15, జూన్ 2012, శుక్రవారం

ఔను.. రాజకీయ యుద్ధమే! ...ధర్మం గెలుస్తుందా? గెలిచినదాన్ని ధర్మం అనుకుంటున్నామా ?


రాష్ట్రంలో ఒక రసవత్తరమైన యుద్ధం మొదలైంది. అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం ఒకవైపు, కొత్తగా పుట్టిన పార్టీ ఒకవైపు. ఇది ఒకటి రెండేళ్ల పాటు జరిగే యుద్ధం కాదు. సుదీర్ఘ యుద్ధం. మరో రెండేళ్ల భీకరంగా సాగితే కానీ విజేత ఎవరో తేలదు.
రాజ్యాధికారం మత్తు గమ్మత్తయింది. రాజ్యాధికారం కోసం తండ్రిని చంపిన తనయులు ఉన్నారు. రాజ్యం నిలుపు కోవడానికి రాజ్‌పుత్‌లు, మొగలాయిల మధ్య పెళ్లి సంబంధాలు జరిగేవి. ప్రజాస్వామ్యంలో అంతకు మించిన ఎత్తులు పై ఎత్తులు సాగుతున్నాయి. ఇక్కడ అధికారం కోసం మామను పోటు పొడిచే వారుంటారు, తండ్రి మరణాన్ని ఉపయోగించుకునే వారు ఉంటారు. బాబు, బాలయ్యల కుటుంబాల మధ్య పెళ్లి సంబంధాలు, వైఎస్‌ఆర్ కుటుంబ సభ్యుల పెళ్లి సంబంధాల్లో సైతం ఎంతో ముందు చూపుతో సాగిన రాజకీయం ఉంది.
ఈ మహాయుద్ధంలో పోటీ పడుతున్న ముగ్గురిలో గెలిచేది ఒకరు, మిగిలేది మరొకరు, అసలు మాయ మైపోయేది మరొకరు. గెలవాలని ఒకరు గెలవక పోయినా రెండవ స్థానం లో నిలవాలని ఒకరు. బతికి బట్టకట్టాలని మరొకరు. మహా యుద్ధం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ రాజకీయ బతుకు పోరాటంలో జాలి దయ ఏమీ ఉండదు. ఒకరు బతకాలంటే ఒకరిని మింగక తప్పదు.
ప్రేమలో, యుద్ధంలో ఏమైనా చేయవచ్చునంటారు. సాయంత్రం సమయంలో యుద్ధం చేయవద్దని, నిరాయుధుడిపై ఆయుధాన్ని ప్రయోగించవద్దని యుద్ధంలో కొన్ని నిబంధనలుంటాయి. రాజకీయ యుద్ధంలో ఆ మాత్రం ఆంక్షలు కూడా ఉండవు. రాజకీయ యుద్ధంలో ఏదైనా చేయవచ్చు. ఇక్కడ యుద్ధ రంగం విస్తృతమైంది. యుద్ధ కాలం సుదీర్ఘమైనది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది రాజకీయ యుద్ధం. జగన్ అరెస్టు సైతం ఈ యుద్ధంలో భాగమే. రాజకీయ యుద్ధంలో జాలి, దయ ఏమీ ఉండదు. గెలుపు కోసం ఏమైనా చేయవచ్చు. జగన్ యుద్ధాన్ని ప్రారంభించాడు. అల్లా టప్పా యుద్ధం కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురు లేని కాలంలో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి, అధికారంలోకి వచ్చారు. రామారావు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను భూ స్థాపితం చేశాడని ఆయన అభిమానులు అంటుంటారు. నిజానికి రామారావు రాష్ట్రంలో కాంగ్రెసేతర పక్షాలను భూ స్థాపితం చేశారు. రామారావు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న పక్షాల ఓట్లను ఏకం చేశారు. అప్పటి వరకు దాదాపుగా 33శాతం వరకు ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకును తెలుగుదేశం ఏర్పాటు తరువాత ఎన్టీఆర్ మూడు శాతం మాత్రమే తగ్గించారు. జగన్ అలా కాదు తన రాజకీయ భవిష్యత్తు కోసం మొత్తం కాంగ్రెస్‌ను భూ స్థాపితం చేసే విధంగా యుద్ధం ప్రారంభించారు.
చివరకు కాంగ్రెస్ వ్యతిరేకత అనే సిద్ధాంతంపైనే రాజకీయ జీవనం సాగిస్తున్న టిడిపి సైతం భయపడే విధంగా జగన్ యుద్ధాన్ని ప్రారంభించారు. కడప పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కలేదు. పులివెందులలో స్వయంగా వైఎస్‌ఆర్ సోదరుడు పోటీ చేస్తే డిపాజిట్ మాత్రమే దక్కింది. ఇక కోవూరులో కాంగ్రెస్ మూడవ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును జగన్ ఏ మేరకు చీల్చగలడో అంచనాకు వచ్చిన కాంగ్రెస్ హై కమాండ్ చురుగ్గానే పావులు కదిపింది. 

కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు ఉపయోగపడిన ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను దెబ్బతీయడం అంటే ఢిల్లీలో కాంగ్రెస్‌ను చావు దెబ్బతీయడమే. నువ్వు గొంతు నులమాలనుకున్నప్పుడు కాంగ్రెస్ వౌనంగా ఎందుకు ఉంటుంది. ఆత్మ రక్షణ కోసం హత్య చేసినా తప్పు లేదంటుంది చట్టం. జగన్‌ను రాజకీయంగా హతమార్చడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తను కాపాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. దానిలో భాగంగానే జగన్ అరెస్టు.
ఈ యుద్ధంలో జగన్‌వి రెండు లక్ష్యాలు. తనను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌ను అంతం చేయడం, అధికారం చేపట్టడం. రెండవ లక్ష్యం ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి కానీ మొదటి లక్ష్యం ఇప్పటికే సాధించారు. ఉప ఎన్నికల ఫలితాల తరువాత ప్రభుత్వం బతికి ఉండాలంటే జగన్ జైలులో ఉండాలి. ప్రభుత్వ మనుగడ కోసం జగన్‌ను అరెస్టు చేశారంటే, జగన్ తన మొదటి లక్ష్యాన్ని సాధించినట్టే. జగన్ కాంగ్రెస్‌ను వీడి వెళ్లకుండా ఉండినా, ఇప్పుడు వైఎస్‌ఆర్ ఉండి ఉండినా ఈ అరెస్టు జరిగేదా?
అవినీతి అంతమే కాంగ్రెస్ లక్ష్యం, దాని కోసమే అరెస్టులు అని నమ్మే పరిస్థితి లేదు. మద్యం మాఫియాపై ఎసిబి నివేదిక ఇస్తే మాఫియాను ఏమీ చేయకుండా అధికారులను మాత్రం బదిలీ చేశారు. బినామీ పేర్లతో తనకు వైన్ షాపులు ఉన్నాయని ఒప్పుకున్న పిసిసి అధ్యక్షున్ని విచారించడం లేదు.
రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని సాక్షిలో పెట్టుబడులు పెట్టించారని సిబిఐ ఆరోపణ. ఇప్పుడు సిబిఐ చెబుతున్న విషయాలు ఈ రోజు కొత్తగా సిబిఐ పరిశోధించి కనుక్కున్నవేమీ కాదు. గత ఆరేళ్ల నుంచి ఈ విషయాలను ప్రధాన ప్రతిపక్షం ప్రతి రోజూ చెబుతున్నవే. ప్రధాన మంత్రికి, సోనియాగాంధీకి, వివిధ విచారణ సంస్థలకు ఈ వివరాలన్నీ టిడిపి ఆధారాలతో పాటు పుస్తకాలు అందజేసింది. వైఎస్‌ఆర్ ఉన్నప్పుడే ఈ ఫిర్యాదులు చేశారు. వైఎస్‌ఆర్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం అధికారం చలాయించింది కెవిపి రామచంద్రరావు. భారీ వ్యవహారాలన్నీ ఆయన సమక్షంలోనే జరిగేవి. కెవిపి సూట్‌కేసులను ఢిల్లీ హై కమాండ్‌కు అందజేస్తున్నారని టిడిపి పలు సార్లు ఆరోపించింది. సిబిఐ రాజకీయాలతో సంబంధం లేకుండా విచారణ జరిపితే మరి కెవిపిని విచారించాలి. వైఎస్‌ఆర్ కెవిపిని తన ఆత్మగా చెప్పుకున్నారు. ఆయన ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నారు కాబట్టి ఆయన్ని విచారించరు. రాష్ట్రం నుంచి నిధులు ఢిల్లీకి వెళ్లాయని, అందుకే సోనియాగాంధీ వైఎస్‌ఆర్ అక్రమాలపై వౌనంగా ఉన్నారు అని గతంలో టిడిపి ఆరోపించింది. సిబిఐ దీనిపై కనీసం విచారించింది. లేక కాంగ్రెస్ హై కమాండ్ అలా డబ్బులు తీసుకునే రకం కాదు,సచ్ఛీలమైనది అని సిబిఐ భావిస్తుంటే, అదే విషయాన్ని ప్రకటించాలి. జగన్ కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చినప్పటి నుంచే అలా జరిగితే ఆయన ఆస్తులపై విచారణ జరిపిస్తారు అనే వార్తలు వచ్చాయి. ఒకవేళ కాంగ్రెస్ నిజంగా అవినీతిపై యుద్ధం ప్రకటించాలనుకుంటే జగన్ పార్టీ వీడి బయటకు వెళ్లిన తరువాతనే ఆ పని చేయాలా? వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు, జగన్ కాంగ్రెస్‌లోనే ఉన్నప్పుడు వారి అవినీతి గుర్తుకు రాలేదా? అంటే పార్టీలో ఉంటే ఎలాంటి అవినీతికి పాల్పడినా పరవాలేదు. పార్టీ వీడి వెళితే సహించేది లేదు వెంటపడి వేటాడుతామని కాంగ్రెస్ చెప్పదలుచుకుందా? వివాదాస్పదమైన 26 జివోలను రద్దు చేయడం లేదు, ఆ జివోలకు సంబంధించిన మంత్రులను విచారించడం లేదు. మద్యం మాఫియాపై ఎసిబి నివేదికపై నోరు మెదపడం లేదు కానీ పార్టీ వీడి వెళ్లిన వారిపై మాత్రం యుద్ధం ప్రకటించింది. 

రాష్ట్రంలో రాజకీయాలు భారీ పెట్టుబడితో కూడిన ఖరీధైన వ్యాపారంగా రెండు దశాబ్దాల క్రితమే మారిపోయాయి.
అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి 15లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. అంత కన్నా ఎక్కువ ఖర్చు చేస్తే అనర్హుడు అవుతారు. అయితే మనకు అంత మాత్రమే ఖర్చు చేసిన ఎమ్మెల్యే ఒక్కరూ కనిపించరు. అంత కన్నా ఎక్కువ ఖర్చు చేశారని ఒక్కరిని కూడా నిరూపించడం సాధ్యమూ కాదు. ఓసారి అసెంబ్లీలో అవినీతి చర్చ తరువాత బయటకు వచ్చి విలేఖరుల ముందు ఒక ఎమ్మెల్యే ఇంతటి అవినీతి మయమైన అసెంబ్లీలో నేను సభ్యుడినైనందుకు సిగ్గుతో తలదించుకుంటున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సరే ఎన్నికల్లో మీరెంత ఖర్చు చేశారు అని ప్రశ్నిస్తే రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్యే గట్టిగా నవ్వి నేను ఏడు కోట్లు ఖర్చు చేశాను. నువ్వెంత ఖర్చు చేశావో చెప్పు అని ఆ నీతుల ఎమ్మెల్యేను అడిగితే, అతను చెప్పడానికి నిరాకరించారు. ఆ ప్రాంతంలో కనీసం పది కోట్లు ఖర్చు చేస్తే కానీ గెలవరు. చివరకు అతను సరే నేను ఆ విషయంలో తప్పు చేశాను, కాబట్టి అవినీతిపై మాట్లాడే హక్కు లేదా? అని అడిగాడు. మీరు చేసిన ఖర్చు ప్రకారం అసలు మీరు సభలోకి అడుగు పెట్టే అర్హతనే లేదు కదా? నిజంగా ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన వాళ్ళను సభలోకి రాకుండా చేసి కోట్లు ఖర్చు చేసి మీరు వస్తున్నారు అంటూ ఆ చర్చ సాగింది.
రాజకీయాలను భారీ పెట్టుబడుల వ్యాపారంగా మార్చి సామాన్యులు, నిజంగా సమాజం కోసం ఆలోచించే వారు అసెంబ్లీవైపునకు వచ్చే అవకాశం లేకుండా చేశారు. బట్ట సంచి భుజాన వేసుకుని అసెంబ్లీకి వచ్చిన వావిలాల గోపాలకృష్ణయ్య, పార్లమెంటుకు సైతం సైకిల్‌పై వెళ్లిన పుచ్చల పల్లి సుందరయ్య, తన భూమిని మొత్తాన్ని ప్రజలకు పంచి, భారీ మెజారిటీతో నెహ్రూనే ఆశ్చర్యపరిచిన రావినారాయణరెడ్డిల కాలం కాదిది. ఇప్పుడు రాజకీయం అంటే భారీ వ్యాపారం. భారీ వ్యాపారంలో భారీ పెట్టుబడులు పెట్టాల్సిందే. అటువంటివారే నిలుస్తారు.
వ్యాపారం అన్నాక చిక్కులు, సమస్యలు, లాభాలు, నష్టాలు సహజం. కులం, మతం, ప్రాంతంతో పాటు అనేక అంశాలను చూసి జనం ఓటు వేస్తారు, పార్టీల యజమానులు వ్యాపారం చేస్తారు. ఈ వ్యాపారంలో ఒకరు జైలుకు వెళ్లారని, ఒకరు జైలుకు పంపారని, అధికార పక్షం, ప్రతిపక్షం వ్యాపారులు కుమ్మక్కు అయి మూడో వ్యాపారిని రాకుండా చేస్తున్నారని బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు వ్యాపారం మొదలు పెడితే పోటీ వ్యాపారుడు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతాడా? వ్యాపారం అంటే ఎంత కష్టమో చూపిస్తాడు.
ఈ యుద్ధంలో మతాలు, కులాలు, ప్రాంతాలు తమ తమ పాత్రను పోషిస్తాయి. ధర్మం గెలిచిందని చెబుతూ సంతృప్తి చెందుతారు. కానీ నిజానికి ధర్మం ఎప్పుడూ గెలవదు. గెలిచిందాన్ని ధర్మం అనుకుంటున్నాం.. అంతే!!

14 కామెంట్‌లు:

  1. >>> అయితే మనకు అంత మాత్రమే ఖర్చు చేసిన ఎమ్మెల్యే ఒక్కరూ కనిపించరు

    కేవలం ౪ లక్షలే ఖర్చు చేసి గెలిచిన జె.పి వున్నారు కదా. కమ్యునిస్టులు కూడా అంతో ఇంతో పరవాలేదనుకుంట వారి గురించి ఎందుకు చెప్పరు. మీ విశ్లేషణ మొత్తం రాజకీయం గురించి అయితే అది కూడా చెప్పాలి కదా. ప్రజలు ఈ డబ్బు ఖర్చు గురించి పట్టించుకోకపోవటానికి ఇలాంటి వాస్తవాలను విస్మరించే మీలాంటి వారి విశ్లేషణలు కూడా కారణం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత గారు మీరు చెప్పిన అంకె ఆయన పంచిన విజిల్స్ కు కూడా సరి పోదు . మిగిలిన ప్రాంతల సంగతి తెలియదు కానీ హైదరాబాద్ లో మాత్రం ౨౦౦౯ ఎన్నికల్లో ఆయన పార్టీ మిగిలిన ఏ పార్టీకి తీసిపోని విధంగా ఖర్చు చేశారు

      తొలగించండి
    2. ఆయన సాంప్రదాయ రాజకీయాలకు వ్యతిరేకి .. కానీ ఆయన నియోజక వర్గాన్ని ఎన్నుకున్నది సాంప్రదాయ రాజకీయాల్లో బాగంగానే ... అది కాకుండా ఆయన మారే నియోజక వర్గం ఎంపిక చేసుకున్న ఆయన పార్టీ నుంచి సభలో ప్రాతినిధ్యం ఉండేది కాదు. చివరకు ఆయన మొన్న తన నియోజక వర్గం లోని ఒక వార్డు ఉప ఎన్నికల్లో పోటీ చేయండి ఆ సాంప్రదాయ ఎన్నికల్లో బాగంగానే

      తొలగించండి
    3. విజిల్స్ పంచితే కోట్లకు కోట్లు ఖర్చు అవుతాయా..మురళి గారు మీరు చెప్పింది చాల హాస్యాస్పదంగా వుంది . ఎన్నికలలో పోటీకి అస్సలు డబ్బులు లేకుండా పోటీ చెయ్యటం ప్రపంచం లో ఎక్కడా సాధ్యం కాదు. అనైతిక(డబ్బు పంచటం) మార్గాలలో ఖర్చు పెట్టడడమే సమస్య. జర్నలిస్టులు మీకు ఆ విషయం విడమర్చి చెప్పక్కర్లేదనుకుంటాను. డబ్బులు పంచకుండా మిగిలిన పార్టీలతో సమానంగా ఖర్చు పెట్టడం ఎలా సాధ్యమో కనీసం నోటి లెక్కగా అయినా వివరిస్తే తరిస్తాము.

      తొలగించండి
    4. మీరు డబ్బులు గురించి మాట్లాడరు గనక ఈ విషయం ప్రస్తావించాను. దానికి సమాధానం గా మీరు ఆయన సంప్రదాయ రాజకీయాలు అని వేరే కోణం తీసుకు వచ్చారు. దానికి కూడా వివరణ ఇవ్వొచ్చు గాని, మీకు వ్యక్తిగతంగా లోక్సత్తా అంటే అయిష్టం వున్నట్టు కనపడుతున్నది గనక నా సమయం వృధా అని భయపడుతున్నా.. ఎందుకంటే అప్పుడు దానికి సమాధానంగా మీరు ఇంకో కోణం తీసుకు వస్తారు.

      తొలగించండి
    5. మీరు లోక్ సత్తా వీరాభిమాని అనుకుంటాను కాబట్టి మీతో వాదించడం naa సమయం వృదా అనుకుంటున్నాను ( మీ భాష లోనే )

      తొలగించండి
  2. >>>కానీ నిజానికి ధర్మం ఎప్పుడూ గెలవదు. గెలిచిందాన్ని ధర్మం అనుకుంటున్నాం.. అంతే!!

    సత్యం పలికారు. ఇది ఒక్క రాజకీయాలలోనే కాదు. అన్ని చోట్లా. బలహీనుడికి మనుగడ కష్టం అవుతోంది.

    రిప్లయితొలగించండి
  3. ఓడిన వారూ గెలిచినవారూ అందరూ ధనస్వామ్య భాగస్వాములు. ఒక తానులో ముక్కలే. పిచ్చి వాళ్ళం మనమే. ఎవరూ ధర్మాత్ములు లేరు.

    రిప్లయితొలగించండి
  4. చక్కగా విశ్లేషించారు

    రిప్లయితొలగించండి
  5. ఎప్పటి ధర్మం అప్పుడు గెలుస్తుంది!

    http://teepi-guruthulu.blogspot.co.uk/2012/06/blog-post_14.html

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. "గెలిచిందాన్ని ధర్మం అనుకుంటున్నాం" you nailed it.

    రిప్లయితొలగించండి
  8. మీ విశ్లేషణ బాగుంది. సుందరయ్య - వావిలాల - రావి నారాయణరెడ్డిల కాలం కూడా కాదిది.

    ఎన్నికలలో ఎక్కువ తక్కువ ఖర్చు అనేది ప్రజల చైతన్యం ను బట్టి కూడా ఉంటుంది. ప్రజల చైతన్యం వ్యవస్థను బట్టి ప్రభావితమవుతుంది.

    ఇప్పటి పరిస్తితులలో అందరూ డబ్బులు విచ్చలవిడిగానే ఖర్చు చేస్తున్నారు అనేది కూడా సరయినది కాదు. ఉన్నంతలో మెరుగ్గా ఉన్నవారూ ఉన్నారు. అవినీతికి దూరం గా ఉన్న ఎం.ఎల్.ఏ లు - పార్లమెంట్ సభ్యలు స్వంత ఆస్తిని కూడ బెట్టుకోని ముఖ్యమంత్రులు - మంత్రులు ఉన్నారు.

    వారిని సరిగా విశ్లేషించాలే తప్ప అందరినీ ఒకేగాటన కట్టడం వల్ల పాజిటివ్ వైఖరి దెబ్బతింటుందని నా అభిప్రాయం. ఉన్న వ్యవస్థను ఉన్న పరిస్తితులతోనే ఉన్నంతలో ఎప్పటికప్పుడు మెరుగ్గానే బాగు చేసుకోవాలి. అలా ప్రయత్నాలు చేస్తున్నవారూ ఉన్నారు.

    ప్రజలు జగన్ ను సమర్ధించేది జగన్ అవినీతిని కాదు. ప్రభుత్వ కుట్రను - ప్రతిపక్షం లోపాయికారీతనాన్ని మాత్రమే. ఉన్నంతలో ఈ రెండింటిని ఎదుర్కునే శక్తివంతుడిగా ప్రజలు జగన్ ను గుర్తిస్తున్నారు.

    ఎన్ని దుకాణాలు ఉంటే ప్రజలకు అంత మంచిది.రాజకీయం లాభసాటి వ్యాపారంగా మారింది. పత్రికల ద్వారా-వ్యాపారాల ద్వారా రాజకీయాలను శాసించాలనుకునేవారికి జగన్ కొరకరాని కొయ్యగా మారినందునే సీ.బీ.ఐ విచారణ జరుగుతుంది తప్ప, న్యాయాన్ని నిలబెట్టేందుకు కాదు.

    అందుకే ఈ రోజు ఎన్నికల ఫలితాలలో ప్రజలు సీ.బీ.ఐ ని చీ కొట్టారనే చెప్పాలి. సీ.బీ.ఐ కాదది చీ.బీ.ఐ . కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్. కేవలం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక సోనియా ప్రయోగించిన ఓ అస్త్రమది.అదో రాజకీయ వెకిలిచేష్ట. కొందరి మేధావుల అసహనం కుట్రపూరిత కుమ్మక్కుల కుటిలనీతి. దానిని ప్రజలు గమనించి వాల్ల చేష్టలను అసహ్యించుకునే సరైన తీర్పునే ఇచ్చారు. కేవలం సానుభూతి అయితే పరకాలలో సురేఖ కూడా గెలిచేది. అయితే ఇది ఎల్ల కాలం కొనసాగదు. ప్రజల చైతన్యం ఎప్పుడూ ఒకేలా ఉండదు.

    అయితే జగన్ ( వై.ఎస్.ఆర్ కూడా ) ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు వారిని ఎదుర్కునేందుకు అదే అవినీతిని మరింత ధైర్యం గా చేపట్టాడు. కేవలం విశ్వసనీయత - నాయకత్వ లక్షణాలు ఉండి అవినీతి చేస్తే అవినీతి అవినీతి కాకుండా పోదు. ప్రజల తీర్పు - న్యాయస్థానాల తీర్పులను విడివిడిగా చూడాలి. ప్రజలు ఇచ్చిన మద్దతుని అవినీతికి మద్దతుగా భావించకూడదు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం