30, నవంబర్ 2014, ఆదివారం

మాయా బజార్ కెవి రెడ్డిని కాటేసిన పరాజయం

ఆ గొంతు ఒక్కసారి గద్దించిందంటే నాగిరెడ్డి చక్రపాణి లాంటి వారు సైతం వౌనంగా సెట్ నుంచి బయటకు వెళ్లిపోయేవారు. ఎన్టీఆర్ సైతం ఆయన ఉంటే బుద్ధిమంతుడైన విద్యార్థిలా ఉండేవారు. ఒకప్పుడు గర్జించిన ఆ గొంతు మాట్లాడాలా? వద్దా ? అని తటపటాయిస్తోంది. చివరకు మాట్లాడాలనే నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ వద్దకు వెళ్లి తన కుమారుడి విదేశీ చదువు కోసం 40 వేల రూపాయల సహాయం కావాలని అడిగారు. అలా అడిగిన వారు మాయాబజార్ సృష్టించిన కెవి రెడ్డి.


***


శ్రీకృష్ణుడికి ఎన్టీఆర్ మారుపేరు అన్నట్టుగా మారిపోయింది. మరి ఆ ఎన్టీఆర్‌లోని శ్రీకృష్ణున్ని వెలికి తీసింది కెవిరెడ్డినే. ఇద్దరు పెళ్లాలు, సొంత ఊరు ఈ రెండు సినిమాల్లో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించారు. శ్రీకృష్ణుడిగా ఆయన కనిపించగానే జనం ఈలలు వేసి, గోల చేశారు. దాంతో శ్రీకృష్ణునిగా తాను పనికి రాను అని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. మాయాబజారు సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రకు కెవిరెడ్డి ఎన్టీఆర్‌ను ఎంపిక చేస్తే ‘‘గురువు గారూ ఆ పాత్రకు నేను సరిపోను, చేయలేను అని ఎన్టీఆర్ పాత అనుభవాలు గుర్తు తెచ్చుకున్నారు. నీలో శ్రీకృష్ణుడు ఉన్నాడు నేను చూపిస్తాను అని కెవిరెడ్డి భరోసా ఇవ్వడంతో తనపై నమ్మకం కన్నా నటుల ఎంపికలో కెవిరెడ్డికి ఉన్న జడ్జ్‌మెంట్‌కు ఎన్టీఆర్ అంగీకరించారు. ఆ తరువాత ఎన్టీఆర్, శ్రీకృష్ణుడు ఒకరే అన్నట్టుగా మారిపోయింది.
అలాంటి కెవిరెడ్డిపై ఎన్టీఆర్‌కు అపారమైన గౌరవం.


తన కుమారుడి చదువు కోసం గురువు సహాయం అడగడమే మహాద్భాగ్యం అని భావించిన ఎన్టీఆర్ ఆ డబ్బు ఇవ్వడమే కాకుండా, మీరు నాకో సినిమా చేసి పెట్టాలి అన్నారు. ఓటమి దెబ్బలకు తట్టుకోలేక మానసికంగా అలసిపోయిన ఆయన ఆరోగ్యం బాగాలేదు. చేయలేనేమో అన్నారు. గురువు గారూ మీరు అక్కడ కూర్చొని డైరెక్షన్ ఇవ్వండి అంతా మేం చూసుకుంటాం అన్నారు. అలా వచ్చిన కెవిరెడ్డి చివరి చిత్రమే శ్రీకృష్ణ సత్య.
***


కెవి రెడ్డి అంటే కాలేజీ కుర్రాళ్లకు కూడా తెలియకపోవచ్చు. మాయాబజార్ అంటే కానె్వంట్ స్కూల్‌కెళ్లే పిల్లోడికి కూడా తెలుసు.
ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం వచ్చిన సినిమా ఇప్పటి జనాభాలో మూడొంతుల మంది 30 ఏళ్ల యువతేనట. అంటే నేటి యువత తల్లిదండ్రులు కూడా పుట్టక ముందు వచ్చిన సినిమా అది. అయినా నేటి బుడతలకు కూడా ఆ సినిమా గురించి తెలుసు అంటే అదెంత గొప్ప సినిమా అయి ఉంటుంది.


మాయాబజార్‌ను సినిమా అనడం సరికాదేమో! అది సినిమా కాదు ఓ కళాఖండం. తెలుగు సంస్కృతిలో భాగం, తెలుగు సినిమా చరిత్ర. తెలుగు దేవుళ్ల ప్రొఫైల్ పిక్చర్ అది. ఆ కళాఖండానికి ఊపిరి పోసింది కెవి రెడ్డి. కదిరి వెంకటరెడ్డి. పాతాళాభైరవి, మాయాబజార్ ఈ రెండు సినిమాలను మినహాయిస్తే తెలుగు సినిమా చరిత్ర అసంపూర్ణం. ఈ రెండు సినిమాలు కెవి రెడ్డి దర్శకత్వం వహించినవే.


పదవ తరగతి పాఠ్యపుస్తకంలో మాయాబజారు సినిమా గురించి ఒక పాఠాన్ని చేర్చారు. బహుశా మరే సినిమాకు ఇంతటి కీర్తి దక్కి ఉండదు. సినిమా ఎలా తీయాలో బోధించేందుకు అనేక జాతీయ అంతర్జాతీయ సినిమా ఇన్‌స్టిట్యూట్‌లో మాయాబజారు చూపడం తెలిసిందే. కానీ రేపటి పౌరులను తీర్చిదిద్దడం కోసం రాసే పాఠ్యపుస్తకాల్లో కెవిరెడ్డి సినిమా ఉంది అంటే అది సినిమా కాదు సినిమా కన్నా ఇంకా చాలా ఎక్కువ అని అర్థమవుతూనే ఉంది. కెవిరెడ్డి సినిమాలు సినిమా పరిశ్రమకు పాఠాలు అయితే ఆయన నిజ జీవితం సైతం నేటి తరానికి ఎన్నో పాఠాలు చెబుతుంది.
ఓటమికి కృంగిపోవలసిన అవసరం లేదు... ఓటమి తెలియని విజయం ఓటమి కన్నా ప్రమాదకరం అని కెవిరెడ్డి జీవితం నేర్పిస్తుంది.
రాజబాబును పరిచయం చేసింది, అతనిలో మంచి నటుడు ఉన్నాడని గుర్తించింది కెవిరెడ్డినే. వాణిశ్రీని సైతం ... ఎంతో మందిలో నటున్ని గుర్తించిన ఆయన ఓటమి తరువాత తెలిసిన వారే ఎలా వ్యవహరిస్తారో అనుభవంలోకి వచ్చేంత వరకు గుర్తించ లేకపోయారు.


***
వరుస విజయాలకు అలవాటు పడితే పరాజయాన్ని తట్టుకోలేరు కృంగిపోతారు. విజయాలు, పరాజయాలకు అలవాటు పడి ఉంటే పరాజయాలకు కృంగిపోయి ఉండేవారు కాదేమో!
కెవి రెడ్డి అని పిలువబడే కదిరి వెంకటరెడ్డి తీసింది 18 సినిమాలుః అందులో 15 సూపర్ హిట్టు. అంటే ఈరోజుల్లో జరుగుతున్న ప్రచార హిట్టు సినిమాలు కాదు. ఆరు దశాబ్దాల తరువాత విడుదలైనా విజయం సాధించే మాయాబజారు, పాతాళాభైరవి, జగదేక వీరుని కథ లాంటి సూపర్ హిట్లు. విజయసంస్థకు ఎన్నో హిట్లు అందించిన కెవిరెడ్డి చివరి మూడు సినిమాలు సరిగా నడవలేదు. విజయవారి ఉమాచండీగౌరీ శంకరుల కథ సినిమా ఫ్ల్లాప్. అప్పటి వరకు విజయ సంస్థలో మహారాజులా చూసిన కెవిరెడ్డిని పక్కన పెట్టారు. కెవిరెడ్డికి ఇచ్చిన కారును సైతం తీసేసుకున్నారు.
ఈ అనుభవాన్ని ఆయన ఊహించలేకపోయారు. ఉమా చండీ గౌరీ శంకరుల కథ పరాజయాన్ని విజయ సంస్థ తట్టుకోలేకపోయింది. ఆ పరాజయాన్ని కెవిరెడ్డి కూడా తట్టుకోలేకపోయారు. అయితే పరాజయం మనుషుల్లో ఇంత మార్పు తీసుకువస్తుందని ఆయన ఊహించలేకపోయారు. ఆ సృజనశీలిని ఈ మార్పు తీవ్రంగా కలిచివేసింది.


వరుసగా మూడు సినిమాలు పరాజయం పాలు కావడంతో ఆ దర్శకుడు మానసికంగా సంఘర్షణ తీవ్రంగా ఉంది. తానిక సినిమాలకు పనికిరానా? అని మదనపడ్డారు. అద్భుత విజయాలతోనే జీవితాన్ని ప్రారంభించడమే పెద్ద పరాజయం. పరాజయ అనుభవం లేకపోతే నీకు జీవిత మాధుర్యం ఎలా తెలుస్తుంది. నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సరిగ్గా ఎలా అంచనా వేయగలవు. పరాజయం నిన్ను నీకు కొత్తగా పరిచయం చేస్తుంది.
అదే ఘన విజయాల తరువాత ఒక పరాజయం ఎదురైతే తట్టుకోవడం కష్టం. కెవి రెడ్డి విషయంలో అదే జరిగింది. ఆర్థికంగా దెబ్బతిన్నారు, ఆరోగ్యం క్షీణించింది.
***


జూలై 1 1912లో అనంతపురం జిల్లా తాడిపర్తిలో జన్మించిన కెవిరెడ్డి చదువుకునే రోజుల్లోనే తన మిత్రుడు మూలా నారాయణస్వామితో కలిసి సినిమాలు తీయాలని కలలు కనేవారు. చదువు ముగిశాక మూలా నారాయణస్వామి రోహిణి సంస్థలో భాగస్వామిగా చేరడంతో ఆసక్తి ఉంటే రమ్మని కెవిరెడ్డిని పిలిచారు. అక్కడ క్యాషియర్‌గా చేరిన కెవిరెడ్డి డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉండేవారు. తాను సినిమా తీసే సంస్థల కోసం డబ్బు వ్యవహారంలో నిక్కచ్చిగా ఉన్న ఆయన తన సొంత జీవితంలో మాత్రం ఏమీ సంపాదించలేకపోయారు. రోహిణీ నుంచి కొందరు బయటకు వచ్చి వాహిని సంస్థను ఏర్పాటు చేసినప్పుడు కెవిరెడ్డి ప్రొడక్షన్ మేనేజర్‌గా చేరారు. ఆసక్తి అంతా సినిమాలపైనే. 1942లో భక్తపోతన తొలి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అప్పటి వరకు రొమాంటిక్ హీరోగా ఉన్న నాగయ్యను పోతనగా ఎంపిక చేయడం నాగయ్యకే ఆశ్చర్యం వేసింది. మిగిలిన వారు నవ్వుకున్నారు. సినిమా విడుదలయ్యాక నాగయ్యను దేవుడిలా పూజించారు. తరువాత యోగి వేమన అదీ సూపర్ హిట్. గుణసుందరి కథ, పాతాళాభైరవి, పెద్దమనుషులు, దొంగ రాముడు, మాయాబజారు, పెళ్లినాటి ప్రమాణాలు, జగదేక వీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధంతో పాటు రెండు ఇతర భాషా సినిమాలు. ఇవన్నీ సంచలన విజయాలు సాధించాయి. సత్యహరిశ్చంద్ర, ఉమాచండీ గౌరీ శంకరుల కథ, భాగ్యచక్రం ఈ మూడు సినిమాలు కెవిరెడ్డి భాగ్యచక్రాన్ని దెబ్బతీశాయి. పరాజయాలతోనే తన సినిమా జీవితం ముగింపు పలకాల్సి వస్తోందని మదనపడిన ఆయనకు ఎన్టీఆర్ శ్రీకృష్ణ సత్య రూపంలో విజయం అందించారు. మన ఫోటోలు ఎవరు చూస్తారు అంటూ ఆయన ఫోటోలు తీయించుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదట! ఆయన సినిమాను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తారని ఆయన ఊహించి ఉండరు.


కెవిరెడ్డి కుమారుడు ఇప్పుడు అమెరికాలో ఒక కంపెనీ నిర్వహిస్తున్నారు. రైతులా కనిపించే కెవిరెడ్డి సినిమాల బంగారు పంట పండించారు. 15 సెప్టెంబర్ 1972లో 60 ఏళ్ల వయసులో మరణించారు.
*

1 కామెంట్‌:

  1. తీసింది 18 సినిమాలుః అందులో 15 సూపర్ హిట్టు
    >>కే
    .వీ.రెడ్డి అంటే
    కనక వర్షాల రెడ్డి

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం