5, ఫిబ్రవరి 2013, మంగళవారం

రతన్ టాటా-సంతోషం

సంతోషం..కహానీ1


వచ్చే జన్మంటూ ఉంటే నన్ను అర్థం చేసుకునే వాళ్లింట్లో పుట్టించు దేవుడా! -ఇంట్లోవాళ్లకు గట్టిగా వినిపించేట్టుగానే అన్నాడు రవి. రిబాక్ షూ మీద రవికి ఆశ. కొనుక్కుందామంటే ఇంట్లో వాళ్లు పట్టించుకోవడం లేదు.. కోపానికి అదీ కారణం! ఇలాంటి ఇంట్లో పుట్టడం వల్ల తనలాంటి ప్రతిభావంతుడికి సంతోషమనేది లేకుండా పోయిందని మరికొంత కోపం. -‘అరే ఇంజనీరింగ్ చదివే కొడుకు ఎలా ఉండాలి. కాలేజీలో ఒక్కొక్కడు ఎంత స్టయిల్‌గా ఉంటున్నాడు. నేనేమన్నా డబ్బున్నోడి కొడుకులా కారు కొనివ్వమన్నానా? మనకంత సీన్ లేదని తెలుసు. మంచి డ్రెస్సు, షూ అడిగానంతే కదా?’. ఈ మాటలన్నీ స్వగతంగా అంటున్నట్టుగా రవి గట్టిగానే అంటున్నాడు. రవి ఎంత మొత్తుకున్నా తండ్రి మాత్రం అవేమీ పట్టించుకోకుండా టీవీ చానెల్‌ను ఆసక్తిగా చూస్తున్నాడు. తండ్రి కూర్చున్న సోఫా వద్దకు వచ్చి పక్కనే కూడలబడ్డాడు రవి. 


టీవీలో రతన్ టాటాపై ప్రత్యేక కార్యక్రమం వస్తోంది. రతన్ టాటా ఇంట్లో పుట్టే అదృష్టం ఉంటేనా?....’ అంటూ తండ్రికి వినిపించేట్టుగా మళ్లీ అన్నాడు రవి.

దేశంలో సంపన్నతకు టాటా మారుపేరు. సంపన్నత కన్నా టాటా పేరుకే ఎక్కువ ప్రాచుర్యం... యాంకర్ చదువుకుంటూ పోతోంది తెలుగునే ఇంగ్లీష్‌లా. అదృష్టం అంటే టాటాదే కదా? అనుకున్నాడు రవి. ఎంత ఏడ్చినా తండ్రిని ఒప్పించడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చి తానూ వినసాగాడు.

 రతన్ టాటా దాదాపు 50 ఏళ్లపాటు టాటాల సామ్రాజ్యానికి నాయకత్వం వహించారు. ఆ సామ్రాజ్యం విలువ ఐదులక్షల కోట్లు. 75 ఏళ్ల వయసులో రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. సాధారణంగా రిటైర్ అయ్యే వారిలో రేపటి నుంచి ఎలా అనే దిగులు కనిపిస్తుంది. కానీ ఆయన మాత్రం పాతికేళ్ల యువకుడిగా ఉత్సాహంగా ఉన్నారు. ‘అయినా మనలాంటి కుటుంబరావులకు దిగులు కానీ లక్ష్మీపుత్రుడు ఆయనకేం’ అనుకున్నాడు రవి స్క్రీన్‌మీద చూపు తిప్పకుండానే. -రిటైర్మెంట్ తరువాత ఏం చేయాలనుకుంటున్నారు’ టాటాకు యాంకర్ సంధించిన ప్రశ్న. ‘లైఫ్ బిజీతో చాలా కోరికలు నెరవేర్చుకోలేకపోయాను. ఇప్పుడు వాటి పనిబడతా’ అంటూ చిర్నవ్వుతో చెప్పుకుపోతున్నారు టాటా. 

‘నీకేం బాసూ.. లక్షల కోట్లు. ఏ కోర్కెనైనా క్షణాల్లో నెరవేర్చుకుంటావ్’ రవి మనసు రన్నింగ్ కామెంట్రీ చేస్తోంది. ‘చిన్నప్పుడు పియానో నేర్చుకునే వాడిని. ఏడేళ్ల వయసులోనే బిజీగా ఉండి ఆపేశాను. ఇప్పుడది నేర్చుకోవాలని అనిపిస్తోంది. నా పెట్స్‌కు నేనంటే ఎంతో ప్రేమ. ఇప్పుడిక వాటితో ఆడుకుంటా. లైఫ్ బిజీతో దూరమైపోయిన చిన్న చిన్న సంతోషాలన్నీ ఇప్పుడు తీర్చేసుకుంటా.  నాకిప్పుడు చాలాటైం దొరుకుతుంది’ అంటూ రతన్ టాటా చెప్పుకుపోతుంటే రవికి బుర్ర తిరిగింది. అంతా గమనిస్తున్న తండ్రి గట్టిగా నవ్వేశాడు. ‘సంతోషమంటే రెబాక్ షూ, బ్రాండెడ్ జీన్స్ మాత్రమే కాదురా కుర్రకుంకా. చాలా ఉంటాయ్..’ అంటూ రవి భుజం తట్టాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం