9, ఏప్రిల్ 2014, బుధవారం

తెలుగునేతతో అంతరాత్మ ఇంటర్వ్యూ!

తెలుగునేత ఈల వేస్తూ అద్దంలో తనను తాను చూసి ముసిముసిగా నవ్వుకున్నా డు. ఎంత కాలమైనా నేనేంటో ఎవరికీ తెలియదు. ఎవరికో ఎందుకు నా ఆత్మకు కూడా తెలియదు అని మనసులోని మాటను బయటికే అన్నాడు.
అంతరాత్మను కూడా నమ్మని నువ్వు ర్ర్ రోజు నన్ను పిలవడం సంతోషంగా ఉంది  పిలిచావు కదా వచ్చాను అని అంతరాత్మ అద్దంలో నుంచి మాట్లాడడం మొదలు పెట్టింది. తెలుగు నేతతో  అంతరాత్మ సంభాషణ ఇలా సాగుతోంది 

‘‘మంచి ఉషారు మీదున్నట్టున్నావు’’
‘‘ఔను చాలా రోజుల తరువాత..’’
‘‘మరి సరదాగా ఒక ఇంటర్వ్యూ చేయనా? ’’
‘‘నువ్వా ? నన్ను ఇంటర్వ్యూ చేస్తావా? ’’
‘‘నీ ముఖం ఏమడుగుతావు? అడుగు ?’’
‘‘ ఇంత కాలం అయినా తిండికి నోచుకోని పేదలను చూస్తే ఎవరికైనా జాలి వేస్తుంది కదా? పేదరికాన్ని ఎలా నిర్మిస్తావు? ’’
‘‘ పేదరిక నిర్మూలనకు తొలి సంతకం చేస్తా’’
‘‘ రైతు ఆత్మహత్యలకు అంతులేదు.’’
‘‘ రైతుల ఆత్మహత్యలను నిషేధిస్తూ రెండవ సంతకం చేస్తాను’’
‘‘ రైతులు, అప్పుల్లో కూరుకుపోయారు’’
‘‘ అప్పులన్నింటిని రద్దు చేస్తూ మూడవ సంతకం చేస్తా’’
‘‘ ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానంటున్నావు. కనీసం రెండు కోట్ల కుటుంబాలు ఉంటాయి కదా? ఉద్యోగాలు ఎలా ఇస్తావు’’
‘‘ ఏదో ఒక నాడు అందరికీ ఉద్యోగాలు అంటూ నాలుగవ సంతకం చేస్తాను’’
‘‘ 12 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అన్నావు కదా? ’’
‘‘ అవును దీనిపై ఐదవ సంతకం చేస్తాను’’
‘‘ అది సరే మీరు సంతకం చేస్తే పేదరికం ఎలా నిర్మూలన అవుతుంది.’’
‘‘ పదేళ్ల నుంచి ప్రభుత్వ ఫైళ్ల మీద సంతకం చేయక చేతులు దురద పెడుతున్నాయి.’’
‘‘గోక్కుంటే పోతుంది కదా? ’’
‘‘ ఇది మామూలు దురద కాదు .. పదవితో తప్ప దేనితోనూ దీన్ని గోక్కోలేం. దురద తీరేంత వరకు సంతకాలు చేస్తా అంతే.. సంతకాలు నేనే చేయాలి. సమస్యలను పెట్టుబడిగా పెట్టుకొని మన భవిష్యత్తు చూసుకోవాలి కానీ నువ్వెవడవయ్యా బాబు నన్ను సమస్యను పరిష్కరించమంటావు.’’
‘‘సరే కొన్ని ప్రశ్నలు అడుగుతాను నిజాయితీగా చెబుతావా?’’
‘‘  ఏ పార్టీ అయినా కావచ్చు , వై నాయకుడైనా కావచ్చు రాజకీయ నాయకుడు నిజాయితీగా చెబుతాడు అనే మాట నువ్వు నమ్ముతావా? అయితే చెబుతా అడుగు? ’’
‘‘ఎన్నికల్లో ఏ సంవత్సరంలో ఏమన్నావో చెప్పమంటావా? ఆ రోజు నేనడిగిన ప్రశ్న, నువ్వు చెప్పిన సమాధానం కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది చెబుతా విను.’’
***
‘‘బిజెపితో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు?’’
‘‘దేశ ప్రయోజనాల కోసం(2014)’’
‘‘వామపక్షాలతో ? ’’
‘‘దేశ ప్రయోజనాల కోసం ’’
‘‘మరి టిఆర్‌ఎస్‌తో పొత్తు ఎందుకు పెట్టుకున్నట్టు ?’’
దేశ ప్రయోజనాల కోసమే (2009)
‘‘ అంతకు ముందు ఏమన్నారు?’’
‘‘మసీదులను కూల్చే పార్టీ అధికారంలోకి వస్తే దేశం అల్లకల్లోలం అవుతుంది. దేశ ప్రయోజనాల కోసమే వామపక్షాలతో కలిసి వెళుతున్నాం (1998)’’
‘‘మసీదులను కూల్చే పార్టీతో మీకు పొత్తేంటి?
కాంగ్రెస్ నుంచి దేశాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. దేశ ప్రయోజనాల కోసమే బిజెపితో పొత్తు (1999)’’
‘‘దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం, మీ కోసం నేను ఉర్దూకూడా నేర్చుకుంటాను, బిజెపితో పొత్తు పెట్టుకోవడం నా రాజకీయ జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. దేశం కోసం బిజెపికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను (2004 ఎన్నికల తరువాత)’’
‘‘గుర్తు కొచ్చాయా? నువ్వన్నమాటలే’’


‘‘కాదని ఎవరన్నారు?’’
‘‘నా ప్రతి నిర్ణయానికి దేశ ప్రయోజనమే ముఖ్యం. భవిష్యత్తులో బిజెపిని వదిలి వామపక్షాలను కలిసినా, ఎన్‌డిఏను నట్టేట ముంచి థర్డ్ ఫ్రంట్ వెంట పడ్డా అన్నీ దేశ సంక్షేమం కోసమే.’’
‘‘ప్రతి ఎన్నికల్లో పార్టీలు మార్చడంలో దేశ సంక్షేమం ఏముంది? ’’
‘‘పిచ్చోడా! దేశం అంటే నువ్వేమనుకుంటున్నావు?’’
‘‘ దేశమంటే భారత దేశమే కదా? ’’
‘‘ తెలియక పోతే తెలుసుకోవాలి?’’
‘‘ ఓహో తెలిసింది... తెలిసింది. మీ దృష్టిలో దేశం అంటే తెలుగుదేశం’’
‘‘దేశం అంటే తెలుగుదేశం అని నేను చెప్పా నా? దేశ ప్రయోజనం అంటే నా దృష్టిలో నా ప్రయోజనం..నేను పదవిలో ఉండడమే దేశ ప్రయోజనం.అందుకోసం ఏమెట్లయితే నాకేం.. ’’


‘‘హమ్మా! ఇదా నీ ఆలోచన... ఈవిషయం ప్రజలకు చెప్పనా? ’’
‘‘చెబితే నిన్ను పిచ్చోడు అనుకుంటారు. నాకు బలం ఉంటే తెలంగాణను ఆపే వాడిని అని సీమాంధ్రలో చెప్పిన మరుసటి రోజే తెలంగాణకు వచ్చి నేనిచ్చిన లెటర్ వల్లనే తెలంగాణ వచ్చింది, నేనెప్పుడూ తెలంగాణ వాదినే అని చెప్పినప్పుడు నీకు అర్ధం అయి ఉండాలి నేనేంటో నా బలమేంటో? ఒకే సభలో కుడివైపు తెలంగాణ కోరుకున్న తెలంగాణ వారిని, ఎడమవైపు సమైక్యాంధ్ర కోరుకున్న సీమాంధ్రులను కూర్చోబెట్టి కుడి ఎడమలను రంజింప జేసే విధంగా మాట్లాడే సత్తా ఉన్న నాయకుడ్ని నేను... నాతో పెట్టుకోకు.’’


‘‘నీరహస్యాలన్నీ నాకు తెలిసిపోయాయి...’’
‘‘ నిజమే కానీ తెలిసినా ఏమీ చేయలేవు. నువ్వు నా అంతరాత్మవు , నా అనుమతి లేనిదే ఈ విషయాలను నువ్వు బయటపెట్టలేవు. ఆత్మతో కూడా రహస్యాలు పంచుకోవద్దనే సిద్ధాంతం నాది. ఇప్పటికే ఎక్కువగా మాట్లాడావు ఇక చాలు  లోపలికి వెళ్లు ’’

చివరి మాట తోటి నాయకులకు ఏమైనా సదేశం ఇస్తావా ?
నా జీవితమే నా సందేశం 
అది కాదు ఇంకో మాట చెప్పు 
రాజకీయాల్లో ఉన్నప్పుడు మనసులో మాట  బయటకు చెప్ప  వద్దు. చెప్పిన దానికి కట్టుబడి ఉండవద్దు 

1 కామెంట్‌:

  1. One time I will vote to X party another time I will vote to Y party. As a person I have freedom to vote any party. I may not vote every time to same party. Why cant a party can change poll alliance in each election. Let people will decide the alliance is right or wrong.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం