26, ఫిబ్రవరి 2014, బుధవారం

చారిత్రాత్మక అపనమ్మకం

ఛీ... ఛీ... దరిద్రం... నాశనమై పోతారు. వాళ్లకు పుట్టగతులుండవు’’
‘‘ఏమైందేంటి శాంతిశ్రీలా ఉండేవాడివి ఉగ్రశ్రీ వయ్యావు. ఎవరిని తిడుతున్నావు? ఎందుకు తిడుతున్నావు??’’
‘‘తిట్టాలా నరికి పోగులు పెట్టాలా? రక్తం మరిగిపోతున్నది’’
‘‘నీ బాధ అర్ధమైంది.. రాష్ట్ర విభజనపైనే కదా నీ కోపం.. అలా కోపం రావడం సహజమేలే నేను అర్ధం చేసుకుంటాను’’
‘‘రాష్ట్ర విభజన ఎప్పుడో ఒకప్పుడు జరగాల్సిందే.. ఆ విషయం నాకూ తెలుసు. కొత్త రాజధాని వచ్చే చోట మా వాళ్లు పొలాలు కూడా కొన్నారు. నా కోపం దాని కోసం కాదు’’


‘‘ విషయం చెప్పకుండా తిట్ల దండకం వినిపిస్తున్నారంటే విభజనపైనే అనుకున్నాను ’’
‘‘డబ్బు ఈ రోజు ఉంటుంది. రేపు పోతుంది. కుక్కను కొడితే డబ్బు రాలుతుంది. . అది కాదు ముఖ్యం. నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకాన్ని పోగొడితే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎవరైనా డోం ట్ కేర్.. నమ్మకం కోసం ప్రాణం ఇస్తాను. నాకు మొత్తం ప్రజాస్వామ్యం మీదనే నమ్మకం పోతోంది. ’’
‘‘ఏం మోసం చేశారేమిటి? ఒకడికమ్మిన ప్లాట్ ను మళ్లీ నీకమ్మారా?’’
‘‘ఇందులో మోసం ఏముంది? ఇది కామన్ కదా. ప్లాట్ అన్నాక ఇద్దరు ముగ్గురికి అమ్ముతా రు. అందులో బలవంతుడెవడో వాడికే ఆ ప్లాట్ దక్కుతుంది. బలహీనుడు కోర్టుకెళతాడు. ఇది కామనే, అందరూ చేసేదే. అది కాదులే విషయం’’


‘‘ఇంకేంటి సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇస్తానని చెప్పి మన సుబ్బారావుగారబ్బాయి ఆ అమ్మాయికి కడుపు చేసిన సంగతా ఏంటి?’’
‘ 
భలే వాడివయ్యా నువ్వు. నీ ఆలోచనలు మరీ సిల్లీగా ఉంటాయి. నేను ప్రధానమంత్రి గురించి చెబుతుంటే నువ్వు హీరోయిన్ కాబోయి గర్భవతి అయిన అమ్మాయి గురించి చెబుతావు. అది కామన్ లేకపోతే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమాలు తీసేది,తీస్తామని నమ్మించేది వీళ్లను హీరోయిన్‌లుగా దేశం మీదికి వదలడానికా? ఎవరి టార్గెట్‌లు వారికుంటాయి. ఆ అమ్మా యి హీరోయిన్ కావాలనుకుంది. వాడు అమ్మాయి కావాలనుకున్నాడు. ఇందులో మోసం ఏముం ది...? ఇలాంటివి కామన్’’

‘‘ఏంటయ్యా నీ బాధ ప్రధానమంత్రి అంటా వు, ప్రజాస్వామ్యం అంటావు. ఇంతకూ నీ నమ్మకాన్ని వమ్ము చేసిందెవరు? ’’
‘‘నా ఒక్కడిని మోసం చేస్తే పరవా లేదు. మొత్తం దేశాన్నే  మోసం చేశారు. ప్రజాస్వామ్యా న్ని మోసం చేశారు. ఇది చారిత్రక మోసం ’’
‘‘ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నావు, నీ వయసెంత ? ప్రజాస్వామ్యం గురించి నీకేం తెలుసేమిటి? ’’
‘‘ ఇదిగో నా వయసెంతని కాదు. 1952లో జరిగిన తొలి పార్లమెంటు ఎన్నికలు మొదలుకొని, మన రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఏ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చిందో, ఎలా ఉల్లంఘించారో వివరాలన్నీ నా దగ్గరున్నాయి. ఒకటి రెండు విడవ మంటావా? ’’
‘‘ ఏదీ విడువు వింటాను’’
‘‘ ఇందిరాగాంధీ నాలుగు దశాబ్దాల క్రితం గరీబీ హటావో అని నినాదం ఇచ్చిందా? ’’
‘‘ఔను ఆ నినాదం పుణ్యమే అని కదా పేదలు ఇప్పటికీ కాంగ్రెస్ వెంటే ఉంది’’
‘‘ఇప్పుడు దేశంలో పేదలున్నారా? లేరా? ’’
‘‘ఎందుకు లేరు. ప్రపంచంలోని సగం మంది పేదలు, సగం మంది నిరక్ష్యరాస్యులు మన సోదరులే కదా? ’’
‘‘దీన్ని బట్టి నీకేమర్ధమైంది గరీబీ హటావో అని నినాదం ఇచ్చి అధికారంలోకి వచ్చినా హామీ నెరవేర్చలేదనే కదా? ’’
‘‘ ఔను నిజమే! ’’
‘‘ ఇంకా చెప్పనా! వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని, కాంగ్రెస్ కే హాత్ ఆమ్ ఆద్మీకే సాత్ అన్నారు. కానీ ధరలు తగ్గలేదు. ప్రభుత్వం ఆమ్ ఆద్మీలకు కాకుండా అమీర్‌లకే సాత్ ఇచ్చిందని తేలిందా? లేదా? ’’
‘‘ ఇందులో సందేహం ఎందుకు? నిజమే.’’
‘‘ ఒక్క కాంగ్రెసే కాదు బిజెపి ఏం చెప్పింది. అధికారం ఇస్తే రామ మందిర నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చింది. నిర్మించారా? ’’
‘‘ నిర్మించలేదు.’’


‘‘బాబు ఎప్పుడైనా మాట మీద నిలబడ్డారా? ’’
‘‘ ఛీ...  .
ఛీ ... ఎందుకు అబద్ధం చెప్పాలి బాబు ధర్మప్రభువులు ఒక్కమాట మీద నిలబడలేదు ’’
‘‘తోడల్లుడు దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి  కారులో కలిసి సచివాలయానికి వెళదామని హామీ ఇచ్చారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం , అబ్బో ఇంకా చాలా హామీలు ఇచ్చారు ... ఏ ఒక్కటైనా అమలు చేశారా? ’’
‘‘ చేయలేదు ’’
‘‘మన చిరంజీవి బాబు సంగతేంటి
సామాజిక న్యాయం నుంచి, కాంగ్రెస్‌లో విలీ నమై అమ్మ మాటే నా మాట అన్నారా? లేదా?’’
‘‘ఔనవును అన్నారు ’’
‘‘మన జగన్ బాబు అధికారంలోకి రాకముందే బోలెడు అధికారం అనుభవించాడు ఆ బాబేమన్న తక్కువ తిన్నాడా?
‘‘ఎంత తిన్నాడో తెలియదు కానీ గిట్టని వాళ్లు మాత్రం లక్ష కోట్లు తిన్నాడంటారు.’’
‘‘ అవన్నీ సరే ఇంతకూ నీ నమ్మకాన్ని ఎవరు వమ్ము చేశారు ? ఏదేదో చెబుతున్నావు?’’
‘‘అక్కడికే వస్తున్నాను’’


‘‘ తొలి ఎన్నికల నుంచి గరీబీ హటావో వరకు,  అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలోనూ, రాష్ట్రంలోనో ఏ పార్టీ అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోదు అని మన రాజకీయ పార్టీల మీద, ప్రజాస్వామ్యం మీద మనకు గట్టి నమ్మకం ఉందా? లేదా?’’

‘ఒక్క పార్టీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోదు. అని మన గట్టి నమ్మకం. ’’
‘‘ కదా! మరి అలాంటప్పుడు తెలంగాణ ఇస్తామని ఇచ్చిన హామీకి సిగ్గులేకుండా కాంగ్రెస్, బిజెపి ఎలా కట్టుబడి ఉన్నాయి. వీళ్లసలు మనుషులేనా? వీళ్లకు ప్రజల నమ్మకాలతో పని లేదా? వీళ్లు మాటకు కట్టుబడి ఉండరనే నమ్మకంతోనే కదా!  రెండేళ్ళ రాజకీయ అనుభవం ఉన్న జగన్ బాబు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అల్లుడు బాబు లాంటి నేతలంతా మాట తప్పి చక్కగా రాజకీయ సంప్రదాయాలను గౌరవిస్తే , నూటా పాతికేళ్ళ చరిత్ర ఉందని చెప్పుకొనే కాంగ్రెస్ , దేశాన్ని పాలించడానికి ముస్తాబవుతున్న బిజెపి కి ఆ మాత్రం సిగ్గులేదా ? మాట తప్పాలనే సాంప్రదాయాన్ని పాటించాలనే ఇంగిత జ్ఞానం లేదా ? ఇక వీళ్ళు  దేశాన్నేం పాలిస్తారు ?  మాట తప్పుతారనే నమ్మకం తోనే కదా   ఇంత కాలం మనం నిచ్చింతగా ఉంది. మన నమ్మకాన్ని వమ్ము చేసిన వీళ్లను నరికి పోగులు పెడితే తప్పా నువ్వే చెప్పు’’
‘‘ ఆ ....????’’

3 కామెంట్‌లు:

 1. ఆ అమ్మా యి హీరోయిన్ కావాలనుకుంది. వాడు అమ్మాయి కావాలనుకున్నాడు. ఇందులో మోసం ఏముం ది...? ఇలాంటివి కామన్’’ :-)
  funny.......

  రిప్లయితొలగించండి
 2. మురళి గారూ, ఆఖరిన ట్విస్టు అదిరింది. Unlike politicians, you are living upto our expectations of a great post!

  రిప్లయితొలగించండి
 3. చాలా బాగుందండీ...
  ఇలా ఇచ్చిన మాట తప్పకపోతే మన దేశం సింగపూర్ ఆయిపోదు... ఆలోచించవలసినదే.....

  మీ అర్టికల్స్ అన్ని కూడా బాగున్నాయండీ... ప్రతి అర్టికల్ చదువుతాను.. వాటన్నటికి కలిపి ఒకే కామెంటు పెట్టనని ఏమి అనుకోకండీ....

  రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం