5, ఆగస్టు 2014, మంగళవారం

సినీ పితామహుని దయనీయ జీవితం

అది భారతీయ సినిమా రజతోత్సవ వేడుకల వేదిక ... అట్టహాసంగా సాగుతోంది. ఆడిటోరియంలో ఒక మూల ఆనామకుడిగా ఒక వ్యక్తి కూర్చున్నారు. అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. అతనూ అవేమీ పట్టించుకోకుండా రజతోత్సవ వేడుకలను తిలకించడంలో మునిగిపోయారు. వి.శాంతారాం అతన్ని చూశారు. తనను తాను నమ్మలేకపోయారు. కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. అతను అనామకుడు కాదని భారతీయ సినిమా పితామహుడని, ఇప్పుడు తాము అనుభవిస్తున్న సినిమా స్టాటస్‌కు మూల పురుషుడు అతనే అని గుర్తుకు వచ్చి ఆ మహనీయున్ని వేదికపైకి తోడ్కొని వచ్చారు. అనామకునిలా ఆడిటోరియంలో కూర్చున్న ఆ మహనీయుడే దాదా సాహెబ్ ఫాల్కే.
***
‘‘బతికే పరిస్థితి లేదు.. చనిపోయేందుకు విషం కొందామన్నా డబ్బులు లేవు’’
తన తండ్రి రాసిన ఉత్తరాన్ని అతని కుమారుడు ఇంక చదవలేకపోయాడు. కన్నీళ్లు కార్చాడు... అంతకు మించి ఏమీ చేయలేడు కూడా ఎందుకంటే అతని వద్ద కూడా డబ్బేమీ లేదు
ఈ సీన్ సినిమాలో అయితే అద్భుతంగా పండుతుంది. ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించవచ్చు. ఆ కన్నీళ్ల నుంచి కాసులను కూడా కురిపించవచ్చ.
ఇది సినిమానే జీవితంగా భావించిన భారతీయ సినిమా పితామహుని నిజ జీవిత విషాద దృశ్యం. తన దీన పరిస్థితిని వివరిస్తూ ఫాల్కే తన కుమారుడు బాలచంద్రకు అంతిమ దశలో రాసిన ఉత్తరం సారాంశం.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దేశంలో సినిమా రంగానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం. కానీ దుండిరాజ్ గోవింద్ ఫాల్కే ఉరఫ్ దాదా సాహెబ్ ఫాల్కే జీవితం మాత్రం అత్యంత విషాదకరంగా ముగిసింది.
ఈ ఉత్తరంలోని రెండు ముక్కల సమాచారం అతని జీవిత కథను, వ్యథను మొత్తం తెలుపుతోంది.
రాజా హరిశ్చంద్ర తొలి భారతీయ సినిమా. ఆ సినిమాకు సర్వస్వం ఫాల్కేనే. ఆయన మరణించినప్పుడు చాలా పత్రికల్లో ఆ వార్త కూడా రాలేదు. ఆయన అంత్యక్రియలకు 10- 12 మంది మాత్రమే వచ్చాయి. సంతాప సూచకంగా ఒక్క సినిమా హాలు కూడా మూయలేదు. హాలులో సినిమాలో అలానే నడుస్తున్నాయి, కానీ దేశానికి సినిమాను పరిచయం చేసిన ఆయన మాత్రం నిశ్శబ్దంగా ప్రకృతిలో కలిసిపోయారు.
***
60 ఏళ్ల వరకు సినిమాలో హీరో వేషాలు. ఆ తరువాత రాజకీయ ప్రవేశం .... ఎన్టీఆర్ నుంచి చిరంజీవి.. బాలకృష్ణ వరకు హీరోలు అనుసరించే ఫార్ములా ఇదే. హీరోలు తమ పాపులారిటీని చివరి వరకు ఉపయోగించుకుంటారు. 60 నుంచి హీరోల రిటైర్‌మెంట్ వయసు 55కి తగ్గి ఉండవచ్చు కానీ ఫార్ములా మాత్రం మారలేదు. ఈ తరం మరింత ముందు జాగ్రత్తగా ఉంటోంది. ఉండాలి కూడా... ఒక్కరు హీరో అయితే మొత్తం బంధు వర్గంలోని యువకులందరినీ హీరోలను చేస్తున్నారు. ఈ తరం మరింత ముందు జాగ్రత్తగా ఉంటోంది. నాలుగైదు సినిమాల్లో నటించిన చిరంజీవి కుమారుడు రాంచరణ్ విమానయాన రంగంలో ప్రవేశించారు. జీవితం పట్ల అవగాహన పెరిగింది .. పెరగాలి కూడా.. కాలం మారింది వయసులో ఉన్నప్పుడే భవిష్యత్తు జీవితం గురించి జాగ్రత్త పడుతున్నారు. జాగ్రత్త పడాలి కూడా..
భారతీయ చలన చిత్ర పితామహుని కాలంలో సినిమాను ప్రేమించడం తప్ప ఇలాంటి ముందు జాగ్రత్తలేమీ లేవు. సినిమానే జీవితంగా బతకడమే ఆయన చేసిన పెద్ద తప్పయింది. సినిమా వేరు జీవితం వేరు.. సినిమాకు సర్వస్వం అర్పించడం కాదు, సినిమా నుంచి ఎంత పిండుకుందామనే ఆలోచన లేకపోవడమే ఆయన చేసిన తప్పయింది.
***
దాదాసాహెబ్ ఫాల్కే సంస్కృత పండితుని కుమారుడు. 1870లో నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లో జన్మించారు. బొంబాయిలోని జెజె కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో, బరోడాలోని కళాభవన్ విద్యార్థి. మంచి చిత్రకారుడు, నాటకాల్లో మేకప్ వేశారు. మంచి మెజీషియన్ కూడా... ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. ఆ కాలంలోనే ప్రింటింగ్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం జర్మనీ వెళ్లాలనుకున్నారు. సినిమాకు సంబంధించిన వార్త ఒకటి పత్రికలో వచ్చింది. తనను ఆ వార్త బాగా ఆలోచింపజేసింది. మన దేశంలో కూడా సినిమాను ఎందుకు తీయకూడదు అనే ఆలోచన అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. తన వద్ద ఉన్న డబ్బు, మిత్రుల నుంచి తీసుకున్న అప్పు , జీవిత బీమా డబ్బు మొత్తం తీసుకొని సినిమా నిర్మాణానికి సంబంధించిన పరికరాలు కొనడానికి 1912లో ఇంగ్లాండ్ వెళ్లారు.
అయితే ఫాల్కేకు తాను చరిత్ర సృష్టించబోతున్నానని తెలియదు, అదే తన జీవితాన్ని పేదరికంలోకి నెట్టివేస్తుందనీ ఊహించలేదు.
***
ఫాల్కే 1913లో రాజా హరిశ్చంద్ర, ఆదే సంవత్సరం మోహినీ భస్మాసుర, సత్యవాన్ సావిత్రి (1914) శ్రీకృష్ణ జననం (1918) కాళీయ మర్దన్ (1919) నిర్మించారు. ఆ తరువాత సినిమా రంగంలో క్రమంగా వ్యాపార ధోరణి మొదలైంది. దాంతో పాల్కే పక్కకు తప్పుకున్నారు. సినిమా ప్రేమ ఆయన్ని నిలువనివ్వలేదు. తన పలుకుబడి, పరిచయాలు ఉపయోగించి నిధులు సమీకరించి 1937లో గంగావతరణ సినిమా తీశారు. నిండా మునిగిపోయారు.
సినిమాను వ్యాపారంగా చూసి ఉంటే ఆయన పరిస్థితి బాగానే ఉండేది. సినిమాను విపరీతంగా ప్రేమించి దెబ్బతిన్నారు. తన వారసులను పేదరికంలోకి నెట్టేశారు. ఆయన దేశానికి తీసుకు వచ్చిన సినిమాతో సినీ వ్యాపారులు కోట్లు సంపాదించారు. పాపులారిటీని, రాజకీయాల్లో పదవులు సంపాదించారు కానీ ఫాల్కే మాత్రం కఠిక దరిద్రంలో మరణించారు. ఆయన కుమారుడు ముంభై వీధుల్లో చిల్లర వ్యాపారిగా జీవితం గడిపారు.
బాగున్న రోజుల్లో ఫాల్కే ఫోర్డ్ కారును ఉపయోగించేవారు. 1920 ప్రాంతంలో ఆ కారులోనే షూటింగ్‌కు వెళ్లేవారు. తిరిగి సినిమా తీయాలని నిర్ణయించుకున్న కాలంలో దాన్ని అమ్మేశారు. ఆ కారు పెళ్లిళ్ల ఊరేగింపునకు ఉపయోగించారు. ఐదేళ్ల క్రితం ఈ కారు నాసిక్ డంప్ యార్డ్‌లో లభించింది. తొలి భారతీయ సినిమా కెమెరాను ఫాల్కే జర్మనీ నుంచి తెప్పించారు. అదేమైందో ఇప్పుడు ఎవరికీ తెలియదు. సినిమా నిర్మాణానికి ఎలాంటి ఏర్పాట్లు లేని కాలంలో ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఫాల్కే తొలి సినిమా తీశారు. ఫాల్కే భార్య సరస్వతి భారతీయ తొలి సినిమా రాజా హరిశ్చంద్ర నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. ఆమెనే తొలి భారతీయ సినిమా టెక్నీషియన్. సరస్వతి షూటింగ్ సమయంలో వెలుతురు కెమెరాపై పడకుండా బెడ్ షీట్‌ను అడ్డుగా పట్టుకుని ఉండేవారట. షూటింగ్‌కు కావలసినవన్నీ సమకూర్చేవారు. రాత్రి పూట క్యాండిల్ వెలుగులోనే ఈ సినిమాకు సంబంధించిన సాంకేతిక పనులు నిర్వహించేవారు. సినిమా బృందం 60-70 మందికి ఆమెనే వంట చేసి పెట్టేవారు. రాజా హరిశ్చంద్రలో హరిశ్చంద్రుని కుమారునిగా ఫాల్కే కుమారుడు బాలచంద్ర నటించారు. తొలి భారతీయ బాలనటుడు అతనే. శ్రీకృష్ణ జననం, కాళీయ మర్దన్‌లో బాల శ్రీకృష్ణునిగా మందాకిని నటించారు. ఆమె ఫాల్కే పెద్ద కూతురు. ఆమెనే తొలి భారతీయ బాలనటి.
***
భారతీయ సినిమా రజతోత్సవ వేడుకల్లో దాదాసాహెబ్ ఫాల్కే ఒక అనామకుడిగా కూర్చోవడం చూసిన శాంతారాం ఆయన్ని గుర్తించి వేదికపైకి తీసుకు పోయి 1938లో అప్పటికప్పుడు వేదికపై ఐదువేల రూపాయల పర్స్ అందజేశారు. ఆ డబ్బుతో ఫాల్కే తిరిగి సినిమా తీస్తాడేమోనని చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే సినిమా అంటే ఆ మహనీయునికి అంత పిచ్చి. అందరూ ఒత్తిడి తెచ్చి ఆ డబ్బుతో నాసిక్‌లో ఒక ఇంటిని కొనిపించారు. అప్పటి వరకు ఫాల్కేకు సొంత ఇల్లు కూడా లేదు. ఆ ఇంటిలోనే తుది శ్వాస విడిచారు.

4 కామెంట్‌లు:

 1. మంచి వ్యాసం వ్రాసారు. pathetic చివరి రోజులు.
  ఆయన లెజెండ్ అంటే (నిజానికి ఫాల్కే గారిని పయనీర్ pioneer అనాలి). ఇప్పటి వారేమో తమని లెజెండ్ అని ఎందుకు పిలవట్లేదని డిమాండ్.

  రిప్లయితొలగించండి
 2. నిజమైన కళా సేవ అంటే ఫాల్కే లంటి వారు చేసినదే.నేటి హీరోలు మేం కళా సేవ చేస్తున్నామంటే నవ్వు వస్తుంది. శ్రీ ఫాల్కే గారి గురించి తెలియని విషయాలు తెలియజేసినందుకు దన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 3. తను ప్రాణంగా భావించిన చలనచిత్రసీమకి , తన ప్రాణాన్నర్పించారు దాదా సాహెబ్ ఫాల్కే .
  తన చరిత్రను ముందు తరాల నటుల జీవితాలకు చక్కని గుణపాఠమై నిలిచి పోయింది . తను పోయినా , తన పేరు మాత్రం చిరస్థాయిగా వుండిపోయింది .

  ఈ విషయాన్ని నటులే కాదు , ప్రతి మనిషీ ఏ రంగంలోని వారైనా తెలుసుకొని మసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది .

  రిప్లయితొలగించండి

 4. ఫాల్కే గారి చివరి రోజుల సంగతి తెలియదు.తెలిపినందుకు ధన్యవాదాలు.కనీసం శాంతారాం గారు గుర్తించి స్వంత ఇల్లు ఏర్పాటుచేయించినందుకు అభినందించాలి.మిగతా పరిశ్రమ కూడా ఆయనకు ఆర్థిక ,వైద్య సహాయం అందించిఉంటే బాగుండేది.ఇప్పుడే కాస్త నయమేమో.వృద్ధ కళాకారులకు పరిశ్రమ వాళ్ళు కొంత పెన్షన్ల రూపంగా సహాయమందిస్తున్నారు.

  రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం