5, అక్టోబర్ 2011, బుధవారం

సామంత ‘కిరణం’!

ఉద్యోగులంతా ఒక చోట చేరి కబుర్లుచెప్పుకుంటున్నారు. ఎప్పటిప్పుడు రహస్యంగా సమాచారం తెలుసుకోవడమే కాకుండా అంత కన్నా రహస్యంగా పైకి నివేదిక పంపడంలో నిష్ణాతుడైన సామంతరాజు కిరణుడు గోడ వెనక్కి చేరి వారి మాటలు వినసాగాడు. రాష్ట్రాన్ని చూస్తుంటే చిన్నప్పుడు చదివిన కథోటి గుర్తుకొస్తుందిరా! అని ఒక ఉద్యోగి నవ్వాడు.


 ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకొకడు ఏదో అడిగాడని రాష్ట్రం తగలబడి పోతుంతే నీకు కథలు గుర్తుకొస్తున్నాయా? అని మిగిలిన వారు విసుక్కున్నారు. కథకూడా అలాంటిదేలేరా! అనండంతో అంతా ఆసక్తిగా ముందుకొచ్చారు.

వెనకటికో రాజుగారు యుద్ధాలకు వెళ్లాడు. అప్పుడు సెల్‌ఫోన్ల వంటి సమాచారం లేదు కాబట్టి మన రాజుగారు భారీ సైన్యంతో యుద్ధానికి వెళ్లాక తన రాజ్యంలో పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కష్టం. కొంత కాలానికి వార్తాహరుడు వచ్చి మహారాజా మీరెంతో ప్రేమించే మీ ముద్దుల గుర్రం కాలు విరిగింది అని చెప్పాడు.


 రాజు గారి ఆవేదనకు అంతు లేకుండా పోయింది. బాధను తట్టుకోలేక పోయారు. కొద్ది సేపటి తరువాత స్థిమిత పడి ఇంతకూ కాలు ఎలా విరిగింది అని అడిగాడు. మరి మన రాజభవనం కూలిపోయి దానిపై పడితే కాలు విరగదా? అని వార్తా హారుడు మెల్లగా చెప్పాడు, రాజుకు తల గిర్రున తిరిగినట్టు అనిపించింది. తేరుకుని రాజభవనం కూలిపోయిందా? అన్నాడు. మరి శత్రురాజులు దాడి చేసి ఫిరంగులతో పేలిస్తే రాజభవనం కూలిపోదా? అని చెప్పుకొచ్చాడు. శత్రురాజులు దాడి చేశారా? అని తేరుకోకముందే మరి వారు దాడి చేసి మీ కుటుంబాన్ని అదుపులో తీసుకుని ఫిరంగులతో రాజభవనం పేలిస్తే.... అంటూ ఒక దాని తరువాత ఒకటి చెప్పుకు పోసాగాడు.


 శత్రురాజు దాడి చేసి మీ రాజ్యాన్ని సర్వనాశనం చేసి మీ కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారని అన్ని విషయాలు ఒకేసారి చెబితే రాజుగారు తట్టుకుంటారా? గుండాగిపోదా? ఒక దాని తరువాత ఒకటి చెప్పడంతో రాజుగారు గుండెదిటవు చేసుకుని వినగలిగారు అని ఉద్యోగి కథ ముగించాడు. మన రాజు కూడా అమ్మగారికి ఇలానే సమాచారం పంపుతున్నట్టున్నాడు అని అంతా నవ్వారు.

****
కథ విన్న సామంత రాజు కిరణుడికి ఐడియా వచ్చింది. ఇంత శక్తిసామర్ధ్యాలు తన సేవలు జాతికి అవసరమనుకుని అమ్మకు ఉత్తరం రాయడం మొదలు పెట్టాడు....


 ‘‘అమ్మా మీ ప్రియపుత్రుడు కిరణుడు పంపిస్తున్న రహస్య లేఖ.. ఇక్కడ రాష్ట్ర ప్రజలు మినహా నేను సుఖంగా ఉన్నాను, అక్కడ మీరు కూడా సుఖంగా ఉన్నారని భావిస్తున్నాను. నెల నెలా నేను పంపిస్తున్న నివేదికల ద్వారా మా రాష్ట్రం ఎంత అద్భుతంగా ఉందో మీకు ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉన్నాను. ఆరేడువందల మంది యువకులు తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకోవడం, విద్యుత్ లేక పంటలు పండక కొందరు రైతులు ఆత్మహత్య చేసుకోవడం వంటి స్వల్ప సంఘటనలు మినహా రాష్ట్రం అద్భుత ప్రగతి పథంలో పయనిస్తోంది. 


ప్రభుత్వం అనేది లేదు అనిపించడమే అద్భుతమైన పాలనకు చిహ్నం అని, చట్టాలు ఎంత తక్కువగా ఉంటే పాలన అంత బాగున్నట్టు అని పాశ్చాత్య రాజనీతిజ్ఞులు చెప్పారు. 


అమ్మా కావాలంటే ఇప్పుడు మీరు రాష్ట్రంలో పర్యటించండి ప్రభుత్వం అనేది ఉందని ఒక్కరన్నా చెబుతారేమో చూడండి. ప్రభుత్వమే లేనప్పుడు చట్టాలు ఎక్కడుంటాయి.? మంత్రులు ప్రభుత్వం సంగతి తేలుస్తామంటున్నారు, నేను మంత్రుల సంగతి తేలుస్తానంటున్నాను. ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. ప్రభుత్వం ఉంటే కదా పడగొట్టడానికి...


 టిబెటియన్ల గురువు దలైలామా చాలా రోజుల నుండి ప్రవాస ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అప్పుడెప్పుడో సుభాష్ చంద్రబోస్ ప్రవాస భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడట! నేను వీరందరి కన్నా ఒక అడుగు ముందుకేసి అసలు కనిపించని ప్రభుత్వాన్ని చక్కగా నడిపిస్తున్నాను. నేను పంపిన నివేదిలతోనే నాకు పదవి వచ్చిందని తెలిసి గిట్టని వారు నాపై తప్పుడు నివేదికలు పంపిస్తారు వాటిని అస్సలు నమ్మకు తల్లి. నా అంతటి వాన్ని నేనే , మరొకరు లేరు.


 ఎన్టీఆర్‌కు, వైఎస్‌ఆర్‌కు సైతం సాధ్యం కాని ఎన్నో అద్భుతాలు నేను సాధించాను. అసలు నేను ముఖ్యమంత్రిగా ఉండడానికి మించిన విచిత్రం ఏముంటుంది?? వైఎస్‌ఆర్ జగన్ అభిమానులమంటూ 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మిగిలిన వారు తెలంగాణ కోసమంటూ రాజీనామా చేశారు. వారందరి రాజీనామాలు ఆమోదిస్తే , ప్రధాన ప్రతిపక్షం బలం కన్నా మనది తక్కువ. ప్రధాన ప్రతిపక్ష ప్రాయోజిత ప్రభుత్వాన్ని నడిపిన ఘనత నాదే తల్లీ! దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టు అని ప్రతిపక్షాన్ని మనం సవాల్ చేసే స్థితిలో ఉన్నాం. అప్పుడెప్పుడో పార్టీ మార్పిడి నిరోధక చట్టం లేనప్పుడు హర్యానాలో బన్సిలాల్ నేనొక్కడిని గెలిస్తే చాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానన్నాడని గొప్పగా చెప్పుకుంటారు.


 నేను అంత కన్నా గొప్పవాన్ని నాకు నేనే సొంతంగా గెలువలేను, సిఎమ్‌గా సొంత జిల్లాకు వెళితే ఒక్క ఎమ్మెల్యే రాలేదు అయినా నాకు ఎదురు లేదు. ఎన్టీఆర్ ఎంత గ్లామర్ ఉన్న నాయకుడైనా ప్రతిపక్షాల చేతిలో ఇబ్బందులు తప్పలేదు, వైఎస్‌ఆర్ ఎంత చరిష్మా ఉన్న నాయకుడైనా మీడియా చేతిలో ఇబ్బంది తప్పలేదు, కానీ నేను మాత్రం అటు ప్రతిపక్షం నుండి, ప్రతిపక్ష మీడియా నుండి సైతం మద్దతు సాధించాను ఇంత కన్నా శక్తివంతుడెవరుంటారు తల్లీ! ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానంటే, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయగలి శక్తిసామర్ధ్యాలు నాకున్నాయని తేలిపోయింది. మీరు సరే అంటే ఈరోజు నుండి మన మోహన్‌సింగ్ ప్రభుత్వంపై రోజూ నివేదికలు పంపగలను. రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించిన నాకు దేశాన్ని కూడా అంతే అద్భుతంగా పాలించాలని ఉంది....’’
అం టూ ఉత్తరం ముగించి సామంత రాజు కిరణుడు అమ్మ నుండి సమాధానం కోసం ఎదురు చూడసాగాడు.


 మనమూ ఎదురు చూద్దాం....ఈ దేశ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉండబోతుందో!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం