2, ఆగస్టు 2012, గురువారం

ఇంటర్వ్యూ కు వెలుతున్నారా ? అక్కడ ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు

‘ప్రతాప్.. చాన్స్ కొట్టావయ్యా. మొత్తంమీద బోర్డుని మెప్పించావ్. ఉద్యోగానికి నువ్వు ఎంపికైనట్టే..’ ఇంటర్వ్యూ బోర్డు చీఫ్ డైలాగులు ప్రతాప్‌ని ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. ఫైనల్ ఇంటర్వ్యూలో ఎంపికయ్యాడు కనుక, ఇక ఉద్యోగం వచ్చేసినట్టే. కళ్లు మెరుస్తుంటే ఆనందంతో వొళ్లంతా తుళ్లిపడింది. దిగ్గున కుర్చీలోంచి లేచాడు. ‘్థ్యంక్యూ సర్ థ్యాంక్యూ. నా జీవితాశయం నెరవేరింది. ఇలాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయాలని ఎన్నాళ్లనుంచో కంటున్న కల నేటికి నెరవేరింది’ -ఆనందంలో అప్రయత్నంగా పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పేశాడు. పని చేస్తే ఈ కంపెనీలోనే పని చేయాలని కంకణం కట్టుకున్నానని కూడా అనేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి.. ఆ తరువాతే, టంగ్ స్లిప్పయ్యాడు. కొంప కొల్లేరు చేసుకున్నారు. 


అదెలాఅంటే..? ‘సార్.. కంపెనీలో ఉద్యోగం దొరికేసింది. సో.. మిగిలిన విషయాల వివరాలు కూడా చెప్తే..’ ‘మిగిలిన వివరాలా? ఏంటయ్యా అవి’ కూల్‌గా అడిగాడు ఇంటర్వ్యూ చేసిన పెద్దాయన. ‘అదేసార్.. పెర్క్స్, లీవులు గట్రా. మొదటి నెలలోనే లీవులిస్తారా? లీవుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరమేమీ ఉండదుగా మన దగ్గర? నాకు బంధువులు స్నేహితుల సంఖ్య ఎక్కువ. ఎలాంటి కార్యక్రమానికైనా నేనే అటెండవ్వాలి. అందుకని..’ ప్రతాప్ ప్రశ్నల పరంపర ఇంకా పూర్తికాలేదు. ఈసారి ఇంటర్వ్యూ చేసిన పెద్దాయన దిగ్గున లేచ్చాడు. ఆయన కోపం నషాళానికి అంటిందన్న విషయం ఆయన ముఖంమీదే కనిపిస్తుంది. ‘అసలు నీకు బుద్దివుందా? ఇంకా పూర్తిగా ఉద్యోగంలో చేరనేలేదు. అప్పుడే లీవుల గురించి వివరాలు అడుగుతున్నావ్. నీలాంటోడిని ఉద్యోగంలో పెట్టుకుంటే అంతేసంగతులు. సెలవులు పెట్టడమన్నది అంటువ్యాధి లాంటిది. నీనుంచి పక్కవాళ్లకు అంటుకుంటే, అప్పుడు మేం పెట్టాలి కంపెనీకి సెలవులు. ఉద్యోగం లేదు.. గాడిద గుడ్డూలేదు. ఫో’ కసురుకున్నాడు ఇంటర్వ్యూ చేసిన పెద్దాయన. ‘సార్.. సార్’ అంటూ వేడుకుంటున్నాడు ప్రతాప్.


 *** 
తీవ్రమైన కరెంట్ కట్‌తో ఫ్యాన్ ఆగిపోయి మెళకువ వచ్చింది ప్రతాప్‌కు. చమటలు పట్టేసిన ముఖం ఆందోళనగా ఉంది. అప్పుడు అర్థమైంది, తాను ఎమ్మెన్సీ కంపెనీలో లేనని, ఇంట్లో బెడ్‌రూంలోనే ఉన్నానని. ‘ఇది కలా?’ అనుకున్నాడు మనసులో. గడియారం వంక చూశాడు. ఫైనల్ ఇంటర్వ్యూకు వెళ్లే టైమైందన్న విషయాన్ని గడియారం వికృతంగా చూపెట్టింది. రాత్రంతా ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్లాలన్న ఆలోచనలే ముసరటంతో, తెల్లవారుజామున పిచ్చి కల వచ్చింది. ‘కల కలవరపెడితే పెట్టిందిగానీ, ఇంటర్వ్యూలో పిచ్చి వేషాలేసి, తలతిక్క విషయాలేవీ మాట్లాడకూడదని చెప్పి పుణ్యం కట్టుకుంది’ అనుకున్నాడు ప్రతాప్. మంచం దిగి నీట్‌గా తయారై ఇంటర్వ్యూని ఫేస్ చేయడానికి కొత్త ఉత్సాహంతో బయలుదేరాడు. *** ఇది పోటీ యుగం. కనుక చదువుల్లో -నేటి యువత బాగానే రాణిస్తోంది. ప్రతిభ నీ ఒక్కడి సొత్తేకాదన్న విషయాన్ని పదేపదే చెబుతున్నట్టు -ఎక్కడికెళ్లినా పోటీ పోటీ. ఒకరిని మించి ఒకరు పోటీలో తలపడుతున్నారు. కానె్వంట్ స్కూల్లో చదివేటప్పుడు, క్లాసే ప్రపంచమైనప్పుడు, క్లాస్‌లో నెంబర్‌వన్‌గా నిలిచినప్పుడు మనల్ని మించినవాడు లేడన్న భావన కలుగుతుంది. తరువాత -టెన్త్ పరీక్షలు రాసే సమయానికి మనకంటే పుడింగులు చాలామందే ఉన్నారని లోకజ్ఞానం కొద్దికొద్దిగా అబ్బుతుంది. టెన్త్ గండాన్ని గట్టెక్కి ఇంటర్ చదువులో చేరగానే, కార్పొరేట్ కాలేజ్‌లో వారం వారం నిర్వహించే ఇంటర్నల్ పరీక్షల్లో మన మార్కుల్ని చూసుకున్నాక -మనకంటే పుడింగులు కొన్ని వేలమంది రాష్టవ్య్రాప్తంగా ఉన్నారన్న జీవిత సత్యం అవగాహనకు వస్తుంది. నానా తంటాలు పడి ఎలాగోలా ఇంటర్‌లో ర్యాంకు పట్టి సాంకేతిక విద్యకో, వృత్తివిద్యకో పరుగుతీశాక -అసలు తత్వం అప్పుడు బోధపడుతుంది. ఇంతకాలం మనం ఊహించిన దానికంటే ప్రపంచం చాలా విస్తృతమైందని, ప్రపంచంలో మనతో పోటీపడే పుడింగులు లెక్కపెట్టలేనంత మంది ఉన్నారన్న విషయం. అదిచూసి దిగులుపడి పరుగుకు బ్రేకులు వేసేవాళ్లు చాలామందే కనిపిస్తారు. దిగులును పక్కకునెట్టి, దాన్ని వంటబట్టించుకోకుండా ‘మన కోసం ఏదోకటి ఉండకపోదులే’ అని పరుగులు తీసేవాళ్లూ కనిపిస్తారు. ఎవరి శక్తి సామర్థ్యాల మేరకు వారికి అవకాశాలు లభిస్తుంటాయి. అవకాశాల కోసం ఆశావాహ దృక్పధంతో ఎదురు చూడాలి తప్ప, పోటీ ప్రపంచంలో పోటీని చూసి పోటీ పడలేమేమోనన్న భయంతో నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు నైపుణ్యం పెంచుకుంటే పోటీలో కొందరికంటే ముందే ఉండొచ్చు. హిట్టు కొట్టిన మార్కులతో పైతరగతిలో సీటు సంపాదించగలమేమోగానీ, ఉద్యోగం సంపాదించటానికి మార్కులు ఒక్కటే ప్రాతిపదిక కాదన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇది అర్థంగాకే అకడమిక్ కెరియర్‌లో అత్యున్నత మార్కులు సాధిస్తున్న చాలామంది, అవగాహనతో ఎదుర్కోవాల్సిన ఇంటర్వ్యూల్లో మాత్రం చతికిలపడుతున్నారు.


 ఇటీవల కొన్ని సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెలుగుచూసిన వాస్తవాలివి. అలాంటి జాబితాల్లో పైన చెప్పుకున్న ప్రతాప్‌లాంటి కుర్రాళ్లు ఉండొచ్చు. ఉద్యోగం సంపాదించడానికి మార్కులొక్కటే సరిపోదు. వాటితోపాటు అనేక విషయాలు అక్కడ పరిశీలనకు వస్తాయి. కంపెనీ కల్పించిన ఉద్యోగావకాశాన్ని సమర్థంగా నిర్వర్తించగల సామర్థ్యం ఉందా? అన్న పరీక్ష నుంచి అవి ప్రారంభమవుతాయి. ఇంటర్వ్యూ అంటే -తెలుగు సినిమాల్లో చూపినట్టుగా ఉండదన్న విషయాన్ని మొట్టమొదట గుర్తెరగాలి. నైలు నది పొడవెంత? భూమి బరువెంత?లాంటి తలతిక్క ప్రశ్నలు సంధించేసి, తరువాత తాపీగా ఉద్యోగాన్ని ముందే రికమండేషన్‌తో ఎవరికో ఇచ్చేశారని తెలుసుకునే తెలుగు సినిమాల్లోని సన్నివేశాలూ అక్కడ ఉండవు. ప్రశ్నించటం, పరిప్రశ్నలు సంధించటం, సమాధానాలు చెప్పడంలో భాగంగా మనతో చర్చలో పాల్గొని అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయటంలాంటి విచిత్రమైన పరీక్షలు అక్కడ ఎదురవుతాయి. మన వ్యక్తిత్వాన్ని, పనితీరును అంచనా వేసుకునే లెక్కలుంటాయి. సాధారణంగా 25ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇస్తే -ఆ అభ్యర్థిని ఆ కంపెనీ 30 ఏళ్లపాటు భరించాల్సి ఉంటుంది. మరి 30ఏళ్లపాటు మీతో పని చేయించుకోవాల్సిన కంపెనీ -ఒక్క ఇంటర్వ్యూతోనే మిమ్ములను పూర్తిస్థాయిలో అంచనా వేయాలంటే ఎంత వర్కవుట్ చేయాలి. లేదూ కంపెనీకి (మారకుండా పని చేసే పరిస్థితిలో. కానీ, కొత్త జనరేషన్‌లో కెరీర్ ఉన్నతికోసం కప్పగంతులే ఎక్కువగా ఉంటున్నాయి) 30ఏళ్లపాటు మీరేం ఇవ్వగలరో వాళ్లు అంచనా వేసుకునే సమాచారం, నమ్మకం ఇవ్వగలగాలి. అకడమిక్ చదువుల్లో ఉన్నతి సాధించిన వాళ్లు చాలామంది సైతం ఈ ‘ఎడ్యుకేషన్’లోనే ఫెయిల్ అవుతున్నారని దీనిపై సర్వేలు నిర్వహించిన సంస్థలు చెప్తోన్న మాట. *** ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై కొన్ని సంస్థలు స్వల్పకాలిక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి. అలాంటి సంస్థల్లో శిక్షణ తీసుకోవడం మంచిది. కొన్ని కార్పొరేట్ కాలేజీలు అయితే, విద్యార్థుల చివరి ఏడాదిలో ఈ తరహా శిక్షణను కూడా నిర్వహిస్తున్నాయి. ఇంటర్వ్యూ ఫేస్ చేసేటపుడు కచ్చితంగా చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. ఇంటర్వ్యూ ఫేస్ చేసేటపుడు మన తలంపులోకి రాకూడదని ఒకేఒక్క విషయం -సెలవు’ అంటాడొక మానసిక నిపుణుడు. పన్నీ విషయంలా కనిపించినా ఇదే వాస్తవం. లీవుల గురించి ఆసక్తి చూపకండి. కొత్త సంస్థలోకి మారేటప్పుడు -ఆ సంస్థ వ్యక్తుల్ని మెప్పించేందుకు పాత సంస్థపై విమర్శలు చేయకండి. అదే కొంప ముంచుతుంది. మీ సంస్థలో పని చేయాలనే ఆసక్తితో వచ్చానన్న అంశాన్ని మాత్రమే ప్రస్తావించాలి.


 అలాగే, ఈ సంస్థలో పైకి ఎదగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని మాత్రమే పాజిటివ్ కోణంలో చెప్పాలి. జీతభత్యాల విషయం ఇంటర్వ్యూ నిర్వహించేవారు ప్రస్తావించే వరకూ మీరు మాట మొదలుపెట్టొద్దు. సాధ్యమైనంత వరకు జీతం ఎంతిస్తారు? మిగిలిన వారికి ఎంతిస్తున్నారు? లాంటి పిచ్చిప్రశ్నలు మనల్ని గేటుబయట నిలబడేలా చేస్తాయి. మీ దృక్పథం దుస్తుల్లో ప్రస్ఫుటమయ్యేలా డ్రెస్ వేసుకోవటం మంచిది. ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే చిన్న చిర్నవ్వు మనలోకి చాలా లోపాల్ని కవర్ చేస్తుంది. అందుకే మందహాసులై ఉండండి. ............

1 కామెంట్‌:

  1. అనుభవం తక్కువ ఆవేశం ఎక్కువ అయిపోయిన రోజులండీ, మన మాటలు వింటారా? చెప్పడం మనధర్మం..వినకపోతే వాళ్ళ ....

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం