2, ఏప్రిల్ 2014, బుధవారం

పురాణాల కాలంలోనూ పార్టీ ఫిరాయంపులు!

‘‘మన రాజకీయ నాయకుల్లాంటి బతుకు శత్రువుక్కూడా వద్దనిపిస్తోంది’’
‘‘వాళ్లకేమైంది? బాగానే సంపాదిస్తున్నారు కదా?’’
‘‘సంపాదనకేముంది. కుక్కను కొడితే డబ్బులు రాలుతాయి.
విషయం అది కాదు... మన నాయకులు ఏం చేసినా తప్పు పడుతున్నారు ఏం ఇతరులు చేస్తే తప్పు కానిది నాయకులు చేస్తే తప్పా?’’
‘‘విషయం ఏమిటో నేరుగా చెప్పు ’’


‘‘రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారని అందరూ తిట్టుకుంటున్నారు కదా?’’
‘‘తిట్టరా మరి ఏ మాత్రం సిగ్గులేకుండా సొంతింటికి వచ్చానని ఒకరు, ఇంత కాలం నేనున్నది సొంతిల్లు అనుకున్నాను, కాదు కాదు ఇదే నా సొంతిల్లు అని మరొకడు అంటుంటే వినడానికి మనకే సిగ్గుగా ఉంది వాళ్లు నిస్సిగ్గుగా ఎలా చెబుతున్నారో ఆ మాటలు ?’’


‘‘ఇలా పార్టీలు మారడం అనేది రాజకీయ పార్టీలు ఏర్పడక ముందు నుంచే ఉంది. ఆ విషయం తెలుసా? నీకు?’’
‘‘పార్టీలే లేనప్పుడు పార్టీలెలా మారుతారు?’’
‘‘పార్టీలు మారడం ఏదో ఈ కాలంలోనే మన నాయకుల నుంచే మొదలైనట్టు చెబుతున్నారు కానీ పురాణాల కాలం నుంచి ఉంది. మనకు అనుకూల మైన పార్టీలోకి మారితే మంచి పని చేశాడని అభినందించడం, నచ్చ ని పార్టీలోకి మారితే తిట్టడం ఇప్పుడే కాదు, పురాణాల కాలం నుంచే ఉంది. ’’
‘‘నిజమా!’’


‘‘ఔను! అంతే కాదు ఒక కుటుంబంలో అన్న ఒక పార్టీలో ఉంటే తమ్ముడు మరో పార్టీలో ఉండడం కూడా కొత్తదేమీ కాదు అప్పటి నుంచే ఉంది. శ్రీకృష్ణుడు పాండవుల పార్టీలో ఉంటే బలరాముడు కౌరవుల పార్టీలో ఉన్నారు. అయితే ఆ రెండు పార్టీల వాళ్లది కౌరవ వంశమే. అలానే ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలదీ కాంగ్రెస్ వంశమే. కౌరవ హీరో దుర్యోధనుడు, పాం డవ హీరో అర్జునుడి నుండి, శ్రీకృష్ణుడి వర కు అన్ని పాత్రల్లో అదరగొట్టిన మన అన్నగారి కుటుంబ సభ్యులు తలా ఒక పార్టీలో ఉ న్నారని అంటారు కానీ అందులో తప్పేముంది? శ్రీకృష్ణుడి కుటుంబంమే అప్పుడు న్న రెండు పార్టీల్లో ఉంటే శ్రీకృష్ణుడి వేషం వేసిన అన్నగారి కుటుంబం అన్ని పార్టీల్లో ఉంటే తప్పేమిటి?


ఎన్నికలను కురుక్షేత్ర యుద్ధంతో పోల్చినప్పుడు ఆనాటి సాంప్రదాయాలను ఎలా కాదంటారు ’’
‘‘సరే కానీ పార్టీలు మార్చడం పురాణాల కాలంలోనే ఉందన్నావు కదా?’’
‘‘అదే చెబుతున్నాను. రామాయణం తెలుసు కదా? రావణుడు శ్రీరాముడితో యు ద్ధం చేస్తుంటే అతని తమ్ముడు ఏ పార్టీలో ఉండాలి. రావణుడి పార్టీలోనే కాదు. చివరి వరకు విభీషణుడు నీ కోసం ప్రాణాలిస్తాను అన్నా అని నమ్మించి అన్న ప్రాణాలు తీసే మార్గం తెలుసుకుని శ్రీరాముడి వైపు వెళ్లాడా? లేదా? ’’


‘‘ అది లోక కళ్యాణం కోసమే కదా? ’’
‘‘అంతేలే ఎదుటి వాడు చేస్తే వెన్నుపోటు. అదే మనం చేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ అని ఇప్పుడు మనం చెప్పుకునే మాట అప్పటి నుంచీ ఉంది. మనకు నచ్చితే పార్టీ మారడం లోక కళ్యాణం నచ్చక పోతే మహా పాపం. విభీషణుడు వెళ్లింది మాత్రం అన్న పోతే రాజ్యం తన వశం అవుతుందనే కోరికతోనే. రావణుడు అసలే మహ శక్తి సంపన్నుడు, ఆయన మరణం కూడా అంత సులభం కాదని తమ్ముడికి బాగా తెలుసు. అన్నపై ఉన్న ప్రేమ కన్నా అధికారంపై మమకారం ఎక్కువ కావడంతో పార్టీ ఫిరాయించాడు అధికారం సాధించాడు. సుగ్రీవుడు చేసింది కూడా ఇదే కదా అన్న తన్ని తరిమేస్తే శ్రీరాముడు స్నేహ హస్తం అందించారు. నిజానికి ఈ పార్టీ ఫిరాయింపుల ద్వారానే శ్రీరాముడు విజయం సాధించాడంటే అతి శయోక్తి కానే కాదు. 
విభీషణుడే  తొలి పార్టీ ఫిరాయింపు దారుడు ..  శ్రీరాముడికి మద్దతుగా వానర సైన్యం లభించడం, లంకలో తమకు చేయూత నిచ్చే విభీషణుడు లభించడం ఈ రెండు జరిగి ఉండక పోతే శ్రీరాముని విజయం సాధ్యమయ్యే దా?’’

‘‘అలా అంటే కర్ణుడిది కూడా పార్టీ ఫిరాయింపే అంటావేమో!
‘‘కాదు కానే కాదు... తన సొంత పార్టీ పాండవులది అనే విషయం కర్ణుడికి తెలియనే తెలియదు. యుద్ధ సమయంలో తల్లి చెప్పినా సొంత పార్టీలోకి వెళ్లడానికి ఇష్టపడకుండా నమ్మి అవకాశం కల్పించిన దుర్యోధనుడి పార్టీలోనే ఉండిపోయాడు. ’’
‘‘అవును నువ్వన్నది నిజమే! ఓటమి ఖాయం అని తెలిసినా కొంత మంది నాయకులు పార్టీ మారకుండా ఉన్నట్టు కర్ణుడు పార్టీ మారలేదు.’’
‘‘తమకు నచ్చితే పార్టీలు మారడాన్ని ప్రోత్సహించిన శ్రీమహావిష్ణువు నచ్చక పోతే పార్టీ మారితే తల నరికేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమృతం చేజిక్కిన తరువాత దాని కోసం రెండు పార్టీల వాళ్లు కొట్టుకున్నారు. రాష్ట్రంలో కొన్ని పార్టీల్లో మైనింగ్ వంటి భారీ వ్యవహారాలు, భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో అధికార పక్షానికి 60 శాతం, ప్రతిపక్షానికి 40 శాతం అని చక్కగా పంచుకుంటారు. సముద్రం నుంచి అమృతాన్ని వెలికి తీసినప్పుడు అలానే రెండు పార్టీలు పంచుకుంటే సరిపోయేది. దేవతలు, రాక్షసులు రెండు పార్టీలు కలిసి కృషి చేయడంతోనే అమృతం లభించింది. ఇద్దరూ పంచుకోవాలి కదా? విష్ణుమాయతో తమ పార్టీ వారికే పంచే ఏర్పాటును శ్రీమహావిష్ణువు తెలివిగా చేశాడు. ఇది గ్రహించి రాహు కేతువులు చొక్కాల రంగులు మార్చి అధికార పక్షంలో గుట్టు చప్పుడు కాకుండా చేరిపోయారు. అందరితో పాటు అమృతం తాగుతుంటే మన పార్టీ వాళ్లలా కనిపించడం లేదే అని అనుమానం వచ్చి చక్రం అడ్డేస్తాడు. అంటే వాళ్లు పార్టీ మారడాన్ని అడ్డగించడం అన్న మాట! ’’
‘‘ ఆ ’’
‘‘భీష్ముడు కౌరవుల పక్షాన ఉన్నా యుద్ధం లో పాండవులే గెలవాలని కోరుకుంటాడు .అలానే కొందరు  ఏ పార్టీ లో ఉన్నా తమ సామాజిక వర్గం పార్టీ నే గెలవాలని కోరుకోవడం సామాజిక బాధ్యతగా భావిస్తారు 
దేవతలు, దేశాలే పార్టీలు మారుతున్నప్పుడు పాపం అల్పజీవులు నాయకులు మారితే తప్పా?’’

‘‘అంటే నాయకులను దేవతలు అంటున్నావా ?’’
‘‘దేవుళ్ళు కనిపించరు , గెలిచాక నాయకులు కనిపించరు అంత మాత్రాన నాయకులు దేవతలని నేనెలా అంటాను ’’

‘‘మరేమంటావు ’’

‘‘మధుర వాణి గిరీశం తో జత కట్టింది , గిరీశం ఎగస్పార్టీ తో జత కట్టింది అయినా గురజాడ గారు ఆమెను ఒక్క మాటైనా అన్నారా ?
అనలేదు కదా .. మన నాయకుల బతుకు మధుర వాణి కన్నా హీనం అయిపోయిందని చెప్పదలుచుకున్నాను అంతే .  మీరేమంటారు ?’’

6 కామెంట్‌లు:

  1. కేవలం హాస్యానికి తెచ్చే పోలికలతో పురాణ పురుషుల అసలు వ్యక్తిత్వాల్ని మార్చడం మంచి అలవాటు కాదు సార్!వ్యాసుదు బలరాముడు అనే వ్యక్తిని యెందుకు అలా రూపు దిద్దాడో తెలుసా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పటానికే. లాక్షాగృహం, మాయాద్యూతం, ద్రౌపదీ మానహరణం,ఘోషయాత్ర, గోగ్రహణం లాంటివి జరిగాక కూడా కృష్ణుదూ పాందవుల పక్షాన ఉండటంలోనూ బలరాముడు కౌరవుల పక్షాన ఉండటంలోనూ ఇప్పటి రాజకీయాల్ని చూస్తున్నారా?

    విభీషణుడ్ని అంతగా హేళన చేస్తున్న వాళ్ళు, సభలో అన్నా, నువ్వు చేస్తున్నది తప్పేమో ఒకసారి అలోచించరాదా అని మర్యాదగానే అడిగినందుకు యెగిరి తల మీద తన్నడం గురించి కూడా తెలుసుకోవలి కదా?విభీషణుదు చిన్న వాడు గాబట్టి మర్యాదగా చెప్పాడు. కుంభకర్ణుదైతే చావు తిట్లు తిట్టాడు. నీ ఒక్కడి కామం కోసం రాక్షస జాతి నంతా బలి పెడతావా అని నిలదీశాడు.తమ పక్షంలో తప్పు ఉన్నదని తెలిసి దానికి ఒప్పుకోకుండా నీతికి నిలబడ్డవాళ్లకి దురుద్దేశాలు అంటగట్టడం యెంతవరకు సమంజసం?ఉంభకర్ణుడు అంత చెప్పిన వినకుండా , "సరేలే నీకున్న ఇద్దరు తమ్ముళ్ళలో ఒకడెలగూ వొదిలేసాడు, నేను కూడా పోతే చావులో నీకు తోడుండకుండా ఒంటరి వౌతావు" అని విసుక్కుంటూ యుద్ధానికి వెళ్ళాడు.

    యేదయినా ఒక విషయాన్ని విమర్శించాలంటే మొత్తం అక్కడ యేమి ఉందో పూర్తిగా చెప్పి అందులో ఉన్న అసలైన తప్పేమిటో విప్పి చెప్తే యెవరూ కాదనరు. పైగా దాని వల్ల అర్ధవంతమయిన చర్చ జరిగి కొన్ని మంచి విషయాలు బయట పడతాయి.అది ఉపయోగకరమే, కానీ అసలు విషయంలో ఉన్న మూలసూత్రాన్ని దాచేసి మీరు విమర్శించడానికి పనికి వచ్చేవాటి మాత్రమె చెప్పి అక్కద ఉన్నది అంతే నని యెదటివాళ్ళని భ్రమింప జేసి విమర్శించదం సరయిన తర్కం కాదు. అందులోనూ ప్రజల్ని నైతికంగా ఉన్నతుల్ని చెయ్యడానికి ఉద్దేశించిన కావ్యాల్ని, అందులో ఉన్న పురాణ పురుషుల్ని వారి ఔన్నత్యాలకి విరుధ్ధంగా చూపించే పులుముడు పాండిత్యం వల్ల మీకు సొంతగా పేరు రావదం తప్ప మరే ప్రయోజనమూ ఉండదు!

    రిప్లయితొలగించండి
  2. పోలికలు బాగోలేవు. పురాణాలని హేళన చేసినట్లే ఉంది కాని రాజకీయుల్ని చేసినట్టులేదు. ఈ టపా మీ స్థాయికి తగ్గవారు రాయవలసినది కాదు. ఆలోచించుకోండి.

    రిప్లయితొలగించండి
  3. సర్ మీరు వ్రాసిన విదానం బాగునది కాని మన రుసుల్ కాని లేదా వ్యాసుడు కాని ప్రతి పాత్రకి వొక అవునచ్యం ఉనాది వొక అర్ధం ఉన్నది మన పురానములను మనమ్హేలన చేసుకోవటం బాగోదేమో బావి తరములో మన పిల్లలు ఎలా అర్ధం చేసుకొంటారో ఇలా వ్రాసినదుకు శంమిచ్చ్మంది

    రిప్లయితొలగించండి
  4. sarma garu, venkata ratna sharma Kaligotla garu Hari Babu Suraneni garu thanks
    శ్రీ రాముణ్ణి , శ్రీకృష్ణుడి ని హిరోలు చూపుతో వచ్చిన సినిమాలను ఆదరించిన వాళ్ళే .. రావణుడిని , దుర్యోధనుడిని హీరోలుగా చేసి సినిమాలు తీసినా ఆదరించారు. ఆ పాత్రలను మరో కోణం లో చుపినట్టుగానే భావించి ఆదరించారు అంతే తప్ప ... పురాణాలను కించపరిచే ఉద్దేశం ఎంత మాత్రం కాదు

    రిప్లయితొలగించండి
  5. //శ్రీకృష్ణుడు పాండవుల పార్టీలో ఉంటే బలరాముడు కౌరవుల పార్టీలో ఉన్నారు. //
    బలరాముడు కౌరవ పక్షంలో ఉన్నాడా... ఎక్కడనుంచి సేకరించారు ఈ అంశాన్ని. మహాభారత యుద్ధంలో తన శిష్యడైన దుర్యోధనుడు, మేనత్త పిల్లలైన పాండవులు పాల్గొంటుంటే, నారాయణాఖ్య యాదవ సంతతి కౌరవులవైపు, తన తమ్ముడైన కృష్ణుు పాండవుల వైపు నిలిస్తే బలరాముడు ఎవరి పక్షం వహించకుండా, యుద్ధవార్తలు కూడా అందని తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు.

    దైవమాతృకయైన వ్యవసాయాన్ని నదీమాతృకగా మార్చిన అవతారపురుషుడు బలరాముడు. దశావతారాల్లో భార్గవరాముడు, దశరథరాముడు, బలరాముడు ఉన్నారు. అలాంటివాడిని నేటి రాజకీయాలకు ప్రతీకగా వాడుకున్నారే... ఇది కాస్త బాధించింది.

    రిప్లయితొలగించండి
  6. నిజమే, రాముడిగా వేసిన రామా రావు నటుడిగా వైవిధ్యం కోసం రావణ పాత్రనీ చేసాడు. కానీ ఆ కధల్లో సీతాపహరణం నాటి రావణుడ్ని కాకుండా అతని లోని శివ భక్తిని చూపించటం వల్ల వైరుధ్యం కనిపించ లేదు. అదీ గాక అప్పుడు ఆ సినిమాల దర్శకులు కమలాకర కామేశ్వర రావు లాంటి పురాణ కధల పట్ల గౌరవం ఉన్న వారు.రామా రావు సొంతంగా దర్శకత్వం నెరపిన సినిమాల్లో పౌరాణిక పరిజ్ఞ్నానం కన్నా పైత్యకారి తనం పాళ్ళే యెక్కువయింది.యెవరూ వ్యతిరేకించక పోవటం వల్లనే ఇంకా రెచ్చిపోయాడు.

    అది యెంత వరకూ వెళ్ళిందంటే "శ్రీ మద్విరాట పర్వం" అనే ఒక చెత్త సినిమాలో కీచకుడ్ని కూడా ఉన్నతంగా చూపించేటంత వరకూ వెళ్ళింది. భీముడు కోపానికి ప్రతి రూపం. భీమ కోపం అంటుంటాం కదా! అలాంటి వాడికి తన భార్యని చెరబట్టాలని చూశాడనే కోపం కలిసింది. ఇక చెప్పాలా? అసలు కధలో భీముడు కేవలం చంపడంతో వదల్లేదు. అవయవ సంధులన్నీ చీల్చి ముద్ద ముద్దగా చేశేస్తాడు. అలాంటిది ఆ "మద్ది రాట పర్ర" సినిమాలో యంటీ వోడ్ని సత్తిగాడు గెలవటమా అనే లాజిక్కుకి మాత్రమే పనికొచ్చే యెదవ పని చేశాడు. కీచకుడ్ని చంపటానికి భీముడు బొడ్లో కత్తి దాచుకుని దాంతో పొడిచి చంపాడన్నట్టుగా చూపించాడు.ఆలోచించండి.మీ మీద నాకు ఈ కామెంటుని ప్రచురిస్తారా లేఅదా ఈయన దీన్ని పట్తించుకుంటారా లేదా అనే అనుమానం వస్తే అసలు ఇంత వివరంగా కామెంటుని వేసేవాడ్నే కాదు.

    అసలు ఆయా పాత్రల యొక్క మూల స్వరూపం తెలియని విధంగా జనం ఉంటే ఆ మరో కోణమే అసలు కోణం అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి మామూలు హాస్యానికి గురయ్యే విభీషణుడు అనే ఉత్తమ వ్యక్తిత్వం గల పాత్ర యెలా అవహేళనకు గురయిందో చూశారుగా.మనకన్నా హాలీవుడ్ వాళ్ళు మెరుగ్గా ఉన్నారు ఈ విషయంలో. నేను ఇప్పుడు టీవీ లో చూస్తున్న క్లాష్ ఆఫ్ థ టైటాన్స్ నీ ఇంకా వాళ్ళ పౌరాణికాల్ని వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నా ఆ కధల పట్ల వాళ్ళకి ఉన్న గౌరవాన్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది వాళ్ళ మీద.

    నేను మొదట్లో నాస్తికుడ్ని. ఆ నాస్తికపు రోజుల్లోనే విషవృక్షం చదివి అసహ్యించుకున్నా రామాయణాన్ని ఇలాగా విమర్శించేది అని. అప్పట్లో మార్క్సిశ్టు సాహిత్యమూ యెక్కువగానే చదివా. నాకు హిందూ ధర్మం మీద గౌరవం పెరిగింది పురాణ ప్రవచనాలు చెప్పే శాస్తుర్లు గారి లాంటి వాళ్ళ కాదు. మార్క్సిజం - భగవద్గీత లాంటి మంచి పుస్తకాలూ, రాహుల్ స్సాంకృత్యాయన్ పుస్తకాల వల్లనే.

    చాలా చోట్ల వస్తున్నాయి ఇలాంటి ప్రస్తావనలు, చిన్న చిన్న కామెంట్లు సరి పోవేమో - ఒక పోస్టుగా గుది గుచ్చి రాసే ఉద్దేశం ఉంది.చూద్దాం యెప్పుడు మొదలవుతుందో.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం