12, అక్టోబర్ 2011, బుధవారం

హే కృష్ణా!.. జై తెలంగాణ.. జై సమైక్యాంధ్ర....జైతెలుగు నాయుడు‘‘మరేటి సేద్దామంటావ్!’’ అని ఒకరంటే ‘‘నేనేటి సెప్తా’’ అంటూ మరో నాయకుడు అంతే అసహనంగా బదులిచ్చాడు.
పూర్వకాలం నాటి జమీందారు బంగ్లాలా, కార్పొరేట్ కంపెనీ ఆఫీసులా ఉన్న ఆ భవనం చుట్టూ చేరి చాలా మంది నాయకులు గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. అపరిచితుడు వీరి మాటలకు అడ్డుతగులుతూ ‘‘తెలుగు భవనం ఇదేనా? బోర్డు కూడా లేదిమిటి?’’ అని ఆశ్చర్య పోయాడు. ‘‘ తటస్థ భాషలో ఉంది మీకు కనిపించదు.

 మాది ప్రాంతీయ పార్టీ. చూపు జాతీయం, ఆలోచన అంతర్జాతీయం. ఇంగ్లిష్‌లో బోర్డు పెడితే తెలుగు, ఉర్దూ, హిందీ భాషల వారికి దూరమవుతాం, సరే తెలుగులో పేరు పెడితే ఏ ప్రాంత మాండలికంలో పెట్టాలి? పార్టీని పోషించేది మేం కాబట్టి మా మాండలికమే కావాలని కోస్తా వాళ్లంటారు, తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ మాండలికంలో పెట్టమని ఈ ప్రాంతం వారంటారు, మేం రాజధానిని త్యాగం చేశాం కనీసం బోర్డుమీద మా మాండలికంలో పేరు పెట్టొచ్చు కదా అని రాయలసీమ వాళ్లంటారు. మేమేమన్నా రాష్ట్రం అడుగుతున్నామా? మా ఉత్తరాంధ్ర మాండలికం అంటే మీకంతా చిన్నచూపా? అని ఇజీనగరం వాళ్లు వాదించేశారు. అందుకే అందరి కోసం తటస్థ భాషలో పెట్టారు’’ అని తెలుగునేత చెప్పుకొచ్చాడు.

‘‘మీరేమీ అనుకోనంటే చిన్న సహాయం’’ కోస్తా నాయకులు చాలా మర్యాదతో తెలంగాణ నాయకులను అడిగారు. తాము కూర్చున్న కుర్చీలను అడుగుతున్నారేమో అనుకుని తెలంగాణ నాయకులు లేచి నిలబడ్డారు. ‘‘మేం గొడారికెళ్లాలి?’’ అన్నారు. ‘‘అడవులకెళ్లాల్సిన ఖర్మ మనకెందుకండీ ఈ సారి మన పార్టీ గెలుస్తుంది మీరు భయపడకండి’’ అంటూ తెలంగాణ నేత ధైర్యం చెప్పబోయాడు. ‘‘ఎడారి కాదండీ, గొడారి అంటే గోదావరి ట్రైన్ కన్న మాట. టైం అవుతోంది. అధినేతతో మీ సమయంలో మేం మాట్లాడతాం, మా సమయం మీరు తీసుకోండి’’ అని కోరాడు.
అగ్నిగుండం అవుతుంది, తలలు తెగుతాయి.. అంటూ కృష్ణా జిల్లా యువనేత బట్టీ పడుతున్నాడు. వెరీగుడ్ బాగా మాట్లాడుతున్నావ్ అని  తెలుగు నాయుడు అతని భుజం తట్టి అభినందించాడు. గుంటూరు సీనియర్ నేత తెలుగునాయుడి చెవి దగ్గరకు తన నోటిని పంపించి సార్ ఆ డైలాగులు మనోడి సొంతం కావు, ఆ తెలంగాణ పార్టీ నాయకుడు ఎప్పుడో వాడేసిన డైలాగులను ఇప్పుడే మా ముందే బట్టీ పట్టి చెబుతున్నాడని అన్నాడు.

 ‘‘మీ ప్రాంతంలో అస్సలు ఉద్యమం లేకుండా అంతా ప్రశాంతంగా ఉంటే పార్టీ మనుగడ ఎలా ఉంటుంది’’ అని తెలుగునాయుడు ఉత్తరాంధ్ర నాయకులను నిలదీశాడు. మేం ఎంత చెప్పినా మా ప్రాంతంలో సమైక్య ఉద్యమం సాగడం లేదు సార్! పోనీ ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం నడపమంటారా? అని భారీ నాయుడు అడిగాడు.
 ఆయన వైపు అనుమానంగా చూస్తూ ‘‘ఏంటీ నాయుడు గారు బాగానే సంపాదించినట్టున్నారు, ముఖ్యమంత్రిని అయిపోదామనుకుంటున్నారా? ఇప్పటికే రెండు కళ్లంటున్నాను, మీరు ఉత్తరాంధ్ర ఉద్యమం అంటే అప్పుడు నేను మూడు కళ్ల సిద్ధాంతం చెప్పాలి’’ అంటూ వారిని పంపించి, రాయలసీమ నాయకులను పిలిచారు.

 ఫోన్‌లో ఢిల్లీలోని జాతీయ నాయకుడితో, ఏం చేయదలుచుకున్నారో మీరు నాకు ఎప్పటికప్పుడు చెప్పండి, సలహాల కోసం నా సెల్‌ఫోన్ లైన్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’’ అంటూ తెలుగునాయుడు మాట్లాడుతుండగా, నల్లగొండ నాయకుడు చిటికెన వేలు చూపుతూ లోనికి పరిగెత్తుకొచ్చాడు. మిస్టర్ పెళ్లాంలో ఆమని కోసుకుపోయిన తన చిటికెన వేలివైపు రాజేంద్రప్రసాద్ చూడాలని ఆశపడ్డట్టుగా ఆశగా చూశాడు. అటు చూడకుండానే కనులతోనే ఏంటన్నట్టు అధినేత ప్రశ్నించాడు. బాత్రూమ్‌కు వెళ్లాలి మీ అనుమతి అంటూ నసిగాడు. తెలంగాణ సాధన ఉద్యమం కోసం మీకు పూర్తి స్వాతంత్య్రం ఇచ్చాను కదా? ఏ క్షణంలో ఏం చేయాలో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నా కదా? బాత్రూమ్‌కు వెళ్లాలంటే మీ కన్వీనర్ అనుమతితో వెళ్మొచ్చు కదా? అని కోపంగా పంపించేశాడు.
* * *
ఇక్కడ ఇలా ఉంటే అక్కడ ఇటలీ భవన్‌లో ...
* * *
సత్తిబాబు ఫ్యాక్స్ దగ్గరే తిష్టవేసి హై కమాండ్‌కు ఎప్పటికప్పుడు సమాచారం పంపుతున్నారు. పరిస్థితులు ఇక్కడ చాలా ఘోరంగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర సత్తిబాబునో, గోదావరికి చెందిన మెగాజీవినో అర్జంట్‌గా సిఎంను చేసేయండి అది తప్ప సమస్యకు మరో పరిష్కారం లేదు అనేది ఆ ఫ్యాక్స్ సందేశాలన్నింటి సంక్షిప్త సారాంశం.
* * *
సమయం ఎక్కువగా లేకపోవడంతో అన్ని ప్రాంతాల నాయకులకు ఉమ్మడిగా సందేశం ఇవ్వడానికి తెలుగునాయుడు సమావేశ మందిరానికి అందరినీ పిలిచాడు. ‘‘ప్రత్యేక రాష్ట్రం కోసం భూ కంపం సృష్టించండి.... 60 ఏళ్ల నుండి మీకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు’’ అంటూ గంట ఉపన్యసించాడు. వెంటనే సమైక్య రాష్ట్రం వల్ల రాష్ట్రం ఏ విధంగా సమగ్రాభివృద్ధి జరుగుతుందో సీమాంధ్ర నాయకులకు గణాంకాలతో సహా తెలుగు నాయుడు మరో గంట వివరించాడు. వెళ్లండి మీమీ ప్రాంతాల్లో మహోద్యమాన్ని నిర్వహించండి.. అని బోధించి పంపాడు. అక్కడ జై తెలంగాణ జై సమైక్యాంధ్ర నినాదాలు మిన్నుముట్టాయి.
* * *
కోస్తా నేతలు పరిగెత్తుకొచ్చి కార్యాలయ ఇన్‌చార్జ్‌తో ‘‘తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకత-ఉద్యమించాల్సిన తీరు బుక్‌లెట్స్ సీమాంధ్ర వారికిచ్చారు, సమైక్య రాష్ట్రంలోనే సమగ్రాభివృద్ధి బుక్‌లెట్‌ను తెలంగాణ వారికిచ్చారు కొంప మునిగింది’’ అని వాపోయారు.
ఆ బుక్‌లెట్స్ తీసుకున్నవారంతా వెళ్లిపోయారు ఇప్పుడెలా అని కార్యాలయ బాధ్యులు తలపట్టుకున్నారు.
* * *
అపరిచితుడు అంతా రహస్యంగా విన్నాడు. తెలుగు నాయుడు తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకత, ఉద్యమం సాగించాల్సిన తీరు ఎంత అద్భుతంగా చెప్పాడో, సమైక్యాంధ్ర గురించి అంతే అద్భుతంగా చెప్పాడు. ఇలాంటి నేత నిజంగానే ప్రపంచంలోనే అరుదు అనుకున్నాడు.
‘‘ అర్జునా నీవు నిమిత్త మాత్రుడవు, చంపేదీ నేనే, చనిపోయేది నేనే, అంతా నాలోనే లీనమవుతున్నారు. తెలంగాణ ఉద్యమం చేయించేది నేనే, సమైక్యాంధ్ర ఉద్యమం చేసేది నేనే అంటూ బోధిస్తున్న అపర కృష్ణునిలా కనిపించాడు తెలుగునాయుడు అపరిచితుడికి. హే కృష్ణా మళ్లీ జన్మించావా? అని అపరిచితుడు కింద పడిపోయాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం