21, సెప్టెంబర్ 2011, బుధవారం

ఇది ఇంటింటి రాజ్యాంగేతర శక్తి కథ....శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు రాజ్యాంగేతర శక్తికి ఆధ్యులురేషన్ కార్డు మీద ఇంటి యజమాని కాలమ్‌లో ఇంటాయన తన పేరు చూసుకుని మురిసిపోతాడు. కానీ నిజానికి ఇంటి యజమాని తాను కాదు ఆమె అనే విషయం అతనికీ తెలుసు. అంటే అధికారికంగా అధికారం ఒకరి చేతిలో ఉంటుంది, దాన్ని చలాయించేది మరొకరు అనేది మనకు రేషన్ కార్డు నుండే అనుభవంలోకి వస్తుంది. కేంద్రంలో పాలన రాష్టప్రతి పేరు మీద రాష్ట్రంలో గవర్నర్ పేరు మీద సాగుతుంది. వారిదే నిజమైన అధికారం అని వారి వద్ద పని చేసే బంట్రోతులు కూడా అనుకోరు. సోనియమ్మ విదేశాల్లో ఉంటే అంతామౌన  వ్రతం చేశారు అమ్మగారు వచ్చేంత వరకు సమస్యలు ప్రస్తావించవద్దనుకున్నారు..


ఆమె ఈ దేశానికి ప్రధాని కాదు, రాష్టప్రతి కాదు. మరి ఆమె ఏమిటీ ? అంటే ఏమీ కాదు. కానీ అన్నీ ఆమెనే ఇదే మన ప్రజాస్వామ్య విచిత్రం. మన రాజ్యాంగంలోనే రాజ్యాంగేతర శక్తికి బోలెడు అవకాశాలు కల్పించారు. నా ప్రభుత్వం అంటూ రాష్టప్రతి, గవర్నర్ ప్రసంగిస్తారు. కానీ వారి చేతిలో ఎలాంటి అధికారం ఉండదు.
ఇప్పుడు ప్రధానమంత్రి పోస్ట్ కూడా డమీ అయిపోయింది.

 ఆ మధ్య ఒక పోటీలో ఒక్కో దేశంవాళ్లు తాము కనిపెట్టిన వాటి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారట! రిమోట్‌తో నడిచే టీవి, విమానం కనిపెట్టామని చెప్పుకుంటు పోతుంటే మన దేశీయుడు లేచి మీదేం గొప్ప మేం రిమోట్‌తో నడిచే ప్రధానమంత్రిని ఆవిష్కరించామని చెప్పగానే మన వానే్న విజేతగా ప్రకటించారట!
పాండవ వనవాసంలో ఎస్వీ రంగారావు బానిస కొక బానిస కొక బానిస ఏ బానిస అని తిట్టినట్టుగా ఉంది మన ప్రజాస్వామ్యం సైతం. 1924లో మహాత్మాగాంధీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత ఎప్పుడూ ఆయన ఎలాంటి పదవి తీసుకోలేదు. కానీ స్వాతంత్య్రంకోసం పోరాటాన్ని, కాంగ్రెస్‌ను నడిపింది ఆయనే. చేసింది మంచి పనే కాబట్టి ఆ సంగతి వదిలేద్దాం. రాజ్యాంగం ప్రకారం అధికారం ఒకరి చేతిలో ఉండడం అధికారం చలాయించేది మరొకరు కావడం మనకు అనాది కాలం నుండి ఉన్న సంప్రదామే.

 దేవేంద్రుడే పెద్ద డమ్మి ప్రభువు కదా! శక్తివంతులైన త్రిమూర్తులే కాదు, చిన్నా చితక దేవుళ్లు కూడా దేవేంద్రున్ని పెద్దగా పట్టించుకున్న దాఖలా కనిపించదు. పాలించే పని ఎలాగూ లేదని ఆయన షోకిల్లా రాయుడిలా తిరగడంపైనే దృష్టి సారించి కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఆయనకు పాలించే అవకాశమే దక్కనప్పుడు పాలనలో ఇబ్బందులు ఎక్కడుంటాయి.

 శ్రీరాముడుపితృవాక్య పాలకునిగా కన్నా పినతల్లి కైక వాక్య పరిపాలకునిగానే ఎక్కువ కనిపిస్తున్నారు. నిజంగా దశరథుని చేతిలో అధికారం ఉంటే ఆయన శ్రీరాముడిని అడవులకు పంపేవారా? పాలన దశరథుని పేరుతో సాగినా పగ్గాలన్నీ కైక చేతిలోనే ఉండేవని అధికారమంతా ఆమెదేనని అర్ధం కావడం లేదా? మహాభారతంలో అడుగడుగునా రాజ్యాంగేతర శక్తులే కనిపిస్తాయి. విరాట రాజు డమీ రాజు , అసలైన అధికారం కీచకుడిదే! మీ రాజు ఉట్టి డమీ అసలైన అధికారం నాదే అని కీచకుడు సైరంధ్రికి చెబుతాడు. ఔను నిజమే అతను చెప్పినట్టు విను అంటుంది మిసెస్ విరాట రాజు.

 యుద్ధాన్ని నడిపిన శ్రీకృష్ణుడే అతి పెద్ద రాజ్యాంగేతర శక్తి కదా! పాండవులు, కౌరవుల మధ్య అది భూమి తగాదా? దాంతో శ్రీకృష్ణునికి ఎలాంటి సంబంధం లేదు, కానీ ఇద్దరి మధ్య రాయబారం నడిపి, రాయబారం విఫలమైందని, చెప్పి యుద్ధం చేయించింది ఆయనే కదా! పాండవుల సంగతి పక్కన పెడదాం, కౌరవుల్లోనై నిజమైన అధికారం ఎవరి చేతిలో ఉందే వారే అధికారం చలాయించారా? అంటే అదీ లేదు. మొన్న కౌన్ బనేగా కరోడ్ పతిలో భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు వంటి కొన్ని పేర్లు చెప్పి వీరిలో కౌరవ సైన్యానికి నాయకత్వం వహించని వారు ఎవరు ?అని ప్రశ్నించారు. చెబితే పాతిక లక్షలొస్తాయి. రామాయణ, భారతాల గురించి తెలియని భారతీయుడుంటారా? ఉన్నారు సమాధానం చెప్పలేక పోయారు. ఎందుకంటే కౌరవ పక్షం మొత్తం దుర్యోధనుడి పేరుతోనే గుర్తింపు పొందింది కానీ అతనెప్పుడు సైన్యానికి నాయకత్వం వహించలేదు. అంటే రాజ్యాంగేతర శక్తి అన్న మాట!
 ధృతరాష్ట్రుడు రాజైనా అతను మన్‌మోహన్‌సింగ్ లాంటి వాడన్నమాట! చుట్టూ ఎన్ని కుంభకోణాలు జరిగినా, ఏం జరిగినా సర్దార్‌జీ మంచి బాలుడు అన్నట్టు అవేమీ పట్టకుండా సోనియాజీ మాట జవదాటకుండా ఉంటారు. అందుకే రాజైనా ధృతరాష్ట్రుడి మాట ఎవరూ వినరు, పట్టించుకోరు. పక్కన వింజామరలు ఊపే సిబ్బంది తప్ప ఎక్కడా ఎవరూ ఆయన మాట విన్నట్టు కనిపించలేదు మనకు.

 అధికారంలో ఉన్నవారి వద్ద రాజ్యాంగేతర శక్తులు కనిపిస్తుంటాయి కానీ ఘనత వహించిన మన బాబుగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు. ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు ఆయన తరఫున పార్టీలో అసలైన అధికారం చలాయించి, కొత్త రికార్డు సృష్టించారు. అధికారంలో ఉన్నప్పుడు వెన్నుముక లేని వింత జీవులను తయారు చేసి తనకు రాజ్యాంగేతర శక్తుల సమస్య లేకుండా చేసుకున్నారు.
చేయి ఖాళీ లేదు వెళ్లిపోమని బిక్షగాడికి చెప్పడానికి కోడలుకున్న అధికారం ఏమిటి? ‘‘ఇటు రా’’, అని పిలిచి వాడు వచ్చాక ‘‘ఆధికారికంగా నేను చెబుతున్నాను, చేయి ఖాళీ లేదు ’’అందట పూర్వపు అత్త. ఇప్పుడు అధికార కేంద్రం మారింది. ఇప్పుడు అత్తగారా ధైర్యం చేయడం లేదు. కోడలే ఆ మాట చెబుతోంది. ఆయన డమీ ఆమెదే అసలైన అధికారం. ఇది ఇంటింటి రాజ్యాంగేతర శక్తి కథ.

5 కామెంట్‌లు:

 1. మా ఆవిడ ని రాజ్యాంగేతర శక్తి అనడం ఖండిస్తున్నాను అధ్యక్షా. రాజ్యాంగమే ఆవిడ.

  రిప్లయితొలగించు
 2. రిమోట్‌తో నడిచే టీవి, విమానం కనిపెట్టామని చెప్పుకుంటు పోతుంటే మన దేశీయుడు లేచి మీదేం గొప్ప మేం రిమోట్‌తో నడిచే ప్రధానమంత్రిని ఆవిష్కరించామని చెప్పగానే మన వానే్న విజేతగా ప్రకటించారట!

  ఈ వ్యాఖ్య అదిరింది.

  రిప్లయితొలగించు
 3. మీకు బొత్తిగా భయం లేకుండా పోయింది ....ఉండండి మా గంగా భవాని అక్కని పిల్చుకొస్తా .
  పైగా మీరు కోడళ్ళని కూడా అన్నారు. నో....నేనస్సలు ఒప్పుకోను

  రిప్లయితొలగించు
 4. హహ్హహ్హ .. అట్టా నిజ్జాలు చెప్తే ఎట్టా సార్వాడు. యే అత్తో కోడలో చీపురట్టుకోరూ?? కేకపుట్టించారు మొత్తానికి.

  రిప్లయితొలగించు
 5. చాలా బావుంది. దుర్యోధనుడు సేనకి నాయకుడు కాకపోవడమే కాదు. రారాజు అని పిలిపించుకోవడమే గాని, అసలు రాజు ధృతరాష్ట్రుడు కదా. అందుకని వాళ్ళింటో కూడా దుర్యోధనుడు రాజ్యాంగేతర శక్తే!

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం