17, నవంబర్ 2013, ఆదివారం

ఇచ్చట చరిత్ర సృష్టించబడును

పార్వతమ్మ గారు ఇంకా రాకపోవడంతో ఈ రోజు బిజీగా ఉన్నారేమో అనుకున్నాను.
లేదండి సావిత్రి గారు! కోడలు పిల్ల నాతో పనేమీ చేయించదు. మనవడితోనే ఆలస్యమైంది అని చెప్పుకొచ్చింది.


 ఇద్దరూ గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగులు. పెన్షన్ పుణ్యమా అని ఇంట్లోనో, వంట్లోనూ ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. పైకి చెప్పుకోరు కానీ ఇంట్లో తమ మాట అంతో ఇంతో చెల్లుబాటు కావడానికి పెన్షనే కారణమని వారికీ తెలుసు. అత్తలేని కోడలుత్తమురాలు.. ఓయమ్మో కోడలు లేని అత్త గుణవంతురాలు అనేది పాత పాట. పెన్షనున్న అత్త ఉత్తమురాలు.. ఉద్యోగం ఉన్న కోడలు గుణవంతురాలు అనుకునే కాలం వీరిది. సాయంత్రం కాలనీ పార్కులో బాతాఖానీ వారి దిన చర్య. రాజకీయ పార్టీల్లో గ్రూపులున్నట్టుగానే కాలనీలో అన్ని గ్రూపులు తమ తమ వర్గం వారితో పార్కులో సెటిల్ అయ్యారు. ఒకే అభిప్రాయాలు ఉన్నవారు ఫేస్‌బుక్‌లో ఒకే గ్రూపులో తచ్చాడినట్టుగా పార్వతమ్మ, సావిత్రి ఒకే చోటుకు చేరుతారు. రాష్ట్ర విభజన అంశం మొదలుకుని కాంగ్రెస్, టిడిపిలపై అభిప్రాయాల వరకు వారికి భావ సారూప్యత ఉండడం వల్ల వారి స్నేహం దిన దిన ప్రవర్థమానం అవుతోంది. భద్రాచలంపై కూడా వారిద్దరిదీ ఒకే అభిప్రాయం. అనేక అంశాలు చర్చించుకున్నా ఇద్దరి మధ్య ఎప్పుడూ బేదాభిప్రాయాలు పొడసూపలేదు. లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ్, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుల్లా కలిసిపోయారు మీరిద్దరూ అని పక్కింట్లో కొత్తగా దిగిన పంకజమ్మ వీరి స్నేహాన్ని చూసి చమత్కరించారు. మహేష్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఎవరి సినిమా బాగున్నా ఇద్దరు కలిసి వెళతారు కాబట్టి ఇక వారిరువురిని ఏ సమస్య విడదీయలేదని కాలనీ వాసులు నిర్ధారించుకున్నారు.


ఆ రోజు వారిద్దరి మధ్య ఎప్పుడూ లేని విధంగా కొత్త కొత్త అంశాలపై చర్చ సాగింది. కొత్త అంశాలంటే మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఫ్యాషన్‌లు, కొత్త సినిమాలు, కాలనీలో ప్రకాశ్ వాళ్ల అబ్బాయి తమ కాలేజీలో చదివే అమ్మాయితో ఎక్కడికో పోయిన విషయాలు అని కాదు. చాలా పాత విషయాల్లోని కొత్త కోణాలన్నమాట!


వారిద్దరి మధ్య సంభాషణల సారాంశం ఇలా ఉంది.
‘‘ఈ విషయం తెలుసా? గుర్రంపై కత్తిపట్టుకుని నిలుచున్న వీరనారి ఝాన్సీరాణి కాదట! మరో మహిళ అలా వీరోచితంగా పోరాడితే కొంత మంది ఝాన్సీరాణి అంటూ ప్రచారం చేశారట! మాయావతి పుణ్యమా అని ఈ విషయం ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది.’’


నిజమే నేను కూడా ఇంత కాలం ఝాన్సీ రాణి అనుకున్నాను..
సర్దార్ పటేల్ తొలి ప్రధానమంత్రి కావలసిన వారు, తృటిలో తప్పి పోయింది. పటేల్ ప్రధాని అయి ఉంటే మనం అమెరికాను మించి పోయేవాళ్లం. ఈ ప్రమాదాన్ని బ్రిటీష్‌వాడు ముందే కనిపెట్టి నెహ్రూ ప్రధానమంత్రి అయ్యేట్టుగా రహస్యంగా కుట్ర పన్నాడు. కావాలంటే మా అబ్బాయి ఫేస్‌బుక్‌లో ఉన్న ఫోటో చూపిస్తా చూడు. నెహ్రూ సిగరెట్టు తాగుతున్నట్టుగా ఉంది చూశావా ఈ ఫోటోనే దానికి సాక్షం.
దానికి దీనికి సంబంధం ఏమిటే?
అక్కడే ఉంది అసలు రహస్యం. ఈ సిగరేట్టులో ఒక రకమైన మత్తుమందు పెట్టారు. ఈ మందు ఎవరు పెడితే వారు చెప్పినట్టు వింటారన్నమాట! పటేల్ ప్రధానమంత్రి కావద్దు నెహ్రూనే ప్రధానమంత్రి కావాలి అని సంకల్పం చెప్పి ఈ సిగరెట్టును నెహ్రూతో తాగించారు. దాంతో అప్పటి వరకు అందరూ పటేల్ ప్రధాని కావాలని అనుకున్నవారు కూడా నెహ్రూనే ఎంపిక చేశారు’’
ఇందులో మహాత్మాగాంధీ కుట్ర కూడా ఉందనిపిస్తోంది. దీనిపై పరిశోధించమని మా మనవడి ఫేస్‌బుక్‌లో కామెంట్ రాస్తాను. నాకెందుకో మొదటి నుంచి మహాత్మునిపై అనుమానం. మహాత్మాగాంధీ పోరాడింది బ్రిటీష్‌వాడిపై చివరకు మహాత్మునిపై సినిమా తీసింది, మహాత్మునిగా నటించింది ఆ బ్రిటీష్‌వాడే ఇందులో కుట్ర ఉందనడానికి ఇంత కన్నా సాక్షం ఏం కావాలి...జాతిపిత బిరుదు విషయంలో భగత్‌సింగ్ తనకు పోటీ వస్తాడని మహాత్ముడే ఏదో కుట్ర పన్నాడని మొన్న మా మనవడి క్లాస్ మెట్ చెప్పిందట!


ఔను ఇంతకూ నీ మనవడు ఏ క్లాస్ చెప్పనే లేదు.
అదేంటి నీకు తెలియదా? ఇప్పుడు వాడు యూ కేజి దాటి ఒకటో తరగతికి వచ్చాడు. వాడికి చరిత్ర అంటే ఎంతిష్టమో!
ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రానికి, బిజెపి అధికారంలోకి వచ్చాక దేశానికి స్వాతంత్య్రం వచ్చిందట కదా?
నిజమే అయితే వాళ్లిద్దరు ఓడిపోగానే మళ్లీ వచ్చిన స్వాతంత్య్రం వెనక్కి వెళ్లింది. అంతే కాదు బ్రిటీష్‌వాడిపై పోరాడేందుకు అన్నగారు సిద్ధమవుతుండగా, ఈ విషయం ఉత్తరాది వారికి తెలిసి లాల్‌బాల్‌పాల్‌ల ద్వారా స్వాతంత్య్ర ఉద్యమం నడిపించారు. అమ్మో ఉత్తరాదివారు ఎంతైనా తెలివైన వారు. దేన్నయినా ముందే గ్రహించేస్తారు. అదే మన నాయకత్వంలో స్వాతంత్య్ర పోరాటం జరిగి ఉంటే ఇప్పటికీ మన వాళ్లే ప్రధానమంత్రులుగా ఉండేవారు. చరిత్ర సృష్టించాలన్నా, తిరగ రాయాలన్నా మన వాళ్లకే సాధ్యం.


అసలు చైనా వాడు అన్ని రంగాల్లో అలా ముందుకు దూసుకెళ్లడానికి కారణం తెలుసా?
మన పూర్వీకులు రాసిన తాళపత్ర గ్రంధాలు కొన్ని జర్మనీ వాడు ఎత్తుకెళ్లి ఎంతో అభివృద్ధి చెందితే, మరిన్ని చైనా వాడికి దొరికాయి వాటితోనే వాడీ రోజు అమెరికానే సవాల్ చేసేట్టుగా తయారయ్యాడు.
మన జ్ఞానాన్ని ఎత్తుకెళ్లిన వాడే అంత అభివృద్ధి చెందితే మరి మనం అని వెనక నుంచి ఎవరో ప్రశ్నించినట్టుగా అనిపించింది. వెనక్కి చూస్తే ఎవరూ లేరు.

‘అమెరికాను కనుగొన్నది మన తెలుగువాడే? 
మనవాడు పడవలో వెళుతుంటే కొలంబస్ అనేవాడు లిఫ్ట్ అడిగాడు. మన వాళ్లు అసలే దయార్ధ్ర హృదయులు కదా సర్లేఅని పడవలో ఎక్కించుకుంటే మన వాడి కన్నా ముందు వాడే పడవ నుంచి దూకేసి అమెరికాను కనుగొన్నది నేనే నేనే అని అరిచాడు’’ అని అప్పటి వరకు వీరి మాటలు వింటున్న పంకజమ్మ టీవిల ద్వారా తనకు తెలిసిన పరిజ్ఞానాన్ని పంచుకుంది.

5 కామెంట్‌లు:

  1. Hha..hha...very nice:-):-)
    mee blog ippide chusaanu.mee tapaslanni chaalaa bagunnaayi:-):-)

    రిప్లయితొలగించండి
  2. superb but such arguments are coming through even from intellectuals.

    రిప్లయితొలగించండి
  3. Really good.....I felt very sad when I saw comments about Nehru and Gandhi with fake photos.... People are sharing also by believing.... I saw several people who hates Gandhi.. He was died long back, but they are hating him... What a pity..!

    రిప్లయితొలగించండి
  4. మీకో విషయం తెలుసా? ఎంటీ రామారావు ఏ విషయమైనా తన చిన్నకూతురితో చెప్పి ఆమె సలహా పాటించేవాడట. ఆరోజుల్లో లక్ష్మీ పార్వతి ఆధిక్యాన్ని ఎలా అడ్డుకోవాలా అని ఏమీ తోచక "పరిస్థితి ఇలా ఉందమ్మా" ఆమెదగ్గర వాపోతే ఆవిడే "అయితే అల్లుడికి ఇచ్చెయ్యి నాన్నా" అందట. అపుడు ఎంటీవోడు అల్లుడిని పిలిచి "నేను ఇస్తే బావుండదుగాని, నువ్వే లాక్కెల్లిపోయినట్లు నటించు అపుడు నేను ఊరికే గగ్గోలు పెడతాను, మాయావిడకి కూడా అనుమానం రాదు" అని అల్లుడికి చెప్పి కథ నడిపించాడట. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో లారీ నడుపుకునే మా ఓనర్ వాళ్ళబ్బాయి చెప్పిన సంగతులివి. ఇంతకీ ఇతనికీ విషయాలన్నీ ఎవరు చెప్పారు, ఎంటీఆర్ చిన్నకూతురు స్వయంగా చెప్పిందా ఏమిటి అని మావాల్లు నవ్వుకున్నారు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం