7, డిసెంబర్ 2013, శనివారం

ఎవరి వల్ల తెలంగాణ?

తెలంగాణ ఏర్పాటుకు గురువారం కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్ర విభజనకు సంబంధించి కీలక దశ పూర్తయింది.
పది జిల్లాల తెలంగాణకు అధికారంలో ఉన్న యుపిఏ, ప్రధాన ప్రతిపక్షం అయిన బిజెపి మద్దతు ప్రకటించిన తరువాత ఇక మిగిలిన తతంగం నామ మాత్రమే. ఏదో ఒక చోట విభజన నిలిచిపోతుందని భావించడం అత్యాశే అవుతుంది. అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం నిర్ణయించుకున్నప్పుడు సింపుల్ మెజారిటీతో పాస్ అయ్యే బిల్లు కోసం ఏమవుతుందో అనే సందేహమే ఉండాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందే అవకాశం ఏ మాత్రం లేదు, అయితే అసెంబ్లీ కేవలం అభిప్రాయం చెప్పడానికే పరిమితం కానీ నిర్ణయంపై ప్రభావం చూపలేదు. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ ఏర్పాటుకు గండాలన్నీ గడిచిపోయినట్టే!


మా వల్లే తెలంగాణ ఇప్పుడీ మాట ప్రతి పార్టీ నుంచి వినిపిస్తోంది. నిజమే అన్ని పార్టీలకు ఆ మాట చెప్పుకునే అవకాశం అంతో ఇంతో ఉంది. బిజెపి వల్లనే పది జిల్లాల తెలంగాణ ఏర్పడుతోందని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. బాబు లేఖ ఇవ్వడం వల్లనే అఖిలపక్ష సమావేశం నిర్వహించి తెలంగాణ ఏర్పాటు చేస్తున్నారని టిడిపి నాయకులు ప్రకటించారు. కాంగ్రెస్ మాట ఇచ్చింది నిలుపుకొంది, మా వల్లే తెలంగాణ అని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. ఇక తెలంగాణకు పర్యాయ పదంగా మారిన టిఆర్‌ఎస్ ఎలాగూ తమ వల్లే తెలంగాణ అని చెప్పుకుంటుంది. వీళ్లే కాదు మా వల్లే తెలంగాణ అని ఇప్పుడు పైకి చెప్పుకోలేని వైకాపాకు సైతం ఈ మాట చెప్పుకునే అవకాశం అంతో ఇంతో ఉంది. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర విభజన చేయాలని వైకాపా ఇచ్చిన లేఖ సైతం అంతో ఇంతో ప్రభావం చూపింది. మా వల్లే తెలంగాణ అని ఇంత మంది క్లైమ్ చేసుకుంటున్నారు సరే మరి నిజంగా ఎవరి వల్ల తెలంగాణ వచ్చింది?


తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు కెసిఆర్ వల్లే తెలంగాణ అని గట్టిగా వాదిస్తారు. ఈ వాదనలో వాస్తవం కూడా ఉంది. ఒక్కరి వల్ల కాదు నిజానికి అందరి వల్ల తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఏర్పాటును అడ్డుకొంటూ గత కొంత కాలంగా సీమాంధ్ర నాయకులు, మీడియా తీసుకు వస్తున్న ఒత్తిడిని చూసి తెలంగాణ వాదులు సైతం తెలంగాణ రాదేమో అనే అనుమానంలో పడిపోయారు. ఇంతటి వత్తిడిని సైతం తట్టుకుని తెలంగాణ ఏర్పాటుకు ముందడుగు వేశారంటే కచ్చితంగా తెలంగాణ ఏర్పాటు చేయాలని ధృడమైన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ వల్లనే ఇది సాధ్యం అయింది. 2014 ఎన్నికల తరువాత బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ ఇచ్చేదేమో అది వేరే విషయం కానీ 2014 ఎన్నికలకు  ముందు తెలంగాణ ఏర్పడుతోందంటే సోనియాగాంధీ ధృడంగా తీసుకున్న నిర్ణయమే దానికి కారణం.


టిఆర్‌ఎస్ ఒంటి చేత్తో తెలంగాణ కోసం ఉద్యమించి అలసిపోతున్న సమయంలో బిజెపి ఆ ఉద్యమానికి ఆక్సిజన్‌లా నిలిచింది. 1997లో చేసిన ఒక ఓటు రెండు రాష్ట్రాలు తీర్మానం నుంచి పక్కకు పోయినా, ఎనిమిదేళ్ల తరువాత బిజెపి జాతీయ నాయకత్వం తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణ యం తీసుకుని ఉద్యమానికి ఊపిరి పోసిం ది. 2004లో కెసిఆర్ కాంగ్రెస్ మంత్రివర్గంలో చేరారు. అయతే బిజెపి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఉద్యమ బాట పట్టాలని నిర్ణయం తీసుకున్న తరువాత టిఆర్‌ఎస్ మంత్రివర్గం నుంచి బయటకు వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి ఆ సమయంలో అండగా నిలిచింది బిజెపినే, చివరకు ఇప్పుడు 10 జిల్లాల తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిందీ బిజెపినే. బిజెపి మద్దతు లేకపోతే ఇంత సంక్లిష్టమైన అంశానికి పరిష్కారం లభించడం అంత సులభం కాదు.


కాంగ్రెస్, టిడిపి, బిజెపి, సిపిఐ అన్ని పార్టీలు తెలంగాణ నినాదం అందుకోవడం, వైకాపా సైతం తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం నిజమే. తెలంగాణలో ఉనికిలో ఉన్న అన్ని పార్టీలు జై తెలంగాణ అన్నాయి. ఇది కాదనలేని నిజం. అయితే ఈ అన్ని పార్టీలు ఈ మాట అనక తప్పని పరిస్థితి తీసుకు వచ్చింది మాత్రం కెసిఆర్! అందుకే తెలంగాణ ఏర్పాటులో మీడియా, రాజకీయ పక్షాలు ఎవరికి క్రెడిట్ ఇచ్చినా తెలంగాణ ప్రజలు మాత్రం ముమ్మాటికీ కెసిఆర్ వల్లనే తెలంగాణ ఏర్పడిందని నమ్ముతారు. ఇది నిజం కూడా.


కెసిఆర్‌కు మంత్రిపదవి రాకపోవడం వల్ల తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించాడని టిడిపి విమర్శిస్తోంది. దక్షిణాఫ్రికాలో గాంధీ మహాత్ముడిని రైలు నుంచి బయటకు గెంటివేయకపోతే అసలు స్వాతంత్య్ర ఉద్యమమే జరగకపోయేదని చెప్పడం ఎలా ఉంటుందో ఇదీ అలానే ఉంటుందని ఈ విమర్శకు ఫేస్‌బుక్ జనమే సమాధానం చెబుతున్నారు. 2001లో కెసిఆర్ టిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేస్తే, 97లోనే బిజెపి ఒక ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం చేసింది. 99 ప్రాం తంలో వైఎస్‌ఆర్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 42 మంది తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు తెలంగాణ ఏర్పాటు కోరుతూ సోనియాగాంధీకి వినతిపత్రం ఇచ్చారు. 95 ప్రాంతంలోనే తెలంగాణ జనసభ వరంగల్‌లో లక్షలాది మందితో తెలంగాణ కోసం సభ ఏర్పాటు చేసింది. తెలంగాణ పాటలు పాడిన బెల్లి లలితను ఆ కాలంలోనే హత్య చేశారు. అంత కన్నా చాలా ముందుగానే ఇంద్రారెడ్డి తెలంగాణ కోసం ఒక పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ కోసం నినదించే లక్షలాది గొంతులు సిద్ధంగా ఉన్న వాతావరణం అది. ఆ గొంతులకు సరైన నాయకత్వం లేదు. ఆ సమయంలో తెలంగాణ గొంతులకు కెసిఆర్  నాయకుడిగా మారారు కానీ కేవలం కెసిఆర్‌కు మంత్రిపదవి దక్కలేదని తెలంగాణ అడుగుతున్నారు అనేది అవగాహన లోపమే అవుతుంది.


69లో జరిగిన ఉద్యమాన్ని దానికి వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకత్వం పన్నిన వ్యూహాలను నిశితంగా అధ్యయనం చేసిన కెసిఆర్ తొలి దశ ఉద్యమం ఎక్కడ విఫలమైందో వాటినే గుణపాఠంగా తీసుకుని రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యం అని నమ్మారు. అదే కోణంలో పార్టీని నడిపించి విజయం సాధించారు. టిఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో దాదాపు ఆరునెలల పాటు కెసిఆర్ మేధోమథనం జరిపారు. తెలంగాణ కాంక్షతో రగిలిపోయే వారంతా ఆయనతో గంటల పాటు ముచ్చట్లు పెట్టారు. వారి చర్చల్లో వినిపించే మొదటి మాట ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారు, కానీ తెలంగాణ సాధ్యం కాదు అనేది మొదటి మాట! ‘‘మా చిన్నప్పటి స్నేహితులు తెలంగాణ రావాలని కోరుకుంటున్నాం కానీ అట్లెట్లొస్తది తెలంగాణ అనేవాళ్లు, అట్లెట్ల తెలంగాణ రాదు అని నేను సమాధానం చెప్పేవాడ్ని’’ అంటూ డిసెంబర్ 9 ప్రకటన తరువాత ఒక సభలో కెసిఆర్ చెప్పుకొచ్చారు. సామాన్యులకే కాదు చివరకు ఉద్యమ కారులకు సైతం తెలంగాణ రాదుఅనే భావన బలంగా ఉండేది. రాజకీయాలతో తెలంగాణ రాదు పోరాటాలతోనే తెలంగాణ అంటూ గద్దర్ తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు కెసిఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే మీడియా ఆయనకు భారీ ప్రచారం కల్పించింది. తెలంగాణ ఏర్పడేంత వరకు ఇంట్లో అడుగుపెట్టను అని ప్రకటించి ఇంటి నుంచి బయటకు వచ్చిన గద్దర్ కనీసం ఏడాది కూడా ఉద్యమాన్ని నడపలేకపోయారు. ఎన్నో ఉద్యమాల్లో ఆటుపోట్లను ఎదుర్కొన్న గద్దర్ సైతం కొద్ది కాలంలోనే వెనక్కి వెళ్లారు. దేశంలో ప్రస్తుతం ఉన్న సంకీర్ణ రాజకీయాల శకం తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమైనదని, వంద అసెంబ్లీ, 15 పార్లమెంటు సీట్లుగెలుచుకుంటే తెలంగాణ మన వద్దకే వస్తుందని కెసిఆర్ నమ్మారు. ఆ దిశగా పార్టీ పరిస్థితి సైతం 2009 డిసెంబర్ 9 ప్రకటన తరువాత క్రమంగా మెరుగవుతూ వచ్చింది. చివరకు ప్రధానపక్షాలైన కాంగ్రెస్,టిడిపిలకు తెలంగాణలో డిపాజిట్లుదక్కని పరిస్థితి ఏర్పడింది.


తెలంగాణ వాదానికి లభిస్తున్న మద్దతు చూసి అనేక తెలంగాణ పార్టీలు పుట్టుకొచ్చాయి, టిఆర్‌ఎస్ నుంచి బయటకు వెళ్లి పార్టీలు పెట్టిన వారూ ఉన్నారు. కానీ వీరిని సీమాంధ్ర నాయకులు, మీడియా పట్టించుకుంది కానీ తెలంగాణ ప్రజలు మాత్రం పట్టించుకోలేదు. టిఆర్‌ఎస్ జలదృశ్యంలో ఆవిర్భవించింది. ఆవిర్భవించిన కొద్దిరోజులకే అది ప్రభుత్వ స్థలం అంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశాల్లో ఉన్న సమయంలో రాత్రికి రాత్రి టిఆర్‌ఎస్ కార్యాలయాన్ని బయట పడేశారు. కొందరు ఆగ్రహంతో ఊగిపోతే జిల్లాలో ఉన్నకెసిఆర్ ఎవరూ ఏమీఅనవద్దని, పార్టీ సామగ్రి మొత్తం అద్దె భవనంలోకి మార్చమని ఆదేశించారు. ఉద్యమంలో హింస ప్రవేశిస్తే ఎక్కువ రోజులు ఉండదని మొదటి నుంచి చెబుతూ వచ్చిన కెసిఆర్ అదే దిశగా 13 ఏళ్లపాటు ఉద్యమాన్ని నడిపించి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమానికి ఒక మచ్చ లాంటిది ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల విధ్వంసం. ఆనాడు జరిగిన మిలియన్ మార్చ్ ఇతర ఉద్యమ సంస్థల ఆధ్వర్యంలో జరిగింది. హింసకు అవకాశం లేకుండా ఉద్యమం సాగించడమే కెసిఆర్ సాధించిన తొలి విజయం. ఈ వ్యూహమే తెలంగాణ సాధనకు దోహదం చేసింది. ఇక టిడిపిలాంటి ప్రత్యర్థులు, తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలని చూసిన వారు కెసిఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. దాని వల్ల కెసిఆర్ పట్ల సీమాంధ్రుల్లో వ్యతిరేకత ఏర్పడిందేమో కానీ తెలంగాణ వారిలో తెలంగాణ కాంక్ష మరింతగా పెరిగేందుకు ఉపయోగపడింది. కనీసం నన్ను లక్ష తిట్లు తిట్టారు. నేనేమీ పట్టించుకోలేదు, పట్టు విడవకుండా ముందుకెళ్లాను అని ఒక సభలో కెసిఆర్ చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తిపై ఇంత తీవ్ర స్థాయిలో దూషణలకు దిగడం బహుశా కెసిఆర్ విషయంలోనే జరిగిందేమో! గత 12 ఏళ్ళ  నుంచి తెలంగాణ ఉనికిని పక్కన పెట్టలేని పరిస్థితి కెసిఆర్ కల్పించారు. ఒకప్పుడు అసెంబ్లీలో తెలంగాణ పదం వాడేందుకు వీలులేదని చెప్పిన పరిస్థితి నుంచి తెలంగాణ అసెంబ్లీ ఏర్పాటు సాకారం కావడానికి పునాది రాయిగా నిలిచింది కచ్చితంగా కెసిఆరే. పరిస్థితులు,మిగిలిన పార్టీలు తమ తమ పాత్రలను పోషించాయి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలంగాణ కథానాయకుడు కెసిఆర్.

12 కామెంట్‌లు:

 1. "ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలంగాణ కథానాయకుడు కెసిఆర్"

  You can hate him but you can't ignore him.

  రిప్లయితొలగించు
 2. bagundi mee vishleshnaa ... mummattiki KCR ye hero ... athi aradhanaa oka niayamthurthavam niki dhari thiyakudahu

  రిప్లయితొలగించు
 3. హమ్మయ్య! ఇప్పటికి వ్రాసారా ఈ వ్యాసాన్ని, పాపం ఇన్నాళ్ళు వుగ్గబట్టుకొని ఉన్నారనుకుంటా, మొత్తానికి మీ అభిప్రాయం చెప్పారు .... గుడ్ ...

  రిప్లయితొలగించు
 4. చేసింది ఘనకార్యమీ కాదు. ఆర్టికిల్ 3 అనేది రాజ్యాంగ పరమయిన వెసులుబాటు మాత్రమే. అసలు కాంగ్రెసుని ఒప్పించింది మత్రం నాకిది ఇస్తే నీకది ఇస్తాననే లాలూచీ తోనే. తను చేసిన ఉద్యమాన్నే అవమానించే ప్రతిపాదన అది. విలీనం అనే ప్రతిపాదన వల్ల తెచ్చుకుని తీరా చూస్తే -- కేసీ ఆర్ మాటిస్తే తల తెగి పడ్డా తప్పడనే మొనగాడు - యే మాత్రం సంకోచించకుండా నేను కలప ననేశాడు. అదే లాలూచీ యవ్వారాలకి కేవలం వీధుల్లో ఉద్యమాలతో ఆగకుండా అటువైపు వాళ్ళు తగులుకుని ఉంటే?

  అందరూ రాహుల్ గాంధిని ప్రధానిని చెయ్యడానికి విదగొడుతున్నారని యెలా అనుకుంటున్నారో గానీ అది పూర్తిగా తప్పు. దేశమంతా చంక నాకిపోయి విడగొట్టటం వల్ల సీమాంధ్ర లోనూ నష్టపొయాక ఈ కాసిని సీట్లు చలి కాసుకోటానిక్కూడా పనికి రావుగా! నాకు తోచిన క్లూ వేరే ఉంది. పార్తీ పూర్తిగా వోడిపోయినా సోనియాకీ రాహుల్ కీ అమేధీ యో యేవో నికరమయిన స్థానాలు ఉన్నాయి. మరి వారికి అతి ముఖ్యులయినా చిదంబరం, ఆజాద్ లాంటి వారి సంగతేమిటి? చిదంబరాన్ని ఈ సారి జయలలిత తమిల నాడు నుంచి గెలవనివ్వదు. ఆజాదుని వాళ్ళ పార్తీ వాళ్ళే పార్టీ ఆఫీసుకి రానివ్వట్లేదు, ఇంక పార్లమేంతుకి గెలిపించటం కూడానా?మిగతా వాళ్ళ పరిస్తితీ అనతే. వాళ్ళందరికీ నమ్మకమయిన సీట్ల కోసం - అంటే సొనియ మహా రాణీ గారి పెంపుడు జంతువులకి అధికార భద్రత పధకం.

  అందుకే చిదంబరం అంత మొహమాటం లేకుండా ఆంధ్రప్రదేశ్ కి చెందిన మంత్రికి ముఖమ్మీదే నిర్ణయం మారదని తెగేసి చెప్పటం.

  రిప్లయితొలగించు
 5. నాడు తెలంగాణ పదాన్ని వాడేందుకు వీలు లేదన్న పెద్ద మనుషులు ఇప్పడు కుమిలి కుమిలి ఏడుస్తున్నారు.. ఇది తెలంగాణ వాసులకు ఎంతో గర్వకారణమైన సందర్భం..

  రిప్లయితొలగించు
 6. నాడు తెలంగాణ అనే పదాన్ని వాడొదందని చెప్పిన పెద్ద మనుషులు ఇప్పుడు కుమిలి, కుమిలి ఏడుస్తున్నారు.. ఇది నిజంగా మనకు ఎంతో గర్వకారణమైన విషయం..

  రిప్లయితొలగించు
 7. తెలంగాణా పట్టు విడువని విక్రమార్కుడు,తెలంగాణా గంగను భూమార్గం పట్టించి భూకంపం పుట్టించిన భగీరథుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు! ఆయనకు ఆయనే సాటి!ఆయనకు లేనేలేరు పోటీ!

  రిప్లయితొలగించు
 8. పరిస్థితులు, మిగిలిన పార్టీలు తమ తమ పాత్రలను పోషించాయి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తెలంగాణ కథానాయకుడు మాత్రం కె చంద్రశేఖర్ రావే!

  రిప్లయితొలగించు
 9. మీ విశ్లేషణ బాగుంది. తెలుగుదేశం - జగన్ లకు తెలంగాణా ఏర్పాటు ఏ మాత్రం ఇష్టం లేనిది. తెలంగాణా క్రెడిట్‌ని తెలంగాణా ప్రాంత ప్రజలు ఖచ్చితంగా టీ.ఆర్.ఎస్ కే ఇస్తారు తప్ప కాంగ్రెస్‌కు కాదు. కాంగ్రెస్ కోరుకునేది అదే. సోనియా తెలంగాణా ఇచ్చింది కేవలం రాహుల్ గాంధీ కోసమే తప్ప తెలంగాణా ప్రజలపై ప్రేమతో కాదు. తెలంగాణాలో కే.సీ.ఆర్‌ను సీమాంధ్రలో జగన్‌నూ వాడుకోవడం ద్వారా ఏ.పీ లో 35 సీట్లకోసం అధిష్టానం ఎత్తు వేసింది. ఇందులో సక్సెస్ అవుతుందా? చిత్తవుతుందా అనేది చూడాలి.

  రిప్లయితొలగించు
 10. కాంగ్రెస్ KCR ని నిజంగా అదుపులో పెట్టాలని అనుకోనుంటే, ఏ CBI నో ప్రయోగించేవాళ్ళు. లాలు ప్రసాద్, జగన్, ఓవైసీ లను కంట్రోల్ చేయంగా, KCR ను కంట్రోల్ చేయడం పెద్ద పనేంకాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ కోసం తెలంగాణా ఇస్తున్నారేగాని ఇంకో కారణం లేదు....

  KCR కు నిజంగా తెలంగాణా రావాలనుంటే, ఆ వచ్హేవరకు కాస్త నోరు అదుపుఓ పెట్టుకోకుండా సీమాంధ్రులను భయభ్రాంతులను చేసే ప్రకటనలను చేయకూడదుకదా....

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం