27, జనవరి 2013, ఆదివారం

నడమంత్రపు దేవుళ్లు... వై యస్ ఆర్ ..ఎన్టీఆర్ .మాయావతి...అమితాబ్ ..నమిత లకు దేవాలయాలు ... ప్రజాస్వామ్యం లో వెర్రి తలలు వేస్తున్న వ్యక్తి పూజ

మనది రాజరికమా? ప్రజాస్వామ్యమా? అంటే ఈ రెండూ కాదు వ్యక్తిపూజ స్వామ్యం అనిపిస్తోంది. సిద్ధాంతాల కన్నా ఈ దేశంలో వ్యక్తి పూజకే రాజకీయాల్లో పెద్ద పీట వేస్తున్నారు. వ్యక్తిపూజ మన నర నరాల్లో ఇంకిపోయింది. రాజరికంలో రాజు పట్ల ఈ వ్యామోహాన్ని చూపించాం. రాజు ఎంత తప్పు చేసినా ఎదిరించవద్దని, రాజు ఏం చేసినా మన మంచి కోసమే అని మన శాస్త్రాలు ఘోషించాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆరు దశాబ్దాల తరువాత కూడా ప్రజాస్వామ్యంలోనూ ప్రజలకు దూరంగా ఉండే రాజులు గెలుస్తున్నారు. ఆ రాజు కుటుంబంపై ప్రజల కుండే పిచ్చి అభిమానం. వ్యక్తి పూజ రాజులకు పెట్టని కోటలా నిలిచింది. 

రక్షణ కోసం సైన్యాన్ని నియమించుకోవడం కన్నా..రాజు కోసం ప్రాణాలు అర్పించే ప్రజలను తయారు చేసుకోవడం ఎక్కువ ప్రయోజన కరం అని పాలకులు ఎప్పుడో గ్రహించారు. వ్యక్తిపూజకు పెద్ద పీట వేసినప్పుడు తప్పు ఒప్పులను సమీక్షించుకునే విచక్షణా జ్ఞానం కోల్పోతాం. ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కొత్త రాజులు పాతుకు పోయారు. వ్యక్తిపూజ ఉధృత స్థాయికి వెళ్లింది. చివరకు హీరోయిన్లకు, హీరోలకు, నాయకులకు ఆలయాలు కట్టే స్థాయికి ఈ ఆరాధన చేరుకొంది. 

మానవత్వం ఉన్నవారిని మంచి చేసిన వారిని మనుషులు ఎప్పుడూ మరిచిపోరు. ఇంగ్లాండ్ నుంచి ఒక ఉద్యోగిగా మన దేశానికి వచ్చిన కాటన్‌కు కోస్తాలో ఆర్ఘప్రదానం చేసే వాళ్లు చాలా మందే ఉంటారు. అతను క్రైస్తవుడు. ఆర్ఘప్రదానం చేసేది హిందువులు. మంచి చేసిన వారికి మేం గుండెల్లో గుడికట్టుకొని పూజిస్తాం అని తెలియజేస్తున్నట్టుగా ఉంటుంది ఇలాంటి దృశ్యాలను చూసినప్పుడు. మంచిని గుర్తించినప్పుడు ఆ మంచి మరింతగా వ్యాపించడానికి దోహదం చేస్తుంది. మంచిని గుర్తించడం వేరు. వెర్రి అభిమానం వేరు. అభిమానం కాస్తా వ్యక్తిపూజకు దారితీస్తే...

 మన దేశ రాజకీయ చరిత్రలో మహాత్మాగాంధీ ఒక దేవునిగా పూజలు అందుకున్నారు. ఆధునిక కాలంలో ఆయనతోనే మన దేశంలో రాజకీయాల్లో వ్యక్తి ఆరాధన ప్రారంభం అయిందనవచ్చు. ఆయన ఒక్క మాట చెబితే విద్యార్థులు కళాశాలలు వదిలి స్వాతంత్య్ర సంగ్రామంలో చేరారు.దేశం కోసం ఉద్యమించారు. మొత్తం దేశం స్పందించింది. ఆయన నాయకత్వంలో దేశం ఒక్కత్రాటిపై నిలిచింది. దేశానికి మంచి జరగడానికి మహాత్మాగాంధీకి ఉన్న ఇమేజ్ దోహదం చేసింది. ఆ తరువాత జవహర్‌లాల్‌నెహ్రూకు సైతం దాదాపుగా ఇదే విధంగా ఇమేజ్ లభించింది. 125 ఏళ్ల కాంగ్రెస్‌కు ఇప్పటికీ వ్యక్తిపూజ ఒక వరంగా మారింది. వ్యక్తిపూజకు ఇది పాజిటివ్ కోణం. 

* * * 
వ్యక్తిపూజ ఒక హిట్లర్‌ను తయారు చేసింది.తమ జాతే  అత్యున్నతమైన దని పౌరులని నాజీ బృందం నమ్మించింది. తమను తాము ప్రేమించుకున్న నాజీలు హిట్లర్ చేసిన సిద్ధాంతం బాగా నచ్చింది. ఆయన నాజీల పాలిట దైవంగా కనిపించారు. అంత వరకు బాగానే ఉంది కానీ నాజీల దైవం కాస్తా యూదుల పాలిట రాక్షసునిగా మారాడు. వ్యక్తిపూజకు ప్రపంచంలోనే పరాకాష్టగా నిలిచిన వాడు హిట్లర్. తన ఉపన్యాసాలతో ప్రజలను రెచ్చగొట్టి వారి పాలిట తానో దైవంగా నిలిచి లక్షలాది మంది యూదులను హతమార్చాడు. వ్యక్తిపూజకు సంబంధించి ఇది రెండవ కోణం. రెండవ ప్రపంచ యుద్ధం నాటి భయంకరమైన అనుభవాల నుంచి ప్రపంచం ఇప్పటికీ బయటఫడలేకపోతోంది. కానీ జర్మనీలో ఇప్పటికీ నాజీ అభిమానులకు కొదవ లేదు. వ్యక్తిపూజకు ఉండే శక్తివంతమైన లక్షణం అది. హిట్లర్ చేసిన ప్రచారం ఇప్పటికీ జర్మనీ యువత మెదళ్లను తొలుస్తూనే ఉంది. హిట్లర్ చేసింది తప్పు కాదు. తమదే అత్యున్నతమైన జాతి అని విశ్వసించే హిట్లర్ అభిమానులు జర్మనీలో ఇంకా చాలా మందే ఉన్నారు. వ్యక్తి పూజకు సంబంధించి 20 వ శతాబ్దంలో గొప్ప ఉదాహరణ హిట్లర్. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక సాధారణ సైనికునిగా ఉన్న ఆతను తన వాగ్దాటితో కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించి జాత్యహంకారాన్ని రగిల్చి రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడయ్యాడు.

 లాడెన్ చెబితే చాలు వేలాది మంది ముస్లిం యువకులు తీవ్రవాదులుగా మారారు. విమానాన్ని మానవ బాంబుగా మార్చి టవర్స్‌ను కూల్చారు. వ్యక్తిపూజ వెర్రితలలు వేసినప్పుడు విచక్షణా జ్ఞానం కోల్పోతారు. వ్యక్తిపూజ మంచి ప్రయోజనాల కోసం ఉపయోగపడితే మంచిదే కానీ వెర్రితలలు వేస్తే సమాజాన్ని ప్రమాదంలో ముంచేస్తుంది. హిట్లర్, స్టాలిన్ వంటి వారు వ్యక్తిపూజకు ప్రపంచంలో ఉదాహరణగా నిలిచారు. వ్యక్తిపూజను కోరుకునే వారు ప్రధానంగా ప్రచారంపై ఆధారపడతారు. తమను తాము అత్యున్నతమైన నాయకులుగా, ప్రపంచాన్ని ఉద్దరించడానికి అవతరించిన అవతార పురుషులుగా ప్రచారం చేసుకుంటారు. హిట్లర్ ప్రారంభ కాలంలో తాను ఉపన్యాసం చేసేప్పుడు చప్పట్లు కొట్టడానికి కొంత మందిని తానే ఏర్పాటు చేసుకునే వారట! బ్రిటన్‌లో లార్డ్ బాడెన్ తానెంత గొప్ప వ్యక్తో తానే ప్రచారం చేసుకునే వారట! తన ఇమేజ్ పెంచుకోవడానికి స్వయంగా ఆయనో న్యూస్ పేపర్‌ను, మ్యాగజైన్‌ను ప్రారంభించారు. మారు పేర్లతో తన గొప్పతనం గురించి తానే వ్యాసాలు రాసుకునే వారట! వ్యక్తిపూజను అందుకున్న వారందరిలో కనిపించే కామన్ లక్షణం. మీడియా ప్రచారం. 

మరే దేశంలోనూ కనిపించని విధంగా సినిమా నటుల విషయంలో మన దేశంలో వ్యక్తిపూజ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఉత్తరాదిలో ఎక్కువగా కుల రాజకీయాలు వ్యక్తిపూజలో ప్రాధాన్యత వహిస్తే దక్షిణాదిలో సినిమాలు ఎక్కువ ప్రాధాన్యత వహిస్తున్నాయి. తమిళనాడులో హీరోయిన్లకు, హీరోలకు, రాజకీయ నాయకులకు ఆలయాలు నిర్మించడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి మన రాష్ట్రాన్ని ఆవహించింది. ఏకంగా ఆలయాలను నిర్మించి పూజించే స్థాయికి వ్యక్తి పూజ చేరుకుంది. ఎన్టీఆర్.. వైఎస్‌ఆర్ ఆలయాలు తమిళనాడు అంత స్థాయిలో కాకపోయినా మనుషులకు ఆలయాలు నిర్మించే సంస్కృతి ఇప్పుడిప్పుడే మన రాష్ట్రంలోనూ ప్రవేశించింది.


  ఈ కాలానికి సంబంధించి  రాష్ట్ర రాజకీయాల్లో పాపులర్ నాయకులు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఎన్టీఆర్ కాగా, మరొకరు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. మూడు దశాబ్దాలకు పైగా శ్రీరామునిగా, శ్రీకృష్ణ్ణునిగా అటు దైవంగా ఇటు సాంఘిక, జానపద సినిమాల్లో హీరోగా ఎన్టీఆర్ తెలుగు వారి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆ అభిమానం ఆయన్ని ఏకంగా ముఖ్యమంత్రిని చేసింది. రాజకీయ నాయకుడిగా కన్నా నటునిగానే ఆయన అభిమానులకు చేరువయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రిగా తాను అమలు చేసిన పలు పథకాల ద్వారా వైఎస్‌ఆర్ ప్రజలకు చేరువ అయ్యారు. వైఎస్‌ఆర్ మరణం తరువాత వ్యక్తి పూజ మొదలు కాగా, ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఆయన నటునిగా, రాజకీయ నాయకునిగా ఉన్నప్పటి నుంచే పూజలందుకున్నారు. ఆత్మగౌరవం నినాదంతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌కు ప్రజాప్రతినిధులు బహిరంగంగానే కాళ్లు మొక్కేవారు. అలా కాళ్లు మొక్కిన వారే ఆయన్ని అధికారం నుంచి దించేశారు.

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం తరువాత ఎన్నో చారిత్రక సమావేశాలకు వేదికగా నిలిచిన ఆబిడ్స్‌లోని ఆయన నివాసాన్ని వారసులు అమ్మివేశారు. చివరి రోజుల్లో ఆయన నివసించిన బంజారాహిల్స్‌లోని భవనాన్ని రియల్ ఎస్టేట్ డవలపర్‌కు అమ్మేశారు. ఆయన నివసించిన ఇళ్ల ప్రాధాన్యతను వారసులు గుర్తించలేదు కానీ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సహాయానికి ఒక సామాన్య కూలీ మాత్రం స్పందించారు.
 ఒక  కూలీ  ఎన్టీఆర్‌కు ఆలయాన్ని నిర్మించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజక వర్గంలోని తొట్టెంబేడు మండలం కంచెనపల్లి గ్రామంలో శ్రీనివాసులు అనే సాధారణ కూలీ ఎన్టీఆర్‌కు ఆలయాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ ఫోటోలకు పూజలు చేసేవాడు. ఒక దాత ఎన్టీఆర్ విగ్రహాన్ని బహూకరించడంతో విగ్రహం ఏర్పాటు చేశారు. 1985లో తమ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ఆ ప్రాంతానికి వచ్చి సహాయం చేశారని, దానికి కృతజ్ఞతగా తాను ఆలయాన్ని నిర్మించినట్టు శ్రీనివాసులు తెలిపారు. ఈ అభిమాని నిర్మించిన ఆలయం గురించి ఒక చానల్‌లో చూసిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు గ్రామంలో ఎన్టీఆర్, బసవ తారకంలకు ఆలయాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించారు.

 వైఎస్‌ఆర్‌కు వ్యతిరేకంగా ప్రత్యర్థులు ఎంతగా ప్రచారం చేసినా ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏకంగా ఒక కొత్త పార్టీ పురుడు పోసుకునేంత బలంగా ప్రజల్లో నాటుకున్నాయి. ఆ పథకాల వల్ల చివరకు ఆభిమానులు ఆయనకు ఆలయాలను నిర్మిస్తున్నారు. వైఎస్‌ఆర్ క్రైస్తవుడు. హిందుపూజా విధానాలతో ఆయనకు ఆలయాన్ని నిర్మించారు. విశాఖ జిల్లా రాజగోపాలపురం గ్రామంలో రాజశేఖరరెడ్డి ఆలయం పేరుతో దేవాలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం కోసం గ్రామస్తుల నుంచి నాలుగు లక్షల రూపాయలు సేకరించామని, ఇతర హిందూ ఆలయాల్లో వలెనే ఇక్కడ పూజలు నిర్వహించనున్నట్టు స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత గోవిందరెడ్డి చెప్పారు. ఈ ఆలయంలో విగ్రహాన్ని జగన్మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. మరోవైపు మదనపల్లి నియోజక వర్గంలో వైఎస్‌ఆర్‌కు ఆలయం నిర్మించనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే ప్రకటించారు. వైఎస్‌ఆర్ క్యాథలిక్ క్రిస్టియన్, ఆలయాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించింది ముస్లిం ఎమ్మెల్యే. హిందూ పూజా విధానంతోనే ఆలయాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టిడిపిల మధ్య అన్ని రంగాల్లోనూ వార్ సాగుతోంది. వైఎస్‌ఆర్ విగ్రహాల ఏర్పాటును వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు ఒక ఉద్యమంగా చేపడితే, టిడిపి నాయకులు కాస్త ఆలస్యంగా ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 

ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట, పూజల నిర్వహణ ఎలా ఉండాలో ఆగమ శాస్త్రం చెబుతోంది. రాజకీయ నాయకులు, సినిమా హీరోలు, హీరోయిన్లకు ఆలయాల నిర్మాణం ఆగమ శాస్త్రానికి ఎలాంటి సంబంధం ఉండదు. వ్యక్తులకు నిర్మించే ఆలయాల్లో అభిమానుల ఆత్యుత్సాహం, వ్యక్తిపూజకు పరాకాష్టగా నిలవడమే తప్ప నిజంగా అక్కడ ఇతర ఆలయాల్లో మాదిరిగా ఉండదు. ఆలయం అంటే కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు. భక్తులు వస్తేనే అది ఆలయం అవుతుంది. కానీ ఇలా వ్యక్తుల ఆలయాల్లో అభిమానులు తప్ప భక్తులు కనిపించరు. ఆ నాయకుని, నటుని జయంతి, వర్థంతి, పుట్టిన రోజుల్లో అభిమానులు వచ్చే హడావుడి చేయడం తప్ప భక్తులెవరూ ఉండరు. ఎక్కువగా ఈ ఆలయాన్ని నిర్మించిన వారే భక్తులుగా వెళుతుంటారు.

 నాయకులకు ఆలయాలు 

రాజకీయ నాయకులకు ఆలయాలు నిర్మించడం ఇప్పుడో ఫ్యాషన్‌గా మారింది. ఒరిస్సాలోని బత్రా గ్రామంలో హరిజనులు మహాత్మాగాంధీకి ఆలయాన్ని నిర్మించారు. సమాజంలోని అన్ని కులాలు ఒకటే అని చాటి చెప్పిన మహాత్ముడు తమ దృష్టిలో దేవుడే అని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోని హరిజనులే నిధులు సమకూర్చుకుని ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎలాంటి కుటుంబ రాజకీయ నేపథ్యం లేకపోయినా కాన్షీరామ్ శిష్యురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి ప్రభావాన్ని ఈ రోజు దేశంలో తక్కువగా అంచనా వేయలేరు. దళిత చైతన్యానికి ఆమె ప్రతీకగా నిలిచారు. ప్రధానంగా దళిత సమాజం నుంచి ఆమె పూజలు అందుకునే స్థాయికి వెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లోని మహబా జిల్లాలో నాత్‌పూర్‌లో మాయావతి ఆలయాన్ని నిర్మించారు. నాస్తిక దేవాలయం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నాస్తికులు. హిందూ వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అలాంటి కరుణానిధికి తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని డిఎంకె నాయకుడు జిఆర్ కృష్ణమూర్తి కళైగనర్ తిరుకోవళి పేరుతో కరుణానిధికి సమిరెడ్డిపల్లి గ్రామంలో ఆలయం నిర్మించారు. మన రాష్ట్రంలో వైఎస్‌ఆర్, ఎన్టీఆర్ విగ్రహాలు పోటీపడుతున్నాయి. ఇద్దరికీ ఆలయాలు నిర్మించారు. ఎన్టీఆర్ సినిమా గ్లామర్‌పై ఆధారపడ్డ ఆయన కుటుంబ వారసులు , రాజకీయ గ్లామర్‌పై ఆధారపడి తిరిగి విజయం సాధించాలనుకుంటున్న రాజకీయ వారసులు ఎన్టీఆర్ విగ్రహాలు, ఆలయాల నిర్మాణానికి నడుం బిగించారు. వైఎస్‌ఆర్ రాజకీయ గ్లామర్‌ను నమ్ముకున్న ఆయన కుమారుడు విగ్రహాల సమరాన్ని ప్రారంభించారు. ఆయన పార్టీని నమ్ముకున్న వాళ్లు ఏకంగా వైఎస్‌ఆర్‌కు వంద ఆలయాలు నిర్మించనున్నట్టు ప్రకటించారు. ఈ కొత్త దేవుళ్ల పోటీలో అసలు దేవుళ్లను ఆ దేవుడే రక్షించాలి. 

శృంగార తారలకు ఆలయాలు

 సినిమా నటీనటులకు అభిమాన సంఘాలు ఉండడం ఎంత సహజమో, ఇప్పుడు తమిళనాడులో వారికి ఆలయాలు ఉండడం అంత సహజం అయింది. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తి మనిషికి దేవునిలా కనిపిస్తాడు. దేవుడు ఉన్నాడో? లేడో? ఉంటే ఎక్కడున్నాడో? ఎలా ఉన్నాడో? మనిషికి తెలియదు కానీ మంచి తనంలో దేవుడ్ని చూసుకుంటాడు. తోటి మనిషికి సహాయపడిన వానిలో దేవుడ్ని చూసుకుంటాడు. ఆపదలో దైవం తనకు అండగా ఉంటుందని మనిషి నమ్మకం. అందుకే ఆదుకున్న వారిని దేవునిలా వచ్చి ఆదుకున్నావని అంటాడు. అంత వరకు బాగానే ఉంది కానీ తనకు నచ్చిన నటులకు, నాయకులకు ఆలయాలు కట్టి పూజించడమే ప్రపంచానికి వింతగా ఉంటుంది. ఇలా ఆలయాలు నిర్మించే వారి సంఖ్య స్వల్పంగానే ఉండొచ్చు, ఆలయ నిర్మాణమే తప్ప నిజంగా ఒక ఆలయంలో పూజలు జరిగినట్టుగా ఇక్కడ జరపవచ్చు, జరపకపోవచ్చు. కానీ ప్రపంచానికి మాత్రం ఇది వింతగానే ఉంటుంది. సినిమా తారలకు ఆలయాలు నిర్మించడమనే వేలం వెర్రి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తుంది. ఖుష్బు ఒక అందమైన హీరోయిన్. నటించింది కొన్ని సినిమాల్లోనే. కానీ ఆమెకు తమిళ సినీభక్తులు ఆలయాన్ని నిర్మించి సంచలం సృష్టించారు. రెండు మూడు దశాబ్దాల పాటు సినీరంగంలో పాతుకుపోయి అద్భుతంగా నటించిన నటీమణి ఏమీ కాదామే కానీ రెండు మూడు సినిమాలతోనే ఆలయం నిర్మించేశారు.

 ఆమెకు ఎంత స్పీడుగా ఆలయం నిర్మించారో అంతే స్పీడ్‌గా కూల్చేశారు. పెళ్లికి ముందు సెక్స్ తప్పు కాదు అంటూ ఆమె చేసిన కామెంట్ తమిళనాడులో దుమారం రేపింది. అంతకు ముందు ఆమెకు ఆలయం నిర్మించడం ఎంత సంచలనం అయిందో, ఆమె ప్రకటన అంతే సంచలనం సృష్టించింది. ఖుష్బుకు తిరుచిరాపల్లిలో ఆలయం నిర్మించారు. పెళ్లికి ముందు శృంగారం తప్పు లేదు అంటూ ఆమె చేసిన ప్రకటనలతో దుమారం చెలరేగి ఆలయాన్ని కూల్చేశారు. ఆమెపై కేసులు పెట్టారు. వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఖుష్బ కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగుసినిమా రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో వెంకటేష్‌కు జంటగా నటించింది. ఆ తరువాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా అంతగా పేరు రాలేదు. తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగారు. శృంగార తారగా తమిళుల అభిమానం సంపాదించారు. ముంబైకి చెందిన ఖుష్బు ముస్లిం. ఆమె సినిమా రంగానికే చెందిన సుందర్‌ను పెళ్లి చేసుకున్నారు. గత రెండు దశాబ్దాల నుంచి తమిళనాడులోనే ఉంటున్న ఆమె ప్రస్తుతం డిఎంకెలో ఉన్నారు. బాలనటిగా 1980లో తొలిసారి బర్నింగ్ ట్రైయిన్ సినిమాలో నటించారు. ఖుష్బుకన్నా ముందే కొందరు తమిళతారలకు ఆలయాలు నిర్మించినా ఎక్కువ ప్రచారం మాత్రం ఖుష్బు ఆలయానికి లభించింది. 

నమితకూ ఆలయం 

నమ్మశక్యం కాకపోవచ్చు కానీ ఇది నిజం. సింహా సినిమాలో బాలకృష్ణతో శృంగారం ఒలకబోసిన నమితకూ తమిళనాడులో ఆలయం నిర్మించారు. తమిళనాడులోని తిరునెల్‌వెళ్లిలో అభిమానులు నమితకు ఆలయం నిర్మించారు. నాకు ఆలయం నిర్మించడం ఏమిటని ఆశ్చర్యపోయాను అని నమిత ఒక సందర్భంలో తెలిపారు. నమిత స్వస్థలం సూరత్. తిరిగి తాను స్వస్థలానికి వచ్చేస్తానని కుటుంబ సభ్యులతో ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. చూడండి ఏదో ఒక రోజు నాకు గుడి కడతారు అని మా ఇంట్లో వాళ్లతో నవ్వుతూ చెప్పేదాన్ని కాని ఇప్పుడు నిజంగానే గుడి కట్టడంతో వింతగా అనిపిస్తోంది అని నమిత ఆశ్చర్యపోయారు.

 పూజకు పూజ

పూజా ఉమా శంకర్ అని ఒక తమిళనటి. పేరు పెద్దగా వినలేదు కదూ. కావచ్చు కానీ ఈమెకూ ఒక ఆలయం ఉంది. మన దేశంలో కాదు. శ్రీలంకలో... ఈ తమిళనటి, సింహాళ, మళయాళ సినిమాల్లో సైతం నటించారు. శ్రీలంకలోని కొలంబోలో ఈమెకు అభిమానులు చాలా ఎక్కువ. ఈమెను వాళ్లు అమితంగా ఆరాధించేస్తుంటారు. దాంతో ఈ పూజకు శ్రీలంకలో ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. పూజ నటించిన అంజలిక, ఆసియ మంగ్ పియబన్న సినిమాలతో ఆమె శ్రీలంకలో లక్షలాది మంది హృదయాలను దోచుకున్నారు. అయితే ఆమె ఎక్కువ రోజులు పూజలు అందుకునే భాగ్యం లేకుండాపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఆలయాన్ని పేల్చేశారు. మళ్లీ ఆలయం నిర్మించడానికి అభిమానులు సిద్ధపడగా, ఆమె వద్దని వారించారు. తొలుత ఆమె కన్నడ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు.తరువాత తమిళ, సింహాళ సినిమాల ద్వారా పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకుంది. పూజ తల్లి శ్రీలంకకు చెందిన వారు కాగా, తండ్రి కర్నాటకకు చెందిన వారు. మరో తమిళ, తెలుగు నటి హన్సికకు తమిళనాడులోని మధురైలో ఆలయం నిర్మించడానికి అభిమానులు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఆమె నటించిన తమిళ సినిమాలు రెండు మాత్రమే విడుదల అయ్యాయి. మూడవది విడుదల కానుంది. అప్పుడే ఆలయానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 హీరోలకూ ఉన్నాయి ఆలయాలు

ఆలయాలన్నీ హీరోయిన్లకేనా? మరి హీరోల సంగతి ఏమిటి? అని బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో తమిళభక్తులు సినీ భక్త జనానికి మంచి దారి చూపించారు. హీరోలకు ఆలయాలు నిర్మించడంలోనూ వారే ముందున్నారు. కర్నాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న కోటిలింగేశ్వర శివాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడే రజనీకాంత్ అభిమానులు రజనీకాంత్‌కు ఆలయంగా సహస్ర లింగం ఏర్పాటు చేశారు. కోటిలింగేశ్వర ఆలయ పూజారులతోనే వేద మంత్రాలతో సహస్ర లింగాన్ని రజని అభిమానులు ఏర్పాటు చేయించారు. కోటి లింగేశ్వర ఆలయ నిర్వాహకులు ఈ సహస్ర లింగం ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తారు. సాధారణంగా రజనీకాంత్‌కు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఆయన సరే అంటే తమిళనాడులో వీధికో ఆలయాలు వెలసి ఉండేవి కానీ ఆయన ఇలాంటి వాటిని ప్రోత్సహించరు. దాంతో తమిళనాడుకు బదులు కర్నాటకలో ఆయన ఆలయం వెలిసింది. 

.... ఎంజిఆర్, అమితాబ్‌లకు గుళ్లు 

  తమిళభక్తులు సినీ భక్త జనానికి మంచి దారి చూపించారు. హీరోలకు ఆలయాలు నిర్మించడంలోనూ వారే ముందున్నారు. దేశంలో సినిమా వాళ్లకు ప్రజల్లో ఇంతటి ఇమేజ్ ఉంటుందని దేశ ప్రజలకు చాటి చెప్పిన తొలి నటుడు ఎంజిఆర్. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి నటుడు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి, టిడిపి ఏర్పాటుకు ఎంజిఆర్ విజయం ప్రేరణగా నిలిచింది. పురిచ్చి తలైవర్ - మక్కల్ తిలగం ఎంజిఆర్. అభిమానులతో నిజంగానే పూజలు అందుకున్న నటుడు ఆయన. తమిళనాడు రాజధాని చెన్నైకి 40 కిలో మీటర్ల దూరంలో గల తిరువనంతపురం నాతవేడులో ఎంజిఆర్‌కు ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ నిర్వహించే ప్రత్యేక కుంభాభిషేకానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంజిఆర్ అభిమానులైన తమిళులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. రాజకీయ నాయకులు, సినిమా తారలకు ఇటీవల కాలంలో ఆలయాలు నిర్మిస్తున్నారు. అయితే వీరందరి కన్నా ముందు ఆలయం నిర్మించింది. ఎంజిఆర్‌కు 

ఎంజిఆర్ ఇజం ఒక మతం అయితే ఎంజిఆర్ ఒక దేవుడు అంటారు ఆయన తొలి భక్తురాలు కాంత శ్రీనివాసన్ . మద్రాస్ హైకోర్టు ఆవరణలో ఆమె 1984లోనే ఎంజిఆర్‌కు ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటికీ ఆమె కోర్టు ఆవరణలో పూలు అమ్ముతుంది. తన జీవితంలో మూడు సార్లు ఎంజిఆర్‌ను చూశానని ఆమె గర్వంగా చెబుతుంటుంది. ఒకసారి ఆమె ఎంజిఆర్‌కు కూల్‌డ్రింక్ ఇస్తే, ఆయన సగం తాగి, మిగిలిన సగం ఆమెకు ఇచ్చారు. ఎంజిఆర్ సమక్షంలోనే మిగిలిన సగం తాను తాగితే ఎంజిఆర్ నవ్వాడని, ఆ అభిమానానికి తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని, నన్ను నేను సంభాళించుకోలేక పోయానని ఆమె చెబుతోంది. 84లో ఎంజిర్‌ను అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయన కోలుకోవాలని అందరిలానే ఆమె ప్రార్థించింది. ఆ సమయంలోనే ఆమె ఎంజిఆర్ ఫోటో పెట్టి ప్రార్థించింది. ఆమెతో పాటు చాలా మంది ఎంజిఆర్ భక్తులు అక్కడే మొక్కేవారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఆయన మూడవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఆలయం నిర్మించారు. ఎంజిఆర్ భక్తుడు ఎంజిఆర్‌కు ఏడు అడుగుల పొడవైన విగ్రహంతో మరో ఆలయాన్ని 1990లో నిర్మించారు. 

హిందూ ఆలయం తరహాలోనే దీన్ని నిర్మించారు. మధ్యలో ఎంజిఆర్ విగ్రహం రెండు వైపుల ఎడిఎంకె జెండాను పట్టుకుని నిలిచిన అమ్మాయిలతో ఈ ఆలయం ఉంది. ( ఇండియా టుడే తమిళ ఎడిషన్ 6.4.1990లో ఈ ఆలయం గురించి రాశారు) ఎంజిఆర్ భక్తులు ఎల్. కలైవనన్, ఆయన భార్య శాంతి తమిళనాడులోని తిరునింద్రవుర్ వద్ద భూమిని కొనుగోలు చేశారు. ఆలయ నిర్మాణం కోసం ముందుగా కాంపౌండ్ వాల్ నిర్మించి ఆరుమిగు ఎంజిఆర్ ఆలయం అని పేరు పెట్టారు. 28.10.2010లో ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. తాజాగా 2011లో మరో ఆలయం నిర్మించారు. ఇప్పటి వరకు ఎంజిఆర్‌కు నాలుగు ఆలయాలను నిర్మించినట్టు సమాచారం. ....
... బిగ్‌బి ఆలయం 

అమితాబ్‌ను సినిమా అభిమానులు కనిపించే దైవంగానే భావిస్తారు. ఏడుపదుల వయసులో ఆయన ఉత్సాహాన్ని చూసి అభినందించాల్సిందే.. కానీ ఏకంగా దైవంగా పూజించడం వింతగానే ఉంటుంది. ఇంత వయసులోనూ ఆయన్ని జనం ఎంతగా అభిమానిస్తారో కౌన్‌బనేగా కరోడ్‌పతిలో చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా కలకత్తాకు చెందిన ఆయన అభిమానులు ఆయన్ని ఏకంగా దైవంగానే చూస్తారు. అమితాబ్ సినిమాల్లోకి రాకముందు తొలి ఉద్యోగం కలకత్తాలోనే చేశారు. బెంగాల్‌కు చెందిన జయను అమితాబ్ పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన్ని బెంగాల్ అల్లుడిగా భావిస్తామని, ఆయన అంటే ఉన్న గౌరవంతో ఆలయం నిర్మించుకున్నాం ఇందులో ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదని అభిమానులు వాదిస్తారు. దక్షిణ కలకత్తాలో సంజయ్ అనే వ్యక్తి అమితాబ్‌కు ఆలయాన్ని నిర్మించాడు. అమితాబ్ ఆక్స్ సినిమాలో కూర్చున్న చైర్‌ను, అగ్నిపథ్ సినిమాలో ఆయన వేసుకున్న షూను సంపాదించి, అమితాబ్ ఆలయంలో వాటిని అమర్చి పూజ జరుపుతున్నారు. జై శ్రీరామ్ అని రాసిన శాలువా ధరించినట్టుగానే అమితాబ్ భక్తులు జై శ్రీ అమితాబ్ అని రాసి ఉన్న ఆకుపచ్చ శాలువా ధరిస్తారు. సంజయ్, ఆయన కుమారుడు ఇక్కడ పూజలు జరుపుతారు. సంజయ్ ప్రత్యేకంగా అమితాబ్ చాలీసా కూడా రాశారు. తమ దృష్టిలో మాత్రం అమితాబ్ జీవించి ఉన్న దేవుడు అంటాడా భక్తుడు.

 కలకత్తా అమితాబ్ అభిమాన సంఘం అమితాబ్ 70వ జన్మదినాన్ని ఈ ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. అమితాబ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ పేదలకు ఈ ఆలయం వద్ద దుస్తులు పంచారు. దక్షిణ కలకత్తా బొన్‌డల్ రోడ్‌లోని ఈ ఆలయాన్ని అమితాబ్ జన్మదినం రోజున ఆయన సినిమాల పోస్టర్లతో అలంకరిస్తారు. అక్కడ పండుగ వాతావరణం ఉంటుంది. తన ఆలయం గురించి తెలిసినప్పుడు అమితాబ్ తనకు ఇది నచ్చలేదని నిర్మొహమాటంగానే చెప్పుకున్నాడు. నేను ఒక మనిషిని మాత్రమే, నటన నా వృత్తి అభిమానించండి. ఫరవా లేదు కానీ ఆలయం నిర్మించి దేవుడ్ని చేయకండి అని విజ్ఞప్తి చేశారు.

3 కామెంట్‌లు:

 1. మనది రాజరికమా? ప్రజాస్వామ్యమా? అంటే ఈ రెండూ కాదు వ్యక్తిపూజ స్వామ్యం అనిపిస్తోంది. సిద్ధాంతాల కన్నా ఈ దేశంలో వ్యక్తి పూజకే రాజకీయాల్లో పెద్ద పీట వేస్తున్నారు. వ్యక్తిపూజ మన నర నరాల్లో ఇంకిపోయింది. రాజరికంలో రాజు పట్ల ఈ వ్యామోహాన్ని చూపించాం. రాజు ఎంత తప్పు చేసినా ఎదిరించవద్దని, రాజు ఏం చేసినా మన మంచి కోసమే అని మన శాస్త్రాలు ఘోషించాయి.
  http://pravasarajyam.com/?p=7732

  రిప్లయితొలగించు
 2. ఇది చాలావరకు భక్తీ కాదు, గౌరవమూ కాదు.
  మూర్ఖత్వం లేదా స్వార్థం.
  సినిమావాళ్ళకు ఆలయాలు నిర్మించడం మూర్ఖత్వం.
  నాయకులకి ఆలయాలు నిర్మించడం స్వార్థం.

  రిప్లయితొలగించు
 3. at last I feel happy for YSR...
  YSR nijamga lekapothe mana state lo vigrahala gurinchi charchinchukone valla me kaadu, may be it NTR or some body....

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం