లు లేవదీసుకుంటారు . పుకార్లు అంటే ఎవరికైన ఆసక్తిగానే ఉంటుంది . అందులోనూ మీడియాలో ఉన్నప్పుడు వీటిపై మరింత ఆసక్తి ... పత్రికలో రాసిన దానికి , ప్రసారం చేసిన దానికి ఎంతో కొంత బాధ్యత వహించాలి . అది రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి .. వాటి విషయంలోనే ఎలాంటి అడ్డు లేనప్పుడు , రికార్డ్ చేయాల్సిన అవసరం లేని పుకార్ల ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో . ******* వై యస్ రాజశేఖర్ రెడ్డి కి ఆత్మ గా గుర్తింపు పొందిన కెవిపి రామచంద్రరావు ఒక సాహసి ప్రయాణం అని వై యస్ ఆర్ గురించి , పోలవరం గురించి ఓ బుక్ రాశారు . అప్పుడు వైయస్ ఆర్ కు పరిచయం ఉన్న నాయకులు , జర్నలిస్ట్ లను పిలిచారు . సీనియర్ జర్నలిస్ట్ లు భండారు శ్రీనివాసరావు శ్రీనివాసరావు , కొమ్మినేని శ్రీనివాసరావు , కెవి యస్ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లారు . ఈ ముగ్గురు ఉన్న ఫోటోను భండారు ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే ... ఆ ఫోటోను టీడీపీ వాళ్ళు తీసుకోని ముగ్గురిలో ఒకరికి వై యస్ ఆర్ కమర్షియల్ కాంప్లెక్స్ , ఒకరికి త్రిబుల్ బెడ్ రూమ్ , ఇంకొకరికి విల్లా ఇచ్చారు అని టీడీపీ గ్రూప్ లో రాశారు . ఆ ముగ్గురి లో ఇద్దరి గురించి బాబుకు కూడా బాగా తెలుసు . టీడీపీ వారు పుకారును ప్రచారం లో పెట్టేప్పుడు పుకారులో నిజానిజాలు బాబును అడిగినా చెప్పేవారు . మీడియా నాయకులపైనే కాదు , నాయకులు మీడియా పై కూడా పుకార్లు లేవదీసే అవకాశం సోషల్ మీడియా కల్పించింది . ఇది జరిగిన కొన్ని రోజులకు మాటల సందర్భంలో సుబ్రహ్మణ్యం 18 మంది సీఎంఓ జర్నలిస్టులకు విల్లాలు ఇప్పించారట కదా ? బయట టాక్ అని చెప్పుకొచ్చారు . ఈ ప్రచారం అన్ని మీడియాల్లో ఉంది . జర్నలిస్ట్ లు అన్నప్పుడు పుకార్లు జన్మ హక్కు . .. నేను దానిని ఏమీ వ్యతిరేకించడం లేదు . కానీ మిగతా ఎవరైనా ఈ పుకారు నమ్మవచ్చు , ప్రచారం చేయవచ్చు కానీ .. మీకు ఆ హక్కు లేదు అన్నాను . వారం క్రితమే కదా ? మీ మీద పుకారు వచ్చింది మీకు వైయస్ ఆర్ త్రిబుల్ బెడ్ రూమ్ విల్లా ఇప్పించారు అని టీడీపీ వాళ్ళు ప్రచారం చేశారు అని గుర్తు చేశాను . సచివాలయం లోకి రానివ్వడం లేదు , వార్తలు దొరకడం లేదు అని మీడియా వాళ్ళు ఏడుస్తుంటే ఇలాంటి పుకారు ఎలా ? పుకారు లో కూడా కొంత నాణ్యత ఉండాలి అని జోకేశాను . ************** సాధారణంగా ఓ విషయం నాకు తెలియదు అని ఎట్టి పరిస్థితిలోనూ కొందరు ఒప్పుకోరు . ఒక పుకారు వినిపించి నిజమా ? అని అడిగితే దానికి మరింత మసాలా జోడిస్తారు . . ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్ట్ ల ఇంటి స్థలం వ్యవహారం కోర్టు కు వెళ్ళాక .. జనరల్ బాడీ మీటింగ్ లో బిజినెస్ లైన్ రిపోర్టర్ ఒకరు సభ్యుల వద్ద పన్నెండు కోట్లు వసూలు చేసి ప్రభుత్వానికి కట్టలేదు . కెవిపి రామచంద్రరావుకు ఇస్తే ఆయన ఆయిల్ బిజినెస్ లో పెట్టారు అని మైకులోనే చెప్పారు . బిజినెస్ రిపోర్టర్ కు భలే బిజినెస్ ఐడియా వచ్చింది అనిపించింది . కెవిపి ఓ వెలుగు వెలిగిపోతున్న కాలం అది . ఓ జర్నలిస్ట్ ఫోన్ చేసి మన స్థలం ఆరు వందల కోట్లకు అమ్ముకున్నారట అని చెబితే , ఆరు వందల కోట్లు కాదు 650 కోట్లకు అమ్మారు , 50 కోట్లు మీడియేటర్ కు ఇచ్చారు అని బదులిచ్చాను . ఫోన్ చేసిన అతని ఉద్దేశం అమ్మారు అంటే , లేదు అని నేను వాదించాలి అని .... అలాంటి వారి వద్ద నేరుగా మాట్లాడితే ఉపయోగం ఉండదు. నువ్వు చెప్పిన 600 నిజం ఐతే నేను చెప్పిన 650 కూడా నిజమే , నీది పుకారు ఐతే నాదీ పుకారే ... అని బదులిచ్చాను . సత్యనారాయణ , దాసోజు శ్రవణ్ పేర్లు ఖరారు అయ్యేంత వరకు లెక్క లేనన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చినట్టే .. ప్రభుత్వ నిర్ణయం వచ్చే అంత వరకు ఏ విషయంలో నైనా .. ఏ పుకారు అయినా రావచ్చు . బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం