10, అక్టోబర్ 2012, బుధవారం

అల్లుడు బంధం!

పాపం రాజకీయ నాయకులు. మన కాలికి ముల్లు గుచ్చుకుంటే వాళ్లు కన్నీళ్లు పెడతారు. మన కోసమే మనం ఆలోచించుకోలేని కాలంలో మీ కోసం అంటూ మన కోసం ఆలోచిస్తారు. నా కోసం ఏడవకండి మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ఒక దేవుడంటే ఆ పని కూడా మేమే చేస్తాం, మా కోసం మీ కోసం మేమే ఏడుస్తామంటారు. రోడ్డుమీద హంటర్‌తో తమను తాను శిక్షించుకునే వాడ్ని చూసి జాలిపడి డబ్బులు రాలుస్తాం కానీ మన కోసం తమను తాము శిక్షించుకునే మన నాయకులను మాత్రం నమ్మం. పాపం వారికి ఇదేం శిక్ష? ఎందుకీ వివక్ష?


పండగ రోజు సగటు మధ్యతరగతి సుబ్బారావు ఇంటికి అల్లుడు అమ్మాయి వస్తే ఏం చేస్తారు. నెలఖరైనా అప్పు తెచ్చి మరీ కట్నం చదివించుకుంటారు కదా? అలా చేయపోతే ఏమంటారు. మర్యాద తెలియని వాళ్లు అని చీదరించుకోరూ..! మరి అదే పని మన నాయకులు చేస్తే ఏమంటున్నాం. తప్పు తప్పు అంటూ గగ్గోలు పెడుతున్నాం. ఇది న్యాయమా? ఎంత చెట్టుకు అంత గాలి ఎంత పెద్దింటి అల్లుడికి అంతటి చదివింపులు. గుమస్తా కుటుంబరావు ఆయన అల్లుడికి బల్లకింద చేయి పెట్టి సంపాదించిన వెయ్యి రూపాయలతో బట్టలు పెడితే, లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దేశాన్ని వంటి చేత్తో తెర వెనక నుంచి పాలించేస్తున్న అత్తగారి అల్లుడు గారికి ఎలా మర్యాద చేయాలి. మర్యాద చేస్తే మనం ఇంతగా గొడవ చేయాలా? అందుకే రాజకీయ నాయకులను చూస్తే జాలేస్తుంది. కన్నకొడుకు బాగు కోసం ఒకరు, అల్లుడి కోసం మరొకరు, త్యాగాలు చేస్తుంటే మనం ఇంతగా ఆడిపోసుకోవాలా? ఇది న్యాయమా? ఇదేనా కుటుంబ విలువలకు మనం ఇచ్చే ప్రాధాన్యం? 

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అనే పాట వింటే అసలీ పాటే ఓ బూటకంఅనిపిస్తోంది. అనుబంధం అత్మీయత అంతా వాస్తవం అని కళ్ల ముందు కనిపిస్తుంటే బూటకం అని ఎలా పాడగలం? మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయని ఎవరన్నారు? తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోవడం లేదని, అల్లుళ్లకు అత్తవారింట్లో మర్యాద దక్కడం లేదని ఎవరన్నారు? ఓ సినిమాలో మంత్రిగా ఉన్న అత్తగారు అల్లుడికి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తానంటుంది. ఆ డైలాగు విన్నప్పుడు అదెలా సాధ్యం అనిపించింది. ఎందుకంటే మంత్రిగా ఉన్నప్పుడు సొంత జిల్లాను, సొంత శాఖను అల్లుడికి రాసివ్వడం సాధ్యమే కానీ మొత్తం రాష్ట్రాన్ని రాసివ్వడం ఎలా సాధ్యం. అది ముఖ్యమంత్రికో, ప్రధానమంత్రికో లేదా వీరిద్దరిని నడిపించే వాద్రా అత్తగారికో సాధ్యం అవుతుంది కానీ మంత్రికెలా సాధ్యం. ఏం అల్లుడికి ఆ మాత్రం స్వతంత్రం ఉండదా? అత్తగారింట్లో అల్లుడికి కాకపోతే ఇంకెవరికి స్వతంత్రం ఉంటుంది. సోనియాగాంధీ అల్లుడికి డిఎల్‌ఎఫ్ అనే సంస్థ వడ్డీ లేకుండా కొంచం తక్కువ 65 కోట్ల డబ్బు ఇచ్చింది. ఏం పావలా వడ్డీ, వడ్డీ లేని రుణం అంటూ అధికారంలో ఉన్న వాళ్లు సామాన్యులకు ఇచ్చినప్పుడు సోనియా అల్లుడికి డిఎల్‌ఎఫ్ ఇస్తే మనకేం నష్టం? ఆ రోజులే వేరు ఉమ్మడి కుటుంబాలు, బంధుమిత్రులతో కళకళలాడేవి, ఒకరినొకరు ఆదరించుకునే వారని, ఇప్పుడు కుటుంబం అంటే భార్యాభర్త, వారి సంతానం మాత్రమే అని వాపోతుంటారు. ఎవరైనా బంధువులను ఆదరిస్తే సహించరు. ఇంత పెద్ద దేశం కొన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అల్లుడికి 65 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తే తప్పా? తెల్లని దుస్తుల్లో రాముడు మంచి బాలుడు అన్నట్టు హుషారుగా కనిపించే వాద్రా వారికి నచ్చి ఉండొచ్చు. 

వాద్రాలో నేటి కాలానికి పనికి వచ్చే ఒక గొప్ప రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. వాద్రాకు డిఎల్‌ఎఫ్ 65 కోట్లు వడ్డీ లేని రుణం ఇచ్చిందని కెజ్రీవాల్ ఆరోపిస్తే, ఆయన చెప్పిన సమాధానం విన్నాక ఆయన రాజకీయాల్లోకి వచ్చి తీరుతాడని అనిపించడం లేదూ! అసలు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చట్టంపై నాకు విశ్వాసం ఉంది, ప్రజలపై నమ్మకం ఉంది, ప్రజాస్వామ్య వ్యవస్థను నేను ప్రేమిస్తాను. అంటూ సమాధానం చెప్పాడంటే అతను కచ్చితంగా కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకుడే అయి ఉంటాడు. ఇంకా రాజకీయ ఆరంగ్రేటం చేయకముందే వాద్రా ఇంత చక్కని రాజకీయ ప్రకటనలు చేస్తున్నారంటే, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక ఇంకెంతగా రాణిస్తారో?


వాద్రా ఇంకా అనుమానం వద్దు రాజకీయాల్లోకి దూకేయ్! కెజ్రీవాల్‌కు డిపాజిట్ కూడా రాదు కానీ మీరు రాజకీయాల్లో బాగా రాణిస్తారు. వాద్రాకే కాదు అసలు అల్లుళ్లకే కాలం అచ్చిరావడం లేదు. మామ గారు ఊరూరు తిరిగి కష్టపడి సంపాదించుకున్న సైకిల్‌ను అల్లుడు ఎత్తు కెళ్లాడు. ఏం అల్లుడికి ఆ మాత్రం స్వతంత్రం లేదా? అంతోటి దానికి వెన్నుపోటు అనే ముద్ర వేసి మానసికంగా హింసించడం న్యాయమా? నందమూరి వంశ సంప్రదాయం ప్రకారం అల్లుడికే అధికారం దక్కాలని అల్లుడిగారి అల్లుడు జూనియర్ ఎన్టీఆర్ ఆశిస్తుంటే, కాదు మా అల్లుడికే అధికారం అని బాలయ్య చెప్పకనే చెబుతున్నారు. అల్లుడి నుంచి పోటీ రాకముందే రాజశేఖర్‌రెడ్డి శకం ముగిసింది. జైలు నుంచి ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తానని కొడుకు చెబుతుంటే అల్లుడేమో దేశ దేశాలు తిరిగి ప్రజలను దీవించేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల్లోనూ అల్లుళ్లకు అన్యాయం జరుగుతోంది. తొమ్మిదేళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉన్నాను, కరుణించి మరోసారి అధికారం ఇవ్వండి అంటూ అల్లుడు గారు సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. మామకు వయసు మీద పడింది, ఇంత కాలం కష్టపడి అలిసిపోయారు, ఇక నేను కష్టపడతాను అని కెసిఆర్ అల్లుడు సిద్ధంగా ఉన్నా, కాలం కలిసి రావడం లేదు. అల్లుడికి పోటీగా కొడుకు క్యూలో నిలిచారు. అందరూ ఒక్క అల్లుడితో తంటాలు పడితే ఎన్టీఆర్ రాజకీయ జీవితం మొత్తం ఇద్దరు అల్లుళ్ల మధ్య నలిగిపోయింది. నెహ్రూకు సైతం అల్లుడి దెబ్బ తప్పలేదు. పార్లమెంటులో అల్లుడు నిత్యం నెహ్రూ విధానాలపై నిప్పులు చెరిగే వారట!

1 కామెంట్‌:

  1. లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దేశాన్ని వంటి చేత్తో తెర వెనక నుంచి పాలించేస్తున్న అత్తగారి అల్లుడు గారికి ఎలా మర్యాద చేయాలి.

    నిజం. తెలియక ఏదో అంటున్నారండి :)

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం