28, అక్టోబర్ 2012, ఆదివారం

భారతీయులం..... వినియోగదారులం


ఈ దేశంలో విప్లవాలు రావు

 ఎందుకంటే?

 పేదల్లో ధైర్యం లేదు

 మధ్యతరగతికి తీరిక లేదు

 సంపన్నులకు అవసరం లేదు. 


ఇది సోషల్ నెట్ వర్క్‌లో చక్కర్లు కొడుతున్న విషయం. మూడు ముక్కల్లో దేశం గురించి బాగానే చెప్పారు. మన దేశంలో పరిస్థితి దీనికి బాగా సరిపోయేట్టుగా ఉంది. ఒకవైపు రైతుల ఆర్తనాదాలు, ఆత్మహత్యలు, నిరుద్యోగం . మరోవైపు భారత దేశంలో విపరీతమైన సంపదను పోగుచేసుకోవడానికి అవకాశం ఉందని గ్రహించి క్యూ కడుతున్న విదేశీ కంపెనీలు. చివరకు ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముకునే వారికి, ఇంటి పక్కన కిరాణా దుకాణం వారికి నిద్ర లేకుండా చేయడానికి, రోడ్డున పడేయడానికి ఈ వ్యాపారంలోకి సైతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. 

మన దేశంలో గతంలో వ్యాపారం అంటే ప్రజలకు అవసరమైన వస్తువులను విక్రయించడం. పప్పు, చింతపండు, బట్టలు, పాత్రల వంటి నిత్యావసరాలను విక్రయించడమే వ్యాపారం. పాశ్చాత్యుల దృష్టిలో అది వ్యాపారం కానే కాదు. ఒక అవసరాన్ని సృష్టించి, దాన్ని అలవాటు చేసి, అమ్మడం వ్యాపారం. అది టీ కావచ్చు సిగరెట్ కావచ్చు, టూత్‌పేస్ట్, సబ్బు ఏదైనా కావచ్చు. ఇప్పుడు మ్యాక్‌డోల్ వాడి పిజ్జాలేనిదే నిద్రపోని వారు దేశంలో చాలా మందిని వాళ్లు తయారు చేశారు. మన దేశాని చెందిన ఒక ప్రముఖ కంపెనీ వాళ్లు ఒక వినూత్న పథకాన్ని చేపట్టబోతున్నారు. నర్సరీ నుంచి చివరకు ఉద్యోగం పొందే వరకు వారే చూసుకుంటారు. అంటే ఆ కంపెనీ వారే నర్సరీలో పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిస్తారు. పెరిగాక తమ కంపెనీకి అవసరం అయిన విద్య నేర్పిస్తారు. విద్య ముగిశాక కంపెనీలో ఉద్యోగం ఇస్తారు. మంచిదే కదా అనిపించకుండా ఉంటుందా? అలా పెరిగి పెద్దయిన వ్యక్తికి ఈ దేశంపై ఎలాంటి ప్రేమ ఉంటుంది. దేశం కన్నా తన కంపెనీయే అతనికి ముఖ్యం అవుతుంది. నిరుద్యోగంతో బాధపడడం కన్నా ఇది మంచిది కదా అనే బలమైన వాదనా ఉంది. ఒక్క కంపెనీ కాదు. ఇప్పుడు మనకు తెలియకుండా మనం పిల్లలను దేశ పౌరులుగా కాకుండా కంపెనీలకు ఉద్యోగులుగా పెంచేస్తున్నాం. వెనక్కి వెళ్లడానికి అవకాశం లేదు ఎంతో ముందుకు వచ్చేశాం.

 దేశంలో స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా సాగుతున్న కాలం. నిజామాంధ్రలో తెలుగువారి పరిస్థితిని వివరిస్తూ సురవరం ప్రతాపరెడ్డి గుంటూరు నుంచి వెలువడిన ప్రబుద్ధాంధ్రకు ఒక వ్యాసం రాశారు. అప్పుడు నిజాం పాలన సాగుతోంది. సంపన్న హిందూ యువత ముస్లింల మాదిరిగా షేర్వాని, రూమీ టోపీ పెట్టుకోవడం ఫ్యాషన్‌గా మారింది. అంటూ నిజామాంధ్రలో తెలుగువారి గురించి రాశారు. ఆరేడు దశాబ్దాల క్రితం నాటి సంపన్నుల ఇళ్లల్లో ఫోటోలు చూస్తే సురవరం చెప్పిన ఈ మాట ఎంత నిజమో తెలుస్తుంది. మనకిప్పుడు ఈ మాట నవ్వు తెప్పించవచ్చు. ఇదే విషయంపై ఆయన బాగా అర్థం కావడానికి కొనసాగింపుగా .... అంటే మీ ఆంధ్రప్రాంతంలో యువత ప్యాంటు, షర్టు వేసుకున్నట్టు అన్నమాట అని స్పష్టం చేశారు. ప్రాంతాల తేడా లేదు ఇప్పుడు దేశమంతా ఇదే ఫ్యాషన్. పుట్టుకతో మనం భారతీయులం అయినా మన ఆస్తిత్వాన్ని మనం కోల్పోతున్నాం. మనను మనం కోల్పోయి మనంగా మిగిలాం. అప్పుడు ఈస్టిండియా అనే ఒక చిన్న కంపెనీ మన దేశాన్ని ఇంగ్లాండ్ నుంచి పాలించేది. ఇప్పుడు కొన్ని వందల విదేశీ కంపెనీలు మన దేశంలో ఉండే మనను పాలించేస్తున్నారు. 

ఒక్కసారిగా మన దేశంపై ప్రపంచానికి ప్రేమ పుట్టుకొచ్చింది. విశ్వసుందరీమణులుగా వరుసగా మనవారినే గెలిపించారు. అలా గెలిపించడం వల్ల ఏమైంది. గెలిచిన వారికి సినిమాల్లో హీరోయిన్లుగా, ప్రకటనల్లో మోడల్స్‌గా బోలెడు అవకాశాలు లభించాయి. గెలిపించిన కంపెనీల సౌందర్య సాధనలకు వేలకోట్ల రూపాయల మార్కెట్ మన దేశంలో ఏర్పడింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఎప్పుడో చెప్పారు. దేశమంటే మనుషులే కదా అందుకే దేశాల మధ్య సైతం ఆర్థిక సంబంధాలు తప్పవు. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతటి విపరీతమైన కొనుగోలు మార్కెట్ ఇండియాలో ఉంది. వంద కోట్లు దాటిన జనాభా. దాదాపు యాభై శాతం మంది యువత. 30 శాతం వరకు మధ్యతరగతి. ప్రపంచానికి మనపై ప్రేమ కురిపించడానికి ఇంత కన్నా ఇంకేం కావాలి. చైనా జనాభాలో మనను మించి పోయింది. అది పెద్ద మార్కెటే కానీ అక్కడ యూరప్ పప్పులు ఉడకవు, చివరకు అమెరికా జాతీయ జెండాను సైతం చైనానే తక్కువ ధరకు అమ్ముతోంది. అమెరికా మార్కెట్‌నే చైనా ముంచేస్తోంది. చైనా పోటీని ఎదుర్కోలేక పోతున్న యూరప్ దేశాలకు చైనా మార్కెట్‌పై పెద్దగా ఆశలు లేవు. వారికి మిగిలింది ఇండియానే. జరుగుతున్నది మంచికో చెడుకో అర్థం కాని పరిస్థితి. 

ఒకవైపు విశేషమైన మానవ వనరులు ఉన్నాయని సంతోషపడాలో, అవి మన దేశ ప్రయోజనాల కన్నా విదేశీ కంపెనీలను మరింత సంపన్నులుగా మార్చడానికి ఉపయోగపడుతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితి. భాష, సంస్కృతి, కట్టుబొట్టు క్రమంగా అన్నింటినీ ఆక్రమించేసుకుంటున్నారు. మనకు తెలియకుండానే మనం మానసిక బానిసలమవుతున్నాం. అంతేనా చివరకు వారి కోసం మన యువత పగలు పడుకుని, రాత్రిళ్లు పని చేస్తున్నారు. భారతీయులు గాఢనిద్రలో ఉన్నప్పుడు స్వాతంత్య్రం లభించింది. దేశమంతా నిద్రిస్తున్న సమయంలో మన యువత అమెరికా కంపెనీల కోసం అర్ధరాత్రులు పని చేస్తూ, వాళ్లు నిద్రించే సమయంలో మేల్కొంటుంది. ప్రైవేటు రంగం చేపట్టలేని భారీ ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. కానీ ఇప్పుడు చివరకు కిరాణా వ్యాపారం సైతం విదేశీ కంపెనీలు చేయాలా? దీని వల్ల రైతులకు ప్రయోజనమా? ఓట్లువేయించుకుని అధికారంలోకి వచ్చిన రాజకీయ పక్షాలే రైతులను పట్టించుకోవడం లేదు. అలాంటిది ఏదో సుదూర తీరంలో ఉన్న దేశీయుడు ఈ దేశంలోని రైతులను ఆదుకోవడానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాడంటే నమ్ముదామా! పచారీ వస్తువులు అమ్ముకోవడానికి వచ్చిన వాడికి అంతగా భయపడాల్సిన అవసరం లేదు అంటే ఈస్టిండియా కంపెనీ కూడా అంతే కదా ముందు సుగంధ ద్రవ్యాలు అమ్ముకోవడానికి అనుమతి కోసమే వచ్చింది కదా?

 మీ ప్రధానమంత్రి నిష్కామప్రియుడు, నిద్ర పోతున్నాడా? సరిగా పని చేయడం లేదు అని టైమ్స్ పత్రిక హూంకరించగానే ఎఫ్‌డిఐలకు కేంద్రం బార్లా తలుపులు తెరిచింది. నేనేమి దద్దమ్మను కాను వీరాధివీరున్ని చూడండి మిత్రపక్షాలు వ్యతిరేకించినా ఎఫ్‌డిఐలపై నిర్ణయం తీసుకున్నాను అంటూ ప్రధానమంత్రి అమెరికాకు తన చర్య ద్వారా సందేశం పంపించారు. భారతీయ మీడియాలో ప్రధానమంత్రి పని తీరు గురించి ఎన్ని విమర్శలు వచ్చినా కిమ్మనని మన్మోహన్‌సింగ్ టైమ్స్‌లో ఒక వ్యాసం రాగానే బిగ్ బాస్ మందలించినట్టుగా వణికిపోయారు. ఇంతకూ ఈ దేశాన్ని పాలిస్తున్నది భారతీయ ప్రభుత్వమా? అమెరికానా? అమెరికా ప్రభుత్వమైనా, అమెరికా మీడియా అయినా అమెరికా వ్యాపార సంస్థల ప్రయోజనాల కోసం పని చేస్తుంది. చివరకు ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం సైతం అమెరికా కనుసన్నల్లో పాలన సాగించక తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులను సైతం ప్రజలు వౌనంగా భరించడం, మద్దతు పలకడం తప్ప మరేమీ చేయలేకపోతున్నారు. ముందుగానే చెప్పినట్టు పేదవారి బతుకే దుర్భరంగా మారినప్పుడు ఇక విప్లవాలేం తీసుకువస్తాడు. మధ్య తరగతిని ఈ కొత్త ప్రపంచం ఆనందంలో ముంచెత్తుతోంది. దీని బాగోగుల గురించి ఆలోచించేంత తీరిక వారికి లేదు. సంపన్నులకు అవసరమే లేదు. ఒకవైపు అత్యధిక మంది నిరుపేదలు మన దేశంలోనే ఉన్నారు. పేదరికం దేశానికి సవాల్‌గా మారింది. అదే సమయంలో రెండు వందల రూపాయలతో కాఫీ తాగే నయా ఎగువ మధ్యతరగతి మన దేశంలోనే ఉంది. జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ వచ్చిన విదేశీ ప్రతినిధులు ఒకవైపు హైటెక్ సిటీ మరో వైపు ఇరుకు దారులతో సందులు గొందులతో ఉండే పాతనగరాన్ని చూసి ఇంతకు మించిన వైవిధ్యం ఎక్కడా లేదని విస్తుపోయారు. హైదరాబాదే కాదు మొత్తం మన దేశమే వైవిధ్యభరితమైంది. అకలి కేకలు ఇక్కడే ఉన్నాయి సంపద ఇక్కడే ఉంది. సంపదను ఉపయోగించి ఆకలి కేకలను దూరం చేసే సమర్థవంతమైన నాయకత్వమే ఇప్పుడు కొరవడింది. సంకుచిత రాజకీయ ప్రయోజనాలే తప్ప దేశ హితాన్ని కోరే నాయకత్వం కొరవడింది. గతంలో ఒక ముఖ్యమంత్రి తనను తాను సిఇఓగా ప్రకటించుకుని ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు పాలించడం గొప్పగా భావించే వాళ్లు. ఇప్పుడు ఈ దేశాన్ని ఏలే ప్రభువు ఆరేళ్లపాటు ప్రపంచ బ్యాంకులో ఉద్యోగిగా పని చేసి ప్రపంచ బ్యాంకు విధానాలను ఔపోసన పట్టి పాలకునిగా అమలు చేస్తున్నారు. 

వంద కోట్లు దాటిన భారతీయులు ఒక ఒలింపిక్ స్వర్ణాన్ని కూడా సంపాదించలేదని వాపోతున్నారు కానీ వంద కోట్ల మందిని పాలించేందుకు సమర్థుడైన నాయకుడ్ని సృష్టించుకోలేక పోవడమే ఈ దేశానికి అసలైన శాపం. మాల్స్ ఇప్పుడు మహానగరాలను ఊపేస్తున్న మాట వాస్తవం.అక్కడే సినిమాలు చూడవచ్చు, ఐస్‌క్రీమ్ తినవచ్చు, బర్గర్ లాగించవచ్చు. గంటల తరబడి షాపింగ్ చేయవచ్చు. ఆటలాడవచ్చు, అమ్మాయి, అబ్బాయిలు ప్రేమించుకోవచ్చు. మాల్స్ పుణ్యమా అని సినిమా హాళ్లు, షాపులు మూతపడుతున్నాయి. అవసరం అయిన వస్తువును వెళ్లి కొంటే అది షాపు అవుతుంది. అవసరం లేకున్నా ఆకట్టుకుని కొనిపించడం మాల్స్ ప్రత్యేకత. ఇక్కడ రేటు ఎక్కువ, అయితేనేం ఆకర్షణీయ శక్తి అత్యధికం. జేబులో డబ్బు లేకపోయినా కార్డు ద్వారా అప్పటికప్పుడు కొనిపించే శక్తి వీటికుంటుంది. ఇప్పుడివి దేశాన్ని ముంచేస్తున్నాయి. మా పిల్లలు ఇంట్లో తినాలంటే బోర్ అంటున్నారు పిన్నీ.. పిజ్జాలు, బర్గర్‌లు లేందే వారికి గడవదు. ఇప్పుడు ఇరుగు పొరుగు అమ్మలక్కలు గర్వంగా చెప్పుకునే మాట.

 *** 
సికింద్రాబాద్ స్టేషన్ ఎదురుగా రెండంతస్తుల భవనం. పదిహేను వేలరూపాయలకు అమ్మబడును. బేరానికి అవకాశం ఉంది. క్రింది అడ్రస్‌లో సంప్రదించగలరు.

 ప్రజలకు 58 పైసలకు కిలో బియ్యం అమ్మాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ రామ్‌కె వేపా ఆదేశించారు. బియ్యాన్ని 66 పైసలకు కిలో అమ్ముతున్నారని, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. ఇకపై ప్రభుత్వం పన్నును 40 శాతం నుంచి 20 శాతానికి తగ్గించినందున 58 పైసలకు కిలో చొప్పున అమ్మాలని ఆదేశించారు. హైదరాబాద్ మార్కెట్‌లో ఈ రోజు ధరలు ఉల్లిగడ్డ పది పైసలకు కిలో మిర్చి 12 పైసలు నువ్వులు ఒక రూపాయి 10 పైసలు నూనె ఒక రూపాయి 90 పైసలకు కిలో ఏంటీ నమ్మకం కలగడం లేదా? ఇది నిజం కావాలంటే ఆంధ్రభూమి దినపత్రికలో ధరవరలు చూడండి ఆగండాగండి ఈ ధరలు నిజమే అయితే ఈ రోజువి కాదు. ఇవి 1964 నాటివి. కాలు పెట్టడానికి చోటు కనిపించని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా 15వేలకు రెండంతస్తుల భవనం. ఇప్పుడో అటు నుంచి ఐదారు కిలో మీటర్ల దూరం వెళితే చిన్న కుటుంబం నివసించడానికి అవసరమైన అపార్ట్‌మెంట్‌కే 40లక్షలు కావాలి. ఇప్పుడు సొంత అపార్ట్‌మెంటే సొంతిళ్లు. మూడు దశాబ్దాల క్రితం ముంభైలో అపార్ట్‌మెంట్‌ల గురించి రాష్ట్రంలో వింతగా చెప్పుకునే వాళ్లు. ఇప్పుడు గ్రామాల్లో సైతం అపార్ట్‌మెంట్స్ సంస్కృతి పెరిగిపోయింది. పది పైసలకు కిలో ఉల్లిగడ్డ 30 రూపాయలకు కిలో వరకు వెళ్లింది. 66 పైసలకు కిలో బియ్యం అంటేనే గగ్గోలు పెట్టిన వాళ్లు ఇప్పుడు 40 రూపాయలకు కిలో అంటే కిమ్మనకుండా భరించేస్తున్నారు. బ్రిటీష్ వాడు పాలించినప్పుడు కనీసం పోరాడే శక్తినైనా మిగిల్చాడు. కానీ ఇప్పుడు పెరిగిన ధరలు, పెరుగుతున్న అవసరాలు, మనకు మనం సృష్టించుకున్న పోటీతో పోరాడేశక్తి సైతం క్షీణించింది. మొక్కేవాడికి మొక్కేవాడు తయారవుతున్నాడని ఒక కవి చెప్పిన మాట ఇప్పుడు మనందరికీ వర్తించేట్టుగా ఉంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్పు సహజం. మారాలి కూడా కానీ ఆ మార్పు మనకు మేలుచేసేదిగా ఉండాలి తప్ప మనను మనం బానిసలుగా తయారు చేసుకునే విధంగా ఉండరాదు. ఇప్పుడు జరుగుతున్న మార్పు, సంస్కరణలు నిజంగా మనకు మేలు చేసేవా? లేక మనను పెనం నుంచి పొయ్యిలో పడేసేవా? దీనికి కాలమే సమాధానం చెబుతుంది. ఒక్కటి మాత్రం నిజం. వ్యాపార వేత్త ఎప్పుడూ తన ప్రయోజనం కోసం, తన లాభం కోసం చూసుకుంటాడు కానీ ఈ దేశ ప్రజలను ఉద్ధరిద్దామని అనుకోడు.

 * ............................ 
గంజికి 200 రూపాయలు గంజినీళ్లయినా తాగిబతుకుదాం కానీ ఆ దొర దగ్గర బానిసగా బతకొద్దు. అరేయ్ ఏం చూసుకొని ఎగిసిపడుతున్నావురా! నేను కాదన్నానంటే నీకు గంజినీళ్లు కూడా పుట్టవు ఇలాంటి డైలాగులు పాత సినిమాలు చాలా వాటిలో వినిపిస్తుంటాయి. రాయలసీమ జిల్లాల్లో తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు కమ్యూనిస్టు పార్టీలు, గ్రామాల్లో పెద్దలు గంజి కేంద్రాలను ఏర్పాటు చేయడం గతంలో కనిపించేది. గంజికి లేనివాడు అంటే ఏమీ లేని అభాగ్యుడన్నమాట! కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఇప్పుడు సంపన్నులు మాత్రమే గంజి తాగగలుగుతున్నారు. స్టార్ హోటల్స్‌లో భోజనానికి ముందు గంజి ఇస్తారు. గంజి అని పిలిస్తే దాని విలువ ఉచితం అవుతుంది. గంజికి ముద్దుగా సూప్ అని పేరు పెడితే రెండు మూడు వందల రూపాయలు చెల్లించడానికి వెనకాడరు. ఈ విషయం తెలిసే స్టార్ హోటల్స్ గంజిని నమ్ముకుని బాగానే గడిస్తున్నాయి. పాత కాలంలో తవుడు నూనె ఉపయోగిస్తున్నారు అంటే పాపం పేదోడు అని జాలిపడేవారు. ఇప్పుడు గుండె పోటు రాకుండా ఉండాలంటే తవుడు నూనే వాడమని వ్యాపార ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. సరస్వతి ఎడ్యుకేషన్ ట్రస్ట్ వాళ్ల పాఠశాలలో మీ పిల్లలను చేర్పించమంటే ఎవరినైనా అడిగితే, ఏమంటారు? అడిగిన వారిని పిచ్చివారిని చూసినట్టు చూస్తారేమో! పోనీ ఇండో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చేర్పిస్తారా? అని అడిగి చూడండి. బాబ్బాబు అక్కడ ఎవరైనా తెలిసిన వారుంటే కాస్త రికమండేషన్ చేసి పుణ్యం కట్టుకోండి అని బతిమిలాడతారు. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి. అయితే చిత్రమేమంటే ఈ విషయం తెలిసే సరస్వతి ఎడ్యుకేషన్ ట్రస్ట్ వాళ్లు తాము నడిపే పాఠశాలకు చక్కని తెలుగు పేరు కాకుండా ఇండో ఇండస్ స్కూల్ అని పేరు పెట్టారు. పేరులో ఏముందని అంటాం కానీ సరస్వతి పాఠశాల అంటే వీధి చివరి స్కూల్ అనుకుంటాం, ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఎగబడతాం. నేములోనే ఉందంతా! ................................


4 కామెంట్‌లు:

 1. అంతేనా చివరకు వారి కోసం మన యువత పగలు పడుకుని, రాత్రిళ్లు పని చేస్తున్నారు. ..indulo nenu okaidini Murali garu, talchukunnappudallaa badha ga untundi....badha veru, badhyatha veru...manaku manam gaa aa adusu loki tosukuntunnam....oka mata, ippudu manam paduthunna badha, atrutha, aratam anni soukaryala kosame..manaki avasaram teerchagala vanarulunnay kaani soukaryalu kavali...chinna illu undi chaaladu duplex house, inko illu kavali....bike chaalu car kavaali, rendu carlu kavali.....pakkane unna papi kondalu vaddu foreign tours kavaali...ee madhyakalam lo jaruguthunna hatyalu kooda veeti valle....

  రిప్లయితొలగించు
 2. మురళిగారు,
  మీరు చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం, కాకపోతే మన మాట వినేవారే కరువైపోయారు.

  రిప్లయితొలగించు
 3. Why do you want to fight corruption when your Prime Minister himself is NOT fighting corruption?
  Do you want to get killed?

  Caste = Corrupt by birth.

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం