20, ఫిబ్రవరి 2013, బుధవారం

మనసులోని మర్మం-బయట పెట్టే సెల్‌ఫోన్!


రజనీకాంత్ ఓసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మీడియా వాళ్లు ఆయన చేతిలో బేసిక్ మోడల్ సెల్‌ఫోన్ చూసి విస్తుపోయారు. చిత్ర సీమకే స్టైల్ నేర్పిన రజనీ చేతిలో ఓల్డ్ మోడల్ సెల్‌ఫోన్ కనిపించడం ఆశ్చర్యమే కదా? అదే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావిస్తే, ఈ సెల్‌తో నేను మాట్లాడింది ఇతరులకు వినిపిస్తుంది, వాళ్లు మాట్లాడేది నాకు వినిపిస్తుంది. సెల్‌ఫోన్‌కు ఇంత కన్నా ఇంకేం కావాలి అది బేసిక్ మోడల్ అయితేనేం లేటెస్ట్ మోడల్ అయితేనేం అని ఆయ న నవ్వారు. మహాత్మాగాంధీ అంగవస్త్రంతో ఉంటే ప్రపంచ మంతా ఆయన సింప్లిసిటీకి జోహారులర్పించింది. అదే పని ఇతరులు చేస్తే పాపం పూర్తిగా దివాళా తీసినట్టున్నాడనుకుంటారు.

 రజనీ స్టైలే వేరు కాబట్టి బేసిక్ మోడల్ ఫోన్ కూడా ఆయన చేతికి అలంకరణగానే ఉంటుంది. జంటల మధ్య సంబంధాలు రోజు రోజుకు బలహీనపడుతూ వేగంగా విడిపోతున్నారు కానీ మనిషి + సెల్‌ఫోన్ జంట మధ్య మాత్రం అను బంధం రోజు రోజుకు మరింత దృడంగా మారుతోంది. ఈ జంట విడిపోయే అవకాశమే కనుచూపు మేరలో కనిపించడం లేదు. చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మీ చేతిలో ఉన్నట్టే. అందుకే ఇంట్లో సైతం జంట లేకపోయినా పెద్దగా దిగులు పడడం లేదు కానీ చార్జీంగ్ అయిపోతే ఐదు నిమిషాలు కూడా భరించలేకపోతున్నారు. సెల్‌ఫోన్లలో ఊహించని ఫీచర్లు వచ్చేస్తున్నాయి. 50వేల రూపాయల ఐఫోన్ వాడే మా అంతస్తెక్కడ? ఐదువందల రూపాయల చైనా ఫోన్ వాడే నీ అంతస్థెక్కడ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి నీకెంత ధైర్యం అని ప్రేమను తిరస్కరించే వారూ ఉన్నారు. సెల్‌ఫోన్లలో ఊహించని ఫీచర్లు వచ్చేస్తున్నాయి.


ఫిలిప్స్ ఎలక్ట్రానిక్స్ సంస్థ అద్భుతమైన ఒక అప్లికేషన్ అభివృద్ధి చేసింది. ఈ అప్లికేషన్‌ను ఏ స్మార్ట్ఫోన్‌లోకైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రేమిస్తున్నాను అని చేప్పే వ్యక్తి ఎదురుగా ఈ స్మార్ట్ఫోన్ కెమెరాను కొద్దిసేపు నిలిపితే, ఆ వ్యక్తి గుండె కొట్టుకునే వేగాన్ని, ఊపిరి పీల్చుకునే క్రమాన్ని లెక్కిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా ఆ వ్యక్తి ప్రేమ ఎంత లోతుగా ఉంది, ఆ వ్యక్తి మాటల్లో నిజాయితీ ఎంతుంది అనేది చెబుతుంది. ఈ అప్లికేషన్స్‌ను రూపొందించిన వినె్సంట్ జెన్నీ ఇది 99 శాతం కచ్చితమైన ఫలితాన్ని ఇస్తుందని చెబుతోంది.


ప్రేమిస్తున్నారో లేదో సెల్‌ఫోన్ చెప్పేసినప్పుడు ఇంక ఫోన్ చెప్పని విషయం ఏముంటుంది. అదే జరిగితే అల్లకల్లోలం అవుతుందేమో! అదేదో సినిమాలో ఎదుటివారు మనసులో అనుకునే విషయాలన్నీ గ్రహించే శక్తి రావడంతో బ్రహ్మానందం జీవితం బతుకు బస్టాండ్ అవుతుంది. కొంప దీసి ఈ కొత్త ఫీచర్లు జనం జీవితానికి సుఖాన్నిస్తాయా? కొత్త సమస్యలు తెచ్చిపెడతాయా? ఈ అప్లికేషన్స్ అందుబాటులోకి వచ్చాక మాట్లాడే మాటల వెనుక అసలు అర్ధాన్నిసెల్‌ఫోన్ ఇలా విశే్లషించి చెబితే ఎలా ఉంటుంది.
***

*‘నిర్మాత అస్సలు ఖర్చుకు వెనకాడలేదు. సినిమా బ్రహ్మాండంగా వచ్చింది. హీరోయిన్, హీరో అంతా బాగా సహకరించారు- దర్శకుడు.
- పైసా ఖర్చు చేస్తే ప్రాణం మీదకు వస్తుందనుకునే వాడు సినిమా ఎందుకు తీశాడో? హీరోయిన్ సినిమాలో కన్నా నిర్మాత కోసమే ఎక్కువగా పని చేసింది. ఈ సినిమా సంకనాకి పోవడం ఖాయం.
*‘చిట్టి ... కన్నా... ఎంత క్యూట్‌గా ఉన్నాడో కదూ!’- బాస్ ఇంట్లో ఉద్యోగి.
- చింపిరి జుట్టు బాస్ ఒకడు. వీడి పిల్లి కళ్లే వీడి కొడుక్కు వచ్చాయి. ఆదివారం ఎంజాయ్ చేయకుండా బాస్ కొడుకు పుట్టిన రోజని ఇక్కడ తగలడాల్సి వచ్చింది.
*‘వాడొట్టి వెధవ! మొన్న ఏమైందో తెలుసా?’
‘నాకు తెలిసి అతను అలాంటి వాడు కాదే! నాతోనైతే బాగానే ఉంటాడు’- ఇద్దరు కొలిగ్స్.
- వాడి కన్నా వీడు పెద్ద రోగ్. వాడు తిట్టింది వదిలేసి నేను తిట్టింది సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి వాడికి చేరవేస్తాడు. నా దగ్గర వీడి పప్పులు ఉడకవు. నేను వీడి కన్నా ముదురును.
*‘రోజీ ఈ రోజేంత అందంగా ఉన్నావో? నీ డ్రెస్‌కే నీ వల్ల అందం వచ్చింది’- అబ్బాయి.
- పార్కులంటూ, పార్టీలంటూ ఎంత తిప్పిస్తున్నావు. ఖర్చు చేయిస్తున్నావు. ఒక్కసారి నీకు నామీద గురి కుదరనీ అప్పుడు చూపిస్తా నీ సంగతి 


 *‘ నువ్వు నాకు బాగా నచ్చావు రాజ్ ! మహిళలను గౌరవించే నీ సంస్కారం. నాకెంతో నచ్చింది.’- అమ్మాయి.
-వీడి బొంద. నాకు నచ్చింది వీడి ఆస్తి, వీడి ఉద్యోగం.

*‘ప్రజలే నాకు దేవుళ్లు- వారికే నా జీవితం అంకితం- నాయకుడు
- కూటికి గతిలేని వాడికి కూడా ఓటు హక్కు ఇచ్చేశారు. వీళ్లను కాదు అనాల్సింది ఇలాంటి వాళ్లకు ఓటు హక్కు ఇచ్చినోళ్లను అనాలి. ఇంటింటికి తిరగాల్సి వస్తోంది. తప్పుతుందా? ఓటు వేశాక ఇంతకింత ఏడిపిస్తాను.
‘ప్రజల కోసం తపించడమే మా అబ్బాయి చేసిన నేరమా?’
- మీ అబ్బాయిని ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్నావు. మరి మా అబ్బాయిని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే తప్పా?
*‘కాళ్లు వాచిపోయాయి. వేళ్లు చిట్లిపోయాయి. నీరసంగా ఉంది. షుగర్ లెవల్స్ పెరిగింది. అయినా ప్రజల కోసం నడుస్తున్నందుకు సంతోషంగా ఉంది- నేత
- జబ్బు పడేంతగా నడిచేది డబ్బు కోసం కాదు. ముఖ్యమంత్రి పదవి లేందే ఉండలేను. ఈసారి అధికారం ఇవ్వకపోయారో? మీ అందరినీ శపించేస్తాను.
*‘వచ్చే ఎన్నికల్లో మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. నాకెలాంటి అనుమానం లేదు- అధికారపక్షం
- పిచ్చి సన్నాసులు. ఒక్క ఎమ్మెల్యే మద్దతు లేకున్నా 2014 వరకు అధికారాన్ని కాపాడుకోవడమే అద్భుతమైన విజయం. ఎంత చేసినా జనం గెలిపించరని అందరికీ తెలుసు.

* న్యాయ వ్యవస్థ పై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది .-  కేసులో చిక్కిన నేత. - కేసు నుంచి ఎలా బయట పడాలో నాకు బాగా తెలుసు  

4 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం