14, జూన్ 2012, గురువారం

పిల్లలకు పాకెట్ మనీ ఎంతిస్తున్నారు ? ఎంతివ్వ వచ్చు ?


కొన్నాళ్ళుగా -ప్రపంచ దేశాల్ని ఆర్థిక మాంద్యం కుదిపేస్తోంది. అగ్రదేశాలే అరిటాకులా వణికిపోతున్న ఈ ఆర్థిక త్సునామీ దెబ్బకు -్భరత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కనిపించని గాయాలతో సతమతం అవుతున్నాయి. మానవ జీవన శైలినే మార్చేసేంత ఈ భారీ కుదుపు -కొన్ని అంశాలపై ఎలాంటి పరిణామం చూపించక పోవడం ఆశ్చర్యకర పరిణామం. అందులో -పిల్లలకు అందించే పాకెట్ మనీ వ్యవహారం ఒకటి. మాంద్యం గాలులు నెమ్మదించకముందే -‘అమ్మానాన్న -పిల్లల పాకెట్ మనీ’ అన్న కోణంలో సాగిన ఓ సర్వే విచిత్రమైన అంశాలను తేటతెల్లం చేసింది. పిల్లలపై తల్లిదండ్రులకు ఉన్న ప్రేమానురాగాలు, అదే సమయంలో అమ్మానాన్నలు ఎదుర్కొంటున్న ఆర్థిక అంశాలను అంతర్లీనంగా సమన్వయ పరుస్తూ సాగిన ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తేటతెల్లమయ్యాయి.

 బిడ్డలమీద అమితమైన ప్రేమను చూపించే చాలామంది తల్లిదండ్రులు -ఆ ప్రేమను ఆర్థిక కోణంలోంచే చూస్తున్నారన్న కఠిన వాస్తవం మారుతున్న సామాజిక పరిణామాన్ని కళ్లముందుంచుతుంది. పిల్లల పాకెట్ మనీకి ఎంత ఎక్కువ సొమ్ములిస్తే -అంత ప్రేమను కనబర్చినట్టు. అదీ -అవసరాలను ప్రశ్నించకుండానే పాకెట్ మనీగా ‘క్రెడిట్’, ‘డెబిట్’లాంటి ప్లాస్టిక్ పెంకుల్ని వెదజల్లటం మరో వైచిత్రి. సర్వేలో స్పష్టమైన ఈ మానసిక వైఖరి మార్పు దేనికి సంకేతం? ఒకసారి ఆలోచించాలి. **** ‘ఏరా నా క్రెడిట్ కార్డు నుంచి లక్ష మాత్రమే ఖర్చు చేశావ్. ఇలాగైతే నా పరువేం కావాలి?’ -అమెరికా నుంచి ఓ తల్లి అసంతృప్తి. కొడుకుమీద ప్రదర్శించిన అసహనం. ‘ఖర్చు పెట్టుకోరా అని కార్డిస్తే లక్ష కూడా వాడుకోలేకపోయావ్. ఇంకోసారి ఇలా జరిగితే చచ్చినా కార్డు ఇవ్వను’ -దుబాయ్ నుంచి తండ్రి ఆగ్రహం. ఈ మధ్య వచ్చిన ‘అష్టా చెమ్మా’ సినిమాలో సామాజిక జీవన శైలిలో మార్పుల్ని దృశ్యీకరించిన కొన్ని ఫ్రేముల తాలూకు డైలాగులివి. దేశంలో చదువుకుంటున్న కొడుక్కి, విదేశాల్లో వ్యాపారం నిర్వహించే తల్లిదండ్రులు ఒకేసారి ఫోన్‌చేసి తమ క్రెడిట్ కార్డుమీద బిల్లు తక్కువైందని కొడుకుతో పడిన పేచీ. ‘ఈసారి ఎక్కువ ఖర్చు చేస్తానులే’ అంటూ కన్న తల్లిదండ్రులకు కొడుకు ఇచ్చుకున్న సంజాయిషీ. ఆ.. అది సినిమా సీనే అని కొట్టిపారేయొచ్చు. కానీ, దర్శకుడికి అలాంటి ఆలోచన రావడానికి మూలం ఎక్కడో ఏదో ఉండేఉంటుంది. చిన్నదో పెద్దదో అలాంటి సంఘటన ఎదురయ్యే ఉంటుంది. విచిత్రం ఏంటంటే -ఇలాంటి దృశ్యాలు దేశంలో ఒక వర్గం కుటుంబాల్లో ఇప్పుడు సర్వ సాధారణమైంది.

 చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్ళే సమయంలో రోజుకు మీ నాన్నకు పది పైసలు ఇచ్చేవాడిని తెలుసా? అని పిల్లలకు తాతో బామ్మో చెబితే వాళ్లను వింతగా చూసే పరిస్థితి. పది పైసలు ఎలా ఉంటుందని ఆశ్చర్యపోతారు. పది పైసలతో రోజంతా ఎలా గడిపేవారని ప్రశ్నిస్తారు. ఇప్పటి రోజులు ఇవీ. ఆర్థికంగా ఒక మోస్తరు స్థాయివున్న చాలా కుటుంబాలు -వారంలో ఒకసారైనా అంతా ఒకచోట కూర్చొని గడిపే అదృష్టానికి నోచుకోవడం లేదు. ఆ బాధ పిల్లలకు తెలియకుండా ఉండటానికే, కొదవలేని డబ్బును పాకెట్ మనీగా విసురుతున్నారన్న వాదనా కొంతకాలం బలమైన చర్చనే లేవదీసింది. అలాంటి హద్దులేని పాకెట్ మనీ సంస్కృతే ఇప్పుడు -ప్లాస్టిక్ మనీ స్థాయికి చేరింది అన్నది సర్వేలో తేలిన విచిత్రమైన అంశం. క్రెడిట్ కార్డో, డెబిట్ కార్డో జేబు ఖర్చుల కింద పిల్లలకు ఇవ్వడం ఒక వర్గం తల్లిదండ్రులకు ఇప్పుడు ఫ్యాషన్. వీరి సంఖ్య తక్కువే కావచ్చు. కానీ, ఇది తీవ్రమైన ప్రభావం చూపుతోందన్నది మానసిక శాస్తవ్రేత్తల విశే్లషణ. చదువుకునే కాలేజీల్లో ఇలాంటి పిల్లల పట్ల మిగిలిన వారికి ఆసక్తి పెరుగుతోంది. చూస్తుండగానే, వీరి ప్రభావం క్లాస్ మొత్తంమీద పడుతోంది. తరువాతి పరిణామాలు మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అంటాడు సైకాలజిస్ట్ ప్రభు భరద్వాజ్. దేశంలోని ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలాంటి మహా మెట్రో నగరాలు దాటి మన రాష్ట్రంలోకి ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది ఈ సంస్కృతి. పిల్లలు పాకెట్ మనీ, చేతికందిన సొమ్మును ఖర్చు చేసే విధానంపై ఇటీవల ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు ఐదు మెట్రో నగరాల్లో ఒక సర్వే నిర్వహించారు. కోల్‌కతాలో యువత అతి తక్కువగా నెలకు రెండు వేల రూపాయల పాకెట్ మనీ ఖర్చు చేస్తున్నట్టు తేలింది. అయితే, అక్కడి యువతరం కొంతలో కొంతనయం. పాకెట్‌కు అందే రెండు వేల రూపాయల మనీలో, ఎంతొకొంత రేపటి అవసరాలకూ పొదుపు చేస్తున్న పరిస్థితి లేకపోలేదు. అబ్బాయిలు అయితే, సగటును తొమ్మిది శాతం పొదుపు చేస్తుంటే, అమ్మాయిలు 13శాతం వరకూ పొదుపు చేస్తున్నట్టు సర్వేలో తేలిన వాస్తవం. ఇక దేశంలోని మిగిలిన మెట్రో నగరాల్లో పాకెట్ మనీ ఎంతిస్తే అంతా ఖర్చు చేసేసి, తరువాతి అవసరాల కోసం ఎదురు చూడడమే తప్ప పొదుపనేది కనిపించడం లేదని సర్వేలో తేల్చారు. ముంబయిలో అమ్మాయిలైతే తమ పాకెట్ మనీలో 22శాతం బట్టల కోసం వెచ్చిస్తున్నట్టు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఢిల్లీ అమ్మాయిలైతే పాకెట్ మనీ మొత్తం బ్యూటీపార్లర్‌కు ఖర్చు చేస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. మహానగరాల్లో కాలేజీలకు వెళ్లే పిల్లలకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు ఉండటం ఇప్పటి జనరేషన్‌కు కామన్. -‘ఏటిఎం కార్డు ఉంది కానీ, స్టేట్‌మెంట్ అమ్మానాన్నలకు అందే అవకాశం ఉంది. ఇదే ఇబ్బందికరమైన విషయం. లేదంటేనా.. ’ అంటాడు వర్శిటీ స్టూడెంట్ 

కాలేజీ అమ్మాయిలైతే ఎక్కువగా డ్రెస్‌ల కోసమే ఖర్చు చేస్తున్నట్టు చెప్తున్నారు. తమ గ్రూప్‌లో ఎవరో ఒకరు మంచి డ్రెస్ వేసుకున్నారంటే, పోటీపడి తామూ కొనాలని ప్రయత్నిస్తున్నారు. మార్కుల్లో కంటే డ్రెస్సుల్లోనూ పోటీ కనిపిస్తోంది. తమకన్నా ఒక్క మార్కు ఇతరులకు ఎక్కువ వస్తే సహించకుండా పోటీ పడి మార్కులు ఎక్కువ సాధించే వారు కొందరైతే, డ్రెస్‌లు, ఖర్చుల విషయంలో పోటీపడే వారు ఇంకొందరు. పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వాలా? ఇస్తే ఎంతివ్వాలి అనేది పాకెట్ మనీ సంస్కృతి ప్రారంభమైన నాటినుంచీ సాగుతున్న చర్చ. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు ఇవ్వవచ్చనేది చర్చకు కంక్లూజన్. దీనికీ ఇప్పుడు హద్దులు చెరిగిపోతున్నాయి. పాత సంగతినే ఒకటి ఇక్కడ గుర్తు చేసుకుంటే -నటుడు అక్కినేని నాగేశ్వరరావు కొడుకు నాగార్జున కాలేజీలో చదివేప్పుడు సొంతకారులో కాకుండా ఆర్టీసీ బస్సులోనే పంపేవారట! ‘మీ నాన్న మరీ పిసినారి’ అని అంతా ఆట పట్టిస్తున్నారంటూ నాగార్జున ఇంటికొచ్చి నెత్తి మొత్తుకున్నా అక్కినేని తన విధానాన్ని మార్చుకోలేదు. నాగార్జున మాటలకు నవ్వేసి ఊరుకునేవారు కానీ, బస్సులో పంపడం మాత్రం మానుకోలేదు. ఈ విషయం అనేక సభల్లో ఆయనే చెప్తుకొస్తారు. ‘పిల్లలకు డబ్బు విలువ తెలియాలి. అందుకే నాగార్జునని బస్సులో పంపేవాడిని’ అంటారు అక్కినేని.

 కానీ కొందరు తల్లిదండ్రులు మాత్రం అతి గారాబంతో పిల్లలకు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇచ్చేస్తూ చదువులో కాకుండా డబ్బు ఖర్చు చేసే ఆటలో వారిని ప్రావీణ్యులుగా మార్చేస్తున్నారు. మహానగరాల్లో చాలామంది అబ్బాయిలు తమ పాకెట్ మనీని అమ్మాయిలను ఆకట్టుకోవడానికి ఖర్చు చేస్తున్నారనేది సర్వేలో తేలింది. పిల్లలకు ఎక్కువ డబ్బులిస్తే ఎక్కువగా ప్రేమ చూపినట్టని కొందరు తల్లిదండ్రుల పిచ్చి భావన. పిల్లలకు చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలియాలి. అలాగని పాకెట్ మనీకి దూరంగా ఉంచమని కాదు. ఎంతవరకు అవసరం, ఆ అవసరాలు ఎలాంటివి అనేది గ్రహించి అంతవరకే పరిమితం చేయాలి. అంతే తప్ప హోదా ప్రదర్శనకు పాకెట్ మనీ పెంచితే, పిల్లల జీవితాలతో ఆటలాడినట్టే. చెన్నైలో ఎనిమిది వేల నుంచి 15వేల రూపాయల వరకూ పాకెట్ మనీ ఖర్చు చేసే పిల్లలున్నట్టు సర్వేలో తేల్చారు. రోజుకు 28 రూపాయల సంపాదన కూడా లేక దారిద్య్రరేఖకు దిగువకు చేరుకుంటున్న కోట్లాదిమంది ఉన్న దేశంలో మరోవైపు వేల రూపాయల పాకెట్ మనీ ఖర్చు చేసే నవ యువత పెద్ద సంఖ్యలో కనిపిస్తోంది. ఇది దేనికి సంకేతం? ఎటువైపు దారితీస్తుందీ పరిణామం? యువతరమే ఆలోచించాలి. ఆలోచించుకోవాలి.

4 కామెంట్‌లు:

  1. ఆ పాకెట్టు ఏదో , కత్తిరించేద్దురూ కాస్త! అన్ని తంటాలు తప్పే!

    చీర్స్

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  2. మంచి వ్యాసం. మహిళల గురించి కొత్త విషయాలు,కొన్ని నిజాలు తెలిసాయి. వాళ్లకి చిన్నతనం నుంచి మగవారిని గుండు కొట్టించే విద్య సహజంగా వస్తుందని సాక్షాధారలతో తేటతెల్లమైంది. పురుషులను తమ అవసరాలకి వాడుకోవటం, వాళ్ల దగ్గర ఉన్న డబ్బులను, శ్రమశక్తిని తెలివిగా దోచుకోవడం లో వారిది అందవేసిన చేయి, ఈ బుద్దులు చిన్న తనం నుంచే వారికి సహజంగా వస్తాయని ఈ సర్వే సూచిస్తున్నాది.

    "అబ్బాయిలు అయితే, సగటును తొమ్మిది శాతం పొదుపు చేస్తుంటే, అమ్మాయిలు 13శాతం వరకూ పొదుపు చేస్తున్నట్టు సర్వేలో తేలిన వాస్తవం. ముంబయిలో అమ్మాయిలైతే తమ పాకెట్ మనీలో 22శాతం బట్టల కోసం వెచ్చిస్తున్నట్టు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి ఢిల్లీ అమ్మాయిలైతే పాకెట్ మనీ మొత్తం బ్యూటీపార్లర్‌కు ఖర్చు చేస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. కాలేజీ అమ్మాయిలైతే ఎక్కువగా డ్రెస్‌ల కోసమే ఖర్చు చేస్తున్నట్టు చెప్తున్నారు. మహానగరాల్లో చాలామంది అబ్బాయిలు, తమ పాకెట్ మనీని అమ్మాయిలను ఆకట్టుకోవడానికి ఖర్చు చేస్తున్నారనేది సర్వేలో తేలింది."

    బట్టలు,బ్యూటీపార్లర్‌ కాకుండా ఇంక ఏ ఇతర చానేల్స్ లో ఖర్చు పెడుతున్నారో ఎమైనా వివరాలు ఇచ్చారా? అమ్మాయిలకొరకు ఖర్చు చేసే అబ్బాయీలకు, ఎటువంటి సేవలు లభిస్తున్నాయో ఈ సర్వే లో ఎక్కడైనా చెప్పారా?

    రిప్లయితొలగించండి
  3. మీరు రాసినది చదువుతుంటే బాబోయి అనిపిస్తుంది. ఒక రకంగా ఇక్కడ మా దగ్గర పెరుగుతున్న పిల్లలే నయ్యం. Dollar కర్చు పెట్టేముందు చాలా అలోచిస్తారు. ఒకసారి మా అమ్మాయి పుట్టిన రోజని 100$ ఇచ్చి పంపించాను బయట ఎక్కడన్న treat ఇవ్వమని. వెనక్కి వచ్చాక అడిగాను.8$ మాత్రమే కర్చుపెట్టను అని. అదేంటి అని అడిగితే ఎవరి food కి వాళ్ళే pay చేసామని చెప్పింది. అదేంటి, నువ్వు పిలిచావు కదా వాళ్ళని అంటే, అవసరం లేదు, అలానే ఉంటుంది ఇక్కడ అని. చిన్న వయసులోనే (16 eyars ) నుంచి ఎదో ఒక రకంగా డబ్బు సంపాదించటం మొదలు పెడతారు కాబట్టి వారికి డబ్బు విలువ ఒక రకంగా చెప్పాలంటే మాకంటే ఎక్కువగానే తెలుసు!ఈ ఒక్క విషయం లో మాత్రం ఒక రకంగా అద్రుష్టవంతులమే అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  4. మా పదేళ్ళ పాపకి వారానికి $5 పాకెట్ మనీ ఇస్తానని పొరపాట్న కొన్ని నెలల క్రితం చెప్పా. నేను ఇవ్వకున్నా, మరచినా తన డబ్బు తాను నా దగ్గరి నుండి దౌర్జన్యంగా అయినా వసూలు చేసుకుంటుంది - అనగా నా వాలెట్ నుండి ఎత్తేస్తుంది :) అలా అని ఖర్చు పెడుతుందా - లేదు - దాచుకుంటుంది. మరి తన ఖర్చులో - మేమున్నాంగా.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం