22, జనవరి 2014, బుధవారం

ఆత్మ లేని ఆత్మకథలు.... భాగవతం శ్రీకృష్ణుని ఆత్మకథ .. రామాయణం శ్రీ రాముని ఆత్మ కథ

అధికారం అనుభవించిన వారి జీవితాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఎక్కడ రహ స్యం ఉంటుందో అక్కడ ఆసక్తి ఉంటుంది. అధికారం అన్నప్పుడు కడుపులో ఎన్నో రహస్యాలు ఇమిడి ఉంటాయి. అందుకే ఆ ఆసక్తి. అలాంటి వారు ఆత్మకథలు రాస్తే. రహస్యాలు బయటపెడతారేమో అనే ఆసక్తి ఉంటుంది. నిజాం పాలన ముగిసి ఆరు దశాబ్దాలు దాటిపోయినా నిజాం పై చర్చ ఇప్పటికీ అసెంబ్లీలో సాగుతూనే ఉంది. ఇండో చైనా వార్ సమయంలో భారత సైన్యానికి నిజాం 120 కేజీల బంగారం ఇచ్చాడట! భగవద్గీత అనువాదానికి నిధులు, తిరుపతితో పాటు అనేక ఆలయాలకు నిధులు ఇచ్చాడట! ఇవన్నీ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చెబుతుంటేనే ఆసక్తిగా అనిపించినప్పుడు ఇక స్వయంగా నిజాం తన ఆత్మకథ రాస్తే ఇంకెన్ని రహస్యాలు తెలిసేవో?

 హైదరాబాద్ అభివృద్ధిలో తన వంతు పాత్ర వహించి, పాలనలో చివరి రోజుల్లో కాశీం రజ్వీ చేతిలో కీలుబొమ్మగా ఎందుకు మారాల్సి వచ్చిందో, రజ్వీ ముష్కరులు గ్రామాలపై పడి అమాయకులను హతమారుస్తుంటే ఎందుకు నివారించలేకపోయాడో పాకిస్తాన్ మద్దతుతో హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా ఉంచాలని ఎందుకనుకున్నాడో ఎవరో చెప్పడం కన్నా ఆయన ఆత్మకథలో చెప్పి ఉంటే బాగుండేది.


నాలుగు వందల ఏళ్లు పాలించారు కానీ కనీసం ఓ నలుగురైనా ఆత్మకథలు రాయలేదు. భారతీయులకు అత్మకథల అలవాటు తక్కువే. సురవరం ప్రతాపరెడ్డి దీన్ని ఒప్పుకుంటూనే అదేం కాదు మనం సరైన కోణంలో చూడడం లేదు కానీ భాగవతం, రామాయణాలు ఆత్మకథలు కాకుంటే మరేమిటని ఎదురు ప్రశ్నించారు. శ్రీకృష్ణుడు బాల్యం నుంచి చివరి వరకు సాగించిన లీలల సారం భాగవతం శ్రీకృష్ణుని ఆత్మకథే. శ్రీరాముడి జీవితమంతా రామాయణంలో కళ్ల కు కట్టినట్టు ఉంది కదా అది ఆత్మకథే కదా అం టారాయన. ఇక్ష్వాకుల కాలం నుంచే మనకు అత్మకథలు రాసుకునే అలవాటు ఉందనేది ఆయన అభిప్రాయం.. పురాణాలన్నీ దేవుళ్ల ఆత్మకథలు అనడం వాదనకు బాగానే ఉన్నా. అత్మకథలుగా అవి నిలవవు.


దాదాపు ఏడు దశాబ్దాల క్రితం నాటి మాట! నిజాం పాలనా కాలంలో హైదరాబాద్‌లో ప్రముఖ పత్రిక మిజాన్.. తిరుమల రామచంద్ర, అడవి బాపిరాజు లాంటి హేమా హేమీలు అందులో పని చేశారు. తిరుమల రామచంద్ర ఆఫీసుకు రాగానే చెత్తబుట్టలో ఏమున్నాయో చూసేవారట! మంచి సాహిత్యం సరైన వ్యక్తి చేతిలో పడనప్పుడు అది దర్శనమిచ్చేది అక్కడే అని ఆయన గట్టి నమ్మకం. ఒకసారి అలా చూడగా, చప్రాసీ ఆత్మకథ అంటూ ఒక ఆత్మకథ చెత్తబుట్టలో కనిపించింది. మహామహులే ఆత్మకథలు రాయడం లేదు వీడెవడో చప్రాసీ పైగా ఆత్మకథ రాసుకోవడం అని ఎవరో ఒకాయన దాన్ని చెత్తబుట్టలో పారేశాడు. దాన్ని చదివిన తిరుమల రామచంద్రకు ప్రచురించదగిన రచనగా అనిపించి, అడవి బాపిరాజుకు చూపించారు. చప్రాసీగా పని చేసిన ఒకాయన తన జీవితంలో ఎదురైన సంఘటనతో రాసిన ఆత్మకథ అది. అక్షర దోషాలు ఉన్నాయి, వాటిని సవరించి యధాతథంగా ప్రచురించండి అని అడవి బాపిరాజు ఆదేశించారు. రాయాలనే ఆసక్తి ఉండాలి కానీ చప్రాసీకి సైతం ఆత్మకథ రాసుకునేంత జీవితం ఉంటుంది.


అధికారంలో ఉన్న వారు రహస్యాలు బయటపడతాయనే భయంతో ఆత్మకథల జోలికి వెళ్లరు. నిజాయితీగా నేతలు ఆత్మకథలు రాస్తే హాట్ కేకులు కాకుండా ఉంటాయా?
మనుషులు చెప్పేదాంట్లో నిజాలు ఎంతుంటాయంటే ఈ మధ్య ఓ రచయిత ఐస్‌బర్గ్‌ని ప్రస్తావించారు. అది పది శాతం మాత్రమే పైకి కనిపిస్తుంది. పైకి కనిపించే పది శాతాన్ని బట్టి లోన ఉన్న 90 శాతం గురించి ఊహించుకోవాలి తప్ప కనిపించదు. నాయకులు చెప్పేదానిలో ఆ పది శాతం నిజాయితీ కూడా అనుమానమే. ఆ మధ్య బాబుతో మాట్లాడిన ఒకాయన బాబు పేరుతో మనసులోని మాట అని రాస్తే చివరకు అది ప్రత్యర్థుల చేతిలో ఆయుధంగా మారిపోయింది. నేతలు జీవించి ఉన్నంత వరకు రాజకీయాల్లో ఉంటారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు రహస్యాలను ఆత్మకథల్లో చెప్ప రు. అంటే రాజకీయ రహస్యాలకు శాశ్వత స్థానం సమాధి మాత్రమే. ఎవరైనా నాయకుడు అధికారంలోకి రాగానే మీ చరిత్ర రాసేస్తాం అంటూ ఈ మధ్య బతక నేర్చిన వారు చౌరస్తాల్లో కనిపించే కూలీల్లా మీద పడిపోతున్నారు. ఆ నేతల ఆంద చందాలను పొగుడుతూ వీరు రాసే వాటి కన్నా సమాచార శాఖ ప్రకటనలు మెరుగ్గా ఉంటాయనిపిస్తుంది.


బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఆత్మకథ రాస్తానని బెదిరిస్తున్నారు. ఇప్పటి వరకు మన రాష్ట్రాన్ని 16 మంది ముఖ్యమంత్రులు పాలించగా, వీరిలో పావు మంది కూడా ఆత్మకథలు రాసుకోలేదు. మన నేతలకు ఆత్మకథలు అచ్చిరావేమో? ఎన్టీఆర్ ఆ త్మకథ రాసుకోవాలనే కోరిక రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పింది. ఈ కోరిక పుణ్యమా అని ఆయనకు కొత్త భార్య దక్కింది కానీ ఉన్న పదవి ఊడింది. అల్లుడికి కాలం కలిసొచ్చింది. నీలం సంజీవరెడ్డి ఆత్మకథ రాశారు. జలగం వెంగళరావు డిక్టెట్ చేస్తే వాళ్ల కోడలు రాసింది. కాసు బ్రహ్మానందరెడ్డి, దామోదరం సంజీవయ్యల ఆత్మకథలు కూడా వెలుగు చూశాయి. బహుభాషా వేత్త, సాహితీ మూర్తి పివి నరసింహారావు ఇన్‌సైడర్ అంటూ పరోక్ష ఆత్మకథ రాసుకున్నారు. ఇక రాజకీయాల్లో భవిష్యత్తు లేదనుకున్నారేమో నాదెండ్ల కూడా ఆ మధ్య ఆత్మకథ రాశారు. అంజయ్య, చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి, రోశయ్యలకు ఆ ఆలోచనలే రాలేదు ఎందుకో?

 ప్రకాశం పంతులు ఆత్మకథలో మరీ ఎక్కువ నిజాలు చెప్పేశారని వివాదం తలెత్తడంతో తగ్గించారు. హేమాహేమీలైన ఎంతో మందితో సినిమాలు తీసిన ఎంఎస్‌రెడ్డి నటుల గురించి కొన్ని నిజాలతో ఆత్మకథ రాస్తే తెలుగు సినిమా పరిశ్రమ చిన్నబోయింది. ఆయనకు ఇక సినిమాలు తీసే ఉద్దేశం లేదు కాబట్టి ధైర్యంగా రాశారు. కానీ ఆయన కొడుకు పరిస్థితి అది కాదు. ఇంకా నాలుగు కాలాల పాటు సినిమాలు తీయాలనుకుని, ఆత్మకథను మార్కెట్ నుంచి వెనక్కి తెప్పించారు. నేతి బీర కాయలో నెయ్యేంత ఉంటుందో ఆత్మ కథల్లో ఆత్మ అంత ఉంటుంది .    ఆత్మకథలకు ముఖ్య సూత్రం దానిలో ఆత్మ కనిపించవద్దు.

4 కామెంట్‌లు:

  1. :-)
    :-)
    :-)
    :-)
    (because, no comment is suitable to express the feelin I got on reading this....)

    రిప్లయితొలగించండి
  2. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటదో, ఆత్మకథలో ఆత్మ అంత ఉంటది. ఇది కచ్చితంగా సాంబ పుస్తకంలో రాసుకోవాల్సిందే!! :)

    రిప్లయితొలగించండి

  3. నిజమే.ప్రముఖులకైనా,మరి ఎవరికైనా నిజాయితీగా ఆత్మకథలు రాసుకోవాలంటే చాలా ఇబ్బందులుంటాయి.తనగురించీ,ఇతరులగురించీ చాలా చేదునిజాలు,రహస్యాలు రాయవలలసి ఉంటుంది.అందువలన వాళ్ళ గురించి అనేక విషయాలు మరుగునపడివుండిపోతాయి.సందేహాలు అలాగే మిగిలిపోతాయి.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం