2, అక్టోబర్ 2013, బుధవారం

జైలులో ‘పెద్ద మనుషుల ఒప్పందం’

స్వాతంత్ర పోరాట కాలం లో కీలక ఘట్టాలన్నీ జైలు లోనే జరిగాయి . స్వతంత్ర దేశం లోనూ పెద్దమనుషుల ఒప్పందాలన్నీ జైలు లోనే జరుగుతున్నాయి .. 
పూర్వజన్మ సుకృతం ఉంటేనే చార్‌ధామ్ లాంటి యాత్రలకు వెళ్లే భాగ్యం లభిస్తుందని అనేవారు. మొన్నటి ప్రళయానికి ముందు వరకు.
పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప జైలు జీవితం సాధ్యం కాదనిపిస్తోంది. ఈ కాలంలో పుణ్య క్షేత్రాల సందర్శన పెద్ద కష్టమేమీ కాదు. గతంలో అంటే కాశీకి వెళ్లిన వాడు కాటికి వెళ్లిన వాడు తిరిగి రాడనే వారు. ఇప్పుడన్నీ ప్యాకేజీలే. చివరకు హనీమూన్‌కు సైతం చార్‌ధామ్‌ను ఎంచుకుంటున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన వాడు, జైలుకు వెళ్లిన వాడు చెడిపోయే ప్రసక్తే లేదు. సమాజంలో అతనికి ఎంత హోదా! ఎంత గౌరవం!!
ఐదంకెల జీతంతో ఐటి ఉద్యోగి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు మీ గురించి మీ పక్కింటోడికి తెలిస్తేనే అదో గొప్ప కానీ మీ వీధిలో జైలుకు వెళ్లి వచ్చిన వారెవరైనా ఉంటే అతన్ని చూడండి. ఎంత గౌరవం ఎంత మర్యాద. జైలు అదృష్టం అందరికీ రాదు.


 అందుకే దాణా స్కాంలో తొలిసారి అరెస్టయినప్పుడు లాలూప్రసాద్ యాదవ్ ఇదే విషయం చెప్పాడు. జైలు కాదు అది శ్రీకృష్ణ జన్మస్థానం. ప్రతి మనిషి కనీసం వారం రోజులైనా జైలు జీవితం గడిపితే కానీ జీవితం ఏమిటో అర్ధం కాదని ఆ మధ్య ఆయన పార్లమెంటులోనే చెప్పుకొచ్చారు. జైలులో ఉన్న వాళ్లు పోటీకి అనర్హులు అని ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు చెబితే, రాజకీయ నాయకులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారని అన్ని పార్టీల నాయకులు ముక్తకంఠంతో ఆవేదన వ్యక్తం చేశారు. నేర చరితులు పోటీకి దూరంగా ఉంటే ఇక ఎన్నికల్లో పోటీ చేసేది ఎవరు, అక్రమాలకు పాల్పడేది ఎవరు? అక్రమాలే లేకపోతే ప్రజాస్వామ్యానికి మనుగడ ఏది? అని తీవ్రంగా ఆలోచించి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హడావుడిగా ఆర్డినెన్స్ తెచ్చారు. నేరచరితులు కూడా పోటీ చేయవచ్చు అంటూ... రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోవడం వల్ల రాహుల్‌గాంధీ ఇదో చెత్త ఆర్డినెన్స్ అంటూ మండిపడ్డారు. అందుకే చంద్రబాబు ఆయన్ని మొద్దబ్బాయి అంటున్నారు.


బాబు కూడా అనవసరంగా సిబిఐ విచారణపై స్టే తెచ్చుకుని ఆరునెలల పాటు పాదయాత్ర చేశారు. నడక కన్నా అదే అర్ధసంవత్సరం జైలులో హాయిగా విశ్రాంతి తీసుకుని ఉంటే ఆయనకు జనంలో ఎంత క్రేజ్ ఉండేది.
మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి స్వాతంత్య్ర సమర యోధులు జైలులో ఉన్నప్పుడు అద్భుతమైన సాహిత్యం సృష్టించారు.
దేశానికి స్వాతంత్య్రం కోసం వ్యూహ ప్రతి వ్యూహాలు జైలులోనే రచించారు. జైలులోనే అద్భుతమైన ఆలోచనలు వస్తాయని ఎంతోమంది మహనీయులు నిరూపించారు.
వీరు అనేక సార్లు జైలుకు వెళ్లారు...వచ్చారు.. కానీ వీరెవరికీ లభించని స్థాయిలో ఘన స్వాగతం మన యువనేతకు లభించింది.
హైదరాబాద్ నగరం మొత్తం స్తంభించింది. నలుగురు వ్యక్తులు ఒక చోట చేరితే తాట తీస్తాం అంటూ బెదిరిస్తూ పోలీసులు 144 సెక్షన్ విధించిన సమయంలో వేల మంది యువనేతకు స్వాగతం పలికారు.


మన క్రికెట్ టీమ్ ప్రపంచ కప్ సాధించినప్పుడో, పాకిస్తాన్‌పై విజయం సాధించినప్పుడో విమానాశ్రయం వద్ద స్వాగతానికి హడావుడి సహజమే. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టిన భారత సైన్యం తిరిగి వచ్చినా స్వాగతానికి పెద్దగా హడావుడి కనిపించదు. అవసరం లేదు కూడా. ఎందుకంటి అది వారి డ్యూటీ.
సాహిత్యంలో అంతర్జాతీయ అవార్డు పొందిన వారికి కుటుంబ సభ్యులు తప్ప స్వా గతం పలికే వారుండరు. అవార్డు ఇవ్వాలనుకున్న వారు ఇచ్చారు. స్వాగతం పలకాల్సిన అవసరం ఎవరికుంది? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించాడని సిబిఐతో ఆరోపణలు ఎదుర్కొన్న యువనేత 16 నెలల తరువాత జైలు నుంచి బెయిల్‌పై రావడం అంటే సాధారణ విషయమా? అభిమానులే కాదు ప్రకృతి కూడా పులకరించింది. ఈ స్వాగత ఆర్భాటాన్ని చూసిన తరువాత చంద్రబాబు కూడా కుళ్లుకున్నారట! అనవసరంగా సిబిఐ విచారణపై స్టే తెచ్చుకున్నాను, జైలుకు వెళ్లి నేను కూడా ఇలా బెయిల్ తెచ్చుకుని ఉంటే ఇంతటి ఘన స్వాగతం లభించేది కదా?అని మధనపడినట్టు ధ్రువీకరించని వార్తలు.


జైలు నుంచి బయటకు రాగానే జగన్‌బాబు నిజాయితీతో కూడిన రాజకీయాలు అవసరం అని జాతికి సందేశం ఇచ్చారు. ఆ వెంటనే బెయిల్ ఎలా వచ్చిందో నిజాయితీగా చెప్పండి అని అడగలేకపోయారా? అనేది కొందరి అనుమానం. బెయిల్ అంటే త్రిశంకు స్వర్గం లాంటిదే. ‘పెద్ద మనుషుల ఒప్పందం’ అమలులో ఏ మాత్రం తేడా వచ్చినా బెయిల్ రద్దవుతుంది. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. గడ్డితిన్నందుకు 17 ఏళ్ల తరువాత కూడా లాలూకు జైలుకు వెళ్లక తప్పలేదు. ఎక్కడ తేడా వచ్చిందో? తీర్పు వచ్చిన వెంటనే లాలూ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తనకు ఆదర్శం అని చెప్పుకొచ్చారు. ఆ జ్ఞానం విచారణ జరుగుతున్నప్పుడే ఉండాలి. జైలులో తనకు జడ్‌ప్లస్ కేటగిరి భద్రత కావాలని లాలూ కోరితే కోర్టు సాధ్యం కాదని కొట్టివేసింది. తన నుంచి జైలులో ఉన్నవారికి భద్రత కోసం అని ఆయన అడిగి ఉంటే అనుమతించేవారేమో!


తాజ్‌కారిడార్‌లో మాయావతి ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తేలింది. ములాయం కూడా నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అని సిబిఐ తేల్చింది. పెద్ద మనుషుల తరహా అంటే అదే మరి. ఎదుటి వారు అడగక ముందే అవసరం అయిన మద్దతు ప్రకటించే పెద్ద మనుసు వారికుంది. తోకజాడిస్తే జైలు తప్పదు, చివరకు లొంగుబాటు తప్పదు.
జరుగుబాటు ఉంటే జ్వరం అంత సుఖం లేదంటారు. జరుగుబాటు ఉంటే జైలులో కూడా సుఖంగా ఉండొచ్చు. బయట ప్రపంచం బతుకును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉల్లిధర కూడా జీవితంపై విరక్తి కలిగిస్తుంది. అదే సామాన్యుడు జైలులో ఉంటే ఉల్లికూడా ఉచితంగానే లభిస్తుంది. నాయకుడైతే పదవినిస్తుంది. జైలు జీవితం రాజకీయ నాయకులకు హీరో  వర్షిప్ నిస్తుంది ... ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి .. జైలులు కళకళ  లాడాలి
..  

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం