30, అక్టోబర్ 2013, బుధవారం

దత్తపుత్రుడిపై బ్రహ్మాస్త్రం

అతను భయాన్ని కూడా భయపెట్టేంత ధైర్యవంతుడు. అలాంటి  యువనేత దత్తుడు ఒక్కసారిగా వణికిపోయాడు. శరీరమంతా చమటలు పట్టాయి. భయం అంటే ఏమిటో జీవితంలో అతను తొలిసారిగా తెలుసుకున్నాడు.
ప్రహ్లాదుడ్ని చండామార్కుల వారు ఎన్ని రకాలుగా హింసించినా అతను హరినామ స్మరణ మాననట్టు, కొండలపై నుంచి తొసేసినా, ఏనుగులతో తొక్కించినా హరినామ స్మరణలోనే మునిగినట్టు దత్తుడు సింహాసన నామ స్మరణ మానలేదు. రాజమాత ఎంతగా హింసించినా, కేసులు పెట్టినా సింహాసనం... సింహాసనం అంటూ అన్నింటినీ చిరునవ్వుతో భరించాడు. కాలం కలిసొస్తే మెడలో పామును వేసినా అది పూలమాలగా మారుతుంది. దత్తుడికి అదే జరిగింది. రాజమాత ఎంతగా వేధిస్తుంటే జనంలో దత్తునికి అంతగా జనాభిమానం పెరిగింది.


రాజ్యంలోని అన్ని విచారణ సంస్థలతో విచారణ జరిపించారు. ప్రపంచ చరిత్రలోనే ఇంతటి నేరాలు ఎప్పుడూ జరగలేదు అంటూ రాజమాత ఆరోపణలకు విపక్ష నేత అండగా నిలిచారు. అధికారపక్షం, విపక్షం ఉమ్మడి శత్రువుగా దత్తున్ని ప్రకటించారు. అయినా దత్తుడు భయపడలేదు. విచారణ సంస్థలన్నీ ఎటూ పాలుపోక సతమతమవుతుంటే దత్తుడు హాయిగా నవ్వుకున్నాడు. పెట్టండిరా దమ్ముంటే ఇంకెన్ని కేసులు పెడతారో పెట్టండి అని సవాల్ విసిరారు. విపక్ష నేత ప్రపంచ పటాన్ని ఎదురుగా పెట్టుకొని ఎప్పుడూ వినని దేశాల పేర్లు నోట్ చేసుకుని ఆయా దేశాల్లో దత్తుని అక్రమ సంపాదన దాచిపెట్టాడని భయటపెట్టాడు. దాన్ని మీడియా డైలీ సీరియల్‌లా ప్రసారం చేసింది. ఈ సీరియల్స్ చూస్తూ జైలులో దత్తుడు హాయిగా కాలక్షేపం చేశాడు.

 పాపులర్ టీవి సీరియల్స్‌కు రేటింగ్ పెరిగినట్టుగా దత్తుని అక్రమ సంపాదన సీరియల్స్‌కు టీవిల్లో వీక్షకాధరణ రోజు రోజుకు పెరగసాగింది. అమెరికా బడ్జెట్ కన్నా వంద రెట్లు ఎక్కువగా దత్తుడు సంపాదించాడని డైయిలీ సీరియల్స్‌లో లెక్కలు తేల్చారు. నిజానికి తొలుత వారం రోజుల సీరియల్‌కు సరిపోయే మ్యాటర్ రాసి,తరువాత దాన్ని వందల రోజులకు పొడిగించారు.
త్వరలోనే సింహాసనం అధిష్టించేందుకు పోటీలు జరుగనున్నాయి. వ్యతిరేక ప్రచారంలో, జనాదరణలో దత్తుడే ముందున్నాడని తేలింది.
సింహాసనంపై కూర్చోవడానికి ఒక్కరికే చోటుంటుంది కానీ ఆ సింహాసనంపై ఎందరివో కళ్లుంటాయి. అలాంటి కళ్లలో ఒక కన్నుకు కన్నుకుట్టి భయమెరుగని నేతకు దత్తుడనే పేరు పెట్టి, బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తానని హెచ్చరించాడు.


మహామహులు, రాజమాత కూడా ఏమీ చే యలేని యువనేతను చివరకు రాజకీయ విదూషకుడు భయపెట్టాడా? అని కొందరి అనుమా నం.
దత్తుడు ఎందుకు భయపడ్డాడు అంటే ?


***
యువనేత దత్తుడు అభిమానుల చెంపలు రుద్దీ రుద్దీ అలసిపోయి నిద్రకు ఉపక్రమించాడు. ఆరునెలలు గడిస్తే, సింహాసనం కూర్చోవడమే కాదు ఏకంగా పడుకోవచ్చు అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.
ఆ నిద్రలో వచ్చిన కలతో దత్తునికి అర్థరాత్రి భయం వేసింది.
శరీరం వణికిపోతోంది.
ఏంటా కల? అంటే
***


యువనేత ఉదయం లేవగానే ఎప్పటిలానే శత్రుపత్రికను చేతిలోకి తీసుకున్నాడు. అందులోని వార్తలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. యువనేతకు దేశంలోని అన్ని విచారణ సంస్థలు క్లీన్ చిట్ ఇచ్చాయి. నిజాయితీ పరుడైన యువ పారిశ్రామిక వేత్తను చూసి దేశం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఇలాంటి పారిశ్రామిక వేత్తను వేధింపులకు గురి చేసినందుకు ప్రభుత్వం మొ త్తం దేశానికి క్షమాపణలు చెబుతోంది.
ప్రపం చం ఈ యువనేతను చూసి గర్విస్తోంది. ఇదీ మొత్తం మొదటి పేజీలోని వార్తల సారాంశం. పైగా అప్పటి వరకు విపక్ష నేతకు అనుకూలంగా రాసిన వాళ్లు అదే నేతకు పూర్తిగా వ్యతిరేకంగా రాశారు. ఇంకో పత్రిక తీసి చూస్తే అందులోనూ వార్తలు ఇలానే ఉన్నాయి. తనకు అనుకూలంగా, విపక్ష నేతకు వ్యతిరేకంగా రాస్తూ తనను దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నారని యువనేతకు అర్ధమై తొలిసారిగా భయం పట్టుకుంది. 


యువనేత హడావుడిగా పత్రికల వారికి ఫోన్ చేశాడు. ఇలా రాయడం న్యాయమా? అని అడిగాడు. కనీసం మరో ఆరునెలలు పాత పాలసీనే కొనసాగించి, దయచేసి నాకు వ్యతిరేకంగా రాయండి. అనుకూలంగా రాయకండి  ప్లీజ్ అని వేడుకున్నాడు.


ఏం చేస్తాం సార్ మీ అక్రమార్జనపై రాసీ రాసి విసిగిపోయాం. ఇక రాయడానికి మ్యాటర్ ఏమీ లేదు. అందుకే ఇలా రాయాల్సి వస్తోంది అని సమాధానం చెప్పారు. మీరలా మాట్లాడి నా భవిష్యత్తును దెబ్బతీయవద్దు మీరు రండి కావలసినంత సమాచారం ఇస్తాను రోజుకో కుంభకోణం వివరాలిస్తాను. మిమ్ములను నమ్ముకుని రాజకీయాల్లో భారీ పెట్టుబడులు పెట్టాను. మీరిలా అనుకూలంగా రాస్తే నా గతేం కాను అని ఆవేదన వ్యక్తం చేశాడు. సార్ ఇక మీ కుంభకోణాల గురించి రాయవద్దని మేనేజ్‌మెంట్ స్థాయిలో తీసుకున్న నిర్ణయం ఇది అని వాళ్లు నిర్మొహమాటంగా ఫోన్ పెట్టేశారు.


***
యువనేత కలవరపాటుతో నిద్ర లేచాడు. ఈరోజు ఇది కల రేపు ఇదే నిజమైతే అనే ఆలోచన యువనేతను తొలిసారిగా భయపెట్టింది. మీడియా ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో చక్కగా చెబుతుంటే, ఓటర్లు సరిగ్గా దానికి భిన్నంగా తీర్పు ఇస్తున్నారు. అందుకే  తనపై అనుకూల ప్రచార బ్రహ్మాస్త్రం వేస్తారనే  కల రాగానే యువనేత వణికిపోయాడు. ఇప్పుడిది కల రేపు ఇది నిజం అయితే అనే ఆలోచన దత్త పుత్రుడిని కలవరపాటుకు గురి చేస్తోంది . మాయలపకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నాయకుల ప్రాణం అనుకూల ప్రచారంలో ఉంటుంది.

4 కామెంట్‌లు:

  1. నేనడగదలచుకున్నా... ఇలా ... రా.రాలు కలలో భయపెట్టడం న్యాయమా? అని :))

    రిప్లయితొలగించండి
  2. నేనడుగుతున్నా జగన్ కంటే మీకే ఎక్కువ హడాలెత్తినట్టుందని..... అననుకుల ప్రచారం తగ్గినట్టుందని తెగ బాధ పడుతున్నట్టుందని.....

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం