11, ఏప్రిల్ 2012, బుధవారం

‘అఖిలపక్ష తార’!... ఆమె జీవితం సమాజానికే అంకితం


లైవ్ టెలికాస్ట్ కోసం ఆరేడు డజన్ల ఓబి వ్యాన్‌లతో అక్కడ గందరగోళంగా ఉంది. ఏమైంది ప్రధానమంత్రి వస్తున్నాడా? అని దారిన పోయే దానయ్య అక్కడున్న మీడియా వారిని అడిగాడు. ఏ కాలంలో ఉన్నావ్ ప్రధాని వస్తే ఇంత హడావుడి ఉంటుందా? అని దానయ్యను వెర్రివాడిని చూసినట్టు చూసి నవ్వాడతను. వచ్చేస్తోంది అని ఎవరో విజిల్ ఊదారు.



 లైట్ ఫోకస్ చేయడంతో మబ్బులను చీల్చుకుంటూ సూర్యుడు బయటపడినట్టుగా అక్కడ వెలుగు విరబూసింది. ముంగురు సవరించుకుంటూ మందగమనంతో వయ్యారంగా అడుగులో అడుగేసుకుంటూ తారా చౌదరి వస్తోంది. కదులుతున్న ఆత్మవిశ్వాసపు నిలువెత్తు రూపంగా ఉందామె. ఉత్సాహాన్ని ఆపుకోలేక ఒక కెమెరామెన్ ఆమెను తన్మయంగా చూస్తూ ముందుకు వెళ్లాడు. ‘‘వోయ్ కెమెరామెన్ నువ్వు కెమెరావెనక ఉండి కెమెరా నుండి ఆమెను చూడాలి కానీ ముందుకెళ్లి కళ్లతో చూడ్డం కాదు’’ అని రిపోర్టర్ ఔత్సాహిక కెమెరామెన్‌ను వెనక్కి పిలిచాడు. మెకప్ వేసుకుంటే తెలుగు హీరోయిన్‌లా, తీసేస్తే ముంభై హీరోయిన్‌లా ఉందామె అని తన సినిమా అనుభవాన్ని పంచిపెట్టాడొకరు. ఆమె రాగానే కొందరు తన్మయం చెందితే, కళారాధన తెలియని వాళ్లు హడావుడి చేశారు.


 ‘‘ఏంటీ ఏమవుతుందిక్కడ ఇదేనా మీరు నేర్చుకున్న క్రమశిక్షణ. ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలియదా? ఇదేమన్నా అసెంబ్లీ అనుకున్నారా? ’’అంటూ తారా చౌదరి ఆగ్రహించగానే కొందరు పెద్దవాళ్లు ముందుకు వచ్చి ఏదో తెలియక .... పిల్లలు వదిలేయండి అంటూ పనిలో పనిగా తారా చౌదరి చేయిని తమ చేతిలోకి తీసుకొని సర్ది చెప్పారు.
సరే పది నిమిషాల టైమిస్తున్నా, ఏమడుక్కుంటారో అడుక్కోండి అంది తారా చౌదరి


***
విలేఖరి: అసలేం జరిగిందో ముందు మీరే చెప్పండి
తారా: యూ సీ.... ఓ..కె... తెలుగులోనే చెబుతాను. నా జీవితం తెరిచిన పుస్తకం. ప్రజలకే నా జీవితం అంకితం.
వెనక నుంచి ఓ విలేఖరి: ఆవన్నీ రాజకీయాల్లో చేరాక, కుంభకోణాలు బయటపడ్డాక చెప్పాల్సిన డైలాగులు. ముందు నీ కథేందో చెప్పు’’ అని తన ముఖం కనిపించకుండా అందరికీ వినబడేట్టు అరిచాడు.
తారా: సమాజం ఇలా ఎందుకుందని నేనెప్పుడూ బాధపడుతుంటాను?
‘‘వద్దమ్మా! ముందు విషయం చెప్పు’’ ( మళ్లీ అరుపులు)
తార: ఆ సూర్యుడు ఎవరో చెబితే ఉదయిస్తున్నాడా? ఈ చంద్రుడు ఎవరి కోసమో వెనె్నల కురిపిస్తున్నాడా? గులాబీలు ఎవరి కోసమో పూయవు, అవి వాటి సహజ లక్షణం. నేనూ అంతే. సమాజంలో పడిపోతున్న విలువలను ఎలాగైనా నిలబెట్టాలని నేను కంకణం కట్టుకున్నాను.
విలేఖరి: ఒక ఎంపి గారికి కాంట్రాక్టులు ఇప్పించడానికి ఢిల్లీలో మీరు చక్రం తిప్పారట! గోవా టూర్లు వెళ్లారట!


తార: దేన్నయినా మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. ఇంద్రుడి సభలో రంభ, ఊర్వశి, మేనక వంటి వాళ్లు విశ్వశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నిర్వహించిన బాధ్యతలనే నేను రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేశాను. ఏ రాష్ట్రంలో చూసినా కాంట్రాక్టులు మన వారికే దక్కుతున్నందుకు తెలుగు వారిగా మనం సగర్వంగా తలెత్తుకుని చెప్పుకోవాలి.
విలేఖరి: మీరు ఇలా ఎలా అయ్యారు?
తార: ప్రజల కష్టాలను చూసి చలించిపోయిన గౌతముడు కష్టాలకు కారణాలు కనుగొని బుద్ధడయ్యాడు. ప్రజలను ఎలా సుఖపెట్టాలనే తపనతో నేను సమాజానికి అంకితమయ్యాను.
విలేఖరి: సాధారణంగా ఒక పార్టీ అంటే మరో పార్టీకి పడదు. కానీ మీరు అన్ని పార్టీల వారిని ఎలా ఆకర్షించగలిగారు?
తార: గుడ్ కొశ్చన్. అందుకే అంతా నన్ను ముద్దుగా ‘అఖిలపక్ష తార’ అంటారు. సమాజానికి, సమాజంలో ఉన్న పార్టీలకు, పార్టీల్లో ఉన్న నాయకులను సంతోషపెట్టాలనే అందరినీ ఏకం చేశాను.
విలేఖరి: మీ జీవితాశయం?
తార: సమాజంలో నైతిక విలువలు పెంచేందుకు త్వరలోనే ఒక బృహత్తర పథకాన్ని ప్రారంభిస్తాను. పేదరికం లేని, అందరూ సుఖంగా ఉండే సమాజాన్ని చూడాలనేది నా కోరిక! మహాత్మాగాంధీనే జైలు పాలు చేశారు నేనెంత? కేసులు నాకు కొత్త కాదు బయటకు వచ్చాక నైతిక విలువలపై ప్రచారం కోసం సొంతంగా చానల్ ఏర్పాటు చేసుకోవాలా? లేక ఎవరితోనైనా భాగస్వామ్య ఒప్పందం చేసుకోవాలా? అని ఆలోచిస్తున్నాను.



 ఆమె మాట్లాడుతుండగానే పిఎ చెవిలో ఏదో చెప్పి ఫోన్ అందించాడు. అందరూ విననివ్వండి అని సెల్‌ఫోన్ మైక్ ఆన్ చేసింది.
తార: థ్యాంక్యూ మిస్టర్ రావణ్ గోపాల్ బర్మ. సారీ ... నో... నో... నాపై సినిమా తీయాలని మీకు అనిపించడం సహజమే. ఈ మధ్య మీ వన్నీ అట్టర్ ప్లాప్ సినిమాలే మీతో సినిమాకు ఒప్పుకోలేకపోతున్నాను. అని తార లైన్ కట్ చేసింది.
విలేఖరి: చివరిగా సమాజానికి మీరిచ్చే సందేశం.
తార: మీ సుఖమే నేను కోరుతున్నా ... నా జీవితమే నా సందేశం.

6 కామెంట్‌లు:

  1. మురళీగారు,చాలా బావుంది మీ టపా. ఎప్పటిలాగే. అయితే తారా మేడమ్ ఇవన్నీ ఇలాగే చెప్పారా, వీటిలో మీ స్వకపోల కల్పితం ఎంత ఉందీ అనేది తెలియలేదనుకోండి. నైతిక విలువలపై స్వంత ఛానెల్ ఏర్పాటు చేసుకోవడం....సూపర్. రామ్ గోపాల్ వర్మ పేరు మార్చక పోతే అతని వివాదాల సరదాలో మీరూ చిక్కుతారని భయపడ్డారా ఏమిటీ.

    రిప్లయితొలగించండి
  2. sudha garu ఆమె చెప్పింది చెప్పినట్టు రాస్తే వార్త అవుతుంది కదండీ . చాలా మంది నాయకులు , నడమంత్రపు సిరి గాళ్ళు , ఈ మధ్య నైతిక విలువల గురించి ఎక్కువగా చెబుతున్న వాఖ్యలను ఉపయోగించుకున్నాను. రాంగోపాల్ వర్మ పేరు అలానే రాయడం కన్నా ఇలా రాస్తే బాగుంటుందని అంతే తప్ప భయం తో కాదు . తారకే బయపడనప్పుడు వర్మకేందుకు భయం

    రిప్లయితొలగించండి
  3. తారా సందేశం నాకు యమాగా నచ్చిందండీ. అభిమానినైపోయాను. ఆమె తారాదేశం అని ఓ పార్టీ పెట్టేస్తే అందులో అర్జంటుగా చేరిపోతాను. ఎప్పటికయినా నాకు అందులో ఏదో ఒకటి అనగా ఏదో ఒక పదవి దక్కకపోదు.

    రిప్లయితొలగించండి
  4. శరత్ గారు తార( సందేశం ) .. అందరికీ నచ్చేసింది .ఆమె తరదేశం పార్టీ పెడితే గెలుస్తున్దంటారా ? నాకయితే అనుమానమే తారలకు తెరచాటు అభిమానులు ఉంటారు కానీ , సహచరులు , ఓటర్లు ఉండరేమో

    రిప్లయితొలగించండి
  5. తారాదేశం పార్టీ పెట్టక కొన్ని రోజుల తరువాత రాజశేఖర్ జీవితాల టీవీ ఇంటర్వ్యూ ఊహించికుందాం:

    రాజశేఖర్: ఒకసారీ వాళ్ళు, కాదు కాదు ఆమె ఫోను న.న.న చేసీ, జీవితా మిగిలింది నువ్వు, నువ్వే చెప్పు
    జీవిత: అదేనండీ మీరు కూడా మా పార్టీ ఆవిష్కరణకు రావాలి అని అడిగారు. అప్పుడు రాజశేఖర్ గారిని నేను అడిగితె ఆయన ఏమన్నారంటే ...
    రా: జీవితా ఆ.. విష్.. కణ అంటే ఏమిటి? అంత న.న.న పెద్ద మాటలు నాకు ..
    జీ: (భర్తతో) అది కాదండీ నేను చెప్తున్నా కదా. (ఆన్కరుతో) అలాగే ఒక మంచి పని చేస్తున్నపుడు మనం కూడా సాయపడుదాం అన్నారాయన. అదే విషయం నేను తారా గారికి చెప్పాను.
    రా: (భార్యతో) ఇంకో విషయము, శయము, కూడా ఉంది. అది కూడా చెప్పు.

    Any ordinary viewer who has endorsed this torture can imagine the rest.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం