18, జనవరి 2013, శుక్రవారం

సినిమాలు మనిషిని చెడగొట్టలేవా ?

సినిమాల్లోని వికృత చేష్టల ప్రభావం సమాజంపై ఉండదు అని వాదించే వాళ్లు ... సమాజం సంగతి సరే కానీ చివరకు సినిమా వాళ్లపై సైతం ఆ ప్రభావం ఎంతగా పడుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఈ మధ్య పలువురు సినిమా నటీనటులు వ్యబిచారం కేసుల్లో పట్టుబడ్డారు. హెరాయిన్ వంటి మత్తు పదార్ధాలను సేవిస్తూ పట్టుపడిన వారున్నారు, తరలిస్తున్న నటులు ఉన్నారు. చిన్నా చితక నటులే కాదు హీరోలుగా నటించిన వాళ్లు పట్టుపడ్డారు. మరీ ఎక్కువ పలుకుబడి ఉన్న వాళ్లు తప్పించుకున్నారు. వీరిపై సినిమాల ప్రభావం ఏమీ లేదని సినిమా పెద్దలు చెప్పగలరా?
అమ్మాయిని అల్లరి మూక ఆటపట్టిస్తుంటే.. హీరో వచ్చి వారికి బుద్ధి చెబుతాడు. హీరోయిన్ కళ్లతోనే హీరో ప్రేమలో పడుతుంది. ఆడవారిని గౌరవించే హీరోలోని సంస్కారం ఆమెను ప్రేమించేట్టు చేస్తుంది.
ఇది మూడు నాలుగు దశాబ్దాల క్రితం అనేక తెలుగు సినిమాల్లో కనిపించిన దృశ్యం.


ఇప్పుడు విలన్లు, అల్లరి మూకలు సైతం కుళ్లుకునే విధంగా హీరోనే హీరోయిన్‌ను అటపట్టిస్తున్నాడు. మరీ తిక్కరేగిందంటే హీరోయిన్ తల్లిని కూడా హీరోయిన్‌ను ఆటపట్టించినట్టే ఆటపట్టిస్తాడు. హీరో హీరోయిన్‌ను, హీరోయిన్ తల్లిని ఒకేసారి ప్రేమించేస్తాడు. కాలేజీలో హీరో అల్లరితో హీరోయిన్‌ను ఏడిపించేస్తాడు. హీరోగారి చిల్లర వేషాలకు ముచ్చటపడి చివరకు హీరోయిన్ హీరోను ప్రేమించేస్తుంది. ఇది  ఇప్పుడొస్తున్న అనేక తెలుగు సినిమాల్లో కనిపించే దృశ్యం. 


సినిమాలు మనిషిని చెడగొట్టలేవు, అలా అయితే సినిమాల్లో మంచిని చూసి ఎంతో మంది మంచివారుగా మారేవారు కదా? ఇది ఐదారు దశాబ్దాల నుంచి సినిమా రంగంలో ఉంటున్న ప్రముఖ నటుడు పలు సభల్లో వేసిన ప్రశ్న ఇది.  సినిమాల వల్ల చెడిపోయారని కొన్ని వందల ఉదాహరణలు చూపగలం. అలానే సినిమాల్లోని సందేశంతో బాగు పడ్డ సంగటనలు చూపగలం. సినిమా ఎలాంటి ప్రభావం చూపదు అని వాటికి మించిన ఉదాహరణలు చూపగలం. మనం సినిమా ప్రభావం ఎలా ఉంటుందని భావిస్తే, అలాంటి ఉదాహరణలు చూపగలం. దేశం కోసం త్యాగం చేయమని ఒక సినిమా చెబితే సైన్యంలో చేరి దేశ సేవ చేద్దామని అంతా క్యూ కట్టరేమో కానీ చెడు చూపినప్పుడు కచ్చితంగా అంతో ఇంతో మనిషిపై ఆ ప్రభావం ఉండి తీరుతుంది. ఏదో ఒక సినిమా చూసి నేరం చేసేస్తారని కాదు. సినిమాలన్నీ అలాంటివే అయినప్పుడు క్రమంగా ఆ ప్రభావం మనిషిపై పడుతుంది. పోలీసు శాఖలో అత్యున్నతమైన పదవి నిర్వహించి, రిటైర్ అయిన పోలీసు అధికారి ఒకరు ఒక ఇంటర్వ్యూలో తన పిల్లలు ఒక్క తెలుగు సినిమా కూడా చూడలేదని చెప్పుకొచ్చారు. ఎందుకంటే సహజత్వానికి భిన్నంగా ఉండే ఆ సినిమాలు చూడడం వృధా అనిపించింది అన్నారు.ఈ ఐటం సాంగ్ లేకుండా ఈ మధ్య హిట్టయిన ఒక్కసినిమాను చూపండి అని వచ్చిన ప్రశ్నకు సినిమా వాళ్ల నుండి సమాధానం రాలేదు.
***


మహేష్‌బాబు హీరో, అనుష్క హీరోయిన్‌గా వచ్చిన సినిమా ఖలేజా. ఈ సినిమాలో హీరో హీరోయిన్‌పై దాడి చేసినట్టుగా వెళతాడు. తన టాక్సీకి డాష్ ఇచ్చాడని ఏదో బూతు మాటతో హీరోయిన్‌ను నిలదీస్తాడు. ఆమె భయపడిపోతుంది. ఇది ఒక మాల్‌లో జరుగుతుంది. చాలా మంది పక్క నుంచి వెళుతుంటారు. ఒక యువకుడు చొక్కా మడిచి ఆడపిల్లను వేధిస్తావా? అని హీరోని నిలదీయడానికి ప్రయత్నిస్తే, అమ్మాయి కనిపించగానే ప్రతి ఒక్కడు హీరోలా రక్షించేందుకు వస్తాడని అతన్ని కొట్టేందుకు వెళుతుంటే పైన దేవుడున్నాడు చూస్తాడు అంటూ రక్షించడానికి వచ్చిన యువకుడు వెళ్లిపోతాడు. సినిమాలో ఇదో హాస్య సన్నివేశం. అంటే అమ్మాయిలు ఇబ్బందుల్లో ఉంటే వేధించేవాడు హీరో, అండగా నిలవడానికి వచ్చిన వాడు హాస్యపాత్ర ధారునిగా మారిపోయాడు. ఒకప్పుడు రక్షించేవాడు హీరో అయితే ఇప్పుడు దాడికి దిగేవాడు హీరో అయ్యాడు, ప్రజలు జీరోలయ్యారు. ఒక్క సినిమాతో ఏదో అయిపోతుందని కాదు కానీ ఇలాంటి దృశ్యాల ప్రభావం అంతో ఇంతో ఉంటుంది. సినిమాల ప్రభావం లేకపోతేనే ఒక నటున్ని ప్రజలు ముఖ్యమంత్రిని చేశారా?


మనకెందుకు అని కొట్టుకుపోతున్న సమాజంలో అంతో ఇంతో ప్రజల కోసం ఉద్యమించే సంస్థలు కొన్ని ఉన్నాయి. పెళ్లి చేసుకుంటాను అని మోసం చేసే యువకున్ని నిలదీసేవి మహిళా సంఘాలే. కానీ మన సినిమాల్లో మాత్రం మహిళా సంఘాలు అంటే పనీ పాటా లేని మహిళల సమూహం. తోటి వారి గురించి పట్టించుకోవడమే మన సినిమాల్లో పని లేని తనం. మహిళా సంఘాలను ప్రోత్సహించకపోయినా పరవాలేదు. అంత చిన్న చూపు చూడడం ఎందుకు?


ఆడపిల్లలను వేధించడమే హీరోయిజం అని కొన్ని వందల సినిమాల్లో పరోక్షంగా సందేశం ఇస్తున్నప్పుడు ఆ ప్రభావం యువతపై పడకుండా ఉంటుందా? తమ అభిమాన నటుని స్టైల్‌ను దుస్తుల్లో, హేర్‌కటింగ్‌లో అనుసరించే వారు ఆ వెర్రి బుద్ధులను కూడా అనుసరించకుండా ఉంటారా?
సినిమా ఒక వ్యాపారం. వాళ్ల డబ్బు వాళ్ల ఇష్టం. కానీ సమాజం పట్ల కొంత బాధ్యతా యుతంగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? జనం ఇలాంటి సినిమాలే చూస్తున్నారు కాబట్టి తీస్తున్నామని సమర్ధించుకోవచ్చు. 5 నుంచి 10 శాతం సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. ఇంతోటి విజయం కోసమేనా సినిమా వాళ్ల కృషి.
సమాజానికి కీడు చేసే ఇలాంటి సినిమాలను ఎలా ఆదరించాలో అలానే ఆదరిస్తున్నారు. సినిమాలకు సమాజం నుంచి కావలసింది ఈ గుణపాఠమే. సినిమాల విజయం ఐదు శాతం నుంచి మరింతగా తగ్గి సంక్షోభం తలెత్తినప్పుడు సినిమాల సంఖ్య తగ్గుతుంది, నాణ్యత పెరుగుతుంది. అలా జరగాలని ఆశిద్దాం.

5 కామెంట్‌లు:

 1. రాజా, శర్వానంద్ పార్వతీ మెల్టన్ నటించిన సినిమా అది, పేరు గుర్తుకు రావడములేదు (వెన్నెల అనుకుంట). అందులో విలన్ (నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉన్న పాత్ర) చెప్పే డయిలాగు ఒకటుంటుంది.

  శర్వానంద్ అంటాడు, నీవల్లే నేను చెడిపోయాను అని. దానికి ఆ విలన్, రేయ్ మనిద్దరం కలిసి తిరిగాం, కలిసి తాగాం అయినా చూడు నువ్వు ఎక్కడున్నావో నేనెక్కడున్నానో? నువ్వో పగలడానికి సిద్దంగా ఉన్న గాజువిరా ... ఇక్కడ ఆరాయిని నేనయ్యాను. నేను కాకపోతే మరొకడి కారణంగా పగిలిపోయే వాడివి. నీ గురించి ఆలోచించక రాయినెందుకు తిడతావ్ అని. ఆ డయిలాగులు ఎక్జాక్ట్ గా ఇవి కాదు కానీ, అర్థం మాత్రం ఇదే వస్తుంది. ఇక్కడ సినిమాలు కేవలం అలాంటి రాళ్ళు మాత్రమే.

  అసలు సినిమాలు మనిషిని చెడగొట్టాయా లేక మనిషిని చూసి Inspire అయ్యి సినిమాలు తీస్తున్నారా? చాలా మంది హీరోయిన్లు వేసుకునే డ్రెస్సులు హై క్లాసు లేడీసు వేసుకునేవే అని చెప్పేవారు ఒకప్పుడు. బహుషా సినిమాలు వాటిని అందరికీ పరిచయం చేసుండొచ్చు.

  ఇక ఐటం సాంగులంటారా? మొన్న జరిగిన సంక్రాంతి పండగ సందర్భంగా కొన్ని చోట్ల , అది మనం సంస్కృతికి పట్టుకొమ్మలని చెప్పుకునే పల్లెలలో, కొంత మంది రికార్డింగ్ డ్యాన్సులు వేశారట. వారు కూడా ఐటం సాంగులకే నర్తించారు. కానీ, ఒంటి మీద చిన్న గుడ్డ పీలిక కూడా లేకుండా. హాలీవుడ్డు సినిమాలలో కూడా ఇలాంటి దృష్యాలు ఉండవేమో అని జనాలు ఇదివరకు చెప్పుకున్నారు, ఆ నృత్యాలను చూసి. మరి వారు ఏ సినిమాలను చూసి చెడిపోయారు?

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. శ్రీకాంత్ గారు ధన్యవాదాలు శంకర భరణం వచ్చిన కొత్తలో చాలా మంది తల్లి తండ్రులు తమ పిల్లలకు సంగీతం , నృత్యం నేర్పించారు .. ఆ ప్రభావం ఇప్పటికి ఉంది ..

   తొలగించు
  2. సినిమా ప్రభావం సమాజంపై చాలా ఉంటుందని అందరికీ తెలిసినదేనండి. ఒప్పుకోవదానికే ఇష్టపడరు. వాదనాపటిమ వున్నవారు నేగ్గుతారు అంతే..

   తొలగించు
 2. మంచి ఆర్టికల్. సినిమా శక్తివంతమైనా మీడియా. దీని ద్వారా మంచి , చెడు రెండూ ప్రభావితమవుతాయి. మంచి సినిమాలు తీసేలా చర్యలు తీసుకోవాలి. దిల్ రాజు ధైర్యం చేసి తీసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ కాలేదా? ఆ సినిమా ప్రభావం సమాజంపై లేదా? శంకరాభరణం - సాగర సంగమం - ప్రతిఘటన - ముత్యాలముగ్గు వంటివి ఆడలేదా? ప్రజలు ఆదరించలేదా? సెన్సార్ బోర్డ్ లో కుళ్లు రాజకీయాలు పోవాలి. మంచి సినిమాలు అశ్లీలత ద్వంద్వార్ధాలు లేకుండా తీసేలా చూడాలి. అంగాంగ ప్రదర్శన - హీరోల చేత వెకిల చేష్టలను నిరోధించగలిగే దమ్ము సెన్సార్ బోర్డ్ సభ్యులకు ఉండేలా చూడాలి. సెన్సార్ బోర్డ్ సభ్యులను రాజకీయ పదవుల పందేరాలతో నింపేయడం - వారు సినిమా సర్టిఫికెట్ లను అమ్ముకోవడం జరగకుండా చూడాలి. అందుకోసం ప్రజా ఉద్యమం నడవకుండా అంత తేలికగా వ్యవస్థలో మార్పు వస్తుందనుకోలేము.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. పళ్ళ కొండల రావు గారు ధన్యవాదాలు జీవితం లో పుస్తకం ముట్టుకొని వాళ్ళను గ్రందాలయ సంస్థ చైర్మేన్లు గా ,, సమాజం గురించి ఏమాత్రం అవగాహనా లేని వాళ్ళను సెన్సర్ బోర్డు మెంబర్ లు గా వేస్తున్నారు .. మన ఖర్మ

   తొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం