26, ఆగస్టు 2012, ఆదివారం

దేశం లో నైతిక విలువలు దిగుమతి చేసుకుందాం


నైతిక కరువు!


విద్యుత్ కొరత రాష్ట్రాన్ని ఊపిరాడకుండా చేస్తోందని మనం వాపోతుంటే , సర్లేండి ఈ కొరత తీర్చడం పెద్ద కష్టమేమీ కాదు కానీ దేశాన్ని పీడిస్తున్న అసలైన కొరత గురించి ఆలోచించండి అని మాజీ కేంద్ర మంత్రి దినేశ్ త్రివేది సెలవిచ్చారు. పక్క రాష్ట్రాల నుంచో పక్క ఖండం నుంచో కావాలసినవి తెచ్చుకోవచ్చు కానీ అసలు కొరత గురించి ఆలోచించండి అంటున్నారాయన. చైనా నుంచి దిగుమతికి సైతం అవకాశం లేదు. చైనా ఎగుమతి చేయలేంది ఉంటుందా? మేం నమ్మమంటే నమ్మం అని అనుకోవచ్చు. కానీ ఆయన చెప్పింది విన్నాక నిజమే అని ఒప్పుకోవలసిందే! 

ఇంతకూ ఆయన చెప్పిన కరువు ఏమిటంటే? దేశంలో నైతిక కరవు ఏర్పడిందట. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని ఆయన వాపోయారు. డొక్కల కరువు ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. 1832 ప్రాంతంలో ఐదులక్షల జనాభా ఉన్న గుంటూరు జిల్లాలో కరవు వల్ల రెండు లక్షల మంది చనిపోయారు. శరీరంలో కండ అనేదే లేకుండా డొక్కలు కనిపించేవట! అలాంటి డొక్కల కరువు నుంచి కూడా బయటపడ్డాం కానీ ఇప్పుడున్న నైతిక కరువు నుంచి అంత సులభంగా బయటపడే అవకాశం కనిపించడం లేదు.
ఇంతకూ నైతిక కరవు అంటే ఏమిటి? అంటే చెప్పడం కష్టమే. ఈ మధ్య చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయాల్లో నైతిక విలువలు పడిపోతున్నాయని, వాటిని నిలబెట్టడానికి కంకణం కట్టుకున్నామని చెబుతున్నారు. అంటే రాజకీయ నాయకుల గోదాముల్లో నైతిక విలువల నిల్వలు పుష్కలంగానే ఉన్నాయనిపిస్తోంది. పాత సినిమాల్లో రేషన్ సరుకులను విలన్లు గోదాముల్లో నిల్వ చేసి నో స్టాక్ అనే బోర్డు పెట్టే వాళ్లు. ఆ స్టాకుకు మాత్రం ఆర్జా జనార్దనో మరొకరో లుంగీ కట్టుకుని చేతిలో కర్ర పట్టుకుని కాపలా కాసేవాడు. ఒక వృద్ధురాలు వచ్చి బాబు రెండు రోజుల నుంచి తిండి లేదు, రేషన్ బియ్యం ఇవ్వు బాబు అని కన్నీళ్లు కారిస్తే, షాపు విలన్ పోవే ముసిలి దానా అని తోసేసేవాడు. పడిపోతున్న ఆ వృద్ధురాలిని ఎన్టీఆర్ పట్టుకుని నిలబెట్టి ఆర్జా జనార్దన్‌తో ఫైట్ చేసి గోదాముల్లోని బియ్యం అందరికీ పంచి పెట్టేవాడు. హీరోకు జై అంటూ అంతా ఆయన్ని తమ భుజాలపైకి ఎత్తుకునే వారు. బహుశా ఎన్టీఆర్ ఆ స్ఫూర్తితోనేనేమో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రకటించి అధికారం కొట్టేశారు. పాత సినిమాల్లో ఎన్టీఆర్ గోదాముపై దాడి చేస్తే బియ్యం దొరికాయి కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు గోదాములపై సిబిఐ దాడి చేస్తే ఫైళ్లు దొరుకుతున్నాయి కానీ ఆ నైతిక విలువలు మాత్రం దొరకడం లేదు.
షాపులపై దాడులు చేసి ఎరువులను, విత్తనాలను పట్టుకుంటున్నట్టు నాయకుల ఇళ్లపై దాడి చేసి నైతిక విలువలను పట్టుకోవచ్చు కదా? నైతిక విలువ కరవు ఉందని కేంద్ర మాజీ మంత్రి గంభీరంగానే ప్రకటించారు కానీ వాటిని ఎక్కడ బంధించారు, ఎలా బయటకు తీయాలో మాత్రం చెప్పడం లేదు. ప్రజల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు తీవ్రంగా కృషి చేస్తానని ప్రకటనలు చేస్తున్న నాయకుల జీవితాలను చూస్తుంటే బహుశా వాళ్లే నైతిక విలువలను ఎక్కడో బంధించారనిపిస్తోంది. లేకపోతే అంత ధైర్యంగా ఎలా చెబుతారు. ఆ మధ్య తారా చౌదరి అలియాస్ రాజేశ్వరి కూడా ఇదే మాట చెప్పింది. జీవితంలో విలువలు ముఖ్యం, దాని కోసం కట్టుబడి ఉన్నాను, కొంత మంది నాపై కక్ష కట్టారు. అయినా నేను భయపడను విలువల కోసం పోరాడతాను అని సెలవిచ్చారు. రాజకీయ నాయకులు, సినీ తారలు, తారలు కావాలనుకునే వారు, గనుల ఓనర్లు, పవర్ బ్రోకర్లు ఇలా ఎవరికి వారు నైతిక విలువలను బంధిస్తే, మార్కెట్‌లో కొరత ఏర్పడక ఏం చేస్తుంది. 

అదేదో రాష్ట్రంలో మద్యానికి రేషన్ విధించారట! అలానే నైతిక విలువలకు సైతం రేషన్ విధించి అందరికీ అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి.
ఆ మధ్య ఒక తెలుగు నాయకుడు ప్రజల్లో, మీడియాలో నైతిక విలువలు పడిపోతున్నాయి ఇలా అయితే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా అతనికి చిర్రెత్తుకొచ్చి నిజమే నండి గతంలో విలువలకు కట్టుబడిన నాయకులు ఉండేవారు దానికి తగ్గట్టు సమాజంలోనూ విలువలు ఉండేవి. ఇప్పుడు విలువల గురించి ఉపన్యాసాలు ఇచ్చే నాయకులే తప్ప పాటించే నాయకులు లేరు అందుకే సమాజంలో విలువలు పడిపోతున్నాయనగానే ఆ నేతకు ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. దేశాన్ని ఏలుతున్న పార్టీ అధ్యక్షుడు లక్ష రూపాయలు తీసుకుని కెమెరాలకు చిక్కిపోతే ఆ పార్టీ నేత ఒకరు విలువలు మరీ పడిపోతున్నాయండి అంత పెద్ద నాయకుడు మరీ చీప్‌గా లక్ష రూపాయలు తీసుకోవడం ఏమిటి? పట్టుపడిపోవడం ఏమిటి? జాతీయ నాయకులే ఇంత అసమర్ధులైతే, మాకు వాళ్లేం మార్గం చూపిస్తారని ఆవేదన చెందాడు. అసలు విషయం అది కాదు లేండి మా వాళ్లే ఆయన్ని పట్టించారు ఎక్కడ పోటీకి వస్తారో అని మరొకాయన సెలవిచ్చాడు.
ఒకప్పుడు ప్రపంచానికి నైతిక విలువలు బోధించిన వేద భూమిపైనే నైతిక కొరత ఏర్పడింది. ప్రపంచంలో పది ప్రముఖ మతాల పేర్లు ప్రస్తావిస్తే, అందులో నాలుగు ప్రధాన మతాలు హిందూమతం, బౌద్ధం, జైనమతం, సిక్కుమతం పుట్టింది ఇక్కడే. మతాలు ప్రధానంగా బోధించేది నైతిక విలువల గురించే! మనం చైనా, జపాన్‌లకు ఎప్పుడో బౌద్ధాన్ని ఎగుమతి చేస్తే ఆ దేశాలు ఇప్పుడు ప్రపంచాన్ని తమ వస్తువుల ఎగుమతులతో సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రపంచానికి విలువలను ఎగుమతి చేసిన మన దేశం ఇప్పుడు విలువల కొరతతో ఉక్కిరిబిక్కిరవుతోంది.
ఉవ్వెతున్న ఎగిసిన గ్రీకు సంస్కృతి పతనమైంది విలువల పతనం తరువాతనే. ఇప్పుడు మనం కూడా ఆ దారిలోనే ఉన్నామనిపిస్తోంది. ఆర్థికంగా, సాంకేతికంగా ఆకాశానికంటిన మన ఆభివృద్ధి విలువల్లో మాత్రం పాతాళంలో తవ్వకాలు జరిపితే కానీ మనం ఎక్కడున్నామో తెలియదేమో! విలువలకు స్టాక్‌మార్కెట్ ఇండెక్స్ ఉండదు, అభివృద్ధి సూచికలు ఉండవు అందుకేనేమో అటువైపు ఆలోచించడం లేదు. సరే కనీసం దిగుమతి చేసుకోవడానికైనా ప్రయత్నించండి పాలకులారా....
!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం