26, అక్టోబర్ 2014, ఆదివారం

తెలుగులో తొలిసారిగా స్టార్ ఇమేజ్ పొందిన హాస్యనటి గిరిజ విషాద జీవితం-...ధనం -మూలం 16


పాతాళభైరవిలో ఎన్టీఆర్‌ను నరుడా ఏమీ నీ కోరిక అని అడిగేది ఎవరో గుర్తుందా? ఆమె గిరిజ. ఎన్టీఆర్‌ను ఏమీ నీ కోరిక అని దేవతగా అడిగిన గిరిజకు నిజజీవితంలో మాత్రం ఏ దేవుడు దయనీయమైన స్థితిలో ఉన్న ఆమె జీవితాన్ని కాపాడలేకపోయారు. దేవతా ఏమి నీ కోరికా అని అడగలేదు . 

సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టు అని రేలంగి పాడితే కంపు కొట్టు ఈ సిగరెట్టు కాల్చకోయి నాపై ఒట్టు అని గిరిజ ఒక్క ముక్కలో సిగరెట్టు బడాయిని తీసిపారేస్తుంది.


కాశీకి పోయాను రామా హరి గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి అని రేలంగి అంటే కాశీకి పోలేదు రామా హరి ఊరి కాల్వలో నీళ్లండి... మురికి కాల్వలో నీళ్లండి రామా హరి అని గిరిజ రేలంగి కపట సన్యాసాన్ని బయటపెట్టేస్తుంది. ఈ పాటలు గుర్తున్నాయా?
ఆ పాటల్లోనే కాదు అన్ని సినిమాల్లోనూ ఆమెది సరదా పాత్రలే. సినిమాలో నవ్వించడమే కాదు. నిజ జీవితంలో సైతం ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది. చిన్నా పెద్దా అందరినీ నవ్వుతూ పలకరించేది. రేలంగి, గిరిజ ఉన్నారంటే ఆ సినిమా గ్యారంటీ హిట్టు అనే గట్టి నమ్మకం ఉండేది ఆ రోజుల్లో.
సినిమాల్లో ఆమెది ఎంత సరదా పాత్రనో, సినిమా వైభవం ముగిశాక నిజ జీవితంలో అంత విషాద ముగింపు ఆమె కథ.

***
గిరిజ ఎవరో ఈ తరం వారికి తెలియక పోవచ్చు. తెలుగులో తొలిసారిగా స్టార్ ఇమేజ్ పొందిన హాస్యనటి. ఇప్పుడు మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ ఎంత గొప్ప హీరోలైనా కావచ్చు ఆ సినిమా హిట్టు కావాలంటే బ్రహ్మానందం ఉండాల్సిందే.. అలానే 50-60 ప్రాంతాల్లో సినిమా సూపర్ హిట్టు కావాలంటే రేలంగి, గిరిజ జంట ఉండాల్సింది. వీరుంటే సినిమా హిట్టు అని ఆ కాలం నాటి తెలుగు సినిమా సక్సెస్ ఫార్ములా . హాస్యనటిగా నటిస్తూనే ఎన్టీఆర్, ఎన్‌ఆర్ లాంటి అగ్రనటులతో హీరోయిన్‌గా నటించిన ఘనత ఆమెదే. గిరిజ తల్లి ప్రముఖ రంగస్థల నటి దాసరి తిలకం. ఆమె సినిమాల్లో కూడా నటించింది. 1946లో వచ్చిన వరూధినిలో ఆమెలో నటించారు. గిరిజ కుమార్తె శ్రీరంగ దాసరి నారాయణరావు నిర్మించిన మేఘసందేశంలో అక్కినేని నాగేశ్వరరావు కుమార్తెగా నటించింది. మూడు తరాల నట కుటుంబంగా తొలి ఘనత ఆమెదే. కానీ ఏం లాభం సినిమాల్లో సంపాదించిందంతా సినిమాలకు అర్పితం చేసి ఏమీ నిరుపేదగా జీవితాన్ని ముగించింది.

***
ఆనాటి సినీనటి గిరిజ జీవితంలో రీళ్లు చాలా వేగంగా కదిలిపోయాయి. మహారాణిలా జీవించిన గిరిజ సినిమా కథలానే ఊహించని మలుపులతో ఇల్లు గడవడం కోసం చేయి చాచాల్సిన స్థితిలో పడిపోయింది.
ఆమె ఎక్కువగా హాస్య ప్రధానమైన పాత్రల్లోనే నటించింది. కోట్లాది మందిని దశాబ్దాల పాటు నవ్వుల్లో ముంచెత్తింది. కష్టాలు మరిచిపోయి ఆ మూడు గంటల పాటైనా నవ్వుకునే అవకాశం ఆమె సినిమాల్లో దొరికేది. కానీ చివరకు ఆమె జీవితం మాత్రం విషాదంగా ముగిసిపోయింది.
***
‘‘మా కాలంలో తల్లిదండ్రులే అన్ని వ్యవహారాలు చూసుకునే వారు. ఇప్పుడున్నట్టుగానే భవిష్యత్తు ఉంటుందనే భరోసా లేదు, భవిష్యత్తు గురించి ఆలోచించాలి అనే ఆలోచనలు మాకు ఉండేవి కాదు అంతా తల్లిదండ్రులు చూసుకుంటున్నారు అనుకునే వాళ్లం. ఆమె ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉండేది. గిరిజకు పెళ్లయిన తరువాత గిరిజ భర్త దర్శకత్వంలోనే ఆమె జీవితం సాగింది. మద్రాస్‌లో పెద్ద భవంతి కూడా ఉండేది. అంతా పోయింది. గిరిజ జీవితం ఇలా అయిపోయింది అని షూటింగ్‌లో ముచ్చట్లు వినిపించేవి.’’ అంటూ ఆమె సహనటి ఒకరు గిరిజ గురించి చెప్పారు.
గిరిజ 17 ఏళ్ల వయసులో ఉండగా, తల్లి మరణించింది. ఒక్క క్లిక్‌తో ప్రపంచంలోని సమాచారం మొత్తం కళ్ల ముందు కనిపించే ఈ కాలంలోనే ఐటి ఉద్యోగికి సైతం మనీ మేనేజ్‌మెంట్ గురించి తెలియదు. ఇక 17 ఏళ్ల వయసులో తల్లి మరణించింది. తళుకుబెళుకుల సినిమా ప్రపంచంలో రారాణిగా వెలిగిపోతున్న గిరిజకు మనీ మేనేజ్‌మెంట్ ఎలా తెలుస్తుంది. తెలియకపోవడమే ఆమె పాలిట శాపం అయింది.

తొలి కామెడీ స్టార్ కస్తూరి శివరావు 1950లో తానే దర్శకత్వం వహించి నిర్మాతగా పరమానందయ్య శిష్యుల కథ సినిమా తీశారు. అదే గిరిజకు తొలి సినిమా. అందులో అక్కినేని హీరో, గిరిజ హీరోయిన్. వైభోగాన్ని అనుభవించిన కస్తూరి శివరావు జీవిత చరమాంకంలో దుర్భర దారిద్య్రాన్ని అనుభవించారు. అందులో హీరోయిన్‌గా నటించిన గిరిజ జీవితం కూడా దాదాపు అలానే ముగిసింది. హాస్యనటి గానే కాకుండా అగ్ర నటులు ఎన్టీఆర్ మంచిమనసుకు మంచిరోజులు, ఏఎన్‌ఆర్‌తో వెలుగునీడలు, శివాజీ గణేశన్‌తో మనోహర, హరనాథ్‌తో మా ఇంటి మహాలక్ష్మి వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆనాటి అగ్ర నటులతో పోటీపడి నటించడమే కాదు ఆమె సంపాదన కూడా అలానే ఉండేది.
సియస్‌రాజు అనే దర్శకుడ్ని ఆమె పెళ్లి చేసుకుంది.

పరిస్థితుల్లో క్రమంగా మార్పు... కొత్త వారు రంగ ప్రవేశం చేశారు. మార్పును గిరిజ కొంత వరకు అర్థం చేసుకుంది. కొత్త నీరు వచ్చింది తాను తప్పుకోవాలి లేదా తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. అంత వరకు బాగానే ఉంది కానీ భవిష్యత్తుపై దృష్టిపెట్టి రేపటి కోసం పెట్టుబడి అనే ఆలోచన చేయలేదు. అప్పటి వరకు సంపాదించిన ఆస్తిని వేగంగా కరిగిపోతుంటే చూస్తూ ఉండిపోయింది. మారిన పరిస్థితులను గ్రహించిన గిరిజ ఇక ఒక ఇంటి దాన్ని కావాలనుకుంది. కానీ భర్తను నిర్మాతగా నిలబెట్టాలని ప్రయత్నించి తాను రోడ్డున పడింది.

సి సన్యాసి రాజు గిరిజ భర్త. విజయగిరి ధ్వజాప్రొడక్షన్స్‌ను స్థాపించి 69లో ఎన్టీఆర్, కాంచన, అంజలితో భలే మాస్టారు సినిమా తీశారు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచింది. 1971లో ఎన్టీఆర్ చంద్రకళతో పవిత్ర హృదయాలు తీశారు. ఆ సినిమా అంతే. గిరిజ ఆస్తులు వేగంగా కరిగిపోవడం ప్రారంభమైంది. మద్రాస్‌లో ఆమెకు రెండంతస్థుల విశాలమైన భవనం ఉండేది. ఆమె భర్త నిర్మాతగా మారిన తరువాత ఆ భవనం చేజారిపోయింది. ఆమె అప్పుల్లో కూరుకు పోయింది. రేలంగి మరణించిన తరువాత ఆమెకు సినిమాల్లో అవకాశాలే కరువయ్యాయి.

1937లో పుట్టిన గిరిజ గుడివాడలో పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకునేది. 13 ఏళ్ల వయసులో మద్రాస్‌లో తల్లి వద్దకు వెళ్లింది. అందంగా ఉన్న ఆమె ఆ చిన్న వయసులోనే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపింది. కస్తూరి శివరావుకు ఫోటోలు చూపితే ఏకంగా పరమానందయ్య శిష్యుల కథలో రాజకుమారిగా అక్కినేని సరసన అవకాశం కల్పించారు. ఆ సినిమా అంతంత మాత్రంగానే నడిచినా రేలంగి పరిచయమయ్యారు. ఆయన ప్రయత్నంతోనే పాతాళభైరవిలో అవకాశం వచ్చింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. హీరో, హీరోయిన్‌లతో సమానంగా గుర్తింపు పొందారు.
అచ్చం సినిమా కథలా పెద్ద భవంతిని వదిలి చిన్న అద్దె గదిలోకి మారింది. పూట గడవడానికి కూడా తెలిసిన వారి ముందు చేయి చాచాల్సిన పరిస్థితి. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. గిరిజ తారగా ఒక వెలుగు వెలిగే కాలంలో ఆమె వైపు చూసేందుకు కూడా సాహసించని అనారోగ్యం, పేదరికం, చివరి రోజుల్లో మాత్రం ఆమెను అంటిపెట్టుకొని ఉన్నాయి. తెలిసిన వారు కూడా గుర్తు పట్టలేని స్థితి. ఆ తరం నటీమణులు రాజశ్రీ, భీష్మ సుజాత వంటి వారు ఎంతో కొంత సహాయం చేసి ఆదుకున్నారని సినిమా వాళ్లు చెబుతారు.
గిరిజా ఏమీ నీ కోరిక అని చివరి దశలో ఆమెను తోటి నటులు అడిగి ఉంటే బాగుండేది. కనీసం ప్రశాంతంగా కన్ను మూసి ఉండేది.

డబ్బును మనం గౌరవిస్తే అణకువగా సేవకునిలా ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ఎంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటుందో కొందరు సినిమా వారి జీవితాలను చూసి నేర్చుకోవచ్చు. * 

1 కామెంట్‌:

మీ అభిప్రాయానికి స్వాగతం