29, మార్చి 2012, గురువారం

తెలుగు దేశం కు పునర్వైభవం సాధ్యమేనా?

వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎన్టీరామారావు 1982 మార్చి 29న ఏర్పాటు చేసిన టిడిపి , రెండవ తరం నాయకుని చేతిలో 30 ఏళ్లను పూర్తి చేసుకుని 31వ ఏట అడుగుపెడుతోంది. బాబు పార్టీకి పూర్వవైభవం తీసుకు రాగలరా? మూడవ తరం నాయకుడు బాబు కుమారుడా? బాలకృష్ణనా, హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆరా? ఇప్పుడు టిడిపి శ్రేణులను తొలుస్తున్న ప్రశ్నలివి. వీటికి 2014 ఎన్నికల తరువాతనే సమాధానాలు లభిస్తాయి. మీడియా ఎంత అండగా నిలిచినప్పటికీ ఒకప్పుడు ఉజ్వలంగా వెలుగొందిన టిడిపి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. మరో రెండేళ్లలో మూడవ సారి ఎన్నికలు ఎదుర్కోవాలి. రాజకీయాల్లో రెండేళ్లు అంటే సుదీర్ఘ కాలమే! ఒక్క చిన్న సంఘటన చాలు ఎన్నికల్లో జయాపజయాలను మార్చివేయడానికి. అలాంటిది రెండేళ్లలో ఏం జరుగుతుందో చెప్పలేం అంటూ అనుకూల మాటలు ఎన్ని చెప్పుకున్నా ఏ కోణంలోనూ టిడిపికి ఆశాజనకమైన వాతావరణం కనిపించడం లేదు. తెలంగాణలో తెలంగాణ వాదం, సీమాంధ్రలో జగన్ బలం ఈ రెండూ టిడిపిని ఆడకత్తెరలో పోకచెక్కలా మార్చేశాయి.


ఎన్టీఆర్ నాయకత్వంలో 94లో జరిగిన ఎన్నికల్లో టిడిపికి 44 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తరువాత బాబు నాయకత్వంలోకి పార్టీ వచ్చాక క్రమంగా ఓట్ల శాతం పడిపోతూనే ఉంది. 99లో బిజెపి సానుభూతి పని చేసి 39 శాతం ఓట్లు వచ్చాయి. 2004లో 37 శాతం వస్తే, 2009 నాటికి 28 శాతానికి పడిపోయాయి. ఇప్పుడు వామపక్షాలు సైతం దూరమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో టిడిపి పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. 2009 అసెంబ్లీ సాధారణ ఎన్నికల తరువాత 21 అసెంబ్లీ నియోజక వర్గాలకు, ఒక పార్లమెంటు నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరిగితే, అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. రాయలసీమ, కోస్తా, తెలంగాణ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఈ రెండు ప్రధాన పక్షాలు ఘోరంగా ఓడిపోయాయి. గెలుపు మాట అటుంచి 21 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను టిడిపి కేవలం మూడు చోట్ల మాత్రమే డిపాజిట్ దక్కించుకుంది.


మీడియా మద్దతు, బలమైన సామాజిక వర్గం అండ దండలు సైతం టిడిపిలో ఉత్సాహాన్ని నింపలేకపోతున్నాయి. ‘సంక్షోభంలో ఉన్నది టిడిపి కాదు... రాష్ట్రం సంక్షోభంలో ఉంది... రాష్ట్ర ప్రజలు సంక్షోభంలో ఉన్నారు’ అంటూ బాబు ఎంత మాటల గారడీ చేస్తున్నా, టిడిపి తన జీవితంలో ఇంతకు ముందెన్నడూ లేనంత సంక్షోభంలో ఉంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వయసు 38 ఏళ్లు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ విజయం సాధించగానే అఖిలేష్ చేసిన మొదటి ప్రకటన సమాజ్‌వాది పార్టీది గుండాల రాజ్యం అనే ముద్రను చెరిపివేయడానికి కృషి చేస్తామని ప్రకటించారు.


తప్పులు ఏమిటో గుర్తించుకుంటే వాటిని ఎలా సవరించుకోవాలో ఆలోచన వస్తుంది. తొలిసారి ఓటమి చెందగానే ఎందుకలా జరిగిందో సమీక్షించుకొని, లోపాలను నిజాయితీగా బహిరంగంగా ఒప్పుకుంటే పార్టీకి మేలు జరిగేది. బిజెపికి రాష్ట్రంలో సొంతంగా 18 శాతం ఓట్లు వచ్చాయి, టిడిపితో చేతులు కలిపిన తరువాత 2 శాతానికి పడిపోయంది. 2004లో బిజెపితో పొత్తు వల్ల ఓడిపోయాం అని బాబు ప్రకటించారు. 2009లో టిఆర్‌ఎస్‌తో పొత్తు వల్ల ఓడిపోయినట్టు చెప్పుకున్నారు. 2009లో టిఆర్‌ఎస్‌తో పొత్తు లేకపోతే ప్రజారాజ్యం, టిఆర్‌ఎస్, సిపిఐ కలిసి పోటీ చేసేవి, అలా జరిగితే అప్పుడు తెలిసేది. ఒక్క ఓటుతో వాజ్‌పాయి ప్రభుత్వం ఓడిపోవడం వల్ల వచ్చిన సానుభూతి వల్ల 99లో గెలిచిన విషయం ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోని బాబు బిజెపి వల్ల ఓడాం అని చెప్పినా టిడిపి, బిజెపి బంధాన్ని ముస్లింలు మరిచిపోలేక పోతున్నారు. టిడిపికి చేరువ కాలేకపోతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని అబ్బురపరిచే విధంగా పాలించాము అని ప్రచారం చేసుకున్న బాబుకు ఓటమికి కారణాలు చెప్పుకోవడానికి మనసు ఒప్పలేదు. అహం అడ్డు వచ్చినట్టుగా ఉంది. మేం ప్రజలకు మంచి చేయడం వల్లనే ఓడిపోయాం, అవినీతికి దూరంగా ఉండడం వల్లనే ఓడాం అని టిడిపి నాయకత్వం వింతైన వాదనలు చేస్తుంది. గుండారాజ్ అనే ముద్ర చెరిపేసుకుంటాం అని అఖిలేష్ ప్రకటించారంటే అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ వాళ్లు గుండాల్లో వ్యవహరించారని అతను నిర్మొహమాటంగా ఒప్పుకున్నట్టే. తాము ఎక్కడ తప్పు చేశామో గ్రహించి వాటిని సవరించుకోవడానికే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాధాన్యత ఇచ్చామని అఖిలేష్ బహిరంగంగానే చెప్పారు. మేం సంక్షోభంలో లేం, రాష్ట్రం, రాష్ట్ర ప్రజలే సంక్షోభంలో ఉన్నారని ఒకవైపు చెబుతూనే మరోవైపు టిడిపికి సంక్షోభాలు కొత్త కాదు అంటున్నారు. రాష్ట్ర రాజకీయాలతో ఏ మాత్రం పరిచయం వారికి బాబు మాటలు వింటే ముచ్చటేస్తుంది. రాజకీయ పక్షాలు ఎన్నికల్లో డబ్బును గుమ్మరిస్తున్నాయి, కులాన్ని ఉపయోగించుకుంటున్నాయి. ఇవి బాబు కనిపెట్టిన విషయాలు. ఇవాయన కనిపెట్టినవి కాదు ఆయన రాజకీయాల్లో మొదటి నుంచి అమలు చేస్తున్నవి. కులాన్ని అత్యధికంగా ఉపయోగించుకుంటున్న నాయకుడు ఆయనే, పార్టీ ఆయనదే. చివరకు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు, ఆరోపణలు ఎవరు చేయాలో కుల ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. ఎన్టీఆర్ భవన్‌లో రెడ్డి నాయకుని విలేఖరుల సమావేశం అంటే కాంగ్రెస్ లేదా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి నాయకులపై విమర్శల కోసం అని ముందే నిర్ణయించుకోవచ్చు. ప్రత్యర్థి పార్టీలో ఏ కులం నాయకున్ని విమర్శించాలంటే అదే కులానికి చెందిన టిడిపి నాయకులతో ఎన్టీఆర్ భవన్‌లో విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేయిస్తారు.



 సీమాంధ్ర రాజకీయాల్లో కులానిది ప్రధాన పాత్ర కాగా, తెలంగాణలో కులం ప్రభావం తక్కువ, తెలంగాణ వాదమే ప్రధానం. కులం కార్డుతో తెలంగాణ వాదాన్ని మరుగున పరచడానికి తీవ్రంగానే ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. టిడిపి ఆవిర్భావం నుంచి ఏ ప్రాంతంలో ఏ కులం ఓట్ల శాతం ఎంత? కాంగ్రెస్ ఏ కులానికి టికెట్ ఇస్తే మనం ఏ కులానికి ఇవ్వాలి అని లెక్క పెట్టుకునేది. పార్టీ బాబు నాయకత్వంలోకి వచ్చాక ఇది మరీ పెరిగిపోయింది. రోజు రోజుకు కులం ప్రభావం అధికం కావడంతో ఈ సమస్య చివరకు టిడిపి తలకు చుట్టుకుంది. టిడిపి సామాజిక వర్గంతో అనుబంధంగా ఉండే కులాల కన్నా టిడిపి వ్యతిరేక శిబిరాల్లోని కులాల వారి ఓట్లు అధికం అదే ఇప్పుడు టిడిపి కొంప ముంచింది. జగన్ అవినీతిపై టిడిపి, టిడిపికి అండగా నిలిచే వర్గాలు ఎంత వ్యతిరేక ప్రచారం సాగించినా, ఎన్నికల్లో అది పని చేయకపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. టిడిపి తిరిగి అధికారంలోకి రావాలని కోరుకునే బలమైన వర్గం ఒకవైపు జగన్ వ్యతిరేక ప్రచారం విస్తృతం చేస్తూ మరోవైపు తెలంగాణ అంశాన్ని మరుగున పరచడానికి ఎంత ప్రయత్నించాలో అంత వరకు ప్రయత్నించారు. కానీ రెండింటిలోనూ విజయం సాధించలేకపోయారు. అయితే సమైక్యవాదం లేదంటే, తెలంగాణ ఉద్యమానికి కెసిఆర్‌కు ప్రత్యామ్నాయ నాయకత్వం అనే సిద్ధాంతంతో తొలుత విజయశాంతిని, తరువాత గద్దర్‌ను ఆకాశానికెత్తారు. విజయశాంతి టిఆర్‌ఎస్‌లో చేరగా, గద్దర్ తన శక్తి తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడుతుందని భావించినా కెసిఆర్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలువలేనని గ్రహించారు. 2009 ఎన్నికలకు ముందు టిడిపికి అండగా నిలిచే వర్గం తన సర్వశక్తులు ఒడ్డింది. యువగర్జనలో ఈ శక్తుల బలప్రదర్శనగా జరిగింది. ఇప్పుడు చివరకు ఈ వర్గంలో సైతం బాబు పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది.


 తెలంగాణపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది? జగన్‌ను అరెస్టు చేస్తారా? వీటికి ఇప్పటికిప్పుడు సమాధానం లభించని ప్రశ్నలు. నిజమే ఈ రెండు సమస్యలను కాంగ్రెస్ హై కమాండ్ ఎలా పరిష్కరిస్తుందో తెలియదు. కానీ టిడిపికి ప్రయోజనం కలిగే విధంగా ఈ రెండు సమస్యలు పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ ఎందుకనుకుంటుంది. జగన్, టిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుంది అనేది టిడిపి కొత్త ప్రచారం. టిడిపి తిరిగి అధికారంలోకి రావాలంటే అది జరిగి తీరాలి. కాబట్టి టిడిపి శ్రేయోభిలాషులు ఆ కోరిక కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఎందుకు విలీనం అవుతారు. కాంగ్రెస్ మునిగిపోతున్న పడవ అని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు అది టైటానిక్ లాంటి గొప్ప పడవ అయినా కావచ్చు కానీ మునిగేప్పుడు అందులో ఎక్కేవారుంటారా? కాంగ్రెస్ వ్యతిరేకతే సిద్ధాంతంగా ఉన్న టిడిపికి కాంగ్రెస్ మరీ బలహీనపడిపోవడం కలవరపెడుతోంది. తమతో ఓడిపోయే స్థాయిలో కాంగ్రెస్ ఉండాలని టిడిపి కోరుకుంటోంది కానీ సోదిలో లేకుండా పోయే స్థాయిలో ఉంటే అది టిడిపికి సైతం నష్టమే. అదే ఇప్పుడు టిడిపి సమస్య. కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలో ఉన్న తరువాత మూడవ సారి జరిగే ఎన్నికల్లో సులభంగా గెలుస్తామనుకున్న టిడిపికి కాంగ్రెస్ స్థానంలో సీమాంధ్రలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రత్యర్థులుగా నిలవడం మింగుడుపడడం లేదు. ఒకవైపు అసలు నాయకుడే లేని కాంగ్రెస్, మరోవైపు అవినీతి ఆరోపణలున్న జగన్, అయినా వీరిని ఎదుర్కోలేని నిస్సహాయ స్థితిలోకి టిడిపిని ఆ పార్టీ నాయకత్వం నెట్టివేయడం సంక్షోభం కాకుంటే మరేమిటి?
-బుద్దా మురళి

8 కామెంట్‌లు:

  1. చాలా వివరంగా రాసారు మురళి గారూ... ప్రజల మనసుని గెలవగలిగే నేర్పు, ఓ(దా)ర్పు, ఉన్న వాడే నిజమయిన నాయకుడు అవుతాడు.... ప్రస్తుత రాజకీయాల్లో జగన్ ప్రజలలో తిరిగినంతగా మరెవరూ తిరగటం లేదు. ప్రెస్ మీట్లు మాని ప్రజలతో మీటింగులు పెడితేనే ప్రజల కష్టాలు తెలిసేది. అలా ప్రజల కష్టాలు తెలుసుకుంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు లేవు అని బాధ పడాల్సిన అవసరం ఉండదు....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెంకట సుబ్బారెడ్డి ఆవుల ధన్యవాదాలు ... అన్ని పార్టీ లు చందన బొమ్మన బ్రదర్స్ లాంటివే . వారు చేసేది వ్యాపారమే అని నాకు అనిపిస్తోంది . బాబు పార్టీ కి డబ్బులు లేక పోవడం ఏమిటండి అది కూడా ప్రచారం లో బాగమే డబ్బులు తప్ప ఎమీ లేవు అంటే బాగుంటుంది . కోవురులో ఒక పార్టీ తరపున అన్ని వ్యవహారాలు చూసిన నేత చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్స్ ఓటుకు వెయ్యి, టిడిపి 500 పంచితే జగన్ పార్టీ రెండు వందలు పంచింది . అయితే మేం వెయ్యి పంచినా 60 % ఓటర్లకు మాత్రమే పంచాం వాళ్ళిద్దరూ 100 % ఓటర్లకు పంచారు అని పంపకాల భాద్యత నిర్వహించిన నాయకుడే చెప్పాడు

      తొలగించండి
  2. చాలా చక్కగా రాశారు. తెలుగుదేశం పార్టిని విశ్లేషించటంలో మీరు నంబర్1. ఇంతక్రితం కూడా మీడీయా ప్రభావం వలననే రామారావు గెలిచాడా ఒక వ్యాసం రాశారు. అది కూడా చాలా బాగుంది.
    చంద్రబాబు గారు 9సం|| ముఖ్య మంత్రిగా పని చేసినా ఇంకా పని చేయాలను కోవటం ఎందుకో నచ్చదు. అదికాక ఆయనని వయసులో ఎంతో చిన్న వారైన వారు కూడా పూచిక పుల్ల లాగా తీసి వేసి మాట్లాడుతుంటే, వారికి సమాధానాలు ఇచ్చుకొంట్టూ ఆ పదవిలో కొనసాగటం బాగా లేదు. ఆయన పరిపాలించినన్ని రోజులు ప్రతి విషయం లోను చాలా కాలికులేటేడ్ గా ఉన్నారు. అతనికి మంచి మేనేజర్ లక్షణాలు ఉన్నాయే కాని, గొప్ప నాయకూడి లక్షణాలు లేవనిపిస్తుంది. బషీర్ బాగ్ లో జరిగిన కాల్పుల లో చనిపోయిన వారికి కనీసం, చిన్న సహాయం కూడా చేయలేదు. అందులో ఒకతని తల్లి ఎంతో ముసలిది, మొగుడు పిల్లలు ఎవ్వరు లేరని చదివాను. నాయకత్వ లక్షణాలు ప్రదర్శించవలసిన చోటా అధికారం లో ఉన్నపుడు ప్రదర్శించలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనివాస్ గారు థాంక్స్ పదవి లేనిదే ఉండలేను, పదవి కోసం దేనికయినా సిద్ధం అన్నట్టుగా ఉంటుంది బాబు వ్యవహార శైలి . దాని వల్లనే ఆయన పార్టీ పరిస్థితి ఇలా అయిందేమో అనిపిస్తుంది

      తొలగించండి
    2. ఈ సారి ఆయనకి పదవి రాకపోతే పార్టిని నడపగలరంటారా? ఎవరైనా ఆ పార్టిలో ఉంటారా? వాస్తవానికి ప్రస్తుతం తె.దే. పార్టికి ఉన్న పెద్ద లోపం నిజాయితి పరుడైనా, విలువలు కలిగిన ఒక్క బలమైన నాయకుడు లేరు. వ్యక్తి ఐనా, వ్యవస్థ ఐనా కష్ట్ట కాలంలో పైకి రావాలంటే, విలువల పైన ఆధార పడాలి. అప్పుడే ప్రజల మనసులో ఆలోచన రేక్కింత్తించి, వోట్ల రూపంలో మార్చుకొంటారు. ఎప్పుడైతే ఆ పార్టిలో విలువలు కలిగిన నాయకులు లేరో అది బలహీన పడిపోతుంది. అధికారం ఉన్నప్పుడు పార్టి తన బలహీనతలను,అధికార బలంతో కప్పిపుచ్చుకొంట్టుంది. లేనపుడు అదే ఎక్కువగా కనిపిస్తుంది.ప్రజలకి ఎన్ని వాగ్ద్దానాలు చేసిన అవి వారి మనసులోకి పోవు. వారి దృష్ట్టి నాయకుడు వెనకేసిన డబ్బు మీదే ఉండి, ఈ నాయకులు డబ్బులు బాగా సంపాదించి మనకు మాత్రం వాగ్దానాల వరాలు గుప్పిస్తున్నరను కొంట్టారు. వారు చెప్పే విలువలు, మాటలను నమ్మరు.

      తొలగించండి
  3. చాలా బాగా రాసారు మురళిగారు..!
    నాకైతే ఇవికాక ఇంకొన్ని వైఫల్యాలు కూడా కనిపిస్తాయి (అనిపిస్తాయి).
    అందులో ఒకటి, చుట్టుపక్కల రాష్ట్రాల్లోకి అంటే తమిళనాడు, కర్నాటక, ఒరిస్సా, మహారాష్ట్రల్లోకి పార్టీని విస్తరించకపోవడం. పార్టీ పెట్టినప్పట్నుంచీ ఆలోచన ఉందో లేదో నాకు తెలీదుగానీ, 2004 ఎన్నికలప్పుడు చంద్రబాబుకు ఎంతోమంది చెప్పిచూసారు. వినిపించుకోలేదంటారు. ఆ పని చేసి ఉంటే తెలుగుదేశం పరిస్థితీ, తెలుగువారి పరిస్థితీ, తెలుగు "ఓట్ల" పరిస్థితీ ఎంతో మెరుగ్గా ఉండేవనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో చిరు చాలా నయం, కర్నాటకలోని తన అభిమానులని దృష్టిలో పెట్టుకుని తన పార్టీని విస్తరిస్తానన్నాడు.(కనీసం మాటవరసకి). ఇప్పుడా భయం లేదు. హాయిగా కాంగ్రెస్‌ లోకి కలిపేసాడు. నిజంగా తెలుగుదేశం పక్కరాష్ట్రాల్లోకి విస్తరించి ఉండుంటే, మన దేశ రాజకీయాల్లో "ఉత్తరప్రదేశ్‌"కున్న స్థానం తెలుగువారికి లభించి ఉండేదనడంలో అతిశయోక్తి లేదు. ఆ స్థాయిలో చక్రం తిప్పాల్సినవాడు, తర్వాతికాలంలో పార్టీని కాపాడుకోడానికి "రెండు కళ్ళు" అనుకోవాల్సి వచ్చింది.
    ఇంక "బిజెపీ"తో పొత్తు విషయం. నాకైతే ఇదంతా "తృతీయ ఫ్రంట్‌" రాజకీయం అనిపిస్తోంది. ములాయం "సమాజవాదీ"కి ముస్లిం ఓట్లు అత్యంత కీలకం,"తృతీయ ఫ్రంట్‌"కి అతని రాష్ట్రమూ కీలకమే. అందువల్ల మిత్రధర్మం(?) అనుసరించి మాట్లాడుతున్న మాటలవి. బీహార్‌ లో నితీశ్‌ కుమార్‌ ఎన్నికల ప్రచారానికి మోడీని రావొద్దనడం వెనుకకూడా "తృతీయ ఫ్రంట్‌" రాజకీయం ఉంది.

    మన రాష్ట్రంలోని "కులపిచ్చి" విషయంలో తెదేపా పాత్ర అనన్య సామాన్యం అనిపిస్తూ ఉంటుంది. అయితే, మన రాష్ట్రమే కాక ఇతర రాష్ట్రాల్లోనూ "కులపిచ్చి" ఉంది. దానికి మూలకారణం ఏదైనప్పటికీ రాజకీయం కావడానికి కారణం మాత్రం వి.పి సింగ్‌ సర్కారే అనుకుంటున్నా. అదే సమయానికి తెదేపా ప్రతిపక్షంలో ఉన్నది. అధికారంలోకి రావడానికి దాన్ని కూడా వాడుకుంది. కులపిచ్చి ఏస్థాయిలో ఉందంటే కొన్ని కళాశాలల్లో వేరే కులానికి చెందిన విద్యార్థితో కనీసం మాట్లాడడం కూడా మాట్లాడనంతగా (బహుశా, ఇది చాలా తక్కువగా చెప్పడం). కులపిచ్చి అరికట్టడంలో తెదేపాగానీ, కాంగ్రెస్‌ వంటి ఇతర రాజకీయ పక్షాల చొరవ దాదాపుగా శూన్యం. బీహారులోని నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం, అధికారిక రికార్డులన్నిటి నుండీ కులాన్ని సూచించే పేర్లన్నీ తొలగించి పారేస్తోంది. అంత నిబద్ధత మన నాయకులకు లేదు కదా.
    మిగతా విషయాలెలా ఉన్నా తెలుగువారి అత్మగౌరవం పేరుతో వచ్చిన పార్టీ తెలుగువారికీ, తెలుగు భాషకీ చేసిందేమిటో అర్థం కావట్లేదు. సుమారు లక్షన్నరమంది ఉండే సింగపూరు తమిళులు దాన్ని ఆ దేశ అధికారభాష చేయగలిగారు. 30 లక్షలకి తక్కువ కాకుండా ఉన్న బెంగుళూరు తెలుగువారు, మద్రాసు తెలుగువారు, కనీసం రైల్వే స్టేషన్లలో, బస్సుస్టాండ్లలో తెలుగు అనౌన్స్‌మెంట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. దీనిక్కారణం తెలుగువారి దౌర్బల్యం కాదా..? అందుకు మొట్టమొదటి దోషి తెలుగుదేశమే అనడంలో సందేహమే లేదు.

    రిప్లయితొలగించండి
  4. వామన గీత గారు అండమాన్లో టిడిపి ఉంది ఆ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు అనేక సార్లు వచ్చి బాబును కలిశారు . కర్ణాటకలో , మరీ కొన్ని ప్రాంతాల్లో పార్టీ విభాగం ఏర్పాటు చేశారు. ఆ మధ్య అండమాన్ మున్సిపల్ ఎన్నికల్లో ఎర్రం నాయుడు , దాడి వీరభద్ర రావు వెళ్లి ప్రచారం చేసి వచ్చారు ఫలితాలు ఏమయ్యాయో తెలియదు. ఇక ఇప్పుడు ఆన్ లైన్ లో పార్టీ సభ్యత్వం ఇచ్చేస్తున్నారు ఇతర రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచం లో ఏ దేశం నుంచయిన సభ్యత్వం తీసుకోవచ్చు . సభ్యత్వ్బం ఉందంటే అక్కడ పార్టీ ఉన్నట్టే కదా ..
    నాకు icici ఖాతా ఉంది సికింద్రాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో తమిళులు కొంత మంది ఉంటారు ఆ ప్రాంతాల్లో atm లలో తెలుగు ఉంటుంది . మరీ ఇతర ప్రాంతాల్లో తెలుగు వారు ఇంత కన్నా ఎక్కువ సంఖ్యా లో ఉన్న తెలుగు కనిపించదు. తెలుగుదేశం వారి వెబ్ సైట్ ఉంది వీలుంటే చూడండి . తెలుగు పదాలు కనిపించకుడా ఎంత జాగ్రత పడ్డారో చూస్తే .................

    రిప్లయితొలగించండి
  5. మురళిగారు..
    అండమాన్‌లో తెదేపా ఉందన్న విషయం నాకు తెలీదు. తెలియజేసినందుకు ధన్యవాదాలు. అయితే, అక్కడ ఉన్నంతమాత్రాన పెద్దగా మార్పు ఉన్నట్టు తోచడం లేదు. అక్కడి జనాభాయే 4 లక్షలు. దీవులన్నిటికీ కలిపి ఒకే ఒక్క లోకసభ సీటు ఉంది. పైగా, అక్కడ తెలుగుకు అధికారభాష హోదా ఉంది, వారితో ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధబాంధవ్యాలున్నాయి. (ప్రధానంగా ఉత్తరాంధ్రతో. అక్కడి తెలుగువారి యాసకూడా శ్రీకాకుళం యాసలాగే ఉంటుంది. దాడి వీరభద్రరావు, ఎర్రం నాయుడు ఎన్నికల ప్రచారం చేయడం వెనుక కూడా ఇదే కారణం ఉండుంటుంది). అయితే, కర్నాటక, తమిళనాడువంటి పెద్దరాష్ట్రాల్లో ఉండడం చాలా ప్రభావం చూపిస్తుంది.

    పక్క రాష్ట్రాల్లో తెలుగు గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని సరదా లెక్కలు చెప్పుకోవచ్చు. బెంగుళూరు, మద్రాసు, ముంబై నగరాలు ఒక్కొక్కదానిలో 30 లక్షలకు తక్కువకాకుండా తెలుగువారున్నారు(ట). ఇది విశాఖ,విజయవాడల జనాభా మొత్తానికి సమానం. ఢిల్లీ నగరంలో 9 లక్షలు, శివారు ప్రాంతాలు కలిపితే 15 లక్షలు తెలుగువారున్నారు(ట). ఇది విశాఖ జనాభాతో దాదాపుగా సమానం. కానీ వీళ్లంతా "ఎడ్యుకేటెడ్" తెలుగువాళ్ళు. బయట ఇంగ్లీషుకీ, హిందీకి అలవాటుపడిపోయి ఉంటారు. తెలుగే మాట్లాడలన్న నియమాలేమీ ఉండవు. పైపెచ్చు ఆయా భాషలు తెలీకుండా వచ్చే తెలుగువారిని "ఎర్రబస్సు" ఎక్కేవారిని చూసినట్టు చూస్తూ ఉంటారు. అంటే, మన రాష్ట్రం నుండి పక్క రాష్ట్రానికి రావాలంటే ఇంగ్లీషు/హిందీ తప్పనిసరి. దానికి తెలుగువారందరం మానసికంగా సిద్ధమైపోయాం. తమిళులు అలా కాదు.


    అసలు తెలుగువారికి తమిళులకున్నంత భాషాభిమానం ముందునుండీ ఉన్నట్టైతే, మన తెలుగు భారతదేశానికి ఎప్పుడో రెండో అధికార భాష అయ్యేది. హిందీవారు రెండోభాషగా చదువుకుంటూ ఉండేవారు. హిందీవారు మనరాష్ట్రానికొస్తే మనవాళ్లు వచ్చీరాని హిందీలో ఎలా మాట్లాడుతున్నారో, అదే విధంగా ఉత్తరాదివారు వచ్చీరాని తెలుగు మాట్లాడుతూ ఉండేవారు. ఊహించుకోడానికి బానే ఉంటుంది, అసలెలాగూ లేదు కదా..!

    సభ్యత్వం ఉన్నంతమాత్రాన పార్టూ ఉన్నట్లెలాగవుతుంది..? వేరే దేశాలో పోటీకి దిగదు కదా..! మొన్నటి తమిళనాడు ఎన్నికలలో చంద్రబాబు అన్నాడిఎంకే తరుపున ప్రచారం చేసి వచ్చాడు కదండీ. సుమారు 80 లక్షల తెలుగు ఓట్లు ప్రభావితం అయ్యాయని పత్రికల్లో వచ్చిందిగా.

    (నా వ్యాఖ్యకి స్పందించినందుకు ధన్యవాదాలు)

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం