14, మార్చి 2012, బుధవారం

2030 లో ఓ తెలుగు కుటుంబం లో తెలుగు ..పండంటి ఇంగ్లీష్ కుటుంబం

కొడుకు ఇంగ్లీష్ నవల చదువుతున్నాడు. కూతురు ఇంగ్లీష్ సినిమా చూస్తోంది. తల్లి ముద్దాయిలా వౌనంగా ఉంది. ఇంగ్లీష్ పేపర్‌లో నుంచి తల తిప్పిన శ్రీమతి, శ్రీకాంత్‌ను చూడగానే అలగా జనం అలగా బుద్ధులు అంటూ ఇంగ్లీష్‌లో గొణగసాగింది. హాయ్ డార్లింగ్ ఏంటీ ఈరోజు శ్రీమతి గారు కోపంగా ఉన్నారు అని శ్రీకాంత్ ఇంగ్లీష్‌లోనే సరదాగా ఆడిగారు. శ్రీకాంత్ వాళ్లింట్లో అంతా ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు, అదే భాషలో ఆలోచిస్తారు. అదే గాలి పీలుస్తారు. వారి సంభాషణ తెలుగులోకి అనువాదం చేస్తే ఇలా ఉంటుంది.


శ్రీకాంత్‌కు ఆ రోజు ఎడమ కన్ను అదిరింది. ఏం కొంప మునుగుతుందో అని కంగారు పడుతూనే ఉన్నాడు. ‘‘ ఇంట్లో మీ అమ్మయినా ఉండాలి? నేనైనా ఉండాలి . ఇద్దరం ఉండే ప్రసక్తే లేదు’’ అని శ్రీమతి తేల్చి చెప్పడమే కాకుండా బట్టలు సర్దుకోసాగింది. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు మీ అమ్మ ఎంత అమాయకత్వం నటిస్తుందో చూడండి అంటూ శ్రీమతి సూట్‌కేసును కింద పడేసింది. ‘‘తప్పు చేసిన వారు భయపడాలి నాకెందుకు భయం. మీరు ననే్నమన్నా భరిస్తాను కానీ ఈ వయసులో ఇలాంటి అభాండాలు వేస్తే సహించేది లేదు’’ అని తల్లి వార్నింగ్ ఇచ్చింది. ‘‘ అబద్ధాలు చెప్పాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. నా చెవులతో నేను విన్నాను. పక్కింటావిడతో మీ అమ్మ తెలుగులో మాట్లాడుతుండగా నా చెవులతో నేను విన్నాను. సావిత్రి వదిన గారూ బాగున్నారా? అని మీ అమ్మ స్పష్టంగా తెలుగులో అడిగింది. నేను రావడం దూరం నుంచి గమనించి సంభాషణ ఇంగ్లీష్ లోకి మార్చింది. నేను విన్న పదాలను గుర్తు పెట్టుకుని ఇంటర్‌నెట్‌లో వెతికాను అవి తెలుగు పదాలు. యోగ క్షేమాలు అడగడానికి ఉపయోగించే పదాలని గూగుల్‌లో స్పష్టంగా ఉంది. నేను ఆధారాలు లేనిదే మాట్లాడను’’అని శ్రీమతి చెప్పింది. 


‘‘మన ఇంట్లో తెలుగు పదాలు వినిపించాయంటే మన బంధువుల్లో పరువుంటుందా? చెప్పండి మీ అమ్మ చేసిన తప్పు నేను చేస్తే సహించేవారా?’’ అని శ్రీమతి నిలదీసింది. శ్రీకాంత్ హడావుడిగా తలుపులు మూసేశాడు. డియర్ ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలిసిందా? అని కంగారుగా అడిగాడు. ‘‘లేదు కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది పోయే పరువు మనదే కదా? అందుకే ఎవరికీ చెప్పలేదు ’’అని శ్రీమతి చెప్పింది. ‘‘ అమ్మా నీకు వయసుతో పాటు చాదస్తం బాగా పెరిగిపోతుందే? అదేంటమ్మా నీ కేం కష్టం వచ్చిందని తెలుగులో మాట్లాడావు. నీవడిగిన ఇంగ్లీష్ సినిమాల సిడిలు, నవలలు అన్నీ తెచ్చిస్తున్నాను కదా? మళ్లీ తెలుగులో ఎందుకు మాట్లాడావు అని నిలదీశాడు. నువ్వు తెలుగులో మాట్లాడావనే మచ్చ మన కుటుంబంపై పడితే పిల్లల పెళ్లిళ్లు అవుతాయా? చెప్పమ్మా చెప్పు ’’ శ్రీకాంత్ అడిగాడు.


‘‘ప్రామిస్‌రా నేను తెలుగులో మాట్లాడడం ఏమిటిరా? పిల్లలు స్కూల్‌లో తెలుగులో మాట్లాడితే చితగ్గొట్టిన చరిత్ర నాది. కావాలంటే పాత పత్రికల్లో ఉంటుంది చూడు. నేను అంత స్ట్రిక్ట్‌గా ఉంటాననే కదా? సీనియర్లను పక్కన పెట్టి నా ప్రతిభను గుర్తించి ప్రిన్సిపల్‌ను చేశారు. ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి పోతామని చెప్పిండి, లేదా మమ్ములను పొమ్మనండి కానీ ఇలా తప్పుడు ప్రచారం చేయవద్దు అంది. బహుశా పక్కింట్లో తెలుగు పదాలు వినిపించి ఉంటాయి. అవి విని అమ్మాయి నేనే మాట్లాడానని అనుకుంటున్నదేమో’’ అని తల్లి చెప్పింది. ‘‘నానా తంటాలు పడి ఇంటర్నేషనల్ స్కూల్‌లో పిల్లాడికి సీటు సంపాదించాను. ఆ స్కూల్ వాళ్లు పిల్లల ఇంటిపై కూడా నిఘా పెడతారు. ఇంట్లో ఎవరి నోటి నుంచైనా తెలుగు పదాలు వినిపిస్తే, టిసి ఇచ్చి పంపిస్తారు’’ అని చెప్పాడు. తల్లి బోరున ఏడ్చింది
***
మిస్టర్ శ్రీకాంత్ మీ అమ్మాగారికి ఏమీ కాలేదు ఆమె అబద్ధం చెప్పడం లేదు. అంటూ డాక్టర్ రిపోర్టలన్నింటిని పరిశీలిస్తూ చెప్పాడు. కొందరికి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. అలానే మీ అమ్మకు నిద్రలో కలవరించే అలవాటుంది. ఎక్కడో మెదడు పొరల్లో మిగిలిపోయిన తెలుగు పదాలు అలా అప్పుడప్పుడు బయట పడ్డాయి. ఇప్పుడు దిగులు లేదు. కౌన్సిలింగ్ నిర్వహించాం. ఇక జన్మలో మీ అమ్మ నోటి నుంచి తెలుగు పదాలు రావు ఇది నా గ్యారంటీ’’ అని డాక్టర్ ధీమాగా చెప్పారు. ‘‘మా కుటుంబాన్ని రక్షించారు. జీవితంలో మీ మేలు మరువలేను’’ అని శ్రీకాంత్ గద్గద స్వరంతో డాక్టర్‌కు కృతజ్ఞతలు చెప్పారు.
***
శ్రీకాంత్ భయంగా లేచి కూర్చున్నాడు. సెలవు రోజు కావడంతో మధ్యాహ్నం కునుకు తీశాడు. భయంగా క్యాలండర్ వైపు చూశాడు 2012 అని ఉంది. అమ్మయ్య ఇది 2030 కాదు కదా అని చేతిలో ఉన్న పత్రికను భయం భయంగానే చూశాడు. తెలుగులో మాట్లాడినందుకు విద్యార్థినిని చితగ్గొట్టిన టీచర్ అనే వార్తను మళ్లీ చదివాడు. ఆ వార్తను చదువుతూ అలానే నిద్రలోకి జారుకున్న శ్రీకాంత్‌కు ఆ కల చమటలు పుట్టించింది. ఆ కల నిజమవుతుందా? కాదా? పాలకుల దయ మన ప్రాప్తం


ముక్తాయింపు: తెలుగు భాష కనిపించకుండా చేస్తున్న తొలి భాషా ప్రయుక్త రాష్ట్ర పాలకులకు, భాష పేరుమీదనే పార్టీని ఏర్పాటు చేసినా వారి వెబ్‌సైట్‌లో సైతం తెలుగు కనిపించకుండా జాగ్రత్తపడుతున్న పార్టీకి కృతజ్ఞతలతో .. 

43 కామెంట్‌లు:

  1. FYI, తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కాదు, ఒరిస్సా (1936లో ఏర్పడింది). ఒరిస్సాలో కొన్ని ప్రాంతాలలో తెలుగు బాగానే మాట్లాడుతారు. కానీ మన రాష్ట్రంలో ఇంగ్లిష్ పదాలు కలపకుండా తెలుగు మాట్లాడితే సంస్కృతం మాట్లాడుతున్నాడు అని అంటారు. తెలుగు ద్రవిడ భాష. ఈ భాషలో సంస్కృత పదాలు తక్కువ అని వాళ్ళకి తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనకి స్వాతంత్రం ఇరవై ఏడు లో వచ్చిందా నాన్న ?


      చీర్స్
      జిలేబి.

      తొలగించండి
    2. ప్రవీణ్ గారు నేను తెలుగు బాషా గురించి బాధతో రాశాను తప్ప తొలి భాష ప్రయుక్త రాష్ట్రం ఏది అని కాదు. మీరన్నట్టు ఒరిస్సా కావచ్చు అయితే అంతా కన్నా కొన్ని వందల సంవత్సరాల ముందుకు వెళితే ఒక్కో జిల్లా ఒక రాజ్యమే కదండీ అంటే వాటిని మనం భాష ప్రయుక్త రాజ్యాలు అనొచ్చు నేమో . నేను రాజ్యాంగాన్ని చదవలేదు కానీ నాకు తెలిసినంత వరకు రాజ్యాంగం లో భాష ప్రయుక్త రాష్ట్రం అని ఉండదు మన సౌలబ్యం కోసం రాష్ట్రాల విభజన సమయం లో బాషను ప్రాతిపదికగా తీసుకున్నారు .

      తొలగించండి
  2. hey man... what are you talking. shall we have to wait till 2030 to wipe out telugu from all the households. too bad. i hope banning usage of telugu would be a poll promise in 2014 elections.

    జాతి ఖర్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @*శ్రీనివాస్ గారు ధన్యవాదాలు
      @పురాణపండ ఫణి గారు మీరు అన్నట్టు ౨౦౧౪లొ ఆలాంటి హామీ కూడా ఇస్తారేమో. ఒక రాజకీయ పార్టీ వాళ్ళు కొత్తగా తెలుగు పరిరక్షణ సమితి అని ఓ విభాగం పెట్టారు. ఆ పార్టీ నాయకుడు , మాజీ ముఖ్యమంత్రి తెలుగు భాష ప్రియులు ఇందిరాపార్క్ వద్ద దీక్ష జరుపుతుంటే వెళ్లి ఉపాది కోసం ఇంగ్లిష్ నేర్చుకోండి . మీకోసం తెలుగు నేర్చుకోండి అని చెప్పారు ఆయన ఉపన్యసించింది తెలుగు కోసమో, ఇంగ్లిష్ కోసమో నాకు

      తొలగించండి
  3. చెవిటి వాడి చెవిలో శంఖం ఊదినట్లు.. మురళీ గారు.

    బ్లాగుల్లో మనం నోరే నోరు కొట్టుకోవడమే కానీ.. మనం కాస్త బయటకి వెళ్లి చెపితే..మానని పిచ్చివాళ్ళని చూసినట్లు చూస్తారు. మీరు చెప్పిన కల కథ నిజం అవుతుంది కూడా.

    రిప్లయితొలగించండి
  4. మీరు సెటైర్ భలే వేస్తారు! అమ్మో మీరు చెప్పినది ఊహకే భయంకరంగా ఉంది!

    రిప్లయితొలగించండి
  5. ఇండియాలో కన్నా బయట దేశాల్లో తెలుగు చక్కగా మాట్లాడుకునే వారు ఎక్కువగా ఉంటారు రాబోయే కాలంలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @ వనజవనమాలి గారు
      తమిళ నాడు తరహాలో రెండు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోరు ఉంటే రాజకీయ నాయకుల దృష్టి పడి తెలుగు నిలువ వచ్చండి
      @కృష్ణ ప్రియ గారు నా బాధ కూడా అదేనండి
      @రసజ్ఞ గారు సెటైర్ నచ్చినందుకు థాంక్స్ .. భాష మీద సెటైర్ మాత్రం బాధతో రాసిందే నండి
      @జలతారువెన్నెల garu నాకు మాత్రం ఆ ఆశ లేదండి ఇక్కడ తెలుగు బతికితేనే విదేశాల్లో ఉంటుంది

      తొలగించండి
  6. సామెతలు కూడా మారిపోతాయి. చెవిటివాని ముందు శంఖం ఊదడం అనే సామెత పోయి Blowing conch in front of deaf person అనే సామెత వస్తుంది.

    రిప్లయితొలగించండి
  7. haaahaaa..nice post,sorry, I already forgot telgu, u know this key board also promotes only English..who cares to search for telgu fonts??? sorry man...
    vasantham..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంతం గారు చదువు పెరిగితే తెలుగు మరిచిపోతున్నారండి .ఏం చేస్తాం

      తొలగించండి
  8. చాలా బాగా కల కన్నారండీ ! ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అప్పుడు ఆంగ్ల మాధ్యములో ఆంధ్ర రాష్ట్రావతరణము గురించి, ఉగాది పచ్చడి గురించి మాట్లాడును !!

    తెలుగు వీర లేవరా
    దీక్ష బూని సాగరా
    అంగ్రేజీ మాత 'స్వేచ్చ' కోరి తెలుగు వదలి బెట్టరా !!

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు తెలుగు వీర లేవరా అని పాడితే మేము ఇంతమందిమి ఇక్కడుండగా తెలుగు వీర లేవరా అని విదేశియున్ని పిలుస్తారా అని గొడవ పడతారేమో నండి

      తొలగించండి
  9. సరదాగా వ్రాసిన మీ టపాలో ఇలా వ్యాఖ్యారూపంగా గంభీర కంఠస్వరాన్ని చొప్పించడం అసందర్భమైతే మన్నించండి.

    బహుకోట్లాది సంభాషకులు గల తెలుగులాంటి భాషలు హఠాత్తుగా మరణించడం జఱగదు గానీ రాజకీయ అణచివేత ఫలితంగా బాగా రూపుమారిపోయే అవకాశం మాత్రం ఉంది. గతానుభవాల్ని బట్టి - ఒక భాష హఠాత్తుగా మరణించాలంటే-

    ౧. ఆ భాషేయులంతా (కనీసం 95 శాతం మంది) నిరక్షరాస్యులై ఉండాలి అదే సమయంలో వారి నెత్తిమీద ఒక పరాయిప్రభుత్వం కొన్ని వందల సంవత్సరాల పాటు అధికారం చెలాయించి వారి నెత్తిమీద తన భాషని రుద్దాలి.

    ౨. అదే సమయంలో ఆ భాషవారంతా (కనీసం 80 శాతం మంది) మతం మార్చుకోవాలి.

    ౩. యుద్ధాల మూలాన గానీ, కఱువుల మూలాన గానీ, భయంకరమైన అంటువ్యాధుల మూలాన గానీ, భూకంపాల్లాంటి ప్రకృతివైపరీత్యాల వల్ల గానీ ఆ జాతిలో కనీసం 9౦ శాతం మంది చనిపోయి ఉండాలి.

    ౪. ఆ భాష మాట్లాడే ప్రదేశానికి వేఱే భాషలవారు భారీగా వలసొచ్చేసి అక్కడి జనాభాలో కనీసం 4౦ శాతంగా మారాలి. ఈ పరిస్థితులేవీ తెలుగుభాషకి ప్రస్తుతం వర్తించవు గనుక తెలుగు అంతరించడం ఒక ఊహాగానమే తప్ప వాస్తవం కాదు. ఇది ప్రపంచంలో అనేక పెద్దజాతుల్లో ఒకటి (First 15 లో ఉన్నాం) అని మర్చిపోకూడదు.

    నా అభిప్రాయంలో - రాబోయే యుగానికి సంస్కృతం స్థానంలో తెలుగే హిందువులకి పవిత్ర, మతభాష కాబోతున్నది. అలాగే ఇతరదేశాల్లో కూడా వ్యాపించబోతున్నది. అప్పుడు తెలుగుదేశం కాదు, ఏకంగా తెలుగుదేశాలే ఉంటాయి. The humble will inherit the Earth.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు అసందర్భం ఎందుకండి . చర్చ జరిగితేనే కదా నాలుగు విషయాలు తెలిసేది. మీరు చెప్పిన సూత్రాలు నిజమే కావచ్చు కానీ అన్ని సూత్రాలు అన్ని సందర్భాల్లో ఒకేలా పని చేయవు . ఉదాహరణకు 95 శాతం నిరక్ష రాస్స్యులు ఉంటే బాషా కనుమరుగు అవుతుందని అన్నారు. నా అభిప్రాయం ప్రకారం 95 శాతం నిరక్ష రాస్స్యులు ఉంటే తెలుగు అద్భుతంగా నిలుస్తుంది. ఇప్పుడు తెలుగు బతుకుతున్నది . నిరక్ష రాస్స్యుల దయ వల్లనే . అంతా ఉన్నత చదువులు చదివినా వారే అయి ఉంటే తెలుగు కనిపించక పోవడమే కాదు వినిపించక పోయేది కూడా
      ఇక మతం మారితే అన్నారు కొన్ని చోట్ల ఇది నిజం కావచ్చు
      ఇండియా, పాకిస్తాన్ , బంగ్లా దేశ్ లలో ఉన్న ముస్లిం లు ఎప్పుడో మతం మరీ ఇస్లాం లోకి వెళ్ళిన వారే కదా . బంగ్లా దేశ్ లో అంతా ముస్లిం లే అయినా అక్కడ బెంగాలి నిలిచింది. పైగా బాష కోసమే వాళ్ళు పాకిస్తాన్ తో విభేదించి బంగ్లాదేశ్ సాధించుకున్నారు .
      రాహుల్ సంక్రుత్యాన్ గారు రాసిన చరిత్ర బుక్ ఒకటి చదివాను అందులో ఆయన ప్రతి వంద సంవత్సరాలకు ఒక పేరాగా రెండు వేల సంవత్సరాల్లో మతం , రాజ భాష , ప్రజల భాష , వేష భాషలు, తిండి తడి తర అంశాలను రాశారు. గడచినా రెండు వేల సంవత్సరాలుగా ప్రజల భాష వేరు, పాలకుల బాష వేరు .. అయినా ప్రజల బాష బతికే ఉంది అది ఎలా సాధ్య మయిందంటే . గతం లో ప్రజలకు , పాలకులకు పెద్దగా సంబంధం లేదు . రాజు ఏ బాషలో పాలిస్తే ప్రజలకేమిటి ? ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం , కుల వృత్తులు . వీటికి రాజుతో సంబంధం లేదు కాబట్టి బాష బతికింది . ఇప్పుడు వ్యవసాయం ప్రధాన వృత్తి కాదండీ . ఉద్యోగం కావాలంటే ఇంగ్లిష్ నేర్చుకోవాలి , పాలనతో సంబంధం ఉండాలంటే ఇంగీష్ కావాలి . అందుకే గడచినా రెండు వేల ఏళ్ళలో జన భాషకు లేని ప్రమాదం ఇప్పుడు వచ్చింది

      తొలగించండి
  10. బాగు బాగు. Blowing conch in front of deaf person!! అప్పుడు కూడా వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే తెలుగులో ఆలోచిస్తేనే ఇలా ఆంగ్లభాషలోకి తర్జుమా అవుతుంది. తెలుగులో ఆలోచించడమే మానేసినప్పుడు దానికి సరిపోయే ఆంగ్ల సామెతే వస్తుంది కాని ఇదెందుకు వస్తుంది.

    రిప్లయితొలగించండి
  11. బాగు బాగు. కాని సామెత మాత్రం అది అవ్వదు. ఎందుకంటే ఆలోచించడమే ఇంగ్లీషులో చేస్తారు కనుక పై తెలుగు సామెత కాక ఇంగ్లీషు సామెతే వస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేణుగోపాల్ గారు వాళ్ళు ఇంగ్లిష్ లోనే ఆలోచించి ఇంగ్లిష్ సామేతనే చెప్పారు . కలలో అప్పటికప్పుడే అనువాదం చేసుకున్నారు కాబట్టి తెలుగు సామెతనే వచ్చింది

      తొలగించండి
  12. ఇంతకుముందు వ్రాసిన వ్యాఖ్యలో అక్షరదోషాలు పడ్డాయి. దాని బదులు దీన్ని ప్రచురించవలసిందిగా మనవి.

    పైన వ్రాసిన మునువలయికలని (pre-requisites) కాస్త విస్తరించి చెబుతాను.

    ౧. ప్రజలంతా నిరక్షరాస్యులైతే భాష అంతరిస్తుందని నేను వ్రాయలేదు. వాళ్ళలా ఉన్నప్పుడు వాళ్ళల్లో ఒక సాహితీపరమైన శూన్యం నెలకొంటుంది. అదే సమయంలో ఏదైనా పరాయిభాషలవారి ప్రభుత్వం ఆ శూన్యాన్ని, తన భాషని చొప్పించడం కోసం ఉపయోగించుకోవచ్చు. అది ఆ నిరక్షరాస్యుల భాష అంతరించడానికి దారితీయొచ్చు. ఇది రెడ్ ఇండియన్ల విషయంలో అమెరికాఖండాలలో జఱిగింది.

    ౨. మతాలకి ఉపాసనాపద్ధతులే కాక ప్రభుత్వాలకున్నట్లు ఆధికారిక భాషలు కూడా ఉంటాయి. ఉదాహరణకి - హిందూమతానికి సంస్కృతం, క్రైస్తవానికి లాటినూ, ఇస్లాముకి అరబ్బీ మొ||వి. మీరు ఉదాహరించిన బాంగ్లాదేశ్ మతాంతరీకరణ ఉదంతం చాలా ఇటీవలిది. అంటే ఆ దేశం కేవలం 300 ఏళ్ళ క్రితం ఇస్లాములోకి పరివర్తన చెందింది. అప్పటికే బంగభాష అభివృద్ధి చెంది ఉండడం వల్ల ఆ భాష మతాంతరీకరణ వల్ల ప్రభావితం కాలేదు. అదొక మినహాయింపు మాత్రమే.

    ఇహపోతే ప్రజలంతా వ్యవసాయానికి చెందడం వల్ల భాష నిలబడిందనే వాదనని నేను అంగీకరిస్తాను. ఉద్యోగాల కోసమైనా ఇంగ్లీషు ఎందుకో నాకర్థం కాదు. మన రాష్ట్రంలో మనం చేసుకునే ఉద్యోగాలకి ఇంగ్లీషు అవసరం లేదు, అందఱూ కలిసి ఆ ఇంప్రెషన్ ని సృష్టించారంతే. కానీ ఇంగ్లీషు వస్తే ఉద్యోగం వస్తుందనే అభిప్రాయం - లాటరీ టిక్కెట్టు కొన్నవాడికల్లా జాక్ పాట్ తగుల్తుందనే విశ్వాసం లాంటిది.

    రిప్లయితొలగించండి
  13. తాడేపల్లి గారు నాకేమి ఇంగ్లిష్ మీద వ్యామోహం లేదు. వాస్తవిక ప్రపంచం లో ఇంగ్లిష్ కు మాత్రమే ప్రాధాన్యత కనిపిస్తుంటే కేవలం వ్యామోహం అని తీసి పారేయలేము .మన పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా తమ మాతృ భాషకు ప్రాదాన్యతను ఇస్తున్నాయి. అంతా మాత్రాన వాళ్ళు ఐటి లో వెనకబడి ఎమీ లేరు. చైనా , జపాన్ దేశాల్లో వాళ్ల మాతృ భాషకు ప్రాధాన్యత ఇస్తూనే అభివృద్ధి చెందాయి. మన దేశం, ముఖ్యంగా మన రాష్ట్రం లో మాత్రం తెలుగు మాట్లాడితే శిక్షించే స్కూల్స్ ఉన్నాయి. ఇంగ్లిష్ తప్ప మరో బాషా లేదు అన్నట్టుగా ప్రభుత్వమే వ్యవహరిస్తుంది. నిజాం కాలం లో రాజు ఉర్దూను ప్రోత్సహిస్తే సంపన్నులు ఉర్దూ చదివారు . బ్రిటిష్ వాడు , ఆ తరువాత ఇప్పటి పాలకులు ఇంగ్లిష్ కు ప్రాదాన్యత ఇస్తుంటే ఇంగ్లీష్ లోనే చదువుతున్నారు . ప్రజల నుండి మా భాషలోనే పాలన ఉండాలనే ఒత్తిడి పెరగాలి. భాష కోసం బంగ్లా దేశ్ వాళ్ళు దేశాన్ని సాధించుకున్నారు మనం అధికార భాషనూ అధికార భాషగా అమలు చేయమని ఒత్తిడి తేలేమా ?

    రిప్లయితొలగించండి
  14. What a satire!
    ఇందాకలే ఒక స్నేహితుడి ద్వారా తెలిసిన విషయం....ఐక్యరాజ్యసమితి అంతరించిపోతున్న భాషల లిస్టులో తెలుగు కూడా ఉందిట.

    రిప్లయితొలగించండి
  15. అవునండి సౌమ్య గారు ఇది పాత విషయం . .... సంస్కృతం ఎంత గొప్ప భాష అయినా ? ఎంత గొప్ప సాహిత్యం ఉన్నా అంతరించి పోయింది కదండీ ... ఆ పరిస్థితి తెలుగుకు రాకుండా చూసుకోవాలి.

    రిప్లయితొలగించండి
  16. సౌమ్యగారూ ! దయచేసి ఇలాంటి అవాస్తవాలకీ, వదంతులకీ ప్రచారం ఇవ్వకండి. ఎలాగూ చచ్చేదాన్ని మనం ఉద్ధరించేదేంటని నేర్చుకునేవాళ్ళు కూడా వెనక్కి తగ్గుతారు. అలా దాన్ని నిజంగానే చంపేస్తారు. నాకు తెలిసి అలాంటి జాబితాలో తెలుగు లేదు. నిజానికి ఇంగితజ్ఞానం ఉన్నవాడెవడూ తెలుగుని ఆ జాబితాలో చేర్చడు. పదికోట్లమందికి మాతృభాష అయిన మహాభాష ఎప్పటికీ అంత త్వరగా అంతరించదు. ఇందులో సగం జనాభా ఉన్న భాషలు కూడా ఆ జాబితాలో లేవంటే ఇహ ఆలోచించండి ?

    మన దేశంలో మన భాషకంటే నీచాతినీచంగా అణచివేయబడ్డ భాష కాశ్మీరీ. కాశ్మీర్ లో ఏ లిఖితరూపంలోనూ కాశ్మీరీ కనిపించదు. విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీషు. ప్రభుత్వంలో ఉర్దూ. మసీదుల్లో అరబ్బీ. కనీసం కాశ్మీరీలో వార్తాపత్రికలు కూడా లేవు. అయిన ఆఅ భాష ఇంకా జీవించే ఉంది కోటిమంది జనాల నాలుకల మీద !

    స్కూళ్ళలో ఇంగ్లీషుమీడియమ్ ఉన్నంతమాత్రాన తెలుగు అంతరించదు. స్కూళ్లకంత శక్తి లేదు. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కోటిమంది బడిపిల్లలు (ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ళని కలుపుకొని) తెలుగుని ఒక సబ్జెక్టుగా పదేళ్ళపాటు అభ్యసిస్తున్నారు. వాళ్ళందఱికీ ఇంకో 60 ఏళ్ళ ఆయుర్దాయం ఉంటుందని నమ్మితే కనీసం అప్పటిదాకా (2070 దాకా) తెలుగు అంతరించదు. ఏమో గుఱ్ఱం ఎగురా వచ్చు. ఈ లోపల తెలుక్కి పూర్వవైభవం తేవడానికి, ప్రభుత్వమూ, ప్రైవేటుసంస్థలూ కంకణం కట్టుకొని రంగంలోకి సీరియస్ గా దిగుతాయేమో ! ఎవఱికి తెలుసు.

    రిప్లయితొలగించండి
  17. సంస్కృతం అంతరించిపోవడానికి నాందిపలికింది మహాభారతయుద్ధం. ఆ యుద్ధంలో కోట్లాదిమంది చనిపోయారు. ఆ తరువాత సంస్కృతం అంతరించలేదు గానీ ముందు పాళీభాషగా మారి ఆ తరువాత అనేక ప్రాకృతాలుగా విడిపోయింది. ఆ ప్రాకృతాలే ఈనాడు మనకి తెలిసిన ఉత్తరభారతభాషలుగా మారాయి. అంటే సంస్కృతం రూపు మార్చుకుంది కానీ అంతరించలేదు. తెలుగైనా ఆంతే ! సంస్కృతంలో గొప్పసాహిత్యం ఉద్భవించేనాటికి అది జీవద్భాష కాదు, పండితభాష మాత్రమే !

    రిప్లయితొలగించండి
  18. తెలుగు మాట్లాడే వారి కోసం ఒక రాష్ట్రం కావాలని ఉద్యమించినప్పుడు ౬౦ ఏళ్ళ తరువాత తెలుగునాడులో తెలుగు మాట్లాడితే స్కూల్ పిల్లలలకు వాతలు పెడతారని ఉహించారా ? అంతరించి పోవడం అంటే రాత్రి పడుకొని తెల్ల వారు లేవగానే కనిపించకుండా పోతుందని కాదండీ ... తూఫాన్ ప్రభావం క్షణాల్లో కళ్ళ ముందు కనిపిస్తుంది . కానీ కరువు ప్రబావం అలా కనిపించదు. కానీ సమాజం పై అది చూపే ప్రబావం తీవ్రంగా ఉంటుంది . అలానే విద్యా వంతుల శాతం పెరుగుతున్న కొద్ది తెలుగు ప్రబావం తగ్గుతూ పోతుంది . తెలుగు అధికార బాష.. మరీ అధికార బాషగా ఎందుకు అమలు చేయడం లేదని నిలదియాలి కానీ. అంతా బాగానే ఉంది అనుకుంటే , నష్టం జరిగాక చేసేదేమీ ఉండదు . మన చిన్నప్పుడు విన్న తెలుగు పదాలు చాలా ఇప్పుడు వినిపించడం లేదు. హైదరాబాద్ లో సినిమా హాల్స్ లో కూడా మొదటి తరగతి, రెండవ తరగతి టికెట్స్ అంటూ చక్కగా తెలుగులో 1980 వరకు కనిపించాయి. ఇప్పుడు ఒక్క సినిమా హాలులో కూడా అలా కనిపించదు . చివరకు షాప్స్ పై బోర్డ్లు తెలుగులో ఉండాలని జివో ఇచ్చారు కానీ అమలు మరిచారు . అంత కన్నా సిగ్గు చేటు telugu పార్టీ అధికారం లో ఉన్నప్పుడు సచివాలయం నూతన ద్వారానికి పేరు రాసినప్పుడు తెలుగులో రాయలేదు ౭౦-౮౦ ఏళ్ళ వృద్దులు సచివాలయానికి వచ్చి ధర్నా చేశాక అప్పుడు తెలుగులో రాశారు

    రిప్లయితొలగించండి
  19. శ్రీ తాడేపల్లి గారికి, మురళి గారికి, సౌమ్య గారికి,

    1) తెలుగుకు ప్రాచీనభాషగా గుర్తింపును తెచ్చి, కేంద్రప్రభుత్వం నుంచి నిధులను, పదవులను, అధికారాలను సంపాదింపగోరిన కొన్ని సంస్థలు, కొందఱు వ్యక్తుల మూలాన ప్రచారంలోకి వచ్చిన అందమైన అబద్ధాలలో “తెలుగు అంతరించబోతోంది” అన్న నినాదం కూడా ఒకటి.

    2) భారతీయ భాషా వ్యవహారం నుంచి సంస్కృత పదాలు పూర్తిగా తొలగిపోయేంత వఱకు – సంస్కృత భాష, ఆ భాషాధ్యయనం నిలిచే ఉంటాయి. అది సాధ్యం కాదు సరికదా, సంస్కృతమే శరణ్యమయే రోజులు వచ్చితీరుతాయి.

    3) తెలుగు భాషా వ్యవహర్తలు సంస్కృతాంగ్లాలకు ప్రత్యామ్నాయంగా కేవలం “అచ్చ తెలుగు” పదాలను కల్పించుకొని, లేదా ఒకనాటి వాడుకను పునరుద్ధరించి తెలుగుకు కొత్త ఊపిరి పోయాలని భావించటం జరుగుతున్నది. ఒకనాడు ఉరుదూ ప్రాచుర్యానికి వ్యతిరేకంగా వచ్చినదే పొన్నిగంటి తెలగన మొదలైనవారి శుద్ధాంధ్ర కావ్య పరంపర. వారూ ఉరుదూను కలుపుకోక తప్పలేదు. దాని ప్రయోజనం తాత్కాలికం మాత్రమే. అన్యభాషాపదాలను ఆధునిక తద్భవాలుగా చేర్చుకొంటే తప్పేమీ కాదు. వ్యాకరణపరిధి పెరుగుతుంది.

    4) తెలుగులో చిన్నయ సూరి గారి గ్రాంథిక భాషా పునరుజ్జీవనోద్యమం, గిడుగు రామమూర్తి గారి వ్యావహారిక భాషోద్యమం – రెండూ ప్రవాసాంధ్ర ప్రాంతాలనుంచి ప్రత్యేక కారణాల వల్ల పుట్టినవే కావడం మూలాన – రెండూ భాషోద్ధరణకు సహజన్యాయం చెయ్యలేకపోయాయి.

    5) సాహిత్యంలో ఉన్నతప్రమాణాలు కలిగిన రచనలు వెలువడటం, ఆ భాషలో విస్తృతమైన పదసంపద ఉండటం, సహజమైన భావసమర్పకశక్తి, ఆ భాష మాట్లాడే ప్రజానీకంలో జాతి గర్వింపదగిన మహాపురుషులు జన్మించటం, భాషా వ్యవహర్తల ఆర్థిక ప్రాబల్యం – రాజకీయ పురోగతి ఆ భాష గుర్తింపుకు మూలకందా లవుతాయి.

    6) తెలుగు వ్యవహారాన్ని రాజకీయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, పత్రికలు శాసిస్తున్న తరుణంలో ప్రజలు తెలుగును, తెలుగుదనాన్ని కాపాడుకోవటం చాలా కష్టం అవుతున్నది. అందుకు ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషించి, కర్తవ్యాన్ని సూచించండి.

    7) మఱొక అవాంతర విషయం: కాశ్మీరీలో పత్రికలు వెలువడకపోలేదు. 1965 ప్రాంతాల్లోనే సోవియట్ భూమి పక్షపత్రిక కాశ్మీరీలో వెలువడి, ఆ తర్వాత రాజకీయ కారణాల వల్ల ఆగిపోయింది. మద్రాసులో మా చిన్నప్పుడు మల్లాది రామకృష్ణశాస్త్రి గారికోసం ప్రతిసారీ సంచిక రాగానే నేను తీసుకొనివెళ్ళి వారికి ఇచ్చేవాణ్ణి. సంస్కృత-ద్రావిడాదులతోపాటు ప్రాకృతం, పాళీ, కాశ్మీరీ, బెంగాలీ నేర్చుకొమ్మని ఆయన ఎందరికో చెప్పేవారు. ఆయన కాశ్మీరీ నుంచి అనువాదాలు కూడా చేశారు. విద్వాంసులలో ఇప్పుడా పరిధి సంకుచిత మవుతున్నది.

    రిప్లయితొలగించండి
  20. 1) తెలుగుకు ప్రాచీనభాషగా గుర్తింపును తెచ్చి, కేంద్రప్రభుత్వం నుంచి నిధులను, పదవులను, అధికారాలను సంపాదింపగోరిన కొన్ని సంస్థలు, కొందఱు వ్యక్తుల మూలాన ప్రచారంలోకి వచ్చిన అందమైన అబద్ధాలలో “తెలుగు అంతరించబోతోంది” అన్న నినాదం కూడా ఒకటి.
    .................

    ఏల్చూరి మురళీధరరావుగారు మీ స్పందనకు ధన్యవాదాలు . ప్రాచీన భాషగా గుర్తించాలనే డిమాండ్ రావడనికన్న ముందే అంతరించే ప్రమాదమున్న భాషల్లో తెలుగు ఉందని ఐఖ్య రాజ్యసమితి... ప్రకటించింది.
    ఇక రాజకీయ పార్టీ లకు అనుబందంగా ఉండే సంస్థలు ఇప్పుడు తెలుగు పై మాట్లాడడం వెనక రాజకీయ ఉద్దేశాలు ఉండవచ్చు కానీ . నేను చూసిన చాలా సభల్లో తెలుగు గురించి ఆవేదనతో సమావేశాలు నిర్వహిస్తున్న వారు వృద్దులు , ధర్మ రావు గారిని నేను 87 నుంచి తెలుగు కోసం ఆవేదన చెందడాన్ని చూస్తున్నాను ( అప్పుడాయన అధికార భాష సంఘం ఉన్నారు)
    నిజం రాజ్యం లో ఉర్దూ ఒకప్పుడు రాజ భాష . హిందువులు , సంపన్నులు అప్పుడు ఉర్దూనే నేర్చుకొనే వారు. చివరకు వైద్య విద్య కూడా ఉర్దూలో ఉండేది . మర్రి చెన్నారెడ్డి ఉర్డులోనే వైద్య విద్య అభ్యసించారు . ఆలాంటి ఉర్దూ పరిస్తితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ? ఉర్దూలో అత్యదిక సర్క్యులేషన్ గల సియాసత్ పత్రికలో ఉర్దూలో రాసే జర్నలిస్ట్ లు దొరక్క ఇంగ్లిష్ లోనో, తెలుగులోనూ రాసే వారిని తీసుకుంటున్నారు. పదవి విరమణ చెందిన పాత తరం వారిని సబ్ editors గా నియమించుకొని , వీరు రాసిన వాటిని ఉర్డులోకి అనువాదం చేయించుకుంటున్నారు . ఉర్దూ ఉపాద్యాయ పోస్ట్ లు ఉన్న దరఖాస్తు చేసే వారు లేక భర్తీ కావడం లేదు
    మీరు చెప్పినట్టు తెలుగు విశ్వ వ్యాపితం అయితే సంతోషం

    రిప్లయితొలగించండి
  21. చాలా బాగా రాసేరు మురళిగారూ. నేను మీ ఒక పుస్తకాన్ని తెప్పించుకొని చదివేను. రాజలీయాలపైన- అదీ ఆంధ్రదేశపు రాజకీయాల మీదనాకంత అవగాహన లేకపోయినా మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాత్రం భాగా నచ్చింది.
    క్రిష్ణవేణి

    రిప్లయితొలగించండి
  22. అయ్యో అయ్యో తెలుగును యేమన్నా అంటే నేనూరుకోను!

    ఓ తల్లి మా తెల్గు తల్లీ సదానందవల్లీ విశుధ్ధాంధ్రలోకైక సంస్తుత్య నీ భూమిలో వెల్గు నీ పల్కులం జిల్కు గేహంబులం బుట్టి నీ కింపుగా సొంపుగా నాడు నీ భాష మాట్లాడి నీ పాటలే పాడి నీ యాటలే యాడి నీ యందు ప్రేమాతిరేకంబునం జేసి నీ దివ్య సంగీత సాహిత్యముల్ జన్మసాఫల్యతా సిధ్ధిదంబుల్ విచారించుచున్ దేవి నీ దివ్యచారిత్ర లీలావిశేషంబులత్యంత శ్రధ్ధన్ విమర్శించుచున్ నీదు సత్కీర్తిసౌధాగ్రభాగంబునంచంద్రబింబంబు దీపంబుగానొప్పుటం గాంచి సర్వాత్మనా బొంగుచున్ నేడు హూణఫ్రభావంబుకున్నోడి తద్విద్యలం జీవనోపాధికై నేర్చిచుం బోవ తద్వేషముల్ భేషజంబొప్పగా వేయుచుం బోవ తద్భాషలం లోకవృత్తానుమోదంబుగా బల్కుచుం బోవ నీపట్ల ద్రోహంబుగా నాయె మాతీరు కోట్లాదిగా నున్న నీ బిడ్డలం జూచి కన్నీరు నింపంగ నాయెంగదా నీకు ప్రేమం బ్రశంసించి పోషంచు సంతానమే యన్య బాషావిమోహాత్ములై మాతృద్రోహంబు గావించ నిస్సిగ్గుగా నిట్లెగ్గులం జేసినం గాని మాయందు నీ వుందు వో తల్లి దివ్యానురాగంబునం పూర్ణవాత్సల్యభావంబునం మాకు సద్బుధ్ధులం గోరుచున్ మాకు నభ్యున్నతుల్ గోరుచున్ మాకు నాశీః ప్రసాదంబులం జేయుచుం ప్రేమ మాతప్పులం గాయుచుం వేగ మమ్మక్కునంజేర్చి లాలించుచున్ మమ్ము పాలించుచున్ మొఱ్ఱలాలించుచున్ అమ్మరో మాకు మాతప్పు దైవకృపంజేసి యిన్నాళ్ళకైనం బహుస్పష్టమై దోచె మే మింక నీ సేవలో నుందుమో కన్నతల్లీ సదా నీదు సత్కీర్తికిన్ మచ్చ రాకుండ వర్తింతు మేవేళ నీ మాటలే మాకు నోటం ప్రకాశించుగా కింక నేవేళ నీ దివ్యసంగీతసాహిత్యలీలావిలాసంబు లీయుర్వి మార్మోగ జేయంగ నుంకింతు మిందేమియుం శంకయుం గొంకునుం బొకుంనుం లేవు నీ వైభవం బెంచి జీవింతుమో మాతృదేవీ నమస్తే నమస్తే నమస్తే నమః
    (శంకరాభరణం బ్లాగులో తే. ౨/౨౧న నేను ప్రకటించినది)

    రిప్లయితొలగించండి
  23. బుద్దా మురళి గారు చాలా గంభీరమైన విషయాన్నీ చాలా సున్నితంగా చెప్పారు వారికి నా ధన్య వాదాలు
    --- బాలకృష్ణ వి వి

    రిప్లయితొలగించండి
  24. అయ్యయ్యో!మురళీ గారు ఇదంతా తెనుగులో రాసేశారు రేపు మీ పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయా! I am late in comment

    రిప్లయితొలగించండి
  25. ఇలా రాశానని వాళ్ళకు తెలియదు

    రిప్లయితొలగించండి
  26. అయ్యా కష్టేఫలీవారూ. మురళీ గారు ఇదంతా తెనుగులో రాసేశారు చాలా తెలివిగా. రేపు వారి పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయా అన్న శంక అనవసరం. తెలుగులో ఉన్నది వాళ్ళు చదవరు, చదవలేరు కదా! అందు చేత వాళ్ళకు తెలిసినా అదేంటి అర్థం చెప్పమని వాళ్ళు యీయననే అడగాలాయె!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్యా స్యామలీయం గారూ, క్షమించండి. మీరు అనవసరంగా కలలు కంటున్నారు. మురళి గారి పిల్లలకు టెక్నాలజీ బాగా తెలుసు. ఈయన గారు రాసిన తెలుగు వ్యాసాలను వారు గూగుల్ అనువాదంలో మార్చి చూసుకుంటున్నారు. మురళి గారి పరిస్థితి తలుచుకుంటే భయమేస్తోంది. మీరంతా ఏమంటారు. కాదంటారా. అవునంటారా. కాని నాకు ఒక ఆశ వుంది. బ్రౌన్ మహాశయుడు తెలుగు భాషకు చేసిన మేలును మనమంతా అభినందిస్తున్నట్లే, మురళి గారి పిల్లలు కూడా వారి తెలుగు భాషా సేవను కొనియాడుతారు. నా నమ్మకం నాది.

      తొలగించండి
  27. పిల్లలు చదివింది.. చదువుతున్నది ఇంగ్లిష్ మీడియమే అయినా ... చిన్నప్పటి నుండి తెలుగు చందమామ కథలు, పిల్లల కథల పుస్తకాలు చదవడం వల్ల మా పిల్లలకు తెలుగును టెలుగు అనేంత నాగరికత అలవడలేదు ... కనీసం ట్ట్యేలుగు అని కూడా అనరు తెలుగును తెలుగు అని మాత్రమే పలికే అనాగరికులు . భవిషత్తులో కూడా అంత నాగరికత ప్రసాదించకు దేవుడా అని మొక్కు కుంటాను

    రిప్లయితొలగించండి
  28. మురళి గారూ, మీరు చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చారు. తెలుగు భాష మృత భాష కాకూడదు అన్న తలంపుతో రాసింది మీ వ్యాసం. అదికాస్తా పక్కదారి పట్టి మీ పిల్లల భాష పైకి మళ్ళింది. ఆ ఉద్దేశ్యంతోనే నేను అలా రాసాను. ఇప్పటికైనా బ్లాగు మిత్రులు మురళి గారు రాసే అంశాలను సీరియస్ గా చర్చించాలి. నా అభిప్రాయం తప్పైతే పెద్ద మనసుతో మన్నించాలి

    రిప్లయితొలగించండి
  29. పిల్లల గురించి సరదా కామెంట్ కాబట్టే సరదాగానే స్పందించాను

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం