24, ఆగస్టు 2014, ఆదివారం

హిందీ సినిమా ప్రపంచాన్ని ఏలిన తెలుగు వాడు ..అతని జీవితం వారసులకు ఆస్తి పంపకం పై ఓ పాఠం

భారతీయ సినిమా చరిత్ర, అతని జీవిత చరిత్ర సమాంతరంగా సాగాయి.
సినిమా పుట్టినప్పుటి నుంచి నటించడం ప్రారంభించారు. 1909లో జన్మించి, 1995 వరకు నటిస్తూనే ఉన్నారు. అతని జీవితం సినిమా వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఒక చక్కని పాఠం.
హిందీ సినిమా తొలి లెజండర్... 50 మంది హేమా హేమీలైన హీరోయిన్లతో హీరోగా నటించారు. మూకీల కాలంలో మొదలైన అతని నటన 1995 వరకు సాగింది. రాజ్‌కపూర్ లాంటి వారికి దర్శకత్వం వహించారు. అతని జీవితం వారసులకు ఆస్తిని ఎలా ఇవ్వాలో సినిమా లోకానికి ఒక మంచి పాఠం చెప్పింది. ఎవరా నటుడు? ఏమా కథ తెలుసుకునే ముందు....
డబ్బు సంపాదన ఒక్కటే ముఖ్యం కాదు. సంపాదించిన డబ్బును జాగ్రత్త చేయాలని, సద్వినియోగం చేయాలి. చివరకు తన వారసులకు అప్పగించడం కూడా ఒక కళే. 13వ శతాబ్దానికి చెందిన కాశ్మీరుకు చెందిన సంస్కృత పండితుడు క్షేమేంద్రుడు చారుచర్య లో ఆ కాలంలోనే పిల్లలకు ఆస్తి ఎలా అప్పగించాలో చెప్పారు. పెద్ద వారు ఒకేసారి తమ వారసులకు తన సంపదనంతా అప్పగిస్తే ఇక ఆ తరువాత వాళ్లు పెద్దలను చూస్తారనే నమ్మకం లేదు. పోనీ ఆస్తి అస్సలు ఇవ్వను అంటే అడ్డు తొలగించుకోవడానికి దేనికైనా తెగిస్తారు. అందుకే కొంత ఆస్తి ఇచ్చి చివరి దశలో బాగా చూసుకుంటే మిగిలింది ఇస్తారు అనే అభిప్రాయం కలిగించాలంటాడు. దృతరాష్ట్రుడు పుత్ర ప్రేమతో రాజ్యం మొత్తం దుర్యోధనుడికి అప్పగిస్తే ఏమయింది. యుద్ధం వద్దురా అని మొత్తుకున్నా వినకుండా మొత్తం కౌరవుల నాశనానికి కారణమయ్యాడు. కొద్ది పాటి అధికారం మాత్రమే అప్పగించి ఉంటే మిగిలిన అధికారం కోసం దుర్యోధునుడు తండ్రి మాట వినివాడంటాడు.
మనం మన హిందీ లెజెండ్ దగ్గరకు వద్దాం. ఎందుకంటే అతను కూడా తన ఆస్తిని వారసులకు ఎలా అప్పగించాలో తెలియక పోవడం వల్ల అంతిమ దశలో కలలో కూడా ఊహించని నిరాదరణకు గురయ్యారు. .
***
దాదాసాహెబ్ పాల్కె అవార్డు పొందిన తొలి తెలుగు వారు ఎవరు? అంటే అక్కినేని నాగేశ్వరరావు అని చెబుతారు. అక్కినేనికి 1991లో దాదాసాహెబ్ పాల్కె అవార్డు లభిస్తే, దశాబ్దం ముందు 1980లోనే ఓ తెలుగు నటునికి దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది. తెలుగు వాడే అయినా ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు. 11 మూకీ సినిమాలు, 170 వరకు హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ సినిమాల్లో నటించిన జైరాజ్ ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమాలోనూ కనిపించక పోవడం విచిత్రం. పి జయరాజ్ పేరు వినగానే హిందీ సినిమాల గురించి కనీస పరిచయం ఉన్న పాత తరం వారు ప్రతి ఒక్కరూ అద్భుతమైన నటుడు అంటారు. పి జయరాజ్ అసలు పేరు జైరుల నాయుడు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో పుట్టిన పైడిపాతి జైరుల నాయుడు హిందీతో పాటు గుజరాతి, మరాఠీ భాషల సినిమాల్లోనూ నటించిన జయరాజ్‌ను తెలుగు సినిమా ప్రపంచం పట్టించుకోలేదు. ఆయనా తెలుగు సినిమాను పట్టించుకోలేదు. జైరాజ్ తన ఆత్మకథలో, తనపై నిర్మించిన డ్యాకుమెంటరీలో తాను కరీంనగర్‌లో జన్మించానని చెప్పేంత వరకు జైరాజ్ మూలాల గురించి సినిమా వారికి పెద్దగా తెలియదు.
సరోజినీనాయుడుకు దగ్గరి బంధువు అయిన జైరాజ్ పుట్టింది కరీంనగర్‌లో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో చదువుకున్నారు. వయసులో ఉన్నప్పుడు జైరాజ్‌కు ఇంగ్లాండ్ వెళ్లి చదువుకోవాలని ఆసక్తిగా ఉండేది. తల్లి తన అన్నకే ప్రాధాన్యత ఇస్తుందనే కోపంతో 1929లో ఇంట్లో నుంచి బొంబాయికి పారిపోయాడు. ఓడరేవులో పనికి కుదిరాడు. ఆయన సినిమా పోస్టర్లు వేసేవారు. ఆ సమయంలోనే అనేక మూకీ సినిమాల్లో నటించారు. రైఫిల్‌గర్ల్, బాబీ, హమారా బాత్ వంటి మూకీ సినిమాల్లో నటించారు. తరువాత స్వామి, తమన్న, హతిమ్‌తాయి సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించారు. తొలి తరం సౌందర్య రాశులు మీనా కుమారి, మధుబాల, సురయలతో నటించారు. దిలీప్‌కుమార్ సినిమాకు దర్శకత్వం వహించారు. జైరాజ్ నటించిన చివరి సినిమాల్లో ఒకటి ఖూన్‌బరీ మాంగ్. రేఖ, రిషికపూర్, కమల్ హసన్‌ల, డింపుల్ కపాడియాలతో కలిసి నటించారు. చిత్రంగా ఇదే పేరుతో జైరాజ్ ప్రారంభంలో ఒక సినిమా రూపొందించారు. అందులో భరత్‌భూషణ్, నర్గీస్‌తో పాటు జైరాజ్ నటించారు. చారిత్రక, పౌరాణిక సినిమాల్లో మంచి గుర్తింపు పొందారు. టిప్పుసుల్తాన్, హైదర్ అలీ బేగ్, రాణాప్రతాప్‌గా నటించి మంచి గుర్తింపు పొందారు. హిందీ సినిమా రంగంలో అత్యంత గౌరవం పొందిన నటుడాయన. ఆయన జన్మదినం రోజున ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు, సినీ ప్రముఖులంతా జైరాజ్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పేవారు. ఈ సంప్రదాయం చాలా కాలం వరకు సాగింది. క్రమంగా జైరాజ్ సినిమా ప్రపంచాన్ని వదిలి ఇంటికి పరిమితం అవుతూ వచ్చిన కాలం వరకు ఇది సాగింది.
కొత్త తరం వచ్చింది... కొత్త పోకడలు, జైరాజ్ ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. .
***
నా జీవితం చివరి దశలోఇంట్లో నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. అంటూ జైరాజ్ కోర్టులో వాపోవడం కంటతడిపెట్టించింది. హిందీ సినిమా ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన జైరాజ్ 91 ఏళ్ల వయసులో ప్రశాంతమైన జీవితం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా ఎంతో సంపాదించాడు. ముంబైలో ఎన్నో ఆస్తులు ఉన్నాయి. తన కుమారుడు దిలీప్‌రాజ్ వ్యాపారం ప్రారంభిస్తున్నానని చెప్పగానే ఆస్తులను అమ్మి ఇచ్చాడు. కుమారునిపై అజమాయిషీ చేసే వయసు కాదు అతనిది.
ఏదో కొత్త వెంచర్ ప్రారంభిస్తున్నాను , డబ్బు కావాలి అని కుమారుడు అడిగితే తండ్రి ఇవ్వలేదు. హాకీస్ట్రిక్ తీసుకొని కుమారుడు తండ్రిని కొట్టాడు. ఇంట్లోకి సందర్శకులు రావద్దని, ఫోన్ చేయవద్దని ఆంక్షలు విధించారు. దీంతో స్నేహితులు, పెద్దలు వచ్చి పంచాయితీ చేశారు. దిలీప్‌రాజ్‌ను ఇంటి నుంచి పంపించి వేశారు. కుమారుడి ఖర్చుల కోసం తండ్రి ప్రతి నెల డబ్బు ఇవ్వాలనే ఒప్పందం కుదిరింది. కొంత కాలం గడిచాక జైరాజ్ భార్య మరణించిన తరువాత దిలీప్‌రాజ్, ఆయన భార్య వచ్చి నార్త్‌వెస్ట్ ముంబైలోని ఫాలీ హిల్స్‌లోని జైరాజ్‌కు చెందిన ఫ్లాట్‌ను ఆక్రమించేసుకున్నారు. చివరకు జైరాజ్‌ను ఆయన ఇంట్లోనే బందీగా మార్చేశారు.
ఓ రోజు దిలీప్‌రాజ్ సోదరి గీతకు ఫోన్ చేసి తమ తండ్రి జైరాజ్ పదే పదే గుర్తు చేస్తున్నాడని చెప్పాడు. జైరాజ్ ఫోన్ తీసుకుని కన్నీరు పెడుతూ తనను హింసిస్తున్నారని ఎలాగైనా వచ్చి రక్షించమని కోరాడు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న తన తండ్రి దయనీయంగా ఏడవడాన్ని కూతురు తట్టుకోలేక పోయింది. కలకత్తాలో ఉన్న కూతురు వెంటనే ముంబై వచ్చింది. ఈ వయసులో నీ సహాయం కావాలి, వెంటనే రమ్మని తండ్రి కోరడంతో మరుసటి రోజే విమానంలో కుమార్తె ముంబై వచ్చింది. కనీసం సరైన దుస్తులు కూడా లేవు, గదిలో వాసన వస్తోంది, స్నానం చేసి ఎన్ని రోజులు అయిందో అనిపిస్తోంది. వెంటనే డాక్టర్‌ను పిలవడంతో ఆయన చికిత్స ప్రారంభించారు. నాన్న కోసం కొన్ని బట్టలు కొనుక్కొచ్చాను. రెండు నెలల పాటు నేను ఇంట్లోనే ఉండి తండ్రిని చూసుకున్నాను కానీ కుమారుడి నుంచి సరైన సహాయం లేదు. కనీసం మాకు తిండికూడా పెట్టలేదు. నేను వండుకోవడం లేదా, హోటల్ నుంచి తెప్పించుకోవడం చేశాను. అమెరికాలో ఉన్న మరో సోదరుడు వచ్చి చూశాడు కానీ తిరిగి వెళ్లక తప్పని పరిస్థితి కాబట్టి వెళ్లిపోయాడు. చూసి పోదామని వచ్చాను కానీ పరిస్థితి చూశాక ఇలా వదలివెళ్లలేక పోయాను అంటూ జైరాజ్ కుమార్తె గీత జరిగిన విషయం కోర్టుకు చెప్పింది. నా చివరి రోజులు ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. అంటూ జైరాజ్ న్యాయమూర్తికి చెప్పారు. ఆ ఫ్లాట్‌పై తండ్రికే అధికారం ఉందని, కుమారుడు రోజుకు ఒకసారి చూసి వెళ్లడం తప్ప అక్కడ ఉండేందుకు వీలు లేదని కోర్టు ఆదేశించింది. ఆ తరువాత జైరాజ్ ఎక్కువ రోజులు బతకలేదు. 2000 సంవత్సరం ఆగస్టు 11న జైరాజ్ కన్ను మూశారు.
ఆస్తులు పెంచుకోవడమే కాదు పిల్లలకు తల్లిదండ్రులపై అభిమానం అనే డిపాజిట్ కూడా పెంచుకోవాలి.

*

3 కామెంట్‌లు:

  1. కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్.....

    రిప్లయితొలగించండి
  2. జైరాజ్ తెలుగు వాడని అన్నిభాషల సినిమాలలోే నటించాడని తెలిసి సంతోషించినా అతడి జీవిత చరమాంకంలో పడ్డ కష్టాలు వింటుంటే చాలా బాధ అనిపించింది. శ్రీ మురళి గారికి దన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. మానవ సంబంధాలను డబ్బు సంబంధాలు దారుణంగా మార్చడం అనేది జైరాజ్ ఉదంతం మరో ఉదాహరణగా తెలుపుతోంది. జైరాజ్ మన తెలుగువాడని తెలిపిన మురళీ గారికి ధన్యవాదములు. సినిమావారి జీవితాలనుండి అందరికీ పాఠాలు నేర్పేలా పోస్టులు అందిస్తున్న మురళీ గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం