13, సెప్టెంబర్ 2011, మంగళవారం

మీ అమ్మాయి జ్యోతి లక్ష్మిలా డ్యాన్స్ చేస్తోంది అంటే ముచ్చటపడుతున్న తల్లులు....... ఫిర్యాదులతో టీవీ సీరియల్స్‌కు మరింత పాపులారిటీ

 జీ తెలుగులో ప్రసారం అవుతున్న ముద్దుబిడ్డ సీరియల్ పిల్లల్లో నేర ప్రవృత్తిని ప్రేరేపించే విధంగా ఉందని, ఈ సీరియల్‌ను నిషేధించాలని బాలల హక్కుల సమితి రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేసింది. అదే రోజు కేబుల్ టీవీ నెట్ వర్క్ చట్టాన్ని సవరించే ప్రక్రియ ప్రారంభించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి వారు చూపిన కారణం సైతం పిల్లల ప్రధానాంశంగా ఉన్న హిందీ సీరియల్ కావడం విశేషం. కలర్స్ చానల్‌లో బాలికా వధు ( హిందీలో వస్తున్న ఈ సీరియల్‌ను అనువదించి తెలుగులో మా చానల్‌లో ప్రసారం చేస్తున్నారు) ఇది బాల్యవివాహానికి సంబంధించిన ఒక కథ. ఈ సీరియల్‌నే కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి చౌదరి మోహన్ జత్వా ప్రస్తావించారు. టీవీ ప్రసారాలపై స్వయం నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన నిబంధనను కేబుల్ టీవీ నెట్ వర్క్ చట్టంలో చేరుస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కానీ బాలికా వధు వంటి సీరియల్‌పై కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కొందరు అనుకూలంగా మాట్లాడుతున్నారు అంటూ మంత్రి చెప్పుకొచ్చారు.
ఇక మన ముద్దుబిడ్డ విషయానికి వస్తే ఫిర్యాదుకు ముందు ఈ సీరియల్ గురించి ఎంత మందికి తెలుసో తెలియదు కానీ ఈ సీరియల్ ప్రసారాలను నిలిపివేయాలని బాలల హక్కుల సమితి మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేసిన తరువాత హడావుడిగా టీవీ 9, ఎన్‌టీవి వంటి ప్రముఖ న్యూస్ చానల్స్ దీనిపై చర్చా గోష్టులు నిర్వహించి బోలెడు ప్రచారం కల్పించాయి. ఈటీవి సుమన్, ప్రభాకర్‌ల స్నేహం ఆ మధ్య సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. ప్రభాకర్ కోసం చివరకు సుమన్ తండ్రిని సైతం వదిలి బయటకు వచ్చారు. తిరిగి సుమన్ సొంతింటికి వెళ్లారు. ఆ సమయంలో సుమన్‌పై అభిమానంతో (ఈ విషయం సంస్థ ప్రారంభించినప్పుడు ప్రభాకరే చెప్పుకున్నారు) ప్రభాకర్ సుమన్ పేరుమీదనే శ్రీసుమనోహర పేరు మీద ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించి 2009లో నిర్మాత, దర్శకుడిగా ప్రభాకర్ ముద్దుబిడ్డ పేరుతో ఈ సీరియల్ నిర్మించారు. జీ టీవీలో సోమవారం నుండి శుక్రవారం వరకు ఈ సీరియల్ ప్రసారం అవుతోంది. రెండేళ్ల నుండి ప్రసారమవుతున్న సీరియల్‌పై ముగింపు దశలో ఫిర్యాదులు అందడం ఏమిటో?

తెలుగు సీరియల్స్ అన్నింటిలో ఆడవారంటే విలన్లు. అత్త పాత్ర కావచ్చు, భార్య , తల్లి , బిడ్డ, ఆడపడుచు, వదినా, మరదలు, చిన్న కోడలు పాత్ర ఏదైనా కావచ్చు, మహిళా పాత్ర అయితే విలన్ లేదంటే నిరంతరం ఏడుస్తూ ఉండే ఏడుపు గొట్టు పాత్ర. చాలా కాలం నుండి ఇదే ట్రెండ్ సాగింది, సాగుతోంది. అన్ని చానల్స్‌లో ఇవే కథలైనప్పుడు పాపం ప్రేక్షకులను సైతం చూడకుండా ఏం చేయగలరు. వీటికి భిన్నంగా ఒక రకంగా మరింత దగ్గరగా ఉంటుంది ముద్దుబిడ్డ. అన్ని సీరియల్స్‌లో పెద్ద మహిళలు విలన్లు అయితే ఈ సీరియల్‌లో మాత్రం ఐదారేళ్ల చిన్నపాప విలన్ అన్న మాట. ఓ పాప కుటుంబంపై కక్ష తీర్చుకోవడానికి కుట్రలు చేస్తుంది. ఓ కుటుంబాన్ని నాశనం చేయాలనకున్న మహిళ తన బిడ్డకు శిక్షణ ఇచ్చి ఆ కుటుంబ సభ్యురాలిగా పంపుతుంది. దాంతో ఆ బాలిక ప్రతి రోజూ ఆ కుటుంబంపై కక్ష తీర్చుకోవడానికి కుట్రలు పన్నుతుంది. మొత్తం మీద కథ ఇది.

 ఐదారేళ్ల పాపతో కక్ష తీర్చుకోవడానికి తల్లి శిక్షణ ఇవ్వడం ఏమిటో, అంత చిన్నపాప కుటుంబంపై కక్ష పెంచుకోవడం ఏమిటో? నిజానికి ఆ పాపలో కన్నా కథ రాసిన రచయిత బుర్రలో, దర్శకుని బుర్రలో ఎంత విషముందో అర్ధమవుతోంది. పూర్వం రాజుల కథలతో సినిమాలు వచ్చినప్పుడు తండ్రిని మోసం చేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్న విలన్లపై హీరో ఎక్కడో పెరిగి పెద్దవాడై కక్ష తీర్చుకుంటాడు. ఇది స్పీడ్ యుగం అప్పటి మాదిరిగా హీరో పెద్దవాడయ్యేంత వరకు ఆ తల్లికి నిరీక్షించే ఓపిక లేదు. ఐదారేళ్ల వయసులోనే బుర్రలో విషం నింపి కక్ష తీర్చుకునే మానవ బాంబుగా మార్చేస్తోంది. ఇలాంటి తల తిక్క కథతో రెండేళ్ల పాటు సాగించిన సీరియల్ నిలిపివేయాలనే ఫిర్యాదు అందడంతో అందరి దృష్టిలో పడింది.

 గతంలో ఇదే విధంగా బాలల హక్కుల సంఘాలు ఓంకార్ ఆటపాటలపై మానవ హక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. నాలుగైదేళ్ల పిల్లలు డ్యాన్స్ చేస్తే జడ్జిస్ అట 60 ఏళ్ల వృద్ధులు జ్యోతిలక్ష్మిలా భలే డ్యాన్స్ చేస్తున్నావు అని కామెంట్లు చెప్పడం, దీనిపై ఫిర్యాదు చేస్తే మానవ హక్కుల కమీషన్ ప్రసారాలను నిలిపివేయమంటే ఓంకార్ కోర్టుకు వెళ్లారు. ఈ వివాదం వల్ల ఆ కార్యక్రమానికి మరింత పాపులారిటీ పెరిగింది. ఓ మహాతల్లి ఈ సందర్భంగా టీవీ చర్చల్లో మాట్లాడుతూ మా పిల్లలు మా ఇష్టం వద్దనడానికి మీరెవరు? జ్యోతిలక్ష్మిలా భలే డ్యాన్స్ చేస్తున్నావని అంటే మీకొచ్చిన నష్టం ఏమిటి? జ్యోతిలక్ష్మి మాత్రం మనిషి కాదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిందాతల్లి. సెన్సార్ బోర్డులు, నియంత్రణలు ఇవన్నీ ఎందుకు? ఆ మహాతల్లి చెప్పినట్టు నచ్చక పోతే ఆ చానల్ మార్చేసుకోండి, చూడమని మిమ్మల్ని ఎవరు బతిమిలాడుతున్నారు.
 ఏడుపుగొట్టు సీరియల్స్, మనుషుల్లో ఇలాంటి కుళ్లు కుతంత్రాలను నింపే సీరియల్స్ చూడలేక ఇతర హిందీ, ఇంగ్లీష్ వచ్చిన వారు ఆ చానల్స్ వైపు వెళుతున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఈ కుళ్లు ఇంకెంత కాలమో! తమిళ కథలను ఎంత కాలం నమ్ముకుంటారు. తెలుగులో ఆలోచించలేరా? అమృతం సీరియల్ రెండోసారి ప్రసారం చేస్తున్నా జనం హాయిగా చూస్తున్నారు కదా! ఫిర్యాదులతో మరింత సీరియల్స్‌కు మరింత పాపులారిటీ పెరుగుతుంది తప్ప మార్పు రాదు.

5 కామెంట్‌లు:

 1. బాగా చెప్పారు.మీరు చెప్పింది.. నూటికి నూరుపాళ్ళు నిజం. నేను అయితే టీవి చూడటమే మానేశాను.వార్తా చానెల్స్ తో సహా.

  రిప్లయితొలగించు
 2. నేను HMTV మాత్రమే చూస్తుంటాను, తెలంగాణాకి సంబంధించిన వార్తల కోసం.

  రిప్లయితొలగించు
 3. అమృతం - చిన్న తప్పుల సగటు మనిషి జీవితం.

  మేగతావి - పెద్ద తప్పుల సమాహారం

  రిప్లయితొలగించు
 4. జ్యోతిలక్ష్మిలా డాన్స్ చెయ్యడం తప్పు కాదనిపిస్తే ఆ పెద్దావిడే నడుము కనిపించేలా దుస్తులు వేసుకుని డాన్స్ చెయ్యొచ్చు. పిల్లల చేత బూతు డాన్స్‌లు చెయ్యించాల్సిన అవసరం లేదు. పిల్లలు బూతు డాన్సులు చేస్తే pedophelia ఉన్నవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు.

  రిప్లయితొలగించు
 5. బహు బాగా చెప్పారు. ఈ దరిద్రపుగొట్టు నాటికలను చూడలేక చస్తున్నాం...! నా చిన్నప్పుడు దూరదర్సన్ లో వచ్చిన నాటికలు ఎంతో బాగుండేవి. హద్దు పద్దు లేకుండా ఎన్నెన్నో ఛానల్స్ పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కుడా తప్పే అసలు. ఒకప్పుడు మెదడు తలలో ఉన్నవారు ఆలోచిస్తే ఒక మంచి నాటిక వెలువడేది. ఇప్పుడంతా మెదడు మోకాల్లో ఉన్నవారే... ఏదో పాపం స్త్ర్రేలు ఇంటి పని నుండి కాస్త విరామం, విశ్రాంతి కోసం ఈ నాటికలను ఆశ్రయిస్తే వారి ఉత్సుకతను ఆసరాగా తీసుకుని " మొగలి రేకులు " లాంటి దరిద్రపు నాటికను కూడా 1000 బాగాలు తీసారంటే ఆలోచించండి ....! మన తెలుగు వారి కర్మ ఎలా కాలిపోయిందో ...! కొత్తగా వచ్చే సినిమాలు కూడా అంట గొప్పగా ఏమి లేవు. :(

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం