4, డిసెంబర్ 2013, బుధవారం

ఆకలి రాజ్యం

జీవితంలో మరిచిపోలేని రుచికరమైన విందు గురించి ప్రశ్నిస్తే, బుర్ర గోక్కుంటారేమో కానీ సమాధానం ఠక్కున చెప్పలేరు. సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు పాండిబజార్‌లోనో మద్రాస్ పార్కుల్లో కడుపు నకనకలాడుతుంటే కుళాయి నీళ్లు తాగి ఆకలితో పడుకున్న రోజుల గురించి చెబుతారేమో కానీ తిన్న ఫుడ్ గురించి చెప్పమంటే ముఖం తేలేస్తారు. ఎంత పసందైన విందైనా నాలుక మీద ఆ రుచి కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. కానీ ఆకలి రుచి జీవితమంతా ఉంటుంది. అష్టైశ్వర్యాలతో తులతూగే సంపద వచ్చి పడినా ఆకలి అనుభవం మాత్రం మనుషులను వదలదు. అది ఎలాంటి ఆకలైనా కావచ్చు మనిషిని కుదురుగా ఉండనివ్వదు. ఆ ఆకలిని తీర్చుకోవడానికి దైనికైనా తెగించేట్టు చేస్తుంది.


మూడు దశాబ్దాల క్రితం మహానగరంలో సైతం మాదా కబళం అంటూ జోలే పట్టుకుని ఆడుక్కుని ఆకలి తీర్చుకునే వారుండేవారు. ఇప్పుడు వాళ్లు కనిపించడం లేదు కానీ అమ్మా, బాబూ ఒక్క సారి చాన్సివ్వండి.. పదవి లేక నకనకలాడిపోతున్నాను అని పదవీ ఆకలితో అలమటించే వాళ్లు అడుగడుగునా కనిపిస్తున్నారు. వాళ్ళెంత ఆకలితో ఉన్నారో కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ ప్రచారం చేసుకుంటారు. గల్లీ లీడర్ బ్యానర్లతో లోకల్ పదవి ఆకలిని ప్రదర్శిస్తే భారీ నాయకులు ఏకంగా సొంత మీడియాలు, మద్దతు మీడియాలను తయారు చేసుకుని ఆకలిని తీర్చుకోవడానికి ఏళ్ల తరబడి ప్రయత్నిస్తారు.


ఆకలికి భయంకరమైన ప్రతీకార లక్షణం ఉంది. మహాభారత కథకు మూలం ఆకలి. ఇది నిజంగా మహాభారతంలో ఉన్న నిజం. శకుని కుటుంబీకులందరినీ కారాగారంలో బంధించి ఒక్కో వ్యక్తికి ఒక్క అన్నం మెతుకు మాత్రమే ఇస్తారు. ఒక్క మెతుకు ఎవరి ఆకలి తీర్చదని గ్రహించిన అందరూ ఆకలితోనే మరణించాలని, అందరి ఒక్కో మెతుకును శకునికి పెట్టి అతని ఆకలి తీర్చి కురు వంశంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. శకుని ఒక్కడే అందరి మెతుకులు తిని ప్రాణాలను రక్షించుకుని బంధువుగా కౌరవుల పంచన చేరుతాడు. తిన్నింటి వాసాలు లెక్కించవద్దని అంటారు. తింటేనే అంత కృతజ్ఞత చూపాలని అన్నప్పుడు తిండి పెట్టకుండా ఆకలితో మాడ్చివేస్తే మరెంత ప్రతీకార జ్వాలలో రగిలిపోవాలి. శకుని చేసింది అదే. శత్రువుగా వారిని తానొక్కడినీ ఏమీ చేయలేనని గ్రహించి ఇట్లు మీ శ్రేయోభిలాషి అంటూ దుర్యోధనుడికి చేరువయి మహాభారత యుద్ధానికి, తద్వారా కౌరవుల నిర్మూలనలో విజయం సాధిస్తాడు. ఆకలి ఎంతటి ప్రతీకారానికి ప్రేరేపిస్తుందో ప్ర పంచానికి చాటి చెప్పిన వాడు శకుని. దుర్యోధనుడిని పాండవులపై విజయం సాధించాలనే ఆకలి నిరంతరం దహించి వేసేది.


పాండవులది ఆయుధాల సమీకరణ ఆకలి. ప్రతి పాత్రకు ఒక్కో రకమైన ఆకలి ఉంటుంది. ఎవడి ఆకలి వాడికి ముఖ్యం. కొందరు భోజన ప్రియులైతే, మరి కొందరు తాము తినడం కన్నా తినిపించడంలో ఎక్కువ ఆకలిగా ఉంటారు. మన్మథుడి ఆకలి ఇలాంటిదే. తన కోరికేదో తాను తీర్చుకోకుండా ప్రతి ఒక్కరికి శృంగార ఆకలిలోలో ముంచెత్తడానికి చెరుకు బాణాలతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అదే అతని కొం ప ముంచింది. అల్లా టప్పా వాళ్ల మీద ప్రతాపం చూపితే సరే.. చివరకు శివుడిపై కూడా ప్రభావం చూపడంతో కాల్చిపారేశాడాయన. శక్తికి మిం చిన ఆకలి శరీరానికి మంచిది కాదన్న మాట! ఇంద్రుడి శృంగార ఆకలి అతన్ని నిండా ముంచింది.


హిట్లర్‌కు కూడా ఇలానే తనకు మాలిన ఆకలి ఉండేది. మొత్తం ప్రపంచాన్ని మింగేద్దామనే ఆకలితో ప్రపంచం మీద పడ్డాడు. సాగినన్నిరోజులు సాగుతుంది. తన కన్నా పెద్ద బకాసురుడిని మింగాలనుకుంటే ఏమవుతుంది. అదే జరిగింది. అమెరికా జోలికెళ్లడంతో అదే జరిగింది. చివరకు తన తూటాతో తానే పేల్చుకుని చావాల్సి వచ్చింది.
కడుపు నిండిన వాడికి హైదరాబాద్ బిర్యానీ కూడా చేదనిపించవచ్చు, కానీ కడుపు కాలే వాడికి ఇరానీ హోటల్‌లో పప్పన్నం కూడా అద్భుతంగా అనిపిస్తుంది. 1980 ప్రాంతాల్లో మన రాష్ట్రంలో కూడా ఆకలి చావులుండేవి. గంజికేంద్రాలను నడిపేవారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం పేదల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది కానీ అదృష్ట వశాత్తు తిండికి సంబంధించిన ఆకలి చావుల సమస్యలేదు.


మాదా కబళం అనే వారి కన్నా దీనంగా బాబూ ఒక పదవి ధర్మం చేయండి బాబూ అనే గోల ఎక్కువైంది. తొమ్మిదేళ్ల పాటు తిండికి అలవాటు పడ్డాను, పదేళ్ల నుంచి తిండి లేక అలమటిస్తున్నాను, బాబూ ఒక్క పదవి ధర్మం చేయండి బాబూ అని ఆయన ఎంత మొత్తుకున్నా కనికరించే వారు కనిపించడం లేదు. తొమ్మిదేళ్లు బాగా తిన్నవారికి ఆకలేంటి, ఎప్పు డూ వాళ్లే తినాలో మరొకరు తినవద్దా అని జనం అనుకొంటారనే విషయం బాగా తెలుసు కాబట్టే మరొకాయన బాబూ ఆకలిమీదున్నాను ఒక్క చాన్సివ్వండి అంటున్నాడు.


అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టు వచ్చింది సరిపోలేదా? అంటే మొత్తం ప్రపంచాన్ని నిర్మించే కాంట్రాక్టు నాకు దక్కినా ఈ కాంట్రాక్టుల ఆకలి తీరదని ఓ కాంట్రాక్టర్ చమత్కరించారు.
అమ్మా ఒక్క ముద్ద అంటే ఏ తల్లయినా కరిగిపోతుంది. అందుకే మహామహానాయకులే ఈ మంత్రాన్ని నమ్ముకున్నారు. బిజెపికి ఒక్క చాన్సివ్వండి అని వేడుకుంటే కరుణించారు. మళ్లీ పదేళ్ల తరువాత ఇప్పుడు అదే బిజెపి అదే నినాదాన్ని కాస్త మార్చి బిసి ప్రధానమంత్రికి ఒక్క చాన్సివ్వండి అంటున్నారు.


తిండి, ధనం, అధికారం, శృంగారం ఏ ఆకలైనా కావచ్చు అతి సర్వత్రా వర్జయత్ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అధికారం సంపాదిద్దాం, డబ్బు కూడబెట్టుకుందాం, వారసులకు అధికారం అప్పగిద్దాం, వంశ పారంపర్యంగా మనమే పాలిద్దాం అనుకునే అధికార ఆకలి కన్నా ప్రజలకు మంచి చేద్దామనే మంచి ఆకలితో నాయకులు దహించుకు పోయే రోజులు ఎప్పుడొస్తాయో!అసలీ విశ్వమే ఆకలితో దహించుకుపోతోంది. ఒక్కోక్కరిది ఒక్కో రకమైన ఆకలి.

3 కామెంట్‌లు:

 1. బాగుంది మురళీ గారు. ఆకలి 'కేక' పెడుతోంది .

  రిప్లయితొలగించండి
 2. ఆకలి తాలూకు విశ్వరూప సందర్శనం చేయించారు మీరు. ఆకలి... ఊసరవెల్లిలాగా ఇన్ని రంగులు మార్చగలదనీ, ఆక్టోపస్ లాగా అనేక వెర్రితలలు వేయగలదనీ, చేతబడి చేసినట్టు ఇంతమంది చేత ఇన్ని అఘాయిత్యాలు చేయించగలదనీ ఇప్పుడే, ఇక్కడే తెలిసింది. భలేగా రాశారు.
  అన్నట్టు, నేనొక విషయం విన్నాను, అది ఎంతవరకు నిజమో తెలీదు. సెకెండ్ వరల్డ్ వార్ లో... యుద్ధోన్మాది హిట్లర్ మట్టి కరిపించి, జర్మనీ సేనల్ని బెర్లిన్ దాకా తరిమినది సోవియట్ యూనయన్ అనీ, ఆ సమయంలో గోడ మీద పిల్లిలాగా, గోతి కాడి నక్కలాగా కాచుక్కూచున్న అమెరికా చివరి నిమిషంలో... ఎక్కడ వరల్డ్ వార్ విక్టరీ క్రెడిట్ అంతా సోవియట్ రష్యాకు వెళ్లిపోతుందోనని తెగ ఆందోళన పడిపోయి, ఆల్రెడీ ఓటమిని అంగీకరించిన జపాన్ మీద అనవసరంగా బాంబులేసి మానవజాతి చరిత్రలో అత్యంత దారుణానికి ఒడికట్టిందనీ; సోవియట్ యూనియన్ పతనానంతరం చరిత్రను వక్రీకరించి హిట్లరును ఓడించినదీ, రెండో ప్రపంచ యుద్ధాన్ని గెలిపించినదీ తామేనని సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు విన్నాను. ఇదెంత వరకు నిజమో? అయినా, ఉగ్రవాద భూతాన్ని సొంతంగా క్రియేట్ చేసి, దానిని ప్రపంచం మీదకు వదలి, ఆ కనిపించని భూతంపై అంతులేని యుద్ధం ప్రకటించిన అమెరికా, దేనికైనా తెగబడగలదేమో! :-)

  రిప్లయితొలగించండి
 3. తిండి, ధనం, అధికారం, శృంగారం .... ఏ ఆకలైనా కావచ్చు అతి సర్వత్రా వర్జయత్ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అధికారం సంపాదన, వారసత్వం, వంశ పారంపర్య పరిపాలన ఆకలి కన్నా ప్రజలకు మంచి చేద్దామనే ఆకలితో నాయకులు దహించుకు పోయే రోజులు ఎప్పుడొస్తాయో! అసలొస్తాయో లేదో .... అని ఆకలితో మీరు పడుతున్న ఆబ కు ఏకీభావన తెలియపరుస్తున్నాను మురళి గారు.
  అభినందనలు.

  రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం