23, నవంబర్ 2014, ఆదివారం

ఆ నటుడు బిచ్చగాడయ్యాడు



సినిమా నటుడు అంటే జనంలో బోలెడు క్రేజీ. కనిపిస్తే చాలు ఆటోగ్రాఫుల కోసం వందల చేతులు పోటీ పడుతుంటాయి. అలాంటి నటుడే వందలాది ముందు బిక్షం వేయమని చేయి చాస్తే.... అలాంటి నటుడు ఫుట్‌పాత్‌పైనే తన జీవితాన్ని చాలించాడు అని, చివరకు భార్యా పిల్లలు కూడా చివరి దశలో చూసేందుకు రావడానికి ఇష్టపడలేదు అంటే ఊహించడానికే కష్టంగా ఉంటుంది కదూ! చాలా మంది జీవితాల్లో సినిమాల్లో కన్నా ఊహించని మలుపులు ఉంటాయి.
***

54ఏళ్ల యువరత్న బాలకృష్ణ కన్నెర్ర చేయగానే వేగంగా వస్తున్న రైలు తోక ముడిచి వెనక్కి వెళ్లింది. బాలకృష్ణ ప్యారాచూట్ వేసుకుని పాకిస్తాన్‌లో దిగి ఒంటి చేత్తో ఆ దేశ సైన్యాన్ని మట్టికరిపించాడు. మన హీరోలు అందరూ అంతే.  ...   మరి నిజ జీవితంలో..హీరోల కన్నా శక్తివంతమైనది ఒక చిన్న వ్యసనం. ప్రముఖ నటునిగా ఒక వెలుగు వెలిగిన వారిని సైతం బిక్షగాళ్లుగా మార్చేసేంత శక్తివంతమైనది ఆ చిన్న వ్యసనం.
ఒక్కసారి నన్ను పూర్తిగా నమ్మి నీ జీవితాన్ని నాకు అప్పగించు. ఆ తరువాత నీ జీవితాన్ని నడిపించే బాధ్యత నాదీ అని మద్యం మనిషికి గట్టి నమ్మకాన్ని ఇస్తుంది. ఆ మాటను నమ్మిన వారి జీవితాన్ని మద్యమే నడిపిస్తుంది.
***
దాదాపు మూడు దశాబ్దాల సినిమా జీవితం. విలన్‌గా ఒక వెలుగు వెలిగిన నటుడు రోడ్డుమీద బిక్ష మెత్తుకుని బతికాడు.. అలా రోడ్డుమీదనే కన్ను మూశాడు. ఆయన మరణ విషయం తెలిసినా భార్యా, కుమారుడు భౌతిక కాయాన్ని చూసేందుకు కూడా రాలేదు. అంటే నమ్మగలమా? నమ్మి తీరాలి. ఆయన జీవితం నుంచి గుణపాఠాన్ని నేర్చుకోవాలి.
***
పరశురామ్ ఒకప్పటి బాలీవుడ్ ఫేమస్ విలన్... అంతకు ముందు బాల నటుడు. మంచి గాయకుడు. మనకు ఆయన పేరు తెలిసి ఉండక పోవచ్చు. మనం ఆయన సినిమాలు చూసి ఉండక పోవచ్చు. తెలియాల్సిన అవసరం కూడా లేదు. శాంతారామ్, రాజ్‌కపూర్ లాంటి వారు మెచ్చుకున్న ప్రతిభావంతుడైన నటుడి జీవితం చివరకు ఫుట్‌పాత్‌పై ఎందుకు ముగిసింది. భార్యా పిల్లలు కడ చూపు కోసం కూడా ఎందుకు రాలేదు.
***
దేశంలో బుల్లితెరపై తొలిసారిగా టాక్‌షోను ప్రారంభించింది. తబస్సుమ్. 1947లో బాలనటిగా సినిమా రంగంలోకి ప్రవేశించిన ఆమె ఆ తరువాత 70వ దశకంలో దూరదర్శన్‌లో ఫూల్‌కిలే గుల్షన్ గుల్షన్ కార్యక్రమం ద్వారా టాక్ షోలు నిర్వహించారు. ముంబైలో ఓ రోజు తబస్సుమ్ కారులో వెళుతుండగా, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బిక్షమెత్తుకుంటున్న ఒక వ్యక్తిని చూసి ఆమె నిర్ఘాంత పోయింది. తన కళ్లు తనను మోసం చేస్తున్నాయేమో అనుకుంది. కారు ఆపి దగ్గరకు వెళ్లి చూసింది. నిజమే ఆ బిక్షగాడు ఒకప్పటి గొప్ప నటుడు. ప్రభాత్ స్టూడియోలో బాల నటునిగా నట జీవితాన్ని ప్రారంభించి, ఆ కాలంలో టాప్‌మోస్ట్ విలన్‌గా ఎదిగిన పరశురామ్. కొన్ని సినిమాల్లో అతని కుమార్తెగా నటించిన తబస్సుమ్. అతన్ని గుర్తు పట్టింది. అతన్ని తన కారులో ఎక్కించుకొని స్టూడియోకు తీసుకు వెళ్లింది. దూరదర్శన్‌లో పరశురామ్ ఇంటర్వ్యూ ప్రసారం చేశారు.
అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్‌తో సహా సినిమా అభిమానులు ఎంతో మంది స్పందించి సహాయం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పరశురామ్‌కు సహాయం చేశారు.
పరశురామ్ గురించి తబుస్సుమ్ అనుభవాన్ని చదివిన పాత హిందీ సినిమాల అభిమానులు కొందరు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు.
పరశురామ్ కుమార్తెతో పాటు మనవడి ఆచూకీ కనుగొని సంబరపడ్డారు. పరశురామ్ జీవితం ముగింపు గురించి వారి నుంచి తెలుసుకుని ఆవేదన చెందారు.

దునియా నా మానా (1937) సినిమాలో ఆయన పాడిన మన్‌సాఫ్ తెరా హై కె నహీ పాట ఆ కాలంలో చాలా పాపులర్. పరశురామ్ లక్ష్మణ్ మహారాష్టల్రోని ఆహ్మద్‌నగర్ జిల్లాలో ఒక గ్రామంలో పేద కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే అతనికి పాటలు పాడడం, నటించడంలో ప్రావీణ్యం ఉంది. పేదరికం వల్ల ఫోర్త్ స్టాండర్డ్‌కు మించి చదవలేకపోయాడు. విపరీతంగా చదివే వాడు. పదేళ్ల వయసులో తండ్రి బొంబాయికి చేరుకుని పని కోసం రంజీత్ మూవీ టోన్‌లో చేర్పించాడు. వి.శాంతారామ్ ఓ సారి ఆ కుర్రాడు సినిమా కోసం పాట పాడుతుంటే విని తన్మయం చెందారు. ఆ కుర్రాడి బాధ్యత అప్పటి నుంచి శాంతారామ్ తీసుకుని ప్రభాత్ ఫిల్మ్ కంపెనీలో నెలకు ఐదు రూపాయల జీతంపై చేర్చుకున్నాడు. ప్రభాత్ వారి అద్భుతమైన సినిమాగా చరిత్రలో నిలిచిపోయిన దునియా నా మానే సినిమాలో బిక్షగాడిగా పురుషోత్తం నటించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. చివరకు అతను బిక్షగాడిగానే తనువు చాలించడం విచిత్రం. 1940లో పరశురామ్ లీలాబాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఖర్చుల కోసం శాంతారామ్ ఐదు వందల రూపాయలు ఇచ్చారు. ఆ కాలంలో ఇది చాలా పెద్ద మొత్తం. ఇక తన జీవితం స్థిరపడినట్టే అనుకున్నాడు పురుషోత్తం. 

ప్రభాత్ ఫిల్మ్ కొన్ని వివాదాల్లో చిక్కుకోవడంతో ఆయన నేషనల్ స్టూడియో వారి మేరీ దునియా (1942)లో నటించారు. ఈ సినిమాలో ఆయన మూడు పాటలు కూడా పాడారు. తరువాత శాంతారామ్ రాజ్‌కమల్ సినిమా స్టూడియోను ఏర్పాటు చేసి పరశురామ్‌ను నెలకు 80 రూపాయల వేతనంపై తీసుకున్నారు. 1943లో శాంతారామ్ తీసిన శకుంతల సినిమాలో పరశురామ్ కణ్వమునిగా నటించాడు. ఒకవైపు రాజ్‌కమల్ వారి సినిమాల్లో నటిస్తూనే ఇతర సంస్థల సినిమాల్లో బిజీ అయ్యాడు. జీవన్ యాత్ర(1946) మత్‌వాలా షాయర్(47), బూల్(48)అప్నాదేశ్(49), తీన్ బాతి చార్ రాస్తా(53) గీత్ గాయా పాత్తరోనే(64), చోర్ బజార్(54), హౌస్ నంబర్ 44(1955) జాగ్తే రహో1956) బాగం బాగ్(1956) సినిమాల్లో నటించారు. 62లో వచ్చిన కింగ్ కాంగ్, ఆశిఖ్, మై చూప్ రహుంగా, 64లో ఆప్‌కి పర్‌చయే 65లో రుస్తూం ఇ హిందు, 70లో సఫర్, 71లో మన మందిర్ సినిమాల్లో నటించారు. మద్రాస్ వెళ్లి ఎవిఎం వారి సినిమాల్లో కూడా నటించాడు పరశురామ్.

1968లో ఒక సినిమాషూటింగ్‌లో కాలు విరగడంతో అతని దురదృష్టకర జీవితం ప్రారంభం అయింది. ఆ సంఘటన తరువాత పరశురామ్ పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరహా నటన, పాటలకు కాలం చెల్లిందని దూరం పెట్టారు. సినిమాల్లో నటించనిదే ఉండలేని అతను చివరకు మద్యం లేనిదే ఉండలేని స్థితికి చేరుకున్నాడు. సినిమా వాళ్ల ముందు మద్యం కోసం చేతులు చాచడం ప్రారంభించారు. చివరకతను బిక్షగాడిగా మారిపోయాడు.... మద్యానికి బానిసైన పరశురామ్‌కు ఎంత చెప్పినా వినకపోడంతో కుటుంబం దూరమైంది. కుమార్తెకు అప్పటికే పెళ్లి కావడంతో ఆమె వేరుగా ఉంది. అలాంటి సమయంలోనే పరశురామ్ రోడ్డుపై బిక్షమెత్తుకుంటుంటే తబస్సుమ్ చూసింది. ఎంత మంది సహాయం చేసినా మద్యం ముందు ఆయన నిలువలేకపోయాడు. ఆ తరువాత కొద్ది రోజులకే జనవరి 24, 1978న పరశురామ్ ఫుట్‌పాత్‌పైనే జీవితాన్ని ముగించారు. రోడ్డుమీద అతన్ని చూసి దయగల వాళ్లు బాబా ఆస్పత్రిలో చేర్పించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే వాళ్లు రావడానికి ఇష్టపడలేదు. కుమార్తెకు తెలిసి వచ్చేసరికి పరశురామ్ మరణించాడు. ఆమెనే తండ్రి అంత్య క్రియలు నిర్వహించింది. 1981లో పరశురామ్ భార్య, 82లో కుమారుడు మరణించాడు. పరశురామ్ కుమార్తె ముంబైలో, మనవడు న్యూజిలాండ్‌లో ఉన్నారు. మూడున్నర దశాబ్దాల తరువాత తన తాత గురించి తెలుసుకొనే వారి గురించి తెలిసి మనవడు సంతోషించాడు. ఆయన మద్యానికి బానిసై దుర్భర జీవితం గడిపి ఉండవచ్చు కానీ అంత కన్నా ముందు గొప్పనటుడు ఆ నటుని మనవడిగా నేను సంతోషిస్తాను అని పరశురామ్ మనవడు మంగేష్ బార్డె చెప్పుకొచ్చారు.

నటన జీవితంలో ఒక భాగం... కానీ నటనే జీవిత కాదు.. కానీ పరశురామ్ మాత్రం ఆ తేడాను గ్రహించ కుండా జీవితాన్ని విషాదంగా మార్చుకున్నారు. *

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం